జగన్ పాలన చూసేశారుగా.. ఇక డెసీషన్ ప్రజలదే!
ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు మొదలైపోయాయి. ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ , మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరిపే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ఇప్పటికే అధికార వైసీపీ వరసగా అభ్యర్థుల జాబితా లు ప్రకటించేస్తున్నది. వైసీపీ అభ్యర్థులను బేరీజు వేసుకొని ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి కూడా అభ్యర్థుల ప్రకటనకు రెడీ అవుతోంది. కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మళ్ళీ పుంజుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. త్వరలోనే ఆమె ఏపీలో కాంగ్రెస్ నేతగా చురుకుగా వ్యవహరించనున్నారు. ఎవరికి వారు గెలుపు అవకాశాల వేటలో ఉన్నారు. అసంతృప్తి పేరిట వైసీపీ సిట్టింగ్ అభ్యర్థులను భారీగా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ అభ్యర్థులను మార్చేస్తూ జగన్ మొండిగా దూకుడు మీదున్నారు.
అయితే వైసీపీ, టీడీపీలో ఈసారి విజయం ఎవరిది అంటే ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చేశాయి. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ విజయం ఖాయమని సర్వేలు తేల్చేయగా.. జనసేన కలిస్తే వైసీపీకి ఘోర ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టేశాయి. అయితే, మరోసారి అధికారం మాదే అంటూ వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. ఈలోగా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో వైసీపీకి ఇక గెలుపు తలుపులు పూర్తిగా మూసుకుపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, వైసీపీపై అసలు ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎలా , ఎందుకు మూటగట్టుకుందో చెప్పేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గత చంద్రబాబు ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వ పాలనకు పోలిక. తె లంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేళ్లు కేసీఆర్ పాలించారు. దీంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. దాన్ని కాంగ్రెస్ చాకచక్యంగా అనుకూలంగా మలచుకుని అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో విభజన తరువాత ఏపీ ప్రజలు చూడలేదు. కానీ కేసీఆర్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిందని మాత్రం అర్ధం అవుతుంది.
అయితే, ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ పై సానుకూలతగా మారే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో ఏపీ ప్రజలు రెండు ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ.. ఇలా రెండు ప్రభుత్వాల పాలననూ ప్రజలు చూశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ఎలా ఉంది, జగన్ పనితీరు ఎలా ఉందన్నది కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికి ఇవ్వాలి.. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలన్న విషయంలో ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయంతో ఉండే అవకాశం ఉంది. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూశారు కనుక ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవలసింది ప్రజలే. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొనే అవకాశం ఏపీ ప్రజలకు ఉంది.
అయితే, ఇలా గత పదేళ్లలో చంద్రబాబు, జగన్ పాలనను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు విజయం నల్లేరు మీద నడకే అనిపించ కమానదు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తే జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్ధిక అరాచకత్వం కారణంగా పన్నుల రూపంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది. చంద్రబాబు ఇతర దేశాలలో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే.. జగన్ హయంలో ఏపీ ప్రజలకు ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు-ఘోరాలలో జగన్ పాలన కొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంటపెట్టుకొని తిరగడంతో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. విద్య, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించేదేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు మేలు అనేలా జగన్ పాలన సాగింది. దీంతో ప్రజలు ఇప్పటికే వచ్చే ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రజల ఆ నిర్ణయమే సర్వే ఫలితాలలో వెల్లడైంది.