తెలంగాణలో థియేటర్లు బంద్ 

తెలంగాణలో మరోసారి థియేటర్లు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సినిమా హాల్స్ మూసివేస్తున్నట్టు మూవీ థియేటర్స్ యజమానుల అసోసియేషన్ ప్రకటించింది.  రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేది వరకూ సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు  కార్యదర్శి విజేందర్‌ రెడ్డి ప్రకటించారు. అయితే వకీల్‌సాబ్‌ ఆడుతున్న సినిమా హాళ్లు మాత్రం నడవనున్నాయి.ప్రేక్షకుల సంక్షేమం గురించి ఆలోచించి స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.  ప్రభుత్వంతో ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరపలేదని వారు తెలిపారు.  ఈ నెల 20 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతుండటంతో ఆ ప్రభావం సినిమా థియేటర్లపైనా కనిపించనుంది. ఉద్యోగులు, కుటుంబాలతో వచ్చేవారు ఎక్కువగా సాయంత్రం, రాత్రి పూట సినిమాలకు వస్తుంటారు. రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ ప్రారంభమవుతుండటంతో ఈ రెండు షో లకు వచ్చేవారికి ఇబ్బందులు తప్పవు.ఇక మార్నింగ్, మ్యాట్నీ షోలకు వచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్వాహణ అదనపు భారంగా మారుతుందని ఓనర్స్ చెబుతున్నారు. ప్రభుత్వం నిబంధనలను సడలించేవరకు పూర్తిగా సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. ఈ నిర్ణయంతో జంట నగరాల్లోని 150కు పైగా సినిమా హాళ్లతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆరొందల పైగా సినిమా హాల్స్ బధవారం నుంచి మూతపడనున్నాయి

తిరుపతి పోలింగ్ రద్దు? హైకోర్టులో బీజేపీ అభ్యర్థి పిటిషన్

దొంగ ఓట్ల కలకలంతో వివాదంగా మారిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రద్దు కానుందా? తిరుపతిలో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తారా? తిరుపతి లోక్ సభ పరిధిలో ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్ రోజున భారీగా దొంగ ఓటర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మీడియా సాక్షిగా బోగస్ ఓటర్ల బాగోతం బయటపడింది. దీంతో పోలింగ్ ను రద్దు చేయాలని విపక్షాలు, తిరుపతి బరిలో నిలిచిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు డిమాండ్ చేశారు. పోలింగ్ ను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఏపీ హైకోర్టును అశ్రయించారు. పోలింగ్ ను రద్దు చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తన పిల్ లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చారు రత్నప్రభ. దీంతో తిరుపతి ఉప ఎన్నిక రద్దు కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బోగస్ ఓట్లకు సంబంధించి పక్కా అధారాలు ఉన్నందున హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.  ఈ నెల 17న జరిగిన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా వందలాది మంది దొంగ ఓటర్లను ప్రతిపక్ష పార్టీల నేతలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వేల మంది తిరుపతికి వచ్చారు. సొంతంగా ముద్రించిన ఓటర్‌ కార్డుల వెనుక ఓటర్ల జాబితా సీరియల్‌ నెంబర్‌ స్టిక్కర్‌ కూడా వేసి దొంగ ఓటర్ల చేతికి ఇచ్చి పంపారు. ఇవన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. దొంగ ఓటర్లు తాము తీసుకువచ్చిన ఓటర్‌ కార్డులోని ఓటరుకు సంబంధించిన వివరాలు చెప్పలేక తెల్లమొహం వేశారు. గట్టిగా నిలదీస్తే కొంత మంది పారిపోయారు. కొంత మంది తెలియక వచ్చామని ఒప్పుకొన్నారు. టీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు కూడా దొంగ ఓటర్లను పట్టుకొన్నారు. 250 బస్సులను వెనక్కు పంపామని డీజీపీనే స్వయంగా ప్రకటించారు. దొంగ ఓటర్ల వ్యవహారాన్ని టీవీ ఛానళ్లు సమగ్రంగా వెలుగులోకి తెచ్చి చూపించాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని బస్సుల్లో పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి దొంగ ఓట్లను వేయించడానికి రచించిన ప్రణాళికపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ పార్టీ నేతతో మాట్లాడిన ఫోన్‌ సంభాషణ బహిర్గతమైంది.దీంతో దొంగ ఓట్ల అంశం తీవ్ర దుమారం రేపింది.  తిరుపతిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం వరకూ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని కోరారు. సోమవారం ఆయన సీఈసీకి 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. చెవిరెడ్డి ఫోన్‌ సంభాషణల ఆడియో క్లిప్పింగ్‌తో పాటు పోలింగ్‌ రోజు తిరుపతిలో చోటు చేసుకొన్న దొంగ ఓట్ల దందాకు సంబంధించి 11 వీడియో క్లిప్పింగులను లేఖకు జత చేశారు.  దొంగ ఓటర్ల అరాచకంతో తిరుపతిలో అసలు ఓటర్లు ఓటు వేయడానికి రాలేదని, అందుకే గత ఎన్నికలతో పోలిస్తే  ఓటింగ్‌ శాతం తగ్గిందని తన లేఖలో చంద్రబాబు వెల్లడించారు.  80ఏళ్లు పైబడిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కొని తమకు అనుకూలంగా వేసుకొన్నారని ఆరోపించారు. ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అయినా చర్యలు తీసుకోకపోతే ఎన్నికలకు విలువ ఉండదన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం వరకూ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించండి అని చంద్రబాబు లేఖలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. 

