గంటకు 12 వేల కేసులు! దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రోజురోజుకు మరింతగా విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. మంగళవారం దేశంలో రికార్డ్ స్థాయిలో 2 లక్షల 95 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు 2 వేలు క్రాస్ అయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్ బలితీసుకుంది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 2,95,041 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇదే సమయంలో కొవిడ్‌తో 2023 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,82,553కి చేరింది. మహారాష్ట్రలో 62,097, యూపీలో 29,754, దిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 519, ఢిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,67,457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1,32,76,039 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 85.56శాతంగా ఉంది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,57,538 యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ నెలలో మహమ్మారి కట్టలు తెంచుకుంది. ఈ నెల 18వ తేదీ సోమవారం నమోదైన 2,73,500 కేసులు, 1,619 మరణాలను గంటల ప్రాతిపదికన లెక్కిస్తే.. గంటకు 11 408 కేసులు రాగా, 67 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 2.93 లక్షల కేసులు- 2023 మరణాలను లెక్కిస్తే గంటకు 12,293 మంది వైరస్ బారినపడగా, 84 మంది చనిపోయారు. ఏప్రిల్ 1న దేశంలో 72,330 పాజిటివ్‌లు, 459 మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన నాడు గంటకు నమోదైన కేసులు 3,013 అయితే.. మరణాలు 19 మాత్రమే.
20 రోజుల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో బాధితులు, మృతులు పదిరెట్లపైగా పెరిగారు. 1వ తేదీన యూపీలో గంటకు 108 కేసులు నమోదయ్యాయి. మూడు గంటలకొకరు చనిపోయారు. 18వ తేదీన గంటకు 1,271 పాజిటివ్‌లు రాగా, ఐదుగురు చనిపోయారు. కేసులపరంగా ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంది. మరణాలు యూపీ కంటే రెట్టింపు ఉంటున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 1న గంటకు 1,647 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. తాజాగా 2,859 పాజిటివ్‌లు వస్తుండగా, 20 మంది చనిపోతున్నారు.