మంత్రి రోజాకు జగన్ షోకాజ్ నోటీసు.. సస్పెన్షనే తరువాయా?
posted on Jan 10, 2024 @ 12:44PM
పరిచయం అక్కర్లేని పేరు మంత్రి ఆర్కే రోజా. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందిన రోజా పరిస్థితి వైసీపీలో అగమ్యగోచరంగా మారింది. వరుసగా రెండు సార్లు నగరి నుంచి వైసీపీ తరఫున విజయం సాధించిన రోజా.. జగన్ కేబినెట్ లో మంత్రి కూడా. అయినా ఇప్పుడు ఆమెకు ఆ నియోజకవర్గం నుంచి జగన్ మరో చాన్స్ ఇస్తారా అంటే అనుమానమే అని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
మొత్తంగా ఇప్పడు వైసీపీలో టికెట్ల కల్లోలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకూ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండగా.. రాత్రికి రాత్రి ఖాళీ చేసి మరో నియోజకవర్గానికి వెళ్లిపోవాలని పెద్దలు ఆదేశాలు ఇస్తున్నారు. మరికొందరికైతే నీ నియోజకవర్గం మరొకరికి ఇచ్చేస్తున్నాం.. మీరు పక్కకి తప్పుకోండని హుకుం జారీ చేస్తున్నారు. అసలు ఏ ఆధారంగా మమ్మల్ని మార్చేస్తున్నారని అడగాలని ప్రయత్నించినా సీఎం దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో మరో చోటకి వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగానే ససేమీరా అనేవాళ్ళు కొందరైతే.. అసలు పార్టీకి, పార్టీ అధినేతకు రాంరాం చెప్పేసి వెళ్లిపోతున్న వారు మరికొందరు. మంత్రులు, సీనియర్లు, జగన్ కు ఫాలోవర్లు, జగన్ తో మంచి సంబంధాలున్న వారు, కుటుంబంతో అనుబంధం ఉన్న వారు.. ఇలా ఎవరైనా సరే కనీసం మాట కూడా చెప్పకుండా జగన్ మార్చేస్తున్నారు. బుజ్జగింపులు కమిటీ పెద్దలు తాడేపల్లికి పిలిచి ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడాలని ప్రయత్నించినా వారు వినే పరిస్థితి లేదు. జగన్ తో ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నించినా.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. నా మాటే శాసనం అని సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.
దీంతో నిన్నటి వరకూ వైసీపీలో అంతా అనుకున్న వాళ్లకి కూడా రాత్రికి రాత్రి ఫేట్ మారిపోతున్నది. ఈ కోవలోనే మంత్రి రోజాకి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఏ చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం అధినేత చంద్రబాబును, లోకేష్ ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తనదైన ప్రత్యేక శైలిలో దూషణాత్మక విమర్శలు గుప్పించే రోజాను ఇప్పుడు సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా ఆమె ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు జబర్దస్త్ కామెడీని మించిన హాస్యాన్ని పండిస్తున్నాయి. నిజానికి నగరిలో సొంత పార్టీ నేతలే రోజా మీద గుర్రుగా ఉన్నారు. ఇక రోజా, పెద్దిరెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. రోజా విషయంలో పెద్దిరెడ్డి మొదటి నుంచి సానుకూలంగా లేరు. నగరి నుంచి బీసీ వర్గానికి చెందిన ఓ నేతకు టికెట్ ఇప్పించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించడమేమిటి, ఆ నేతకు జగన్ ఇప్పటికే స్పష్టమైన హామీ కూడా ఇచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రోజా మాత్రం తాను వచ్చే ఎన్నికలలో నగరి నుంచే పోటీలో ఉంటానని ధీమాగా చెబుతూ వస్తున్నారు. రోజాకు నగరి టికెట్ ఉంటుందా? ఉండదా అన్న చర్చ పార్టీలో సాగుతుండగానే ఆమెకు జగన్ భారీ షాక్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. రోజాకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చిందనీ, 24 గంటల్లో వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామనీ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాంటి రోజాకు పెద్దిరెడ్డికీ మధ్య విభేదాలు ఉన్న సంగతీ తెలిసిందే. అందుకే రోజా మంత్రిగా ఉన్నా జిల్లాలో ఆమె ఆటలు సాగడం లేదన్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు మంత్రిగా అందరినీ కలుపుకుని పోవాలంటే అధిష్టానం రోజాను హెచ్చరించింది. అయితే రోజా మాత్రం మంత్రి పెద్దిరెడ్డితో సమన్వయం చేసుకునే విషయంలో రాజీలేదన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
తాజాగా నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఆమె బెంగళూరులోని ఒక పబ్ లో డ్యాన్సులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. మంత్రి హోదాలో ఉన్న రోజా ఇలా పబ్బుల్లో డ్యాన్సులు చేయడమేమిటంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతుండగా.. మంత్రి హోదాలో ఉన్న రోజా అవేవీ పట్టనట్టు బెంగళూరు పబ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పబ్బులో డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడం వైసీపీ ప్రతిష్టను కూడా దిగజార్చింది . ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ రోజాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి రోజా వివరణ ఇస్తారా? ఆమె వివరణతో జగన్ సంతృప్తి చెందుతారా, లేక సస్పెన్షన్ వేటు వేస్తారా అన్న చర్చ చిత్తూరు వైసీపీలో జోరుగా సాగుతోంది. షోకాజ్ నోటీసుకు రోజా బెంగళూరు పబ్బులో డ్యాన్స్ చేయడం అన్నది ఒక సాకు మాత్రమేననీ, వాస్తవానికి మంత్రి పెద్దిరెడ్డితో విభేదాలు, వివాదాల కారణంగానే ఆమెను వదిలించుకుకోవాలనుకోవడమే కారణమని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే అసలింతకూ రోజాకు షోకాజ్ నోటీసు అందిందా? అందితే ఆమె స్పందన ఏమిటి అన్నది తేలాల్సి ఉంది.