కరోనా కట్టడికి యాక్షన్ ఏది? కేంద్రంపై సుప్రీం ఫైర్
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. జనాలు ప్రాణ భయంతో బతుకుతున్నారు. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా దీనిపై పూర్తి విచారణ జరపనుంది. ఆక్సిజన్ సరఫరా, రోగులకు అవసరమైన ఔషధాలు, వ్యాక్సినేషన్ పంపిణీ వంటి అంశాలపై విచారణ జరుపుతామని పేర్కొంది. దేశంలోని ఆరు హైకోర్టుల్లో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయి. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో పడకలు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులు విచారిస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే గురువారం మాట్లాడుతూ ఈ సమస్యపై స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని తెలిపారు.
కొవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాక్‌డౌన్‌ను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్నదంతా గందరగోళంగా, అయోమయంగా ఉందన్నారు. వనరుల దారి మళ్లింపు జరుగుతోందన్నారు. ఈ సమస్యలపై కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ను నియమించారు. తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని తెలిపారు.
కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా సోకడంతో తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, అయితే దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని రాహుల్ అన్నారు. దేశంలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులకు కారణం కొవిడ్ మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా అని ఆయన మండిపడ్డారు. టీకా ఉత్సవ్ వంటి పనికిరాని ఉత్సవాలు, ఒట్టి మాటలను కట్టబెట్టి ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.