వైసీపీ ఓట్లకు తూట్లు.. టీడీపీకే భవిష్యత్తు..
posted on May 3, 2021 @ 1:12PM
తిరుపతిలో గెలిచామంటూ వైసీపీ సంబరాలు. 2.7 లక్షల మెజార్టీ అంటూ వేడుకలు. ఇదంతా పైపైనే. లోలోన ఆ పార్టీ నేతల్లో ఒకటే గుబులు. తమ అధినేత జగన్‌రెడ్డికి ఏం సమాధానం చెప్పాలనే వణుకు. 5 లక్షల ఆధిక్యమంటూ బిల్డప్ ఇచ్చి.. 3 లక్షల లోపు మెజార్టీతో బయటపడి.. గెలిచి ఓడినంత పని అయింది. ఇక గత పార్లమెంట్ ఎన్నికతో పోలిస్తే పలు చోట్ల వైసీపీకి ఓట్లకు భారీగా కోత పడటం అధికార పార్టీలో కలవరానికి గురి చేస్తోంది.
2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికల్లో వైసీపీకి జిల్లాలో ఓట్లు తగ్గాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో 2,88,012 ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 2,60,891. అంటే మునుపటి కంటే 27,121 ఓట్లు వైసీపీకి కోత పడ్డాయి.
పోలింగ్ శాతం ఆధారంగా చూస్తే 2019 ఎన్నికల కంటే ఎక్కువే అని కనిపిస్తున్నా, ఓట్ల సంఖ్య పరంగా చూస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో మాత్రం గతానికంటే వైసీపీకి ఆధిక్యత తగ్గింది. శ్రీకాళహస్తిలో గత ఎన్నికల్లో వైసీపీకి 32,919 ఓట్లు మెజారిటీ రాగా, తాజా ఓట్ల లెక్కింపులో 31,469 మెజారిటీ వచ్చింది. సత్యవేడు సెగ్మెంట్‌లో కిందటి ఎన్నికల్లో వైసీపీకి 42,196 ఓట్ల మెజారిటీ వస్తే.. ఇపుడు ఆధిక్యత 38,144కు తగ్గిపోయింది. ఇలా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచినా.. పలు సెగ్మెంట్‌లలో ఓట్లు తగ్గడం అధికార పార్టీపై మిన్నంటిన వ్యతిరేకతకు నిదర్శనం.
తిరుపతి ప్రచార సమయంలోనే ఈ విషయం స్పష్టమైంది. శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారానికి ప్రజలు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో శ్రీకాళహస్తిలో అదే చోట జరిగిన చంద్రబాబు సభ జనం లేక వెలవెలపోయింది. 2021 వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. శ్రీకాళహస్తిలో చంద్రబాబు ర్యాలీలకు జనం తండోపతండాలుగా వస్తే.. వైసీపీ సభలకు జనమే కరువయ్యారు. సత్యవేడులోనూ అదే తరహా సీన్లు కనిపించాయి. తిరుపతి వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం.. వైసీపీ పరాభవం స్పష్టమైంది.
అయితే, ప్రజాభిమానం వేరు.. పోలింగ్ వేరు. అధికార బలంతో, దొంగ ఓట్లతో ఎలాగోలా గెలివగలిగారు.
అసలు, ఉప ఎన్నికంటే వార్ వన్ సైడ్‌గా ఉండాలి. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో వైసీపీకి సానుభూతి ఓట్లు వెల్లువెత్తాలి. మంత్రులు చెప్పినట్టుగానే 5 లక్షల మెజార్టీతో గెలుపొందాలి. కానీ, అలా జరగలేదు. ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవలేదు. సానుభూతి ఓట్లు రాలలేదు. లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నా.. అవి ఓట్లుగా మారలేదు. దొంగ ఓట్లు, బెదిరింపు ఓట్లే.. అధికార పార్టీని గెలిపించాయి. మెజార్టీ సగానికి సగం పడిపోయింది. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఓడింది. టీడీపీలో మాత్రం.. ఓడినా గెలిచినంత జోష్ వచ్చింది. ఇదే జోరుతో.. ఇదే స్పూర్తితో.. పని చేస్తే.. భవిష్యత్ తెలుగుదేశానిదే అనడం అతిశయోక్తి కాకపోవచ్చు.