ఇదేమి రాజ్యం? కేసుల కుతంత్రం.. అరెస్టుల అరాచకం..
posted on Apr 23, 2021 @ 4:01PM
ఆపరేషన్ టీడీపీ. టార్గెట్ చంద్రబాబు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే లక్ష్యం. ప్రతిపక్ష తెలుగుదేశాన్ని కట్టడి చేయడమే ఉద్దేశ్యం. కేసులు, అరెస్టులు. ఇవే వైసీపీ ఆయుధాలు. పోలీసులే వారి భటులు. చంద్రబాబు క్యాంప్ ఆఫీసును అక్రమ నిర్మాణమంటూ కూల్చేయడంతో మొదలు.. ఈ రెండేళ్లలో అలాంటి కక్ష్య సాధింపు చర్యలు అనేకం. చంద్రబాబుతో సహా వరుసబెట్టి నేతలపై కేసులు పెడుతున్నారు. నోరున్న నేతలే వారి మెయిన్ టార్గెట్. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, జేసీ బ్రదర్స్, పరిటాల శ్రీరామ్, కళా వెంకట్రావ్, నారాయణ, తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర. ఇలా టీడీపీ బడాబడా నేతలందరిపై కేసులు.. అందులో కొందరి అరెస్టులు.
భయపెట్టడమే వారి విధానం. నోరు మూయించడమే వారికి ప్రధానం. అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించొద్దు. వారి అడ్డగోలు చేష్టలను నిలదీయొద్దు. ప్రభుత్వ తప్పుడు విధానాలను తప్పుబట్టొద్దు. ఒకవేళ అలా చేస్తే.. ఇలా కేసులు, అరెస్టులతో బెంబేలెత్తిస్తున్నారు. పాలకులు తలచుకుంటే కేసులకు కొదవేముంటుంది అన్నట్టు.. జిల్లాల వారీగా టీడీపీ స్ట్రాంగ్ లీడర్లను సెలెక్ట్ చేసుకొని వారిపైకి పోలీసులను వదులుతున్నారు పాలకులు.
అచ్చెన్నాయుడు. టీడీపీలో ఫైర్‌బ్రాండ్ లీడర్. తెలుగుదేశంలో అందరికంటే పెద్ద నోరు. అందుకే, చంద్రబాబు తర్వాత ప్రధానంగా టార్గెట్ చేసింది అచ్చెన్ననే. ఈఎస్ఐ కేసును తవ్వి.. దాన్ని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు మెడకు తగిలించి.. కేసు బిగించి.. అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అచ్చెన్నకు ఆపరేషన్ అయినా.. కనీస మానవత్వం కూడా చూపించకుండా జైల్లో వేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడం.. కరోనా సోకడం.. ఇలా ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఎంతైనా అచ్చెన్న కదా.. ఇలాంటి కేసులకు, అరెస్టులకు బెదిరే రకం కాదాయన. అందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ఏమాత్రం వెనకాడటం లేదు అచ్చెన్నాయుడు.
ఇక.. జగన్‌రెడ్డిని పేరు పెట్టి తిడుతూ.. ఆయన్ని ఏమాత్రం కేర్ చేయని జేసీ బ్రదర్స్‌పైనా ఇలాంటి పోలీస్ యాక్షన్‌నే ప్రయోగిస్తోంది ప్రభుత్వం. జీసీ సోదరులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్లంటూ జేసీ ట్రావెల్స్‌కు చెందిన వందలాది బస్సులను సీజ్ చేశారు. వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అయినా.. తొడగొట్టి మరీ.. తాడిపత్రిలో పోటీ చేసి గెలిచి.. మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకొని జగన్‌కు షాక్ ఇచ్చారు ప్రభాకర్‌రెడ్డి. జేసీ బ్రదర్సా.. మజాకా...
