ప్రభుత్వ పంతంతో ప్రాణాలకు పరీక్ష.. ఏపీ స్కూళ్లలో కరోనా పంజా..
posted on Apr 24, 2021 8:52AM
దేశమంతా ఒకదారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోదారి అన్నట్లుగా పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు రాష్ట్రాలన్ని అల్లాడిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువున్న రాష్ట్రాలన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. పరీక్షలను రద్దు చేశాయి. కేంద్రం కూడా సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. ఏపీకి పక్కనే ఉన్న తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనూ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. సెకండియర్ పరీక్షను వాయిదా వేశారు. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పంతానికి పోతోంది. ఓవైపు ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. పరీక్షల రద్దుపై నిర్ణయానికి వెనకాడుతోంది.
ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పలు స్కూళ్లలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 12 మంది ప్రభుత్వ టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కందుకూరు బాయ్స్ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్ దేవిక ఇటీవల కరోనాతో మృతి చెందింది.సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలోనే కరోనాతో ముగ్గురు ఉపాధ్యాయులు ప్రాణాలు విడిచారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పదవ తరగతి చదువుతున్న 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పర్చూర్ మండలం చెరుకూరులో హైస్కూల్ లో అత్యధికంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సబ్ కమిటీ సమావేశమైనా.. ఎగ్జామ్స్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.