భారీగా క‌రోనా.. ఆర్బీఐ ఆందోళ‌న‌..

రెండు రోజులుగా నిల‌క‌డ‌గా ఉన్న క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం కల‌వ‌రం సృష్టిస్తోంది. తాజాగా, మ‌రో 3,82,315 మందికి క‌రోనా సోక‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో 3,780 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.   దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. మొత్తం 2,06,65,148 కేసులు,  2,26,188 మ‌ర‌ణాల‌తో దేశంలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది.  కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటమే కాస్త‌ ఊరటనిచ్చే అంశం. మంగ‌ళ‌వారం ఒక్క రోజే 3,38,439 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య  1,69,51,731కి చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 34,87,229కి పెరిగింది.  ఇక‌, తెలంగాణలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మంగ‌ళ‌వారం 77,435 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా.. అందులో 6,361 మందికి పాజిటివ్ వ‌చ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,225 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మంగ‌ళ‌వారం 8,126 మంది కోలుకున్నారు.    కరోనా సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోందని ఆర్బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని.. కంటైన్‌మెంట్ ప్రాంతాలు, భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.   

కరోనా పై యముడి కన్నీరు.. 

యముడు ఆ పేరు వింటే చాలు. తప్పు చేసినోడి గుండెల్లో గుబులు పుడుతుంది. తప్పు చేస్తే ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ, యముడి నుండి ఎప్పటి తప్పించుకోలేరు అని, ఎప్పటికైనా యముడి ద్వారా భారీ మూల్యం చెల్లించాల్సిందే అని అంటుంటారు దైవత్వం ఉన్నారు. యముడు  అదేపనిగా ఎప్పటికప్పుడు తప్పు చేసిన వాళ్ళ చిట్టా పద్దులు తెలుస్తుంటాడని  అంటుంటారు.  కానీ కరోనా వాళ్ళ ఇప్పుడు యముడికి ఆ అవసరం లేకుండా పోయింది. పని కట్టుకుని తప్పుచేసినోడి తాట తీసేపని ఆయనకు లేకుండా పోయింది.    భారత దేశం లో సంచారం చేస్తున్నాడు. కరోనా రావడం తో ఆయనకు పని తప్పింది. పని కట్టుకుని ప్రాణాలు తీసే పని యముడికి లేకుండా పోయింది. తప్పు చేసిన వారికీ భూమి మీద నూకలు చెల్లితే యమా ధర్మ రాజు ఎకాఎకిన వచ్చి తన పాశం సంధించి గదా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయే యముడు కూడా భారత దేశం పరిస్థితి చూసి యముడు కూడా కన్నీటి పర్వం చెందుతున్నాడు. దేశంలో కొనసాగుతున్న కరోనా మరణాలపై, కరోనా వైరస్ పై అవగాహనా కాలిస్తున్నాడు.. ఆ యముడు.. యముడు ఏంటి? కరోనా మీద కన్నీరు పెట్టడం ఏంటి? కరోనా పై అవగాహనా కల్పించడం ఏంటని అనుకుంటున్నారా..? మీరే చూడండి తెలుస్తుంది.   కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా మాస్కు ధరించాలంటూ హిందూపురం పోలీసులు వినూత్న అవగాహన కల్పించారు. యోగి నారాయణ సేవాసమితి సహకారంతో యముడు, యమ భటుల వేషధారణతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే అనర్థాలను వివరించారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. లేదంటే కరోనా మహమ్మారి బారిన పడతారని హెచ్చరించేలా ఈ కార్యక్రమం సాగింది. ‘నేను యముడిని. మాస్కు పెట్టుకోకుంటే వస్తా.. మీరు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటా. బయటకు వస్తే మీ వెంటే ఉంటా..’ అంటూ  యముడి వేషధారణలో ఉన్న వ్యక్తి హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, రేపటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో అనవసరంగా బయట తిరిగితే కేసులు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.  

ఏపీలో మద్య దర్శనం.. తెల్లవారుజామునే ఛీర్స్

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్పెషల్. రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచింది. ఏపీ ప్రజలకు మద్య దర్శనం కల్పించింది. ప్రజలు నిద్ర లేవకముందే రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. టీ తాగే సమయానికి ముందే మందు అందుబాటులోకి వచ్చింది. . గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారి ఉదయం 6గంటలకే లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. కరోనా పంజా విసురుతుండటంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వాణిజ్య కార్యకాలాపాలు కొనసాగించాలని ఆదేశించింది. అందులో భాగంగానే సర్కార్ కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం షాపులను ఉదయమే తెరవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపులు తెరవాలని ఆదేశించింది. దీంతో బుధవారం తెల్లవారుజామునే ఏపీలో మద్యం దుకాణాలన్ని తెరుచుకున్నాయి. మందు బాబులు లిక్కర్ కోసం క్యూలు కట్టారు. మద్యం షాపులతో పాటు మద్యం సరఫరా చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలు పాటిస్తున్నాయి.  గతేడాది కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 43 రోజుల పాటు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అమ్మకాలకే మొగ్గు చూపింది. ఇదంతా ఆదాయం కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ఫ్యూ అమలుచేస్తే ఒకచోట నలుగురు కంటే గుమికూడకూడదు. అలాంటప్పుడు బార్లకు అనుమతి ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకోవైపు ఎప్పటిలాగే మద్యం షాపుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అలా క్యూలు ఉంటే కరోనా వ్యాప్తి పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాల కంటే ఆదాయమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తోంది.

న్యాయమా రెడ్డీ? రాజ‌కీయం 'క‌మ్మ‌'గుంది!