ఒక్క రోజులో 35 మరణాలు.. ఏపీలో కరోనా బీభత్సం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా బీభత్సం స్పష్టిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని బలి తీసుకుంది. గత 24 గంటల్లో ఏపీలో దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో  37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్  నిర్ధారణ అయింది. అంటే పరీక్ష చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకింది. టెస్టుల సంఖ్య పెంచితే ఇంతకు రెండింతలు కేసులు నమోదవుతాయని భావిస్తున్నారు. గతంలో ఏపీలో రోజుకు లక్ష వరకు టెస్టులు చేసేవారు. కాని ప్రస్తుతం 40 వేల లోపే కరోనా టెస్టులు చేస్తున్నా.. 9 వేల వరకు కేసులు రావడం ఆందోళన కల్గిస్తోంది.  చిత్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో కరోనా పంజా విసురుతుందని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ పట్టించుకోకుండా ప్రచారం చేయడం వల్లే కరోనా విజృంభించిందని చెబుతున్నారు.  గత 24 గంటల వ్యవధిలో ఏపీలో  3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 53,889 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 7,472కి పెరిగింది.  

వ్యాక్సిన్ తీసుకుంటే రేషన్, ఎగ్స్ ఫ్రీ! 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో భయంకరంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం కరోనా పంజాతో భారత్ విలవిలలాడుతోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కొవిడ్ వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేశారు. టీకా తీసుకోవడానికి భయపడే జనాలకు అవగాహన కల్పిస్తూ.. అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పించినా టీకాలు తీసుకోవడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. దీంతో వ్యాక్సిన్ తీసుకునేవారికి రాయితీలు, ఆఫర్ లు ప్రకటిస్తున్నారు. రేషన్ ఫ్రీగా ఇస్తామని, గుడ్లు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నది ఎక్కడో కాదు.. కొవిడ్ కు పుట్టినిల్లు చైనాలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ ను సమర్థంగానే కట్టడి చేయగలిగింది. అయితే  వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక మాత్రం  చైనా ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ప్రజలను ఆకర్షించేందుకు చైనా ఆఫర్లు ప్రకటిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి 3 కిలోల గుడ్లు ఉచితం అని, సూపర్ మార్కెట్ షాపింగ్ కూపన్లు ఫ్రీ అని ఊరిస్తోంది. రేషన్ సరకులపై రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. అయినా జనాల్లో ఆశించిన మేర స్పందన రావడంలేదు. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన చైనాలో ఇప్పటివరరకు టీకా వేయించుకుంది 19 కోట్ల మందే.  దాంతో మిగతావారిని ఎలా వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకురావాలో అర్థంకాక చైనా  ప్రభుత్వం తలపట్టుకుంటోంది

చంద్రబాబును ఆకాశానికెత్తిన రోజా

ఆర్కే రోజా.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆమె టీడీపీ కీలక పదవులు నిర్వహించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో సమయం దొరికినప్పుడల్లా  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తుంటారు. తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు. ఫైర్ బ్రాండ్ లీడరుగా పిలుచుకునే రోజా... టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికెత్తారు. వీరుడు.. ధీరుడు అంటూ పొగిడారు.  చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కొన్నేళ్ల క్రితం నాటి టీడీపీ నాయకురాలు.. నేటి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. టీడీపీ నాయకురాలిగా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ ఆమె మాట్లాడారు. శూరుడు.. ధీరుడు అంటూ చంద్రబాబును ఉద్దేశించి రోజా వ్యాఖ్యానించారు.  ‘‘తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి.. అమ్మణ్ణమ్మ కలల పంట.. నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు.. జగమంతా మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు’’ అంటూ రోజా కీర్తించారు.  ఈ వీడియోను నెటిజ‌న్లు షేరింగ్ చేసుకుంటున్నారు. 

కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో పరిస్థితి తీవ్రంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ అమర్ నాథ్ కరోనాతో చనిపోయారు. కరోనా సోకడంతో  10 రోజుల క్రితము నిమ్స్ ఆసుపత్రిలో చెరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం అమర్ నాథ్ తుదిశ్వాస వదిలారు. అమర్ నాథ్ మృతితో జర్నలిస్టులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కార్చారు.  తెలుగు జర్నలిజంలో అత్యంత సీనియర్ కోసూరిఅమర్ నాథ్. దశాబ్దాల పాటు ఆయన వివిధ సంస్థల్లో పని చేశారు. టీయూడబ్ల్యూజేలో కీలక నేతగా ఉన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా పని చేశారు. కోసూరి అమర్‌నాథ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుగా సమాజం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అమరనాథ్ మృతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకుపైగా జర్నలిజంలో అమర్ నాథ్ తనదైన ముద్ర వేశారన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

షాపులు 4 గంటలే.. నిత్య‌వ‌స‌రాల‌కూ ఆంక్ష‌లే..

ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూ. వీకెండ్ లాక్‌డౌన్‌. జ‌న‌తా క‌ర్ఫ్యూ. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. నిత్యావ‌స‌రాల‌పై కూడా ఆంక్ష‌లు విధించింది ప్ర‌భుత్వం. కిరాణా, కూర‌గాయ‌లు, పండ్లు త‌దిత‌ర షాపులు ఉద‌యం వేళ‌.. కేవ‌లం 4 గంట‌ల పాటు మాత్ర‌మే తెరిచి ఉంచాల‌ని ఆదేశించింది. కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.  ‘‘కిరాణాలు, కూరగాయల దుకాణాలు, పండ్ల విక్రయాలు, బేకరీలు, అన్ని రకాల ఆహార దుకాణాలు (మాంసం విక్రయాలు కూడా), వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. హోం డెలివరీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చేయాలి’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ ఆంక్షలు మంగ‌ళ‌వారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్ర‌క‌టించింది.    రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల పేరుతో చాలా మంది జనం బయటకు వస్తున్నారని, దీంతో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 రాత్రి నుంచి జనతా కర్ఫ్యూ పేరుతో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయితే ఇందులో కూరగాయలు, కిరాణా దుకాణాలు, ఆహారశాలలు తదితర నిత్యావసరాలకు మినహాయింపు కల్పించింది. తాజాగా వాటిపైనా ఆంక్షలు విధించింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం.

