నగ్నంగా తిప్పుతూ దాడి.. ఏపీలో సామాన్యుడంటే ఇంత చులకనా?
posted on Jan 9, 2024 @ 3:19PM
ఇప్పటికే ఏపీ పోలీసులపై ఎన్నో విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతలకు అండగా సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారనడానికి ఇప్పటికే ఎన్నో రుజువులున్నాయి. అధికార పార్టీ నేతలకు అడ్డొచ్చిన సొంత పార్టీలోని దళితులు, బీసీలపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈమధ్యనే హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలోని ఓ దళిత యువకుడు పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసి ఘోరంగా అవమానపరిచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ వృద్ద మహిళపై అక్రమ కేసులు బనాయించి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన పాపానికి రాత్రికి రాత్రి పోలీసులు ఇళ్లపై దాడులు చేసి సామాన్యులను లాక్కెళ్లి అసలు ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా వారి కుటుంబాలను క్షోభపెట్టిన ఘటనలు ఎన్నోఎన్నోన్నో ఉన్నాయి. ఏపీలో పోలీస్ ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు కోర్టులను ఆశ్రయించిన సంఘటనలూ ఉన్నాయి. ఆయా సందర్భాలలో పోలీస్ బాసుకు కోర్టులు చీవాట్లు పెట్టినా పోలీసుల బుద్ది మారలేదు.. జులుం ఆగ లేదు.
ఏపీ పోలీసులకు సామాన్య ప్రజలంటే ఎంత చులకనో మరో సంఘటన రుజువు చేసింది. తాజాగా వైసీపీ జెండా దించి ఆ స్థానంలో జాతీయ జెండా ఎగరేయాలని డిమాండ్ చేసిన ఓ సామాన్యుడిపై పోలీసులు ప్రతాపం చూపించారు. అతనితో బట్టలు విప్పించి పోలీసులే వెనకాల లాఠీ పట్టుకొని తిరుగుతూ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పారు. బూటు కాళ్లతో తన్నుతూ ఇష్టం వచ్చినట్లు చితగొట్టారు. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. విడపనకల్లు మండలం చీకలగూరి గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి డిసెంబర్ 31 రాత్రి గ్రామంలోని సచివాలయం ఎదుట ఉన్న వైసీపీ జెండాను తొలగించి, అదే స్థానంలో జాతీయ జెండాను ఎగురవేయాలని సచివాలయ సిబ్బందిని కోరాడు. దీనికి వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు వైసీపీ జెండాను దించకపోతే.. నేనే దాన్ని దించి తగుల బెడతానని చంద్రమోహన్ హెచ్చరించాడు. జెండా దించితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరించారు.
అయితే ఆ మరుసటి రోజు జెండాను చంద్రమోహన్ తగులుబెట్టాడని వైసీపీ నేతలు పాల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రమోహన్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, తనను ఎందుకు స్టేషన్ కు తీసుకెళుతున్నారంటూ చంద్రమోహన్ ప్రశ్నించాడు. అంతే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ పోలీసులు ఆయనపై దాడికి దిగారు. స్టేషన్ కు తీసుకెళ్లి బూటు కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. బట్టలు ఊడదీయించి స్టేషన్ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతూ.. వెంటాడుతూ లాఠీలతో కొట్టారు. జనవరి 1న పోలీసులు చంద్రమోహన్ ను అరెస్టు చేయగా.. 4వ తేదీన ఉరవకొండ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పోలీసు దెబ్బలకు చంద్రమోహన్ ఒళ్లంతా హూనమై ఆరోగ్యం క్షీణించడంతో అతడిని అదేరోజు కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆస్పత్రిలో చేర్చారు. కాగా పోలీసులు చంద్రమోహన్ ను స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పుతూ, లాఠీలతో వెంటాడడానికి సంబంధించిప వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి చెంచాగిరి చేస్తున్నారనే విమర్శలు బాహాటంగానే వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటూ విపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అదే అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై దాడి చేసినా, హత్యలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, చంపేసి డోర్ డెలివరీలు చేసినా పోలీసుల కళ్లకు కనిపించడం లేదు. పైగా వైకాపా నేతల దుశ్చర్యలకు పోలీసులే అండగా నిలుస్తున్నారు. అందుకే వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. మరోవైపు పోలీసులు సామాన్యులపై రెచ్చిపోతున్నారు. ఈ మధ్యనే సొంత ప్రాంతానికి వచ్చిన ఆర్మీ జవాన్ ఫోన్ లో దిశా యాప్ ఇన్స్టాల్ చేయలేదన్న కారణంగా పోలీసులు చుట్టుముట్టి బంధించి చితకబాదిన ఘటన వీడియోలు వైరల్ కాగా.. ఇప్పుడు స్టేషన్ లోనే పోలీసుల దురాగతం వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలను రక్షించేందుకు జీతాలు తీసుకుంటున్న రక్షక భటులు.. ఆ ప్రజలనే భక్షిస్తుండడంతో ప్రజలలో తమకు రక్షణ కరవైందన్న అభద్రతా భావం పెరిగిపోతోంది.