జ‌గ‌న్‌ది రెడ్డి సైన్యం. చంద్ర‌బాబుకు క‌మ్మ ధైర్యం. ఇలా ఏపీలో రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు.. ఇద్ద‌రు నాయ‌కుల‌ను వెన‌కుండి న‌డిపిస్తున్నాయి. ఈ రెండు వ‌ర్గాల్లో ఎవరిది అప్ప‌ర్ హ్యాండ్ అయితే.. వారిదే అధికారం. ఏళ్లుగా ఇదే జ‌రుగుతోంది. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక త‌ర్వాత ఏపీలో టీడీపీ మ‌ళ్లీ బ‌లం పుంజుకుంటోంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఓడినా టీడీపీ బ‌లంగా ప్ర‌తిఘ‌టించింది. తెలుగు త‌మ్ముళ్లు క‌సితో ప‌ని చేశారు. క‌లిసిక‌ట్టుగా పోరాడారు. ప్ర‌తిప‌క్ష పార్టీని 3 ల‌క్ష‌ల మెజారిటీలోపే నిలువరించారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం ఏపీలో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే.. జ‌గ‌న్‌రెడ్డి వ‌ర్గం మాత్రం తీవ్ర నిరుత్సాహం, నిర్లిప్త‌త‌తో ఉంది. ఈ తీరే.. భ‌విష్య‌త్తులో అధికారాన్ని మ‌ళ్లీ తారుమారు చేసే అవ‌కాశం ఉందంటున్నారు సామాజిక రాజ‌కీయ‌ విశ్లేష‌కులు. ముందు రెడ్ల విష‌యానికి వ‌ద్దాం. రాయ‌ల‌సీమ వ్యాప్తంగా రెడ్డి వర్గానిదే ఆధిప‌త్యం. మిగ‌తా జిల్లాల్లోనూ చెప్పుకోద‌గ్గ ప్ర‌భావం. వీళ్లే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అండా-దండా. అంగ బ‌లం, అర్థ బ‌లంతో జ‌గ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించారు. 2019 ఎన్నిక‌ల నాటికి ఐదేళ్లుగా అధికారానికి దూర‌మై.. ఆవురావుర‌మంటూ ఉన్న ఆ సామాజిక వ‌ర్గం.. ఆనాటి ఎల‌క్ష‌న్ల‌లో జ‌గ‌న్‌రెడ్డి గెలుపు కోసం శాయ‌శ‌క్తులా కృషి చేశారు. మ‌ళ్లీ ప‌వ‌ర్‌లోకి రావాల‌నే ధృడ సంక‌ల్పంతో గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. త‌మ ఆర్థిక వ‌న‌రుల‌న్నీ పోగేసి.. ఎన్నిక‌ల్లో భారీగా ఫండింగ్ చేసి.. స్వ‌చ్ఛందంగా ప‌ని చేసి.. జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించుకున్నారు. త‌మ వాడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డం చూసి తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక‌, ఎన్నిక‌ల్లో పెట్టిన ఖ‌ర్చుకు ప‌దింత‌లు తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చు అనుకున్నారు. కానీ, ఆదిలోనే వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. అక్క‌డున్న‌ది జ‌గ‌న్‌రెడ్డి క‌దా. వీళ్ల దోపిడీ సాగ‌లేదు. దొరికిన‌దంతా తిమింగ‌ళంలా ఆయ‌నే దోచుకుంటున్నారంటూ.. పిల్ల చేప‌లు ఆహారం లేక అల‌మ‌టిస్తున్నాయి. మ‌నోడే అనుకుంటే న‌ట్టేట ముంచేస్తున్నాడుగా అంటూ తెగ వ‌ర్రీ అవుతున్నాయి.  ఏపీలో లిక్క‌ర్, ఇసుక రీచ్‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప్ర‌ధానంగా రెడ్ల చేతిలో ఉంటాయి. ఆ మూడింటిలో ఇప్పుడు రెడ్ల‌కు అవ‌కాశం లేకుండా చేశాడు జ‌గ‌న్‌రెడ్డి. కాసులు పిండుకునే ఛాన్స్ ఉండే.. మ‌ద్యం వ్యాపారాన్ని ప్రభుత్వప‌రం చేసి లిక్క‌ర్ డాన్‌ల గ‌ల్లాపెట్టె ప‌గ‌ల‌గొట్టాడు. చంద్ర‌బాబు హ‌యాంలోనూ వైన్లు, బార్ల‌తో బాగా సంపాదించుకున్న ఆ వ‌ర్గ‌మంతా.. ఇప్పుడు నోరు మూసుకొని చూస్తూ ఉండాల్సిన దుస్థితి. భారీగా ముడుపులు స్వీక‌రించి.. ఊరూపేరు లేని బ్రాండ్ల‌ను తీసుకొచ్చి, అడ్డ‌గోలుగా ధ‌ర‌లు పెంచి.. లిక్క‌ర్ ఆదాయాన్నంతా జ‌గ‌న్‌రెడ్డి ఒక్క‌డే గంప గుత్త‌గా దోచేసుకుంటున్నాడ‌నే ఆగ్ర‌హం ఆ వ‌ర్గంలో వెల్లువెత్తుతోంది. అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఒక‌ప్ప‌టి మ‌ద్యం వ్యాపారులంతా.  అటు, రెడ్డి వ‌ర్గాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న ఇసుక త‌వ్వ‌కాల‌నూ ఏక మొత్తంగా ర‌ద్దు చేసేశారు జ‌గ‌న్‌రెడ్డి. కొత్త ఇసుక పాల‌సీ అంటూ.. రాష్ట్రంలోని శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్‌ మొత్తాన్ని వేలం వేసి అంగ‌ట్లో అమ్ముకున్నారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితమైన రాంకీ గ్రూపున‌కే ఏపీలోని ఇసుకంతా దార‌ద‌త్తం చేశారు. ప‌రోక్షంగా జ‌గ‌న్ ఒక్క‌డే ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.  ఇక‌ ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. గ‌డిచిన రెండేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రియ‌ల్ రంగం అధఃపాతాలానికి ప‌డిపోయింది. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేయ‌డంతో భూముల ధ‌ర‌లు కుప్ప‌కూలిపోయాయి. క‌నీసం ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్‌గా ప్ర‌క‌టించిన విశాఖ‌లోనైనా రియ‌ల్ వ్యాపారం చేసుకుందామన్నా అదీ కుద‌ర‌డం లేదు. విశాఖ‌లో భూమంతా వైసీపీ నేత‌ల పర‌మైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ ఆగ‌డాల‌తో భూమిపై పెట్టుబ‌డి పెట్టేందుకు వ్యాపారులు భ‌య‌ప‌డుతున్నారని అంటున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌తీ జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్టు గానీ, సెజ్ గానీ ఉండేది. దీంతో, ఏపీ వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ జోరుగా సాగింది. ఆ రంగంలో ముందున్న రెడ్లు అప్ప‌ట్లో బాగా లాభ‌ప‌డ్డారు. ఇప్పుడు జ‌గ‌న్ రాక‌తో.. అంతా త‌ల‌కిందులైంది. రియ‌ల్ రంగం కుదేలైంది. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం. తెలంగాణ‌లో రెండు ఎక‌రాల భూమి అమ్మితే.. ఏపీలో 3 ఎక‌రాలు కొనుక్కోవ‌చ్చంటూ కేసీఆర్ చేసిన కామెంట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితికి స‌రిగ్గా స‌రిపోతున్నాయి.  అన్ని రంగాల్లోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తిరోగ‌మ‌నంలో ఉండ‌టంతో.. అన్ని ర‌కాల వ్యాపారాలు చేసే రెడ్డి సామాజిక వ‌ర్గం ఆర్థికంగా బాగా చితికిపోయింది. మ‌నోడ‌ని గెలిపిస్తే.. మ‌న‌ల్నే ముంచేస్తున్నాడ‌ని ఆ వ‌ర్గ‌మంతా అక్క‌స్సుతో ఉందని చెబుతున్నారు.  గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు క‌మ్మ వ‌ర్గానికి వ్యాపారాల్లో ప్రాధాన్యత ల‌భించిందనే టాక్ ఉంది.  ఆ స‌మ‌యంలో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేతలు బాగా సంపాదించుకున్నార‌ని చెబుతారు. దీంతో.. సంపాదించింది చాల్లే అన్న సంతృప్తి.. మ‌న‌మే ఎలాగూ గెలుస్తామ‌నే ఉదాసీన‌త‌.. రెండూ క‌లిసి 2019 ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు వ‌ర్గంలో నిర్లిప్త‌త ఆవ‌హించింది. అందుకే, ఆ ఎల‌క్ష‌న్ల‌లో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న రెడ్లు క‌సితో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం.. 2019లో అధికారం క‌మ్మ‌ నుంచి రెడ్డి చేతికి చిక్కింది.  రెండేళ్లైనా గ‌డిచిందో లేదో.. మ‌ళ్లీ మార్పు మొద‌లైంద‌ని అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని అంద‌ల‌మెక్కించినా ద‌మ్మిడి ఆదాయం లేక‌, పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌.. ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మంతా ఆగ్ర‌హంతో ఉందంటున్నారు. అదే స‌మ‌యంలో.. అధికారం లేక‌పోతే త‌మ ప‌రిస్థితి ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో క‌మ్మ వ్యాపారుల‌కు, తెలుగు త‌మ్ముళ్ల‌కూ బాగా తెలిసొచ్చింది. అందుకే, టీడీపీ శ్రేణులంతా మ‌ళ్లీ ఏక‌మై చంద్ర‌బాబు గెలుపు కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. తొలి ప్ర‌భావం, ఫ‌లితం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో క‌నిపించింది. ప్ర‌చారంలో టీడీపీ వ‌ర్గాలు చ‌మ‌టోడ్చాయి. త‌మ పార్టీ అభ్య‌ర్థిని ఎలాగైనా గెలిపించుకోవాల‌నే తాప‌త్ర‌యం, ప‌ట్టుద‌ల వారిని క‌ష్ట‌ప‌డేలా చేసింది. అందుకే,, తిరుప‌తిలో చంద్రబాబు, నారా లోకేశ్ ర్యాలీలు, స‌భ‌లో జ‌నంతో కిక్కిరిసిపోయాయి. బైపోల్‌లో టీడీపీకి జేజేలు హోరెత్తాయి. వైసీపీ మెజార్టీకి భారీగా కోత ప‌డింది. ఇదే ప‌ట్టుద‌ల‌తో, ఇదే క‌సితో.. ముందుముందు మ‌రింత గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం మ‌ళ్లీ టీడీపీనే వ‌రించ‌డం ఖాయం. మ‌ళ్లీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ‌డం త‌థ్యం. ఎనీ డౌట్స్‌?

