బ్యాంకులకు హాఫ్ డే.. కరోనా ఎఫెక్ట్...
posted on Apr 23, 2021 @ 2:33PM
కరోనా పంజా బ్యాంకులపై తీవ్రంగా ఉంది. నిత్యం ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే ఉద్యోగం కావడంతో.. బ్యాంక్ సిబ్బంది భారీగా వైరస్ బారిన పడుతున్నారు. ఒక్క ఎస్‌బీఐ బ్యాంకులోనే 600లకుపైగా ఉద్యోగులకు కరోనా సోకడంతో బ్యాంక్ ఎంప్లాయిస్ హడలిపోతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఉద్యోగులు, ఖాతాదారుల రక్షణ దృష్ట్యా బ్యాంకుల పని వేళలను కుదిస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ-ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. వచ్చేనెల 15 వరకు.. లేదా, ఎస్‌ఎల్‌బీసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పని వేళలు అమలవుతాయి. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగం ఇతర నిర్ణయాలు తీసుకుంటే అవే అమలవుతాయని కమిటీ స్పష్టం చేసింది.
అవకాశం, అవసరాన్ని బట్టి తమ శాఖలను తక్కువ మంది సిబ్బందితో నడిపేందుకు లేదా వారికి ఇంటినుంచే పని చేసేందుకు అనుమతి ఇవ్వడంపై నిర్ణయాధికారాన్ని బ్యాంకులకే ఇచ్చింది. కరెన్సీ చెస్ట్‌లు, ఏటీఎంలలో నగదు జమచేసే వెండర్లు, ఏటీఎం బ్యాక్ ఆఫీసులు, క్లియరింగ్- బ్యాంకు ట్రెజరీ- ఫారెక్స్ బ్యాక్ కార్యాలయాలు, ‘స్విఫ్ట్’ సెంటర్లతో పాటు ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల అధీకృత సెంటర్లు ఎప్పట్లాగానే పని చేస్తాయని తెలిపింది.
బ్యాంకింగ్ రంగ అధికారులు, ఉద్యోగులందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టీకాలు వేయించేలా చూడాలని సర్కారును కోరుతున్నారు.