శ్రీవారి ద‌ర్శ‌నాల‌పై క‌రోనా ఎఫెక్ట్‌

సెకెండ్ వేవ్ ఉప్పెన‌లా ముంచేస్తోంది. క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. కొవిడ్ ఎఫెక్ట్ తిరుమ‌ల మీద కూడా ప‌డింది. శ్రీవారి దర్శనాలను కుదించాలని టీటీడీ నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను సగానికి సగం తగ్గించింది.  మే నెలకు సంబంధించి బుధవారం ఆన్‌లైన్‌లో టీటీడీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది. అయితే టిక్కెట్లను 30 వేల నుంచి 15 వేలకు కుదించాలని అధికారులు నిర్ణయించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్శనాల సంఖ్యను మరింత కుదించేందుకు కూడా టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టిక్కెట్ పొందిన భక్తులు దర్శన తేదీకి రాలేకపోతే టిక్కెట్ పొందిన 90 రోజుల్లో ఎప్పుడైనా స్వామిని దర్శనం చేసుకునేలా టీటీడీ అధికారులు వెసులుబాటు కల్పించారు. మాస్క్ ధ‌రించిన వారికే ఆల‌యంలోకి అనుమ‌తి.

క‌రోనా కౌగిలింత‌.. జ‌ర జాగ్ర‌త్త‌.. మాస్క్ మంచికే..

వైద్యులంతా మొత్తుకుంటున్నారు. జ‌ర జాగ్ర‌త్త అంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. క‌రోనా మ‌హా ఖ‌త‌ర్నాక్‌. మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావొద్దు. జ‌నంలో తిర‌గొద్దు. గుంపులుగా ఉండొద్దు. చెబితే వినాలిగా! ఎవ‌రూ విన‌ట్లే. ఆఖ‌రికి పెద్ద పెద్ద నాయ‌కులు, ప్ర‌ముఖులు సైతం కొవిడ్‌ను కేర్ చేయ‌టంలే. ఫలితం.. వారంతా వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. వారి అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నారు. ఎవ‌రి వ‌ర‌కో ఎందుకు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌నే తీసుకొండి. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళ‌.. నాగార్జున సాగ‌ర్‌లో బ‌హిరంగా స‌భ నిర్వ‌హించారు. మాస్క్ లేకుండా స్టేజ్‌పై క‌లియతిరిగారు. వేదిక‌పై ఉన్న నేత‌ల‌తో ద‌గ్గ‌ర‌గా సంభాషించారు. కేసీఆర్ చుట్టూ గుంపులు గుంపులుగా నేత‌లు చేరారు. క‌ట్ చేస్తే.. సీఎం కేసీఆర్‌తో స‌హా ఆ వేదిక‌పై ఉన్నా చాలామందికి క‌రోనా పాజిటివ్‌.  టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌, కోటిరెడ్డి, అంజ‌య్య‌.. ఇలా స్టేజీపై ఉన్న వారిలో స‌గానికి పైగా నాయ‌కులకు పాజిటివ్ వ‌చ్చింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సైతం క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌జ‌లు పానిక్ అవుతున్నారు. అంత జాగ్ర‌త్త‌గా ఉండే సీఎంకే క‌రోనా వ‌స్తే.. ఇక త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న చెందుతున్నారు. హాలియా స‌భ‌లోనే కేసీఆర్‌కు వైర‌స్ అంటి ఉంటుంద‌ని అంటున్నారు. క‌రోనా టైమ్‌లో కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రిపోయేదిగా. ప‌రిస్థితి ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చేది కాదుగా. అని చ‌ర్చించుకుంటున్నారు. కేవ‌లం ముఖ్య‌మంత్ఉరికే కాదు.. ఆ బ‌హిరంగ స‌భ త‌ర్వాత నాగార్జున సాగ‌ర్‌లో కొవిడ్ కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఒక్క కేసీఆర్ అనే కాదు.. వ‌కీల్ సాబ్‌నూ వ‌ద‌ల‌లేదు క‌రోనా. ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఎక్కువ స‌మ‌యం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యే ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కోసం జ‌న‌స‌మూహంలోకి వ‌చ్చారు. అస‌లే సినిమా హీరో క‌దా. మాస్క్ పెట్టుకుంటే గ్లామ‌ర్ లుక్ పోతుంద‌నుకున్నారో ఏమో.. వేదిక‌పై మాస్క్ లేకుండానే క‌నిపించారు. అస‌లే క్లోజ్డ్ హాల్‌. ప్రాంగ‌ణ‌మంతా జ‌నం కిక్కిరిసి ఉన్నారు. అందులో ఎవ‌రి నుంచో వైర‌స్ సోకిన‌ట్టుంది. ప‌వ‌న్‌కు పాజిటివ్ వ‌చ్చింది. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది. ఫ్యాన్స్‌, ఫ్యామిలీలో ఒక‌టే కంగారు. తాను కాస్త కోలుకున్నాన‌ని పీకే ప్ర‌క‌టించే వ‌ర‌కూ అభిమానుల్లో హైటెన్ష‌న్. అదే వ‌కీల్‌సాబ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు, బండ్ల గ‌ణేశ్ ఇలా అనేక మంది కొవిడ్ బారిన ప‌డ్డారు. ఆస‌క్తిక‌ర విషయం ఏంటంటే.. ఆ షోలో మాస్క్‌ పెట్టుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌కు మాత్రం క‌రోనా సోక‌లేదు. అదీ, మాస్క్ ఇంపార్టెన్స్‌.  ఇటీవ‌ల ఖ‌మ్మంలో జ‌రిగిన ష‌ర్మిల స‌భ‌లోనూ క‌రోనా క‌ల్లోల‌మే. ష‌ర్మిల‌తో పాటు వేదిక మీదున్న చాలా మందికి పాజిటివ్ వ‌చ్చింది. ష‌ర్మిల త‌ర్వాత పార్టీలో కీల‌క నేత‌గా ఉంటున్న కొండా రాఘ‌వ‌రెడ్డి ఖ‌మ్మం స‌భలో కొవిడ్ బారిన ప‌డ్డారు. అందుకే, రాఘ‌వ‌రెడ్డి ఇందిరాపార్కు ద‌గ్గ‌ర జ‌రిగిన ష‌ర్మిల దీక్ష‌కు రాలేదు. ఆ స‌భ‌కు, దీక్ష‌కు హాజ‌రైన అనేక మందికి పాజిటివ్ వ‌చ్చిందని తెలుస్తోంది. క‌రోనా టైమ్‌లో మాస్కే శ్రీరామ‌ర‌క్ష‌. ఇంత చిన్న లాజిక్ వ‌దిలి.. మాస్క్‌ను మ‌రిచి.. క‌రోనాను కౌగిలించుకోవ‌డం.. క్ష‌మించ‌రాని నేరం. అది ప్ర‌ముఖులైనా.. సామాన్యులైనా. బీకేర్ ఫుల్ విత్ కొవిడ్‌.

ప‌రీక్ష‌ల పంతం.. ప్రాణాల‌తో చెల‌గాటం! వైదిస్ ఎగ్జామ్స్ వ‌ర్రీ?

దేశ‌మంతా క‌రోనా క‌ల్లోలం. ల‌క్ష‌ల్లో కేసులు. వంద‌ల్లో చావులు. అనేక రాష్ట్రాల్లో మ‌ర‌ణ మృదంగం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ‌డుల‌కు సెల‌వులు. తెలుగు స్టేట్స్‌లో కూడా స్కూల్స్ మూత‌. ఇంత వ‌ర‌కూ ఓకే. మ‌రి, ప‌రీక్ష‌ల మాటేమిటి?  దేశ వ్యాప్తంగా అన్నిచోట్ల ప‌ది ప‌రీక్ష‌లు వాయిదా ప‌డితే.. ఏపీలో మాత్రం ఎగ్జామ్స్‌ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రిపి తీరుతామంటూ ప‌ట్టుద‌ల‌కు పోతోంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఎందుకింత మొండిత‌నం?  విద్యార్థుల ఆరోగ్యంతో ఎందుకిలా చెల‌గాటం? అంటూ విప‌క్షాలు నిల‌దీస్తున్నాయి. ఇప్ప‌టికే ఎగ్జామ్స్ ర‌ద్దు చేయాలంటూ నారా లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి వారు సీఎం జ‌గ‌న్‌ను డిమాండ్ చేశారు. పరీక్ష‌ల పేరుతో స్టూడెంట్స్‌ను ప్ర‌మాదంలో ప‌డేయ‌వ‌ద్దంటూ హిత‌వు ప‌లికారు. అయినా, ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. ప‌ది ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం  మార్చుకునేందుకు సుముఖంగా లేదు. ఇప్ప‌టికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సైతం థెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది. తెలంగాణ‌తో స‌హా అనేక రాష్ట్రాలు ప‌ది ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయి. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ స్టూడెంట్స్‌ను నేరుగా సెకండ్ ఇయ‌ర్‌కు ప్ర‌మోట్ చేస్తున్నాయి. ఇంట‌ర్ ఫైన‌ల్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌, జేఈఈ టెస్ట్ సైతం వాయిదా ప‌డ్డాయి. దేశ‌మంతా ఒక లెక్క‌. ఏపీ మాత్రం మ‌రో లెక్క అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుపుతామంటూ ప్ర‌భుత్వం గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఎందుకో మ‌రి..?  విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి ఏం సాధిద్దామ‌నో..? అని త‌ల్లిదండ్రులు మండి ప‌డుతున్నారు. ఏపీలో నిత్యం వేల సంఖ్య‌ల్లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలూ పెద్ద సంఖ్య‌లో చోటు చేసుకుంటున్నాయి. అయినా, ప్ర‌భుత్వం త‌ర‌ఫున చెప్పుకోద‌గ్గ చ‌ర్య‌లు లేవు. ఏపీతో పోలిస్తే తెలంగాణ‌లో కేసులు కాస్త త‌క్కువే. అయినా, అక్క‌డి ప్ర‌భుత్వం నైల్ క‌ర్ఫ్యూ విధించింది. ప‌ది ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే ర‌ద్దు చేసింది. అటు, కేంద్ర బోర్డులు సైతం ప‌ది ప‌రీక్ష‌లు వ‌ద్దన్నాయి. ఇలా, అంతా క్యాన్సిల్‌, క్యాన్సిల్ అంటుంటే.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మాత్రం ఎగ్జామ్స్‌, ఎగ్జామ్స్ అంటూ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దేశంలోని స్టూడెంట్స్ అంతా ప‌ది పరీక్ష‌లు రాయ‌కుండా.. ఒక్క ఏపీ విద్యార్థులే రాస్తే.. వీరి కోసం స్పెష‌ల్‌గా అవ‌కాశాలేమైనా వ‌స్తాయా? ఇప్ప‌టికే ప‌ది ప‌రీక్ష‌లు చూచిరాత పోటీలంటూ వాటి విలువ ఎప్పుడో త‌గ్గిపోయింది. అలాంటిది.. క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప‌రీక్ష‌లు పెట్టడం.. ఎవ‌రి ప్రాణాలు తీయ‌డానికంటూ.. పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. హైకోర్టునూ ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. టీడీపీ సైతం ఈ విష‌యంపై న్యాయ నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఇలా లోక‌మంతా వ‌ద్దు అంటుంటే.. జ‌గ‌న్‌రెడ్డి ఒక్క‌రే కావాలంటూ కాక రేపుతున్నారు. ఏపీలో ఇప్పుడు ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై ర‌చ్చ న‌డుస్తోంది. ఇలానే మొండిగా ఎగ్జామ్స్ పెట్టి.. స్టూడెంట్స్‌కి పారాసిట‌మాల్ టాబ్లెట్స్ ఫ్రీగా స‌ప్లై చేస్తారో? లేక‌, ఎగ్జామ్ హాల్‌లో బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లించి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారో చూడాలి మ‌రి...

టీకాల భారం రాష్ట్రాలదే! కేంద్రం చేతులెత్తేసిందా?

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ మూడో దశలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించింది. వ్యాక్సిన్ తయారీదారులు 50 వ్యాక్సిన్‌‌లను కేంద్ర ప్రభుత్వానికి, మరో 50 శాతం వ్యాక్సిన్‌‌లను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓపెన్ మార్కెట్‌కు కూడా సరఫరా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో కొవిడ్ టీకాల భారం ఇకపై రాష్ట్రాలపై పడనుంది. ఇప్పటివరకు కేంద్రమే టీకాలను పంపిణి చేస్తోంది.  కేంద్ర సర్కార్ నిర్ణయంపై కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్ తో ఇప్పటికే ఆదాయం తగ్గిపోయి చాలా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీకాల భారం మోపడం సరికాదనే అభిప్రాయం వస్తోంది. రాష్ట్రాలు ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనే అవకాశం కల్పించడం కూడా సరికాదంటున్నారు. దీనివల్ల ధనిక రాష్ట్రాలు ఎక్కువగా టీకాలు కొనుగోలు చేసే అవకాశం ఉందనే చర్చ వస్తోంది. దేశంలో అవసరమున్న అందరికి టీకా అందకుండా.. ధనవంతులకే దక్కేలా కేంద్ర సర్కార్ నిర్ణయం ఉందంటున్నారు. కొవిడ్ టీకా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్య తీవ్రంగా ఉంది.మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ను ధనిక, సంపన్న దేశాలు గంపగుత్తగా కొని పెట్టికుంటుండగా.. పేద దేశాలు మాత్రం చేతులెత్తేశాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమై ఐదారు నెలలు అవుతున్నా.. ఇంకా కొన్ని దేశాలకు వ్యాక్సిన్ అందలేదు. పేద దేశాలకు టీకా అందని ద్రాక్షలానే మిగిలే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో దేశంలోని రాష్ట్రాల మధ్య టీకాల కోసం పోటీ ఏర్పడి.. అందరికి అందకుండా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మే1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని కూడా కేంద్రం నిర్ణయించింది.దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచించారు. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న డిమాండ్‌ వినిపించింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రులు ఈ దిశగా కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

బ్రేకింగ్ న్యూస్‌.. తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ..

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ. క‌రో నా ఉధృతి నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  నెలాఖ‌రు వ‌ర‌కూ రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 వ‌ర‌కూ క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. రాత్రి 8 గంట‌ల‌కే షాపులు, ఆఫీసులు, హోట‌ళ్లు, మాల్స్‌, సినిమా హాల్స్‌ మూసివేయాలి. అత్య‌వ‌స‌ర సేవ‌లైన ఆసుప‌త్రులు, ఫార్మ‌సీలు, ల్యాబ్స్‌ తెరిచే ఉంటాయి.  నైట్ క‌ర్ఫ్యూ నుంచి కొన్ని అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో ఉండే వ‌ర్గాల‌కు మిన‌హాయింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం. ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా, టెలికం, ఇంట‌ర్‌నెట్ స‌ర్వీసెస్‌, పెట్రోల్ పంప్స్‌, గ్యాస్ స‌ప్లై, విద్యుత్ శాఖ‌, వాట‌ర్‌, సానిటేష‌న్ త‌దిత‌ర విభాగాల‌కు నైట్ క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంది.  అత్య‌వ‌స‌ర విధుల్లో పాల్గొనే వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది, ప్ర‌భుత్వ ఉద్యోగులు ఐడీ కార్డుల‌ను విధిగా చూపించాల్సి ఉంటుంది.  నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను రవాణా చేసే అంత‌రాష్ట్ర వాహ‌నాల‌కు ఎలాంటి ఆటంకాలు ఉండ‌వు. అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయాల్సిన వారు స‌రైన కార‌ణం కానీ, స‌రైన టికెట్ కానీ చూపించాల్సి ఉంటుంది. 

