విజయవాడ లోక్ సభ బరిలోకి సుజనా చౌదరి?
posted on Jan 10, 2024 8:40AM
విజయవాడలో రాజకీయం కాక రేగుతోంది. తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎంపీ కేశినేని నాని రాజీనామా ప్రకటన.. అలాగే ఆయన కుమార్తె కేశినేని శ్వేత.. పార్టీతోపాటు డివిజన్ కార్పొరేటర్ పదవికి సైతం రాజీనామా తో విజయవాడ నుంచి బరిలో దిగనున్న టీడీపీ అభ్యర్థి ఎవరు..కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నానేనా? అనే ఓ ప్రశ్న పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతున్నది.
ఓ వేళ రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్నికి ఇస్తే.. కేశినేని నానితోపాటు ఆయనతోనే ఉన్న పలు వర్గాలు సైతం పార్టీకి దాదాపుగా దూరమవుతాయనే ఓ చర్చ ఆ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లే ఆలోచనలో బీజేపీ ఉందనే ఓ ప్రచారం అయితే నడుస్తోంది. అలాంటి వేళ... మధ్యే మార్గంగా.. బీజేపీ నేతగా ఉన్న సుజనాచౌదరిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపితే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడిక అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సుజనాచౌదరి అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి. ఆయన స్వస్థలం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కంచికచర్ల. ఈ ఊరు విజయవాడ లోక్‌సభ పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అదీకాక.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సుజనా చౌదరి సన్నిహితుడన్న సంగతి తెలిసిందే.
ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని గత కొంత కాలంగా ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు... ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2022లో ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి మహానాడుకు, 2023లో రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడుకు కేశినేని నాని హాజరుకాలేదు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు సైతం కేశినేని నాని దూరంగానే ఉన్నారు. ఈ విషయాలన్నిటి ప్రస్తావనతో పోలిటికల్ సర్కిల్స్ లో నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదన్న చర్చ జరుగుతోంది.
అలాగే గత ఎన్నికల్లో అధికార జగన్ పార్టీ కైవసం చేసుకున్న తన లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కేశినేని నాని తరచూ పర్యటిస్తూ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించిన విషయాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇంకోవైపు కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత సాధ్యమైనంత త్వరలో జగన్ పార్టీలో చేరతారనీ, నాని.. ఆ పార్టీ తరఫున విజయవాడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగననున్నారనే ఓ ప్రచారం వాడి వేడిగా నడుస్తోంది. అదీ కాక విజయవాడ నుంచి ఫ్యాన్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దింపేందుకు సరైన అభ్యర్థి కోసం ఆ పార్టీ గత కొంత కాలంగా అన్వేషణ చేస్తున్నది. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా కేశినేని నానిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు.. న్యూఢిల్లీ వెళ్లాలంటే.. ఒక విమానం కాకుంటే మరో విమానంలో వెళ్లాలంటూ కేశినేని నాని తన రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ మారే ఉద్దేశ్యంతోనే చేశారనే ఓ చర్చ సైతం నడుస్తోంది. ఏదీ ఏమైనా రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలొ దిగే ఏ పార్టీ అభ్యర్థిని విజయలక్ష్మీ వరిస్తుందోనని ఆ నియోజకవర్గ ప్రజలు దృష్టి సారిస్తున్నారనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.