జనసేన వైపు ముద్రగడ అడుగులు?
posted on Jan 11, 2024 @ 9:32AM
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో నిన్నటి దాకా చక్రం తిప్పిన నేతలు నేడు జీరోలుగా మారి పార్టీని వీడుతున్నారు. జగన్ కోసం అయిన వారినీ, సొంత సామాజిక వర్గాన్నీ కూడా దూరం చేసుకుని పార్టీలో చేరిక కోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్న నేతలు కూడా ఇప్పుడు వైసీపీకి దగ్గరవ్వడమంటే కోరి తలకొరివి పెట్టుకున్నట్లే అని భావించి దూరం జరుగుతున్నారు. అలాంటి కోవలోకే కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొంది, ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా చేరారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గ ఓట్ల ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గ మద్దతే పార్టీల గెలుపు ఓటములను నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పెద్ద ఎద్యమమే జరిగింది. ఆ ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం వహించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ముద్రగడ కాపు రిజర్వేషన్లు అసాధ్యం అని చెప్పిన జగన్ కు మద్దతుగా నిలిచారన్న భావన ఆ సామాజిక వర్గంలో బలంగా నాటుకు పోయింది. అందుకు తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభం ఇప్పటివరకూ వ్యవహరించారు. కాపు రిజర్వేషన్ల అమలు కోసం సీరియస్ గా ప్రయత్నించి చాలా వరకూ సాధించిన తెలుగుదేశంపైనా, రిజర్వేషన్ల కోసం తన శాయశక్తులా కృషి చేస్తానంటున్న పవన్ కల్యాణ్ పార్టీ జనసేనపైనా విమర్శలు గుప్పిస్తూ, రిజర్వేషన్లు అసాధ్యం అని తేల్చేసిన జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న ముద్రగడ పట్ల సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ వ్యతిరేకతను కాపు యువత పలు సందర్భాలలో దాపరికం లేకుండా వ్యక్తం చేశారు కూడా.
అయితే ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభం వైసీపీకి మద్దతు విషయంలో పునరాలోచనలో పడ్డారా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయన్న విషయం దగ్గరకు రావడానికి ముందు.. విపక్షాలకు కాపు సామాజిక వర్గ మద్దతు దక్కుండా చేసేందుకు జగన్ తరఫున ముద్రగడ ఎంతగా ప్రయత్నం చేశారో ఒక సారి చూద్దాం. గతంలో జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను అవినీతి ‘ద్వారం)పూడి చంద్రశేఖర్ గా అభివర్ణించారు. ద్వారంపూడిపై జగన్ బినామీ అనీ, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అనీ విమర్శలు గతం నుంచీ ఉన్నాయి. జగన్ ప్రాపకం కోసం అటువంటి ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ అప్పట్లో చేసిన ప్రయత్నం కాపు సామాజికవర్గంలో ముద్రగడకు ఉన్న ప్రతిష్టను దిగజార్చింది. మసకబార్చింది. అప్పట్లో ద్వారంపూడికి సమర్ధనగా, ఆయన కాపు ఉద్యమానికి ఎంతో మేలు చేశారని పేర్కొంటూ ముద్రగడ రాసిన లేఖ ఆయనకే బూమరాంగ్ అయ్యింది. ఇంతకీ ఆ లేఖలో ముద్రగడ ఏం పేర్కొన్నారంటే...
గతంలో కాపు ఉద్యమ సమయంలో ఉద్యమ కార్యక్రమాలకు వచ్చిన యువతకు ద్వారంపూడినే ఉప్మా పెట్టించారని.. వారి తరలింపుకు లారీలు ఏర్పాటు చేశారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. ఆ ఒక్క లేఖ కాపుసామాజిక వర్గంలో ముద్రగడపై ఉన్న గౌరవాన్ని మంటగలిపిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అదే విధంగా గోదావరి జిల్లాల్లోని కాపు యువత పెద్ద ఎత్తున ముద్రగడకు నాటి ఉద్యమ సమయంలో తాము తిన్న ఉమ్మాకు డబ్బులు ఇవిగో అంటూ వెల్లువలా మనీయార్డర్లు పంపించారు.
నిజానికి సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన ముద్రగడ పద్మనాభంకు ఒకప్పుడు కాపు యువతలో మంచి క్రేజే ఉండేది. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆయన ఉద్యమించిన సమయంలో లక్షలాదిగా యువత ఆయన వెంట నడిచారు. అయితే, 2019 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్న చంద్రబాబును కాదని.. ఆ ప్రతిపాదనకు నో చెప్పిన జగన్ కు ముద్రగడ మద్దతు ఇచ్చారు. కానీ.. గత నాలుగేళ్లలో ఆ వర్గానికి జగన్ చేసిందేమీ లేకపోగా కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని తెగేసి చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టేశారు. ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైపోయిందనీ, పెద్దాపురం లేదా మరో నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ వైసీపీ వర్గాలు అప్పట్లో చాలా గట్టిగా చెప్పారు. ముద్రగడ వైసీపీ ఎంట్రీకి జనవరి 2 ముహూర్తం కూడా ప్రకటించేశారు. అయితే జనవరి 2 వచ్చేసింది. వెళ్లిపోయి కూడా వారం రోజులు అయ్యింది. అయితే ఎక్కడా ముద్రగడ వైసీపీ ఎంట్రీ గురించిన వార్తలు రాలేదు. ఆయన కూడా నోరు మెదిపిన దాఖలాలు లేవు.
ఈ తరుణంలో జనసేన, కాపు జేఏపీకి చెందిన కాపు నేతలు ముద్రగడతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ చార్జ్ బోలిశెట్టి శ్రీనివాసరావులు కిర్లంపూడి వెళ్లి మరీ ముద్రగడతో భేటీ అయ్యారు. పైకి మర్యాదపూర్వక భేటీయే అని చెబుతున్నా వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయనీ, త్వరలో అంటే రానున్న రెండు మూడు రోజుల్లోనే జనసేన ముఖ్య నేతలో ముద్రగడను కలిసే అవకాశం ఉందనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ముద్రగడ వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడినా, వైసీపీలో సిట్టింగుల మార్పు రగడ తరువాత ముద్రగడ మౌనముద్ర వహించారు. ఏ పార్టీకి మద్దతుగా నోరెత్తలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.