తిరుపతిలో సంచలన ఫలితం! సర్వేలో ఏం తేలిందంటే? 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. తిరుప‌తి తమదేనని  పోటాపోటీగా ప్రకటనలు చేశారు అధికార వైసీపీ నేతలు. ఐదు లక్షల మెజార్టీ వస్తుందని ఒక మంత్రి అంటే... ఆరు లక్షలు క్రాస్ చేస్తామని మరో మంత్రి చెప్పుకొచ్చారు. అరెవో సాంబా.. రాస్కో.. అన్నంత బిల్డ‌ప్ ఇచ్చారు. తీరా పోలింగ్ రోజు వ‌చ్చేస‌రికి చేతులెత్తేశారు. పోలింగ్ సరళి చూశాక అధికార వైసీపీలో గెలుపు భ‌యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది.  ఓడిపోతామ‌నే భయంతోనే వైసీపీ నేతలు దొంగ ఓట్ల‌తో దిగ‌జారిపోయారని అంటున్నారు. అందుకే  తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు. ఒక‌టా, రెండా.. వంద‌లాది బ‌స్సులు.. వేలాది మంది దొంగ ఓట‌ర్లును.. తిరుప‌తి మొత్తం దించేశారు. విచ్చ‌ల‌విడిగా దొంగ ఓట్లు వేయించుకోవాలని చూశారు. అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి ఎస్కార్టులు.. పాల‌కులే దగ్గ‌రుండి మ‌రీ దొంగ ఓట్లు వేయించారు.  అయితే టీడీపీ నేతల అప్రమత్తతో దొంగ ఓట్ల బండారం బట్టబయలైంది. మీడియా సాక్షిగా దొంగ ఓట్ల ప్ర‌హ‌స‌నం బయటపడంతో చేసిది లేక వందలాది బస్సులను పోలీసులు తిరిగి పంపించేశారు. వైసీపీ ఇంత చేసినా పోలింగ్ శాతం 65 శాతం ద‌గ్గ‌రే ఆగిపోయింది. దీంతో త‌క్కువ శాతం పోలింగ్ ఎవ‌రికి లాభం? మ‌రెవ‌రికి న‌ష్టం? అనే విశ్లేష‌ణ‌లు జోరుగా సాగుతున్నాయి. ఓటింగ్ శాతం త‌గ్గ‌డం అధికార పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేస్తోందని తెలుస్తోంది. 6 ల‌క్ష‌ల మెజార్టీ మాటేమో గానీ.. గెలిస్తే  అదే చాల‌న్న భ‌యం వారిని వెంటాడుతోందని చెబుతున్నారు.  రాజకీయ విశ్లేషకులు, వివిధ సంస్థల అంచనా ప్రకారం తిరుపతిలో షాకింగ్ ఫలితం రాబోతోందని తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో నెల్లరు జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో మూడున్నర లక్షల మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ నేతలు. అయితే పోలింగ్ తర్వాత మాత్రం నెల్లూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో కలిపి 50 వేల మెజార్టీ వస్తే మహాగొప్ప అన్నట్లుగా ఉందట వైసీపీ పరిస్థితి. గూడురు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉండగా.. వెంకటగిరిలో మాత్రమే 20 వేల లీడ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలే అంచనాకు వచ్చారట. ఈ నియోజకవర్గ పరిధిలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మిగితా మూడు నియోజకవర్గాల్లో కలిసి మరో 30 వేల వరకు మాత్రమే అధికార పార్టీకి లీడ్ రావచ్చంటున్నారు.  నెల్లూరు జిల్లాలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుందని భావించిన వైసీపీ నేతలు తాజా అంచనాలతో షాకవుతున్నారట. అయితే వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. స్థానిక నేతలను పట్టించుకోకుండా వాలంటీర్లను జగన్ నమ్ముకోవడం మైనస్ అయిందంటున్నారు. డబ్బులు తమ చేతికి రాకపోవడంతో ద్వితియ శ్రేణి నేతలంతా పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి సైలెంట్ అయ్యారని అంటున్నారు. అధికార పార్టీ డబ్బులు భారీగా పంపిణి చేస్తుందని ప్రచారం జరగగా... చాలా ప్రాంతాల్లో డబ్బులు పంచలేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంచినా రెండు, మూడు వందలతోనే సరిపుచ్చారట. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న ఓటర్లంతా అధికార పార్టీపై కోపంతో .. వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనే చర్చ జరుగుతోంది.స్థానిక వైసీపీ నేతలు కూడా సీరియస్ గా ప్రచారం చేయలేదంటున్నారు. ఎమ్మెల్యేలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఒక కారణమని చెబుతున్నారు. పోలింగ్ రోజునే గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ ను ఓటర్లు అడ్డుకున్నారంటే... జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఊహించవచ్చు.  చిత్తూరు జిల్లాలో  తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లతో మెజార్టీ సాధించాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే టీడీపీ అప్రమత్తతో అనుకున్నంతగా పోల్ చేసుకోలేదని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. దొంగ ఓట్ల బాగోతం రచ్చ కావడంతో తిరుపతి ఓటర్లు షేమ్ గా ఫీలయ్యారట. అధికార పార్టీ తీరుపై ఆగ్రహంతో టీడీపీకి ఓట్లు వేశారని అంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ కేడర్ గట్టిగా పనిచేయడంతో పోటీ హోరాహోరీగా సాగిందంటున్నారు. సత్యవేడులోనూ టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని పోలింగ్ సరళి తర్వాత అంచనా వేస్తున్నారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో 2019 ఎన్నికల్లో టీడీపీకే లీడ్ వచ్చింది. దీంతో తిరుపతిలో ఈసారి కూడా తమకే ఆధిక్యత వస్తుందని తమ్ముళ్లు పక్కాగా చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్ రోడ్ షోలకు భారీ స్పందన లభించింది. సభలకు వచ్చిన స్పందన పోలింగ్ రోజున కనిపించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో తాము గట్టి పోటీ ఇచ్చామని, తిరుపతి అసెంబ్లీ పరిధిలో లీడ్ సాధిస్తామని అంచనా వేస్తున్నారు.  మొత్తంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత అధికార వైసీపీలో గుబులు కనిపిస్తుండగా.. తెలుగు దేశం పార్టీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. ఘన విజయం సాధిస్తామని బయటికి చెబుతున్నా.. లోలోపల మాత్రం వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. దీంతో మే2న జరిగే ఓట్ల లెక్కింపులో ఏమైనా జరగవచ్చని.. సంచలన ఫలితం రావొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

ప్రధాని మోడీకి నెటిజన్ల సెగ! రిజైన్ చేయాలంటూ ట్వీట్లు 

దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రమాదకరంగా ఉంటున్నాయి. దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీరుపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనాను అదుపు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  #ResignModi హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కొవిడ్‌ కట్టడిపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ప్రధాని మోడీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఆరోపిస్తున్నారు. సకెండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై మండిపడుతున్నారు.  ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా మృతదేహాలను రహస్యంగా కాల్చివేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల ట్వీట్లు వచ్చాయి.  దేశంలో కరోనా పెరుగుదలకు మోడీనే కారణమని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ సహా మరికొందరు నేతలు రాజీనామాకు డిమాండ్ చేస్తూ ట్వీట్లు చేశారు.  సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోడీకి ట్విట్టర్‌లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారి. గతేడాది ఆగస్టులోనూ మోడీపై సోషల్ మీడియా మండిపడింది. ఆయన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జేఈఈ, నీట్ గురించి మాట్లాకపోవడంపై సోషల్ మీడియా విరుచుకుపడింది.మోడీ  ప్రసంగ వీడియోకు డిస్‌లైక్‌లతో తమ నిరసన తెలిపారు. ఆ వీడియోకు 74వేల లైక్‌లు వస్తే ఏకంగా 5 లక్షల మంది డిస్‌లైక్ చేశారు.  ఉద్యోగాలు కావాలంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ‘మోడీ రోజ్‌గార్ దో’, ‘మోడీ ఉద్యోగమివ్వు’ వంటి ట్వీట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్క రోజులోనే ఇలాంటి ట్వీట్లు ఏకంగా 50 లక్షలు రావడం గమనార్హం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని గొంతెత్తుతున్నారు.  

కేసీఆర్ కు కరోనా అక్కడే అంటిందా?  

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకింది. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు.  సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని పర్యవేక్షిస్తుందని చెప్పారు. కేసీఆర్ కోసం యశోద హాస్పిటల్ లో ప్రత్యేక గదిని సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు కరోనా సోకిందన్న వార్తలతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. సాగర్ నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా భారీగానే కేసులు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది.  ఈనెల 14న హాలియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి వేదిక పంచుకున్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాస్క్ ధరించలేదు. వేదికపై నోముల భగత్ తో చాలా సార్లు మాట్లాడారు కేసీఆర్. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు. గుంపులు గుంపులుగా కేసీఆర్ చుట్టూ చేరారు నేతలు. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు హాలియా సభలోనే కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.  తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు కరోనా బారినపడడంతో ఆయన క్షేమాన్ని కోరుకుంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందించారు. కొవిడ్-19 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

నాగార్జునసాగర్ లో సంపూర్ణ లాక్ డౌన్ ? 

ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. సాగర్ నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయి. గత రెండు, మూడు రోజులుగా భారీగానే కేసులు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది.  సాగర్ నియోజకవర్గ పరిధిలో  రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నియోజవర్గ పరిధిలోని పీహెచ్సీలకు టెస్టులు కోసం జనాలు భారీగా వస్తున్నారు. కిట్స్ కొరతతో టెస్టులు చేయలేక చేతులెత్తేశారు వైద్యశాఖ సిబ్బంది. దీంతో నల్గొండ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.  కేసీఆర్ సభ,ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్ క్వారంటయిన్ కావాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి చేజారక ముందే లాక్ డౌన్ విధించాలనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు లౌక్ డౌన్ విధిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.  మరోవైపు కరోనా విజృంభణతో నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇండ్ల నుంచి బయటికి రావడానికే జంకుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ కేసులు వస్తున్నాయని తెలుస్తోంది. గిరిజన తండాల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటంతో అధికారులను మరింత కలవరపెడుతోంది. దీంతో లాక్ డౌన్ పెడితేనే బాగుంటుందని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుతున్నారు.   

72 ఏళ్ల న‌వ‌యువ‌కుడు.. రాజ‌కీయ కురువృద్ధుడు..