అయోధ్య,వారణాసిలో బీజేపీ ఓటమి! యూపీలో యోగీకి షాక్ 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఇటీవలే కర్ణాటకలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉండికూడా చతికిలపడింది. తాజాగా ఏడాదిలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ  సత్తా చాటుకుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన జిల్లా, క్షేత్ర(మండల), గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీకి ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయి.  ప్రధాని నరేంద్ర మోడీప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసితోపాటు బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కేంద్రమైన అయోధ్యలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకుగానూ ఎస్పీ 15 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. మిగిలిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు. మధురలోని మొత్తం 33 సీట్లలో ఎనిమిది మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీ 13 స్థానాల్లో విజయం సాధించగా, సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరక్ పూర్ లో (మొత్తం స్థానాలు 68) బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ చెరో 22 గెలుచుకోగా, 23 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నిషాద్ పార్టీలు తలా ఒక సీటును గెలుచుకున్నాయి.  మొత్తం 3,050 జిల్లా పంచాయితీ సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 చోట్ల లీడింగ్‌లో ఉండగా, ఎస్‌పీ బలపర్చిన అభ్యర్థులు 504 సీట్లలో అధిక్యంలో ఉంన్నారు. బీఎస్పీ బలపర్చిన అభ్యర్థుల్లో 132 మంది, కాంగ్రెస్ నుంచి 62 మంది, ఇండిపెండెట్లు 608 మంది లీడింగ్ లో ఉన్నారు. యూపీలో మొత్తం 58,176 గ్రామ పంచాయితీల్లో 7.32 లక్షల వార్డులకు, 3,050 క్షేత్ర(మండల) పంచాయితీల్లోని 75,852 వార్డులకు, 75 జిల్లాల్లోని 3,050 జిల్లా పంచాయితీ స్థానాలకు ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌పై గొడవ జరిగడంతో వ్యవహారం సుప్రీం దాకా వెళ్ళింది. మొత్తానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో  కౌంటింగ్‌ మొదలైంది. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది.  ఎమ్మెల్యేల స్థానాలను తలిపించే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను కీలకంగా భావించే బీజేపీ అక్కడి స్థానిక ఎన్నికల్లో ఓడిపోవడం హెచ్చరిక లాంటిదేనని పార్టీనేతలు అంగీకరించారు. యూపీ పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలకు ఇంకా సమయం పడుతుంది.

కరోనాను జయించిన కేసీఆర్.. నేటి  నుండి విధుల్లోకి .. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి ఆన్ డ్యూటీ చేయనున్నారు. దాదాపు రెండు వారాలకు పైగా కరోనా తో బాధపడిన కేసీఆర్, చివరికి కరోనా ను సైతం జయించాడు. ఐసోలేషన్‌లో ఉన్న కూడా విధులు నిర్వహించిన ఘనత కేసీఆర్ మాత్రమే దక్కింది. అక్రమాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయని  ఈటల పై యాక్షన్ తీసుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ కరోనా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించింది. ఆ రెండింటిలోనూ కరోనా లేదని నిర్ధారణ అయింది. చివరికి  అలాగే, రక్త పరీక్షల్లోనూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది. ముఖ్యమంత్రి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, కాబట్టి ఇక నుంచి విధులకు హాజరు కావొచ్చని వైద్యులు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 19న కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లోనే ఉన్నారు. నేడు హైదరాబాద్ రానున్న సీఎం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కరోనా దెబ్బకు ప్రముఖ దేవాలయాలు మూసివేత..  హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేయాలని ఆయా ఆలయాల అధికారులు నిర్ణయించారు. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు పెద్దమ్మతల్లి ఆలయ అధికారులు తెలిపారు. అయితే, అంతరాలయంలో నిత్య పూజలు మాత్రం జరుగుతాయని స్పష్టం చేశారు. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయ అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. భక్తులు, అర్చక సిబ్బంది క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆలయం పక్కనే ఉన్న బోనం కాంప్లెక్స్‌ను కూడా మూసివేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి ఏకాంత సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

గాంధీ  పర్సనల్ సెక్రటరీ మృతి.. 

అతని పేరు. కళ్యాణం. సిమ్లా లో 1922 వ సంవత్సరం లో జన్మించాడు. ఎప్పుడు ఆయనకు సరిగ్గా 99 సంవత్సరాలు. ఆయన ఎవరో కాదు. తెల్లదొరల భారతం పట్టి,  మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మన జాతిపిత మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ. తాజాగా వి.కల్యాణం ఈరోజు తుదిశ్వాస విడిచారు. వయసుకు సంబంధించిన కారణాలతో ఆయన చెన్నైలో మృతి చెందారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు కల్యాణం మృతి చెందినట్టు ఆయన కుమార్తె నళిని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు బసంత్ నగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1944 నుంచి 1948 వరకు గాంధీతో ఆయన కలిసి ఉన్నారని బయోగ్రాఫర్ కుమారి ఎస్ నీలకందన్ తెలిపారు. మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో కల్యాణం ఉన్నారని.... గాంధీకి వివిధ భాషల్లో వచ్చే లేఖల వ్యవహారాలను ఆయన చూసేవారని చెప్పారు. నాలుగేళ్ల పాటు గాంధీకి ఆయన సేవలందించారని తెలిపారు. 1948 జనవరి 30న ఢిల్లీలో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు కూడా కల్యాణం అక్కడే ఉన్నారని చెప్పారు.  

భార్య ను బలికొన్న అనుమానం.. 

