సునామీలా సెకండ్ వేవ్.. దేశంలో మరణమృదంగం
posted on Apr 24, 2021 @ 10:55AM
మూడు లక్షలకు తగ్గట్లే. మూడు రోజులుగా మరణమృదంగం. దేశమంతా కరోనా కల్లోలం. మొదట్లో మహారాష్ట్రలో భారీగా కేసులు. .ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌లు. సెకండ్ వేవ్‌లో వైరస్ విజృంభణ మామూలుగా లేదు. వ్యాప్తితో పాటు.. డ్యామేజీ ఎక్కువే. శ్వాస వ్యవస్థ మీద దెబ్బకొట్టి.. రోగుల ప్రాణాలు తీస్తోంది. రికార్డు స్థాయిలో సునామీలో చుట్టుముట్టేస్తోంది సెకండ్ వేవ్.
గడిచిన 24 గంటల్లో 3,46,786 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వరుసగా మూడో రోజు కేసుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం 2,624 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481 చేరగా.. మరణాల సంఖ్య 1,89,544.
కరోనా యాక్టివ్ కేసులు 25 లక్షలకు పైగానే ఉన్నాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 14.93శాతానికి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 2,19,838 మంది కొవిడ్ నుంచి కోలుకోవడం కాస్త సానుకూల పరిణామం. మొత్తంగా కోటీ 38లక్షల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13,83,79,832 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.
కరోనా కేసుల్లో ఇప్పటికీ మహారాష్ట్రదే మొదటి స్థానం. శుక్రవారం 66,836 మంది వైరస్ బారినపడ్డారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 41.61లక్షలు దాటేసింది. యాక్టివ్ కేసులు ఏడు లక్షలకు చేరువయ్యాయి. కరోనా కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలో తాజాగా 773 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశరాజధాని దిల్లీలో కరోనా వైరస్ ప్రాణాంతకంగా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో ఒక్కరోజే 28,395 మందికి వైరస్ సోకింది. తాజాగా 24,331 మంది కరోనా బారిన పడగా.. 348 మరణాలు సంభవించాయి. సుమారు 92వేల మంది కొవిడ్‌తో బాధపడుతున్నాయి. ఇది కూడా దిల్లీకి రికార్డు నంబరే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, మెడికల్ ఆక్సిజన్ కొరత ఢిల్లీని వేధిస్తోంది. ఆక్సిజన్ అందక పలు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు విడుస్తుండటం కలకలం రేపుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని పదే పదే కోరుతున్నా.. అటునుంచి సరైన సహకారం అందటం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
అటు, ఉత్తరప్రదేశ్‌లోనూ కొవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తెలంగాణలో శుక్రవారం 7వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. 33మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి.