కరోనా రోగులతో మాట్లాడిన మంత్రి
posted on Apr 23, 2021 @ 9:03PM
కరోనాతో దేశం అల్లాడిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మహ్మమారి పంజా విసురుతోంది. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కేసులు , మరణాలు సంభవిస్తున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా వైరస్ విజృంభిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కరోనా రోగులు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బాధితులకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.
తన సొంత నియోజకవర్గం పాలకుర్తి పరిధిలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు, సీఐ లు, ఎస్సైలు, డీఎంఅండ్ హెచ్ఓ, డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కొందరు కరోనా రోగులతోనూ మంత్రి మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లి తెలుసుకున్నారు.
కొంచెం ధైర్యంగా ఉందాం. మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటాను. మరీ ఇబ్బందులు అనిపిస్తే, నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. అంటూ రోగులకు భరోసా ఇచ్చారు దయాకర్ రావు, ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధులు తిండికి ఇబ్బంది ఉన్నవాళ్లకు సపోర్ట్ చెయాలని సూచించారు. ఒకవైపు బాధితులకు భరోసాని, ధైర్యాన్నినింపుతూ మరోవైపు ప్రజాప్రతినిధులు వారి అదుకోవాలని చెపుతూ వారితో మంత్రి మాట్లాడారు.