అనుమానం. ఇది ఒక పెద్ద పెనుభూతం. ఒక్క సారి మనిషిలో అనుమానం అనే సందేహం మొదలైతే, పక్క వాళ్ళ అంతు చూసే వరకు నిద్దరపోదు. ఈ అనుమానం తో క్షణికావేశంలో ఎన్నో ఘోరాలు జరిగాయి.. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భర్త అనుమానం భార్య ప్రాణాలు తీసింది. ఎందుకు? ఎక్కడ ? ఎలా ? అని ఆలోచిస్తున్నారా? చదవండి మీకే తెలిసింది.  అది పటాన్‌చెరు. రుద్రారం గ్రామం. అతని పేరు సురేష్. ఆమె పేరు స్వప్న. వాళ్ళిద్దరికి పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలం బాగానే ఉన్నారు. అయితే సురేష్ భార్య  తను ఇంట్లో లేనప్పుడు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుంది. అలా కొన్నిరోజులు ఆ వ్యవహారం కొనసాగింది. ఈ నేపధ్యం లో సురేష్‌ భార్య స్వప్నపై  అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి సురేష్‌ ఇంటికి వచ్చేసరికి భార్య స్వప్న ఫోన్‌లో మాట్లాడుతోంది. దీంతో అనుమానం పెంచుకున్న అతడు భార్యను తీవ్రంగా కొట్టిగాయపరిచాడు. గాయపడిన స్వప్న అపస్మారక స్థితి చేరుకుంది. ఆమెను ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉరి..   అది దుండిగల్‌. వంగర మండలం.  గీతనాపల్లి గ్రామం.  అతని పేరు కె.రమణమూర్తి. ఆయన భార్య పేరు శారద. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ కి వచ్చారు. సూరారంలోని పాండు బస్తీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత 7 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు రమణమూర్తి. అతను తరచూ మద్యం తాగుతుండడంతో దంపతుల మధ్య కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల తన సోదరుడి ఇంటికి శారద  ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్లింది. రమణమూర్తి డ్యూటీ కి వెళ్లకుండా మత్తులో మునిగి తేలుతున్నాడు.  కట్ చేస్తే.. ఈ నెల 1న శారదా కు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో కానిస్టేబుల్‌ కృష్ణ,  రమణమూర్తి విధులకు హాజరవడం లేదని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువులకు ఈ విషయం చెప్పింది. శారదా బంధువులు  అదే రోజు ఇంటికి వెళ్లి చూడగా రమణమూర్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసుల అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పోలీసుల కధనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    గొంతు కోసుకున్న మరో కానిస్టేబుల్..  ఆర్థిక ఇబ్బందులు.. మానసిక వ్యథతో ఓ కానిస్టేబుల్‌ గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ముసారాంబాగ్‌ డివిజన్‌ సలీంనగర్‌ పరిధి బాలదానమ్మ బస్తీలో నివసించే అభిలాష్‌ నాయక్‌(33) కానిస్టేబుల్‌. 2011లోనే తన మేనమామ కుమార్తె ఇంద్రజ్యోతితో వివాహమైంది. వీరికి ధీరజ్‌, హేమంత్‌ అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా మాదన్నపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్‌.. భారీగా అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో మానసిక వేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం భార్య, పిల్లలను కోదాడలోని పుట్టింట్లో వదిలి వచ్చాడు. సోమమధ్యాహ్నం భోం చేసి రెండో అంతస్తులోని గదిలో పడుకుంటానని తల్లితో చెప్పి వెళ్లాడు. తర్వాత కిందికి రాలేదు. రాత్రి పదింటికి సోదరుడు ప్రభు వెళ్లి చూడగా గది తలుపు మూసి ఉంది. ఎంతకు సమాధానం రాకపోవడంతో స్థానిక యువకుడు అశోక్‌తో కలిసి తలుపు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అభిలాష్‌ రక్తపుమడుగులో మంచం కింద విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే మరణించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తొలుత బ్లేడుతో ఎడమ చేయి మణికట్టు, తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.             

కేసీఆర్ చరిత్ర బయటపెట్టిన ఈటల 

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. గంట గంటకు సమీకరణలు మారిపోతున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై తొలిసారి స్పందించిన కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు.. ఈటలను టార్గెట్ చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనపై మంత్రులు ఆరోపణలు చేయడంతో మరింత దూకుడు పెంచారు ఈటల రాజేందర్. కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్న రాజేందర్.. ఒక్కొక్కటిగా సంచలనాలు బయటపెడుతున్నారు. కేసీఆర్ చరిత్రను బయటపెడుతున్నారు.  త‌న‌ వ్య‌వ‌హారం న‌చ్చ‌క‌పోతే త‌న‌ను పిలిపించి అడిగితే టీఆర్ఎస్‌ పార్టీ కోరితే తానే రాజీనామా చేసేవాడినని  ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. అంతేగానీ, ఇంత క‌క్ష సాధించడం అవ‌స‌ర‌మా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను త‌ప్పు చేస్తే విచార‌ణ జ‌రిపించాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశాన‌ని చెప్పారు.ఇప్పుడు త‌న‌ను విమ‌ర్శిస్తున్నవారంతా త‌న స‌హ‌చ‌రులేన‌ని ఈటల గుర్తు చేశారు. తెలంగాణ గాంధీగా పేరు గాంచిన వ్య‌క్తి ఇప్పుడు క‌క్ష పూరితంగా వ్య‌వ‌హరిస్తున్నారని విమ‌ర్శించారు. ఎవ‌రో ఇస్తున్న త‌ప్పుడు స‌ల‌హాలు, నివేదిక‌ల వ‌ల్ల నాపై క‌క్ష సాధిస్తున్నారని ఈటల ఆరోపించారు. అస‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎంను క‌లిసే అవ‌కాశం కూడా మంత్రుల‌కు ఉండ‌ద‌ని రాజేందర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సీఎంకు ఆరోగ్యం బాగోలేద‌ని తెలిసి మంత్రులు ఆయ‌న‌ను క‌ల‌వ‌డానికి వెళ్లార‌ని, అయితే ఆయ‌న‌ను క‌లిసేందుకు అనుమ‌తించలేద‌ని చెప్పారు. తెలంగాణ రాకముందు వ‌ర‌కే కేసీఆర్‌.. ప్ర‌జ‌ల‌ను, ధ‌ర్మాన్ని న‌మ్ముకున్నార‌ని, ఆ త‌ర్వాత మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. 2014 నుంచి ప్రజా సంక్షేమం కోసం తాను ఎలా ప‌ని చేశానో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తాము ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి ఎంతో సాయాన్ని అందించామ‌ని ఈటల తెలిపారు. 2015లో తాను క‌రీంన‌గ‌ర్ స‌మ‌స్య‌ల గురించి వివ‌రించడానికి సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి తొమ్మిది మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లాన‌ని, సీఎంను క‌ల‌వ‌కుండా నిలువ‌రించార‌ని చెప్పారు. బ‌య‌ట అంతా మీడియా వాళ్లు ఉన్నార‌ని, వారు చూస్తున్నార‌ని, సీఎంను క‌ల‌వ‌నివ్వ‌క‌పోయినా ఒక్క‌సారి లోప‌లికి వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తామ‌ని చెప్పామ‌ని వెల్ల‌డించారు. క‌నీసం అలా చేయ‌పోతే మీడియా ముందు త‌మ సిగ్గుపోతుంద‌ని చెప్పుకున్నామ‌ని అయిన‌ప్ప‌టికీ లోప‌లికి వెళ్లే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని టల రాజేందర్ వివ‌రించారు. ఆ స‌మ‌యంలో స‌హ‌చ‌ర నేత‌ గంగుల క‌మ‌లాక‌ర్‌కు కోపం వ‌చ్చింద‌ని, ఇంత అహంకార‌మా? అని అన్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇటువంటివి చాలా ఉన్నాయ‌ని అవి చెప్ప‌లేమ‌ని అన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని తాను టీఆర్ఎస్ నేత‌ల‌ను అడ‌గ‌డం లేద‌ని చెప్పారు ఈటల రాజేందర్. కేసీఆర్ పై చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. త్వరలో మరిన్ని సంచలన విషయాలు కేసీఆర్ బయటపెడతారనే చర్చ జరుగుతోంది. దీంతో ఈటల ఎపిసోడ్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. 

సింహాలకు కరోనా.. వామ్మో వైర‌స్‌.. బీ అల‌ర్ట్‌..

