తీన్మార్ మల్లన్నపై కేసు!
posted on Apr 24, 2021 9:06AM
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతంలో మారుతి సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న లక్ష్మీకాంత శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేశారు. దాదాపు వారం క్రితం తనకు ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న, రూ. 30 లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన చానెల్ లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమకు 22న లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
తీన్మార్ మల్లన్న చాలా కాలంతా తన యూట్యూ్బ ఛానెల్ లో కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గతంలోనూ అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసిన మల్లన్న.. అధికార పార్టీకి చుక్కలు చూపించారు. టీజేఎస్ అధినేత కొదండరామ్, కాంగ్రెస్, బీజేపీ కంటే ముందు నిలిచి.. టీఆర్ఎస్ అభ్యర్థికి పల్లాకు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కూడా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ ను ఫాంహోజ్ కు పంపించడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నేతల డైరెక్షన్ లోనే లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారని, అందులో భాగంగానే కేసు నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి.