వామ్మో ఇదేం కరోనా.. దేశంలో ఇన్ని మరణాల?
దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉంది. విచ్చలవిడిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందిపై ప్రతాపం చూపుతూ వికటాట్టహాసం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68లక్షల మంది కొవిడ్ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
దేశవ్యాప్తంగా 15,04,698 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 3,68,147 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99కోట్లకు చేరింది. ఇదే సమయంలో వైరస్ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది. మరణాల సంఖ్య మరోసారి 3వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 3,417 మంది కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,18,959 మంది వైరస్‌కు బలైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు 34లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.13శాతానికి చేరింది.
ఏపీలో 83 మరణాలు..
రాష్ట్రంలో ప్రతి గంటకూ సగటున 996 మంది కరోనా బారిన పడుతుండగా.. ముగ్గురికి మించి ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి, మలి దశల్లో ఎన్నడూ లేని విధంగా 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 23,920 కరోనా కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 నమూనాలు పరీక్షించారు. 20.92 శాతం మందికి వైరస్ సోకినట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 11,45,022కు, మరణాలు 8,136కు చేరాయి.
ఈ జిల్లాల్లోనే ఎక్కువ..
24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల్లో 13,400 (56.02 శాతం) చిత్తూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే వచ్చాయి. మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 1,43,178కు చేరింది. 24 గంటల్లో 11,411 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తంగా 1,66,02,873 నమూనాలు పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట వద్దనున్న గురుకుల(ఏపీఆర్) పాఠశాల-కళాశాలలో 29 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మత్తి కమలాకరరావు కరోనాతో పోరాడి ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని మచిలీపట్నంలోని నివాసానికి తీసుకొచ్చి, తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆసుపత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం 10 మంది మృతి చెందారని అమలాపురం మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కిమ్స్‌లో 8 మంది, శ్రీనిధి ఆసుపత్రిలో ఒకరు, ఏరియా ఆసుపత్రిలో ఒకరు మృతి చెందారని అన్నారు.
తెలంగాణాలో 49 మరణాలు..
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 58,742 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,417కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1352 కేసులు నమోదయ్యాయి.