అవును. సింహాల‌కు క‌రోనా సోకింది. ఇన్నాళ్లూ మ‌నుషుల‌పై మాత్ర‌మే దాడి చేస్తూ వ‌చ్చిన వైర‌స్‌.. ఇప్పుడు జంతువుల‌పై కూడా అటాక్ మొద‌లుపెట్టింది. తొలి పంజా.. సింహం పైనే విసిరింది క‌రోనా సూక్ష్మ‌జీవి. అడ‌వికి రారాజైన మృగ‌రాజులే వైరస్ బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.   హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో కరోనా కలవ‌రం మొద‌లైంది. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సింహాలకు కరోనా సోకింది. సింహాలకు అనారోగ్య లక్షణాలు కన్పించడంతో అనుమానంతో వాటి నమూనాలు సేకరించారు అధికారులు. వాటిని సీసీఎంబీకి పంపించి ప‌రీక్ష చేయించారు. ఫ‌లితాలు చూసి షాక్ అయ్యారు. ఎనిమిది సింహాలు కరోనా బారిన పడినట్టు నివేదికలో తేలింది. మృగరాజులకు సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ సోకినట్టు వెల్లడైంది.  ప్రస్తుతం సింహాల ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో జంతువులకు కరోనా పాజిటివ్‌గా తేలడం ఇదే తొలిసారి. జూ పార్కులను ఇప్పటికే అధికారులు మూసివేసిన కూడా సింహాల‌కు ఎలా క‌రోనా వ‌చ్చిందో అర్థం కావ‌డం లేదంటున్నారు అధికారులు. జూ పార్కు సిబ్బంది నుంచి వైర‌స్ వారికి అంటి ఉంటుంద‌ని అంటున్నారు.   జూపార్కులో సింహాల‌కు క‌రోనా సోక‌డంతో ఇప్ప‌డు జ‌నాలూ బెదిరిపోతున్నారు. మిగ‌తా జంతువులూ క‌రోనా బారిన ప‌డితే ప‌రిస్థితి ఏంట‌ని హ‌డ‌లిపోతున్నారు. ఆవులు, కుక్క‌లు, మేక‌లు, కోళ్లకూ క‌రోనా వ‌స్తుందా అని అనుమానిస్తున్నారు. భ‌యంతో వ‌ణికిపోతున్నారు. దీనిపై అధికారులే స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది. మరోవైపు, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు మూసివేశారు. సందర్శకులు, జంతువుల రక్షణ దృష్ట్యా జూలు, పార్కులు, నగర వనాలు, ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్‌ ఎకో పార్కులు మూసివేశారు. కేంద్ర అటవీశాఖ ఆదేశాల మేరకు మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా దృష్ట్యా విశాఖ, తిరుపతిలలో జూ పార్కులను మూసివేశారు. 29 ఎకో టూరిజం సెంటర్లతో పాటు 23 నగర వనాలు మూసేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి 7 టెంపుల్‌ ఎకో పార్కులు మూసివేయాలని ఆదేశించారు. జంతువుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి. 

కరోనా దెబ్బకు ఐపీఎల్‌ ఫసక్..

అనుకున్నదే జరిగింది! కరోనా ప్రభావం చివరికి ఐపీఎల్ పై కూడా పడింది. విరామం లేకుండా కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్ కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా వేసేలా చేసింది. సరిగ్గా సగం మ్యాచులు ముగిసిన తర్వాత పాజిటివ్‌ కేసులు రావడంతో బీసీసీఐ తలపట్టుకుంది. ఆటను ఆపేసింది. ఆటగాళ్ల సంక్షేమానికే ఓటేసింది!  ఇప్పటి వరకు ఏం జరిగిందంటే? కరోనా.. ఆ పేరు వినగానే బెట్టింగ్ రాయిడ్లు హుషారు అవుతారు. ఐపీఎల్  మొదలు కాగానే బెట్టింగ్ స్టార్ట్ చేసి.. కొంత మంది.. డబ్బులు సంపాదిస్తుంటే.. కొత్త మంది మాత్రం ఆస్తులు పోగొట్టు కుంటారు.  ఐఎస్‌ఎల్‌ నిర్వహణతో..  ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీసులను బీసీసీఐ విజయవంతంగా నిర్వహించింది. చక్కని బయో బుడగలను ఏర్పాటు చేసి నిరాటంకంగా మ్యాచులు నిర్వహించింది. నిజానికి అప్పుడు భారత్‌లో కేసుల సంఖ్య చాలా తక్కువ. దేశవ్యాప్తంగా సగటున 20వేల కేసులే నమోదవుతున్న కాలమది. అంతకుముందే ఇండియన్‌ సూపర్‌లీగ్‌ను నిర్వాహకులు విజయవంతం చేేయడంతో ఐపీఎల్‌పై బీసీసీఐ ముందుకొచ్చింది. సెప్టెంబర్లో టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి రావడంతో లీగ్‌ను ఇక్కడే నిర్వహించాలని అనుకుంది. టీ20 ప్రపంచకప్‌కు ఈ అనుభవం పనికొస్తుందని భావించింది. ఫాస్ట్ నుండే భయం భయం..  ఏప్రిల్‌ 9, శుక్రవారం రోజు ఐపీఎల్‌-21లో తొలి మ్యాచ్‌ జరిగింది. కానీ అంతకు ముందు నుంచే వైరస్‌ భయం పట్టుకుంది. ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. కేవలం మహారాష్ట్రలోనే రోజుకు 50వేల కేసులుండేవి. దేశవ్యాప్తంగా 2-3 లక్షల కేసులు నమోదయ్యేవి. ఇక ముంబయిలోని వాంఖడే మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. ఐపీఎల్‌ ప్రసారదారు సిబ్బంది సైతం పాజిటివ్‌గా తేలారు. సరిగ్గా సీజన్‌కు ముందు కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణా, క్వారంటైన్‌లో ఉండగా దిల్లీ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కరోనా బాధితులయ్యారు. అయినప్పటికీ ముంబయి, చెన్నై లెగ్‌ను బీసీసీఐ విజయవంతం చేసింది. ప్లైయర్ కి కూడా కరోనా రావడం..  ముంబయి, చెన్నై వేదికల్లో మొత్తం 20 మ్యాచులు జరగడం.. ఎలాంటి ఇబ్బందీ తలెత్తకపోవడంతో బోర్డు అంతా సవ్యంగా సాగుతోందనే అనుకుంది. జట్లను అహ్మదాబాద్‌, దిల్లీకి పంపించింది. సామగ్రిని సైతం తరలించింది. మోదీ స్టేడియంలో 8 లీగ్‌ మ్యాచులు జరగాల్సి ఉండగా 5 పూర్తయ్యాయి. దిల్లీలో 8 లీగు మ్యాచులకు 4 ముగిశాయి.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కొందరు ఇంటిబాట పట్టడం, సోమవారం కోల్‌కతా ఆటగాళ్లు సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తికి పాజిటివ్‌ రావడంతో కలకలం రేగింది. దాంతో కోల్‌కతా, బెంగళూరు మ్యాచును రీషెడ్యూలు చేశారు. అదేరోజు సాయంత్రం చెన్నై సిబ్బందిలో బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌, ఓ బస్సు క్లీనర్‌కు కరోనా వచ్చిందని తెలియడంతో కలవరం మరింత పెరిగింది. మంగళవారం నాటి మ్యాచుపైనా సందిగ్ధం ఏర్పడింది. తప్పని నిరవధిక వాయిదా ..  బాలాజీని కలవడంతో ఎప్పుడైతే చెన్నై జట్టంతా వారం రోజుల కఠిన క్వారంటైన్‌కు వెళ్లిందో గందరగోళం మొదలైంది. వేదికను ముంబయికి మార్చి అక్కడే అన్ని మ్యాచులు ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లూ మొదలుపెట్టింది. ఈ వారం రోజుల మ్యాచులు వాయిదా వేసి తర్వాతి వారంలో రోజుకు రెండు చొప్పున ఆడించాలని అనుకుంది. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌సాహా, దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాకు పాజిటివ్‌ వచ్చిందని తెలియడంతో బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి ఆగమేఘాలపై సమావేశం నిర్వహించి లీగ్‌ నిరవధిక వాయిదాకు నిర్ణయం తీసుకున్నాయి. ఆటగాళ్లు సురక్షితంగా, క్షేమంగా ఉండటమే తమకు ముఖ్యమని ప్రకటించాయి. విదేశీ ఆటగాళ్లను సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. తర్వాతి విండో దొరికితే లీగ్‌ నిర్వహిద్దామని బీసీసీఐ ఆలోచన. కానీ అదంత సులభం కాదని తెలుస్తోంది.  

ఈటలకు కేసీఆర్ మరో షాక్! 

