కొవిడ్ ను వదిలేసి పాస్టర్లపై ఫోకస్! జగన్ సర్కార్ పై జనాల ఫైర్ 

ఏపీలో రోజుకు 20వేల‌కు పైగా కేసులు. ఐదు రోజుల్లోనే ల‌క్ష దాటిన పాజిటివ్ కేసులు. హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ క‌రువు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో పిట్టల్లా రాలుతున్న జనాలు.. హాస్పిటల్స్ లో శవాల గుట్టలు. శ‌వ‌ద‌హ‌నాల‌కూ ఇబ్బందులు. మందులు లేవు. టెస్టింగ్ కిట్స్ లేవు. ఇక వ్యాక్సిన్ ఊసే లేదు. మొత్తంగా చూస్తే హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు. అయినా క‌ర్ఫ్యూ పెట్టేసి చేతులు దులిపేసుకుంది స‌ర్కారు. ఇంత‌లా క‌రోనా క‌ల్లోలం రేపుతుంటే.. సీఎం జ‌గ‌న్ మాత్రం నీరో చ‌క్ర‌వ‌ర్తిలా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో పిడేలు వాయించుకుంటున్నారనే విమ‌ర్శ‌లు. ప్రభుత్వ ఉదాసీన‌త‌పై రాజ‌కీయ ర‌చ్చ చెల‌రేగుతున్నా.. న‌వ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది పాల‌కులు వ్య‌వ‌హార శైలి. తాజాగా జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో అత్యంత ప్రాధాన్య‌మైన క‌రోనా అంశానికి.. అతి త‌క్కువ ప్ర‌యారిటీ ఇచ్చింది మంత్రి మండ‌లి.  దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనాపైనే ఫోకస్ చేస్తే.. జగన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ ఎజెండాలో మాత్రం 33వ అంశంగా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను చేర్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 10 రోజులుగా క‌రోనా కాకుండా వేరే ముఖ్య‌మైన టాపిక్ ఏదైనా ఉందా?  కొవిడ్ ఇంత‌లా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తుంటే.. మంత్రి మండ‌లిలో చ‌ర్చించ‌డానికి క‌రోనా కంటే ముఖ్య‌మైన అంశాలుగా మ‌రో 32 టాపిక్స్‌ను ఎజెండాలో ముందు ఉంచ‌డం ఏంటి? ఇంత‌కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ప్ర‌భుత్వానికి ప్ర‌జాల ప్రాణాల‌న్నా.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌న్నా ఎందుకింత నిర్ల‌క్ష్యం? ఎందుకింత ఉదాసీన‌త‌? ఎందుకింత చేత‌గానిత‌నం? అంటూ ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తోంది.  కేబినెట్ భేటీలో ప్రధాన అంశం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సిందే. ఫాస్టర్లు, అర్చ‌కుల‌ప, ఇమామ్‌, మౌజ‌మ్‌ల‌కు జీతాలు పెంచ‌డం. ఈ టాపికే అజెండాలో ప్రియారిటీ ఐట‌మ్‌.  ఫాస్టర్లకు  రూ. 5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపునకు బినెట్‌ ఆమోదం తెలిపింది. ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లోరూ.10వేల గౌరవ వేతనానికి, ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు ఏపీ కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనాతో ఇంత‌లా అల్లాడిపోతుంటే ప్ర‌భుత్వం.. జీతాలు పెంచే టాపిక్‌ను టాప్ ప్ర‌యారిటీగా తీసుకోవ‌డంపై దుమారం చెల‌రేగుతోంది. అస‌లే ఖ‌జానాలో కాసులు లేవు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసింది. గొప్ప‌ల‌కు పోయి చేప‌ట్టిన‌ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కోసం అప్పులు చేయ‌డం, ప్ర‌భుత్వ భూముల‌ను అడ్డంగా అమ్ముకోవ‌డం చేస్తూ.. పాల‌న‌ను ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఇంతగా ఆర్థిక లోటు వేధిస్తున్న ఈ స‌మ‌యంలో ఇలా జీతాలు పెంచే అంశానికి కేబినెట్‌లో తొలి ప్రాధాన్యం ఇవ్వ‌డం చోద్యం కాక మ‌రొక‌టి కాదు. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, స‌రైన నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఏపీలో క‌రోనా విజృంభిస్తోంద‌నేది అంద‌రి మాట‌. ఆసుప‌త్రిల్లో బెడ్స్ సంఖ్య పెంచ‌డం, ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా చూడ‌టం.. మందులు అందుబాటులోకి ఉంచ‌డంపై కేబినెట్ ఫోక‌స్ అంతా పెట్టాల్సింది పోయి.. మొద‌ట మ‌రో 32 అంశాలు చ‌ర్చించి.. ఆ త‌ర్వాత తీరిగ్గా క‌రోనాపై దృష్టి పెట్టేలా కేబినెట్ ఎజెండా ఉండ‌టం క్ష‌మించ‌రాని నేరం అంటున్నారు. అందుకే, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తాజా మంత్రిమండ‌లి స‌మావేశంపై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. అటు, వ్యాక్సిన్ స‌న్న‌ద్ధ‌త‌పైనా ప్ర‌భుత్వాన్ని ఏకిపారేశారు చంద్ర‌బాబు. కరోనా విలయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటే కేబినెట్‌ భేటీలో 33వ అంశంగా కరోనా అంశాన్ని చర్చకు తీసుకొన్నారని, అన్నీ అయిపోయిన తర్వాత చివర్లో దీన్ని పెట్టారని చంద్ర‌బాబు ఆక్షేపించారు. ‘ప్రభుత్వానికి ఇతర పనులు ఉండవచ్చు. కానీ ప్రజల ప్రాణాలు కాపాడటం అన్నిటికంటే అత్యవసరం. ప్రభుత్వం పెట్టిన డ్యాష్‌ బోర్డులో పడకలు, వెంటిలేటర్లు ఎన్ని ఖాళీలున్నాయో కచ్చితమైన సమాచారం ఉండటం లేదంటూ మండిప‌డ్డారు.  ప్ర‌తిప‌క్ష‌మ‌నే కాదు.. స్వ‌ప‌క్షం నుంచీ ఇదే స్థాయి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వ‌యంగా అధికార పార్టీ నేత‌లే సీఎం జ‌గ‌న్ తీరును త‌ప్పుబ‌డుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్‌రెడ్డి చేతులెత్తేశారంటూ స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకుంటుండం సంచలనంగా మారింది. ఈ నెల 3న రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కరోనా సంక్షోభం గురించి మాట్లాడుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి 30 వేలు, దహన సంస్కారాలకు 12 వేలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని అభిప్రాయపడ్డారు. సీఎం ప్రవర్తనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇలా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో విఫ‌లం అయ్యారంటూ అన్ని వ‌ర్గాల నుంచి సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయినా మ‌న ముఖ్య‌మంత్రి తాడేప‌ల్లి ప్యాలెస్ వీడి క‌ద‌లిరావ‌డం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి అంచ‌నా వేయ‌డం లేదు. ప్ర