టీఆర్ఎస్ పై అసద్ గుస్సా.. ఆ పార్టీతో మిలాఖత్ అయినట్టేనా?
posted on Apr 24, 2021 @ 12:46PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయా? అధికార టీఆర్ఎస్ కు షాగ్ తగలనుందా? అంటే అవుననే తెలుస్తోంది. టీఆర్ఎస్ కు మొదటి నుంచి మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న ఓ పార్టీ.. కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్, 2014 నుంచి ఆ పార్టీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటూ వస్తోంది ఎంఐఎం పార్టీ. అధికారికంగా రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా.. లోపాయకారిగా కలిసి పని చేస్తున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం పోటీ చేసి గెలుస్తుండగా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎంఐఎం కారు పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. తెలంగాణలో దాదాపు 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే గెలుపోటముల్లో కీలకం. అలాంటి అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్సే గెలిచింది. ఇందుకు ఎంఐఎం మద్దతే కారణం.
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎంఐఎంకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. హైదరాబాద్ ఎంపీ అసద్ కు సన్నిహితంగా ఉంటారు. అసద్ ఏం చెప్పినా కేసీఆర్ చేస్తారనే ప్రచారం ఉంది. గత డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీ మినగా మిగితా ప్రాంతాల్లో ముస్లిం ఓట్లతోనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచారని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ కు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తోంది పతంగి పార్టీ. ఎమ్మెల్సీ , రాజ్యసభ ఎన్నికల్లోనూ అండగా నిలుస్తోంది. అసెంబ్లీలోనూ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న అసద్ వాయిస్ ఇప్పుడు మారినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తెలంగాణలో ప్రస్తుతం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అయితే జడ్చర్ల మున్సిపాలిటీలో మాత్రం సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు పతంగి పార్టీ నేతలు. నామినేషన్ల సందర్భంగా ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అసద్.. టీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశామని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జడ్చర్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థులను కొందరు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు అసద్.
జడ్చర్లలో అసద్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ.. టీఆర్ఎస్ కు దూరం కానుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయినందువల్లే అసద్ అలా మాట్లాడారని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ కాకుంటే అసద్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. అయితే బీజేపీకి ఎంఐఎం సపోర్ట్ చేసే ఛాన్స్ ఉండదు. ఇక కాంగ్రెస్ కు కూడా అసదు మద్దతు ఇవ్వలేరు . ఎందుకంటే కొంత కాలంగా ఆయన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా అసద్ కుట్రలు చేస్తున్నారని, ఇందుకు బీజేపీ సపోర్ట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు పార్లమెంట్ వేదికగా కూడా బీజేపీతో పాటు కాంగ్రెస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అసద్. దీంతో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు దగ్గర కావడం అసాధ్యమంటున్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ ఏర్పాట్లలో ఆమె బిజీగా ఉన్నారు. ఖమ్మంలో సభ కూడా నిర్వహించారు. షర్మిల పార్టీ తెరపైకి వచ్చినపుడే.. ఆమెకు అసదుద్దీన్ మద్దతు ఇవ్వవొచ్చనే ప్రచారం జరిగింది. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్నారు అసద్. ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీతో కలిసి ఎంఐఎం కలిసి నడవవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. తాజాగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఎంఐఎం చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. షర్మిల పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకోవడం వల్లే అసద్.. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.అదే జరిగితే తెలంగాణలో కారు పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అసద్... కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని.. జడ్చర్ల ఎన్నికల వరకే ఆ అగ్రహం ఉంటుందనే వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.