అసైన్డ్ భూములు అక్రమించారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది  ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్ నేతల తీర్మానం చేస్తూ కేసీఆర్ లేఖ ఇచ్చారని చెబుతున్నారు.  ఈటల వ్యవహారంపై చర్చించేందుకు సమావేశమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు.. ఆయనపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్,  ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రసమయి, మాజీ ఎంపీ వినోద్ తో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా  సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉమ్మడి కరీంనగర్ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కారులో కూర్చొని నివేదిక తయారీ! ఈటల కేసులో హైకోర్టు సీరియస్ 

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసే ముందు ఆయనకు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిగింది. నివాసంలోనే న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం న్యాయస్థానానికి వివరించింది. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. కలెక్టర్‌ నివేదిక కూడా తమకు ఇవ్వలేదని చెప్పింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్  ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపామని న్యాయస్థానానికి వివరించారు.  వాదనలు విన్న హైకోర్టు.. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా.. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని ప్రశ్నించింది. అధికారులు కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్‌ జనరల్‌ పూర్తిస్థాయి విచారణ జరగలేదని వివరించారు. ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యలు చట్టప్రకారమే ఉంటాయని కలెక్టర్‌ నివేదికలో తెలిపారని ఏజీ హైకోర్టుకు వివరించారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. 

రాసిచ్చింది చదివేశారు! టీఆర్ఎస్ నేతల పీసీపై రచ్చ 

తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఈటల రాజేందర్ వ్యవహారంలో ఎట్టకేలకు టీఆర్ఎస్ మౌనం వీడింది. నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ నేతలు స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మాట్లాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈటల వ్యవహారంలో ముఖ్యమంత్రిని సమర్ధించిన గులాబీ నేతలు... ఈటలపై ఘాటు విమర్శలు చేశారు. రాజేందర్ తో టీఆర్ఎస్ నేతలెవరు లేరని చెప్పారు.  ఈటలను టార్గెట్ చేస్తూ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతల స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ అధినేతల డైరెక్షన్ లోనే మీడియా ముందుకు వచ్చారని తెలుస్తోంది. ముందే రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు. సొంతంగా ఒక్క మాట మాట్లాడకుండా అంతా హైకమాండ్ రాసిచ్చిన పదాలనే చెప్పారనే విమర్శలు వస్తున్నాయి. కొప్పుల ఈశ్వర్ కొంత సొంతంగా మాట్లాడినా.. గంగుల కమలాకర్ మాత్రం పూర్తిగా పేపర్లు చదువుతూనే ఉన్నారు. ఈటలపై గంగుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావాలనే టీఆర్ఎస్ పెద్దలు గంగులతో ఈటలను టార్గెట్ చేయించారని అంటున్నారు.  గంగుల కేబినెట్ లోకి వచ్చాకే ఈటలతో కేసీఆర్ కు గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది.  ఈటలకు చెక్ పెట్టేందుకే గంగులను కేబినెట్ లోకి తీసుకున్నారని అంటారు. అందుకే గంగుల.. ఈటలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇంతేకాదు గంగుల టీఆర్ఎస్ లోకి మధ్యలో వచ్చారు. అలాంటి నేత.. ఈటల  వచ్చేనాటికే... తమ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉందని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించిన తర్వాత పార్టీలోకి వచ్చిన గంగుల... ఈటలను విమర్శించడంపై తెలంగాణ వాదులు, ఈటల మద్దతుదారులు భగ్గుమంటున్నారు.  ఈటలకు బీసీ సంఘాల నుంచి మద్దతు వస్తుండటంతో... ఆ అంశంపైనే టీఆర్ఎస్ ఫోకస్ చేసినట్లు కనిపించింది. అందుకే మంత్రిగా ఈటల బీసీల గురించి ఏనాడు మాట్లాడలేదని విమర్శించారు. గంగుల అయితే ఈటల హుజురాబాద్ లో బీసీ.. హైదరాబాద్ లో ఓసీ అంటూ రెచ్చిపోయారు. కేసీఆర్ వల్లే ఈటలకు పదవులు వచ్చాయని మంత్రులు అనడంపై రాజకీయ వర్గాల నుంచి విస్మయం వ్యక్తం అవుతోంది. కేసీఆర్ వల్లే ఈటలకు పదవులు వచ్చాయని చెబుతున్న నేతలు... చంద్రబాబు వల్లే  కేసీఆర్ ఈ స్థాయికి ఎదిగాడని చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల పాత్ర జనాలందరికి తెలుసుంటున్నారు. ఇంతకాలం బీసీ నేతగా ఈటలను కీర్తించిన నేతలే.. ఇప్పుడు అతను బీసీలకు ఏమి చేయలేదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు.  ఈటల ఎపిసోడ్ తర్వాత విపక్షాలు, ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాల్లో వస్తున్న ప్రధాన చర్చ భూకబ్జాలు. అసైన్డ్ భూములు ఆక్రమించారని ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్.. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర మంత్రులు, నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. అయితే ఈటల అంశంపై మీడియా ముందుకు వచ్చిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు.. తమపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై మాత్రం స్పందించలేదు. మొత్తంగా హైకమాండ్ ఆదేశాలతో మీడియాతో మాట్లాడారే కాని.. తమ ఇష్టపూర్వకంగా మాట్లాడినట్లు కనిపించలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

హుజురాబాదులో బీసీ.. హైద్రాబాదులో ఓసీ! ఈటలకు గంగుల కౌంటర్ 

తనపై కక్ష పూరితంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్న ఈటల రాజేందర్ ఆరోపణలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి అని.. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల హుజురాబాద్‌కు వెళితే బీసీ.. హైద్రాబాద్‌కు వస్తే ఓసీ అంటూ మండిపడ్డారు. దేవరాయాంజల్ భూముల కోసం అప్పటి సీఎం వైఎస్‌తో మాట్లాడిన ఈటల.. ముదిరాజ్‌ల కోసం ఎందుకు మాట్లాడలేదు? నీ వ్యాపార భాగస్వాములు ఎవరైనా బీసీలు ఉన్నారా? ఇప్పుడు బీసీలు మీకు గుర్తుకు వచ్చారా? చీమలు పెట్టిన పుట్టలో పాములా మీరు చేరారు అంటూ ఈటలను టార్గెట్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోమని గంగుల హెచ్చరించారు. ఈటల బీసీలను ఎదగకుండా చేశారని,  టీఆర్ఎస్ బీఫామ్  మీద పోటీ చేసిన వారిని  ఓడించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు ఈటల ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈటల తనకు తాను పెద్దగ ఊహించుకుంటున్నారని గంగుల మండిపడ్డారు.  పార్టీలో విభజన తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. పార్టీ ఓడితే ఈటల నవ్వుతారు, గెలిస్తే మొహం మాడ్చుకుంటారని అన్నారు. ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నారని గంగుల ఆరోపించారు. అందుకే వారు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ బొమ్మతో ఈటల గెలిచాడన్నారు కమలాకర్.   ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని, ఈటలకు శాసనసభాపక్ష నేతగానూ అవకాశం ఇచ్చి పార్టీలో మంచి గుర్తింపునిచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈటల తమ కళ్లముందే ఉన్నతస్థానానికి ఎదిగారని అన్నారు.ఆర్థిక, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఎంత కీలకమైనవో అందరికీ తెలిసిందేనని, అలాంటి శాఖలను ఈటలకు అప్పగించారని తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘంలోనూ ఈటలకు ప్రాముఖ్యత ఇచ్చారని, కానీ ఈటల తరచుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారని కొప్పుల ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లోనూ ఈటలను పార్టీ ఏమీ అనలేదని, ఇక ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగిందో చెప్పాలని నిలదీశారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనడం, అమ్మడం నేరం అని ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కొనడం తప్పుగా అనిపించలేదా అని నిలదీశారు. రూ.1.5 కోట్ల విలువైన భూములను కేవలం రూ.6 లక్షలకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఇది ఎస్సీలకు నష్టం చేకూర్చినట్టు కాదా? అని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే... సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎంపైనే ఎదురుదాడికి దిగడం ఈటలకు మాత్రమే చెల్లిందని అన్నారు. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు చేయరాదని చట్టం చెబుతోందని, అసైన్డ్ భూములను ఎన్నిసార్లు అమ్మినా తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని కొప్పుల స్పష్టం చేశారు.

నియంత పాలన సాగదు.. ఆత్మగౌరవ పోరాటమన్న ఈటల

తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గా మరింత దూకుడు పెంచారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎన్నారైల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ది ఆత్మ‌గౌర‌వ ఉద్యమమ‌ని ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. ప్ర‌లోభాల‌కు లొంగ‌లేదు కాబ‌ట్టే నాపై నింద‌లు వేస్తున్నారని చెప్పారు.తెలంగాణ తెచ్చింది కుటుంబ పాల‌న కోసం కాద‌ని తెలిపారు. తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశ‌ప‌డ‌న‌ని చెప్పుకొచ్చారు.  2014కు ముందు పాల‌కులు ప్ర‌లోభాల‌కు లొంగిపోయి పాల‌న కొన‌సాగించార‌ని ఈటల రాజేందర్ అన్నారు.ప్ర‌జ‌ల కోసం కాకుండా అధికారం కోస‌మే పాకులాడారని ఆయ‌న ఆరోపించారు. ఇప్పుడు కూడా అచ్చం అదే రీతిలో పాల‌న కొన‌సాగుతోంద‌ని ఈట‌ల రాజేంద‌ర్  విమ‌ర్శించారు. చాలా మంది తెలంగాణ వాదులు ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పాల‌న కొన‌సాగాల‌ని కోరుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తిలో పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ వాదుల భాగ‌స్వామ్యం లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు పాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని చెప్పారు. అన్ని వ్య‌వ‌హారాలు ప్ర‌జాస్వామ్య‌యుతంగా కొన‌సాగాల‌ని త‌న‌లాంటివారు చెబుతున్నార‌ని ఈటల అన్నారు. ప్రజ‌ల అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ పాల‌న కొన‌సాగాలి త‌ప్ప వారి అభిప్రాయాల‌కు విలువ లేకుండా పాల‌న కొన‌సాగ‌డం స‌రికాద‌న్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు నిర్మించ‌డం, రోడ్లు వేయించ‌డం మాత్ర‌మేన‌న్న భావ‌న స‌రికాద‌ని ఈట‌ల రాజేంద‌ర్  చెప్పారు.'ఆనాడు బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా మ‌నం ఎందుకు కొట్లాడాం.. బ్రిటిష్ వారు అభివృద్ధి ప‌నుల‌ను చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కాదు.. భారత జాతి స్వ‌తంత్రంగా ఉండాల‌ని స్వ‌యం పాల‌న కావాల‌ని కొట్లాడాం' అని ఈటల రాజేందర్ ఎన్నారైల సమావేశంలో వ్యాఖ్యానించారు.  

టీటీడీలో ర‌చ్చ‌ ర‌మ‌ణ‌.. హైకోర్టు నోటీసులు..

ఒక వ్య‌క్తి. అనేక ఆరోప‌ణ‌లు. ఒక అర్చ‌కుడు. అనేక వివాదాలు. ఒక ర‌మ‌ణ దీక్షితులు. ఆల‌యంలో రాజ‌కీయాల‌కు కార‌కుడు. ఇలా ఆయ‌న ఎప్ప‌టి నుంచో కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌. తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కుడిగా ఫుల్ పాపుల‌ర్‌. ఏళ్లుగా స్వామి వారి సేవ‌లో ఉన్నారు. ఎంత దైవ భ‌క్తో.. అంత‌కుమించి రాజ‌కీయ భ‌క్తి కూడా ఉందంటారు. అందుకే, నిత్యం ఆయ‌న చుట్టూ ఏదో ఒక వివాదం. తాజాగా, ప్ర‌ధాన అర్చ‌కుడిగా ర‌మ‌ణ దీక్షితులుని నియ‌మించ‌డాన్ని స‌వాల్ చేస్తూ మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ధ‌ర్మాస‌నం పిల్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఏపీ ప్ర‌భుత్వం, తిరుమ‌ల‌ తిరుప‌తి దేవ‌స్థానం, ర‌మ‌ణ దీక్షితుల‌కు నోటీసులు జారీ చేసింది.  శ‌తాబ్దాలుగా శ్రీవారి ఆల‌యం దేదీప్య‌మానంగా, భ‌క్త‌జ‌న సంద్రంగా అల‌రారుతోంది. ఇప్ప‌టి వ‌రకూ ఎంద‌రో క‌లియుగ దేవుని స‌న్నిధిలో ప్ర‌ధాన అర్చ‌కులుగా చేశారు. కానీ, ర‌మ‌ణ దీక్షితులు పేరు మారుమోగినంత‌గా మ‌రెవ‌రి పేరూ వార్త‌ల్లో నిల‌వ‌లేదు. రాజ‌కీయంగా వివాదాస్ప‌దం కాలేదు. ఆల‌యంలో పూజ‌లు చేసుకునే అర్చ‌కుడికి రాజ‌కీయాల‌తో ఏం సంబంధ‌మో అస్స‌లు అర్థం కాదు. ర‌మ‌ణ దీక్షితులుకి చంద్ర‌బాబు అంటే అస్స‌లు గిట్ట‌ద‌ని అంటారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేలా ప‌లు అంశాలు తెర మీద‌కు తెచ్చారు. అవి అప్ప‌ట్లో రాజ‌కీయంగా పెను సంచ‌ల‌నం సృష్టించాయి.  శ్రీవారి ఖ‌జానాలో అత్యంత అరుదైన‌, విలువైన పింక్ డైమండ్ ఉండేద‌ని.. అదిప్పుడు క‌నుమ‌రుగు అయిందంటూ వివాదం చెల‌రేగింది. పింక్ డైమండ్ ప‌గిలిందంటూ కూడా ప్ర‌చారం జ‌రిగింది. మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ కోసం.. చంద్ర‌బాబే ఆ పింక్ డైమండ్ త‌స్క‌రించారంటూ రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. విష‌యం సుప్రీం కోర్టు క‌మిటీల వ‌ర‌కూ వెళ్లింది. అలా ఆ ఐదేళ్లూ.. చంద్ర‌బాబు, ర‌మ‌ణ దీక్షితులు ఏదో ఒక విధంగా వివాదాల్లో ఉండేవారు.  క‌ట్ చేస్తే.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓ జీవోతో ర‌మ‌ణ దీక్షితులును ప్ర‌ధాన అర్చ‌కులు హోదా నుంచి దించేసింది. 65 ఏళ్ల వ‌య‌సు వారు ఆ స్థానానికి అర్హులు కాదంటూ జీవో జారీ చేసి ర‌మ‌ణ దీక్షితులుకి చెక్ పెట్టింది. ఆ జీవో ప్ర‌కారం.. ర‌మ‌ణ దీక్షితులు హోదా ఊడిపోగా.. ఆ స్థానంలో వేణుగోపాల దీక్షితులును తిరుమ‌ల‌ తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కులుగా నియ‌మించింది అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కారు. జీవోపై ర‌మ‌ణ దీక్షితులు కోర్టుకు వెళ్ల‌డం.. అక్క‌డ ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చినా.. ప్ర‌భుత్వ దాన్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. ఇలా చంద్ర‌బాబు వ‌ర్సెస్ ర‌మ‌ణ దీక్షితులు ఎపిసోడ్ రాజ‌కీయంగా ర‌చ్చ రాజేసింది.  ర‌మ‌ణ దీక్షితులు శ్రీవారి భ‌క్తులు. జ‌గ‌న్‌రెడ్డికి రాజ‌కీయ సేవ‌కుడు. జ‌గ‌న్ మ‌రో 30 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉండాలంటూ అప్ప‌ట్లో మ‌న‌సారా ఆశీర్వ‌దించారు ర‌మ‌ణ దీక్షితులు. అందుకే, జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. మ‌ళ్లీ ర‌మ‌ణ దీక్షితులుకు మంచి రోజులు వ‌చ్చాయి. అయితే, జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఆయ‌న్ను ప‌ద‌వి వెతుక్కుంటూ ఏమీ రాలేదు. పూర్వ వైభ‌వం వ‌చ్చేందుకు ఆయ‌న‌కు ఏడాదికి పైనే స‌మ‌యం ప‌ట్టింది. ర‌మ‌ణ దీక్షితులు ఎంత కాంట్ర‌వ‌ర్సీయో తెలిసే.. జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఆయ‌న‌కు ప్ర‌ధాన అర్చ‌కులు హోదా క‌ట్ట‌బెట్ట‌లేదు అంటారు. ప‌దే ప‌దే ఒత్తిడి తెచ్చి.. జ‌గ‌న్‌ను ఒప్పించి మ‌రీ.. ఇటీవ‌లే ఆయ‌న తిరిగి తిరుమ‌ల‌ తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కుడి ప‌ద‌వి తెచ్చుకున్నారు. త‌న‌ను తొల‌గించి ర‌మ‌ణ దీక్షితులుకి ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వేణుగోపాల దీక్షితులు తాజాగా హైకోర్టులో పిల్ వేశారు. దీంతో.. ర‌మ‌ణ దీక్షితులు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన అర్చ‌కులుగా ఉన్న ర‌మ‌ణ దీక్షితులు.. తాను ఆ ప‌ద‌విని అలంక‌రించాక‌.. మ‌ళ్లీ పింక్ డైమండ్ ప్ర‌స్తావ‌న ఎత్త‌డ‌మే లేదు. నిజంగా పింక్ డైమండ్ ఉండి ఉంటే.. అది ప‌గ‌ల‌డ‌మో, లేక‌, అప‌హ‌ర‌ణ‌కు గురై ఉంటే.. ఇప్పుడు జ‌గ‌న్‌రెడ్డే క‌దా సీఎంగా ఉంది.. ర‌మ‌ణ దీక్షితులేగా ప్ర‌ధాన అర్చ‌కులుగా ఉన్నారు.. విచార‌ణ జ‌రిపిస్తే నిజాలు నిగ్గు తేలుతాయిగా?  నిజంగా చంద్రబాబుది త‌ప్పేమైనా ఉంటే దోషిగా నిల‌బెట్టొచ్చుగా? ఆల‌స్యం ఎందుకు? భ‌యం ఎందుకు? ఓహో.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేద‌నే విష‌యం తేలిపోతుంద‌నా?

కరోనా ప్రాణం ఖరీదు..  

దేశం లో, రాష్ట్రంలో కరోనా సృష్టిన బీభత్సము అంత, ఇంత కాదు. అంతటా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి మరో ఎత్తు. తెలంగాణాలో ఎంతగా  విషమంగా మారిందంటే. కరోనా నుండి ఎవరైనా కోలుకుంటేనో, లేదంటే చనిపోతేనో మాత్రమే వెంటిలేటర్ బెడ్ ఖాళీ అవుతోంది. ఈ చికిత్సలో కనీసం రోజుకు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. బాధితుడు తనంతట తానుగా ఊపిరి పీల్చుకునే వరకూ చికిత్స అవసరం ఉంటుంది. ఇదే సమయంలో నాలుగు ఆక్సిజన్ బెడ్లపై ఉన్న రోగులకు ఒక నర్స్ అవసరం కాగా, వెంటిలేటర్ బెడ్ పై ఉన్న రోగి సహాయార్థం ఒక నర్సును నియమించడం తప్పనిసరని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  కరోనా లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో ఉన్న వారు వైద్యుల సలహాలను తీసుకోకుండానే ఇంట్లో చికిత్సలు తీసుకుంటూ హోమ్ ఐసొలేషన్ కు పరిమితం అవుతున్నారని, వారిలో పరిస్థితి విషమించడంతోనే వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ పెరుగుతోందని ఒకవైపు వైద్యులు అంటున్నారు. కట్ చేస్తే.. హైదరాబాద్ కి  చెందిన ఒక వ్యాపారి తన కొడుకు వెంటిలేటర్ ఇవ్వండి అని పెద్ద మొత్తం లో నగదు ప్రకటించాడు. నా కుమారుడికి కరోనా సోకింది. వెంటిలేటర్ అత్యవసరం. లేకుంటే వాడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వెంటిలేటర్ ఇచ్చి, మా వాడి ప్రాణాలు కాపాడితే రూ. 50 లక్షలు ఇస్తాను. దానికి బిల్లు కూడా వద్దు. అంత మొత్తం ఎక్కువని భావిస్తే, మిగిలే డబ్బులతో పేదలకు కరోనా వైద్యం చేయండి" ఇది హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి కార్పొరేట్ ఆసుపత్రులకు ఇచ్చిన ఆఫర్. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే, అంత ఆఫర్ ఇచ్చినా, ఆ వ్యాపారి కుమారుడికి దాదాపు 24 గంటల తరువాత మాత్రమే వెంటిలేటర్ లభించింది. దీన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు ఎంత  డిమాండ్ ఉందన్న విషయం తెలుస్తుంది.  ప్రస్తుతం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఒక్కో వెంటిలేటర్ కోసం దాదాపు 15 మంది కరోనా బాధితులు పోటీపడుతున్న పరిస్థితి. ఇందుకు కారణం తొలి దశలో వెంటిలేటర్ అవసరమైతే నాలుగు రోజుల్లో కోలుకుని సాధారణ స్థితికి వచ్చే వారు. కానీ, రెండో దశలో వెంటిలేటర్ అవసరమైతే, కనీసం రెండు వారాల పాటు వినియోగించాల్సి వస్తోంది. దీంతో ప్రాణాధార యంత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక వెంటిలేటర్ అవసరమై, డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన వారు కూడా నిరాశ చెందాల్సిన పరిస్థితి. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారికి తాత్కాలికంగా వెంటిలేటర్ బెడ్లకు బదులుగా ఆక్సిజన్ బెడ్లు ఇస్తామని, రెండు మూడు రోజుల తరువాత ఖాళీ అయితే, వెంటిలేటర్ బెడ్లు ఇస్తామని, ఈలోగా ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ఖరాఖండీగా చెబుతున్నాయి. వెంటిలేటర్ల కోసం ఇంతగా డిమాండ్ పెరగడం ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని వైద్యులే చెబుతుండటం గమనార్హం.  ఏది ఏమైనా కరోనా ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఎక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రభుత్వాలకు మాత్రం ప్రజల ఆరోగ్యాలు పట్టడం లేదు. వారికీ కావాల్సింది ఎన్నికలు,  అధికారం మాత్రమేనని, ప్రజా ఆరోగ్యం వారికి అవసరం లేదని తెలుస్తుంది. ఒక వైపు హై కోర్టు, సుప్రీం కోర్టు సైతం లాక్ డౌన్ పై తన అభిప్రాయాన్ని ఇవ్వమని ప్రభుత్వాలను ప్రశ్నించిన కేంద్ర, రాష్ట్రాలకు న్యాయస్థానం మాట చెవిన పడడం లేదు.   

రాజమండ్రి జైలులో కరోనా కలకలం.. హాస్పిటల్ లో దూళిపాళ్ల నరేంద్ర 

సంగం డెైయిరీ కేసులో నిందితులుగా రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ళ నరేంద్ర అస్వస్తతకు గురయ్యారు. దీంతో ఆయనను  రాజమంఢ్రి సెంట్రల్ జైలు నుంచి కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. సోమవారం రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సంగం డెయిరీ అక్రమాలపై నమోదైన కేసులో రిమాండ్‌లో ఉన్న సహకార శాఖ మాజీ అధికారి గురునాధంను కూడా కోవిడ్ పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలించారు. దూళిపాళ్లతో పాటు అరెస్టైయిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ కు  కరోనా నిర్ధారణ అయింది, దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. గోపాలకృష్ణన్‌ కు సోమవారం మధ్యాహ్నం క‌రోనా లక్షణాలు క‌న‌ప‌డ్డాయ‌ని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు త‌లెత్తడంతో  జైలు అధికారులు క‌రోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది.సంగం డెయిరీ ఎండీకి కరోనా సోకడంతో సహకారశాఖ మాజీ అధికారి గురునాథం పాటు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.