ఇటీవ‌ల చంద్ర‌న్న‌ను చూశారా? తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న దూకుడు గ‌మ‌నించారా?.. అదే పంతం.. అదే పోరాటం.. జ‌నం కోసం.. జ‌న‌స్వామ్యం కోసం.. అధికార పీఠంపై అలుపెర‌గ‌ని పోరాటం.. ఉరుములా, ఉప్పెన‌లా ఎగిసిప‌డే సాహ‌సం.. ఆ వ‌య‌సులోనూ న‌వ యువ‌కుడిలా.. యోథుడిలా దండ‌యాత్ర చేస్తున్నారు.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డితే త‌న‌కు అస‌లు వ‌య‌సే గుర్తుకురాదంటారు.. జ‌గ‌న్‌రెడ్డి దౌర్జన్యాల‌పై చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతున్న చంద్ర‌న్నకు ఏప్రిల్ 20తో 72 ఏళ్లు వ‌చ్చాయంటే న‌మ్మాల్సిందే..  చూట్టానికి ఆయ‌న అంతటి వ‌య‌సు వాడిలా క‌నిపించ‌రు. 40 ప్ల‌స్ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ ఆయ‌న‌ది. ఇందిరాగాంధీతో మొద‌లుపెట్టి.. నేటి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌ర‌కూ ఎంద‌రినో ఎదిరించి నిలిచిన ధీరుడు చంద్ర‌బాబు. అలుపెర‌గ‌కుండా సాగుతున్న ఆయ‌న‌ రాజ‌కీయ ప్ర‌స్థానంలో జ‌గ‌న్‌లాంటి పిల్ల కాకిల‌ను ఎంద‌రినో చూసిన ఉద్దండుడు. నిన్న కాక మొన్న వ‌చ్చిన‌.. జ‌గ‌నో లెక్కా..? 72 ఏళ్ల చంద్ర‌న్న‌లో క‌నిపించేంత క‌సి.. క‌మిట్‌మెంట్‌.. దేశంలో మ‌రే నేత‌లోనూ క‌నిపించ‌క‌పోవ‌చ్చు. ఆయ‌న ఓ ప్రాంతానికే నాయ‌కుడైనా.. చంద్ర‌బాబు ఇమేజ్‌, క్రేజ్ మాత్రం విశ్వ‌వ్యాప్తం. అమెరికా అధ్య‌క్షుడిని సైతం ఏపీకి ర‌ప్పించిన ఘ‌నుడు. ఐర‌న్ లేడీ ఇందిర‌ను సైతం వెన‌కంజ వేసేలా చేసిన మొన‌గాడు. ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రిగిన అన్యాయాన్ని నిల‌దీస్తూ.. ప్ర‌ధాని మోదీపై సైతం ధ‌ర్మ‌యుద్ధం చేసిన యోథుడు. ఎన్టీఆర్‌కు ఆప్తుడిగా మారినా, అల్లుడైనా.. అదే ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి ముఖ్య‌మంత్రి అయినా.. అది చంద్ర‌బాబునాయుడికే సాధ్య‌మైంది. ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ఎదిరించినా.. ఈనాడు ఆయ‌న త‌న‌యుడితో యుద్ధం చేస్తున్నా.. ఏనాడు అద‌ర‌లేదు.. బెద‌ర‌లేదు.. వెన‌క్కి త‌గ్గ‌లేదు. 15 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా, 10 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం స‌మోన్న‌తం.  1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో జ‌న్మించిన ఓ సామాన్యుడు.. ఇవాళ ఇంత‌టి అస‌మాన్యుడిగా ఎదుగుతాడ‌ని అప్ప‌డు ఎవ‌రికీ తెలీదు. ఎస్వీ యూనివ‌ర్సిటీలో అర్థ‌శాస్త్రంలో పీజీ చేసిన చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత రాష్ట్ర ఆర్థిక లెక్క‌ల‌న్నిటినీ స‌రి చేసి తిర‌గ రాస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. విద్యార్థి నాయ‌కుడిగా యువ‌జ‌న కాంగ్రెస్‌లో రాజ‌కీయంగా తొలి అడుగు వేశారు. ఆ త‌ర్వాత ఇక రాజ‌కీయంగా తిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు.  1978లో చంద్ర‌గిరి నుంచి గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏ అసెంబ్లీ భ‌వ‌నంలోనైతే ఆయ‌న మైకు ప‌ట్టుకొని.. అధ్య‌క్షా అన్నారో.. ఆ త‌ర్వాత కాలంలో అదే అసెంబ్లీలో ముఖ్య‌మంత్రిగా ప‌దేళ్లు ఉన్నారు. త‌న 28వ ఏట‌నే అంజ‌య్య ప్ర‌భుత్వంలో సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలోనే ఎన్టీఆర్‌కు స‌న్నిహితుడిగా మార‌డం, ఆయ‌న కుమార్తె భువ‌నేశ్వ‌రిని వివాహం చేసుకోవ‌డంతో.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం మ‌రో మ‌లుపు తిరిగింది.  1983లో ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలో చంద్ర‌గిరి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఓడినా.. ఆ త‌ర్వాత టీడీపీలో చేరి అన‌తి కాలంలోనే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్థాయికి ఎదిగారు. నాదెండ్ల భాస్క‌ర‌రావు కుతంత్రాన్ని చంద్ర‌బాబు త‌న చాణ‌క్యంతో చేధించిన తీరు.. ఆయ‌న్ను రాజ‌కీయ చాణ‌క్యుడిలా నిల‌బెట్టింది. నేష‌న‌ల్ ఫ్రంట్ స‌మ‌యంలో జాతీయ నేత‌గా ఎదిగారు. ఇక 1994లో ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీ టీడీపీలో సంక్షోభానికి కార‌ణ‌మైంది.  1995లో ఎన్టీఆర్‌ను దింపేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు చంద్ర‌బాబు. కొందరు దాన్ని ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటారు. మరికొందరు పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా చెబుతారు. చంద్ర‌బాబు  సీఎం అవ‌డం ఒక చారిత్ర‌క అవ‌స‌రంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ పాల‌న‌లో పేరుకుపోయిన వ్య‌వ‌స్థ‌లోని బూజును.. ముఖ్య‌మంత్రిగా మూన్నాళ్ల‌లోనే దులిపేశారు. ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు. రోజుకు 20గంట‌ల పాటు ప‌ని చేసి.. ఏపీ అభివృద్ధిలో కొత్త చ‌రిత లిఖించారు చంద్ర‌బాబు. విజ‌న్ 2020కి ఆయ‌నే రోల్ మోడ‌ల్‌.. బ్రాండ్ అంబాసిడ‌ర్‌. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం, క్లీన్ & గ్రీన్, మీ సేవ‌, రైతు బ‌జార్‌.. లాంటి వాటితో న‌వ వ‌సంతం తీసుకొచ్చారు. దేశానికే ఆద‌ర్శ సీఎంగా నిలిచారు. హైద‌రాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చినా.. కొత్త‌గా సైబ‌రాబాద్ నిర్మించినా.. అది చంద్ర‌బాబు దార్శ‌నిక‌తే. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మంటూ ఏపీకే ప‌రిమిత‌మ‌య్యారు.  2004 త‌ర్వాత వైఎస్సార్‌కు ఎదురు నిలిచి.. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా పోరాడారు. 60 ఏండ్ల వయసులోనూ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. ఆ వయసులో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును చూసి అంతా షాకయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌ను స‌న్‌రైజ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా రూపొందించేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆంధ్రుల క‌ల‌ల‌ రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌ట్టేందుకు అడుగులు వేశారు.  ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న్‌.. ఏపీ క‌ల‌ల సౌధాన్ని కూల్చివేయ‌గా.. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేయ‌గా.. సంక్షేమ ప‌థ‌కాల‌తో రాష్ట్రాభివృద్ధిని తూట్లు పొడ‌వ‌గా.. ఆ జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌కు వ్య‌తిరేకంగా.. 72 ఏళ్ల వ‌య‌సులో.. న‌వ యోథుడిలా పోరాటం చేస్తున్నారు నారా చంద్ర‌బాబునాయుడు. ఈ రాజ‌కీయ కుర‌వృద్ధుడిలో నేటికీ నాటి ఉరిమే ఉత్సాహ‌మే.   

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకింది. అనారోగ్యానికి గురి కావడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం ఫామ్ హోజ్ లోనే కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ.. అవసరమైతే హాస్పిటల్ కు తరలిస్తామని వైద్యులు చెబుతున్నారు.సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని పర్యవేక్షిస్తుందని చెప్పారు. కేసీఆర్ కు కరోనా సోకిందన్న వార్తలతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.    ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి ఈనెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేదికపై భగత్ తో మాస్క్ లేకుండానే మాట్లాడారు కేసీఆర్. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు.