సీజేఐగా తెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
posted on Apr 24, 2021 @ 11:16AM
భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిథులు తక్కువ మంది హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం ఏప్రిల్ 23తో ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ చరిత్ర సృష్టించారు. 1966-67 మధ్య కాలంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా పనిచేశారు. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు.
1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్, ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లతో పాటు సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవా, ఎన్నికల వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్ 27న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2003 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమణ పనిచేశారు.