ఇక, దేవినేని ఉమా. ప్రెస్‌మీట్లతో సీఎం జగన్‌ను ఏకిపారేసే పోటుగాడు. నిత్యం మాటల పోట్లతో జగన్ సర్కారును తూట్లు పొడుస్తుంటాడు. అందుకే, ఆయనపైనా పోలీస్ కేసు నమోదైంది. మీడియా సమావేశంలో జగన్ ప్రసంగ మార్ఫింగ్ వీడియో ప్రదర్శించారంటూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులైతే మరీ చోద్యం. ఉమా నెల్లూరులో ఉండగా.. విజయవాడలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించి.. రెండు గంటల్లో కర్నూలు సీఐడీ ఆఫీసుకు రావాలంటూ ఆదేశించారు. రెండంటే రెండు గంటల్లో అన్ని జిల్లాలు దాటి ఆయన ఎలా వస్తారో ఖాకీలకే తెలియాలి. అందుకే, హైకోర్టు సైతం పోలీసుల తీరును తప్పుబట్టింది. దేవినేని ఉమాకు కాస్త ఊరట కల్పించింది. జగన్ ప్రసంగాన్ని మార్చారంటూ ఉమాపై కేసులు పెడితే.. ఇక ప్రతీరోజూ సాక్షి మీడియాలో వస్తున్న వార్తలపై లెక్కలేనన్ని కేసులు పెట్టాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
తాజాగా, ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి మరోసారి టీడీపీకి పోలీస్ యాక్షన్ రుచి చూపించింది. సంగం డెయిరీలో అక్రమాలంటూ తెల్లవారుజామున వందలాది మంది ధూళిపాళ్ల ఇంటిని చుట్టుముట్టి ఆయన్ను అరెస్ట్ చేశారు. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, మంత్రి నారాయణలపై పెట్టిన కేసు వెనుకున్న కుట్రను ఇటీవల నరేంద్ర బహిర్గతం చేశారు. ఎవరి ఫిర్యాదు మేరకైతే కేసు పెట్టామని పోలీసులు చెప్పారో.. ఆ ఫిర్యాదుదారులే తమకేమీ సంబంధం లేదని చెప్పే వీడియోను ధూళిపాళ్ల బయటపెట్టడంతో ఆయనపై పాలకులు కసి పెంచుకున్నారు. సంగం డెయిరీ సాకుతో.. ఏసీబీ కేసుతో.. నరేంద్ర నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు. అమరావతి ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు ఇవ్వడం.. మచిలీపట్నం మర్డర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయడం.. చింతమనేనికి కేసుల ఉచ్చు బిగించడం.. పరిటాల శ్రీరాంపై చీటికీమాటికి కేసులు పెట్టడం.. కళా వెంకట్రావును కేసులంటూ బెదిరించడం.. ఇలా టీడీపీలో ఓ స్థాయి ఉన్న నేతలందరినీ జగన్‌రెడ్డి సర్కారు టార్గెట్ చేస్తోందని తమ్ముళ్లు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రజలతో కలవనీయకుండా విశాఖ, రేణుగుంట విమానాశ్రయాల్లో అడ్డుకోవడం, బలవంతంగా వెనక్కి పంపడం లాంటి చర్యలతో టీడీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది.
తాజాగా.. కరోనా కల్లోల సమయంలోనూ ధూళిపాళ్ల నరేంద్ర ఇంటిపై పోలీసులు పెద్ద సంఖ్యలో రైడ్ చేసి ఆయన్ను అరెస్ట్ చేయడం వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర అభివృద్ధిని, కరోనా కట్టడిని పక్కనపెట్టి.. కేవలం టీడీపీపై కక్ష సాధింపు చర్యలపైనే ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెడుతోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. పాలకులు తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ప్రభుత్వం.. పోలీసుల సాయంతో.. కేసులు, అరెస్టులతో ఇంతగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నా.. ఎక్కడా తెలుగు తమ్ముళ్లు మాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు.. అదీ తెలుగుదేశం నాయకుల కమిట్‌మెంట్ అండ్ కరేజ్.