సంగంకి సంకెళ్లు.. అప్పుడు వైఎస్.. ఇప్పుడు జగన్..!
posted on Apr 24, 2021 @ 12:47PM
సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్. సంగం డెయిరీకి తాళాలు వేసేందుకే.. ధూళిపాళ్లకు సంకెళ్లు వేశారనే విమర్శ. అమరావతిపై ప్రభుత్వ కుతంత్రాలను బయటపెట్టినందుకే నరేంద్రను టార్గెట్ చేశారనే ప్రచారం. ఇలా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంగం డెయిరీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యా? లేక, ఏసీబీ చెబుతున్నట్టు సంగం డెయిరీ నిజంగానే అక్రమాల పుట్టా? అనేది చర్చనీయాంశంగా మారింది.
సంగం డెయిరీ. గుంటూరు, ప్రకాశం పాడి రైతులకు పెన్నిధి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు ఆధారం. 2వేల కోట్ల వరకూ ఆస్తులు. దాదాపు 200 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు. సుమారు వెయ్యి కోట్ల టర్నోవర్. ఇలా, సంగం డెయిరీ ఆర్థిక వటవృక్షంగా ఎదిగింది.
సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా ఉన్నారు. ప్రస్తుతం డెయిరీకి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంగంపై పైచేయి సాధించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే ప్రయత్నాలు జరిగాయి. అయినా, టీడీపీ పట్టు కోలేదు. వైఎస్ హయాంలో ఆర్డినెన్స్ ద్వారా పాలక వర్గాన్ని రద్దు చేసి.. డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు.
ఐదేళ్ల క్రితం ధూళిపాళ్ల నరేంద్ర.. క్షేత్రస్థాయిలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల మహాజనసభ తీర్మానంతో సంగం డెయిరీని సహకార పరిధి నుంచి కంపెనీ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా, నరేంద్ర మాత్రం అనుకున్నది సాధించారు. ఈ కారణంగానే నరేంద్రకు మంత్రి పదవిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారని అంటారు. ప్రస్తుత వైసీపీ సర్కారు సంగం డెయిరీపై టీడీపీ నేతల పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతోందట. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా డెయిరీ చైర్మన్‌గా కొనసాగుతూ గుంటూరు జిల్లాలో నరేంద్ర చక్రం తిప్పుతున్నారు. దీనిని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆయన అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యలకు అసలు మింగుడుపడటం లేదంటున్నారు.
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. సంగం డెయిరీపై ప్రతీకార చర్యలు మరింత పెరిగాయంటారు. సంగం డెయిరీని దెబ్బ కొట్టేందుకే గుజరాత్‌కు చెందిన అమూల్ మిల్క్‌ను ఏపీకి తీసుకొచ్చారని చెబుతారు. అమూల్ తరఫున పాల సేకరణకు అధిక ధరలు చెల్లిస్తూ.. రైతులను అటువైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. అయినా, సంగంతో దశాబ్దాల అనుబంధం ఉన్న పాడి రైతులు నేటికీ సంగం డెయిరీకే పాలు విక్రయిస్తున్నారు. దీంతో.. అమూల్‌కు పాలు అమ్మకపోతే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వమంటూ అధికారులు, పాలకులు బెదిరింపులకు దిగన సంఘటనలు ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యాయి.
సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉంటూ ధూళిపాళ్ల నరేంద్ర ఏళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఎమ్మెల్యే రోశయ్య ఆరోపణ. లాభాలు రైతులకు పంచి ఇవ్వకుండా.. డబ్బులు దారి మళ్లించి నరేంద్ర వ్యక్తగతంగా వేల కోట్లు కూడబెట్టారని అంటున్నారు. సరైన బోనస్‌లు ఇవ్వకుండా.. సంగం డెయిరీ పేరుతో దోపిడీకి పాల్పడ్డారని.. అది బయటకు తీసేందుకే ఏసీబీ రంగంలోకి దిగిందనేది వైసీపీ పాయింట్. అలాంటిదేమీ లేదని.. రైతులకు ఎప్పటికప్పుడు బోనస్‌లు ఇస్తున్నామని.. సంస్థ ఆస్తులు పెంచామనేది ధూళిపాళ్ల వాదన. సంగం డెయిరీని దెబ్బ తీసేందుకే.. అమూల్‌ను తీసుకొచ్చి.. ఏసీబీ కేసులు పెట్టి.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారనేది టీడీపీ వర్షన్.
2013లో సంగం డెయిరీని మ్యాక్స్ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి మార్చే ప్రక్రియలో అక్రమాలు జరిగాయనేది ప్రస్తుత ఏసీబీ కేసు. ఆ కేసులో భాగంగానే ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు.