ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్.. నైట్ కర్ఫ్యూ
posted on Apr 23, 2021 @ 5:49PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ మే 1 నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మంత్రులు, అధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న ప్రజలు ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఉచిత వ్యాక్సిన్ కోసం 1,600 కోట్లు ఖర్చు పెట్టనుంది ప్రభుత్వం.
మరోవైపు, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, హెటిరో డ్రగ్స్ ఎండీ పార్థసారథిలతో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. ఏపీకి మరిన్ని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని కోరారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు సరఫరా కూడా పెంచాలని వారికి విజ్ఞప్తి చేశారు సీఎం జగన్.
మరోవైపు కరోనా పంజా ధాటికి అతలాకుతలం అవుతున్న ఏపీ వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా కఠిన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరింతగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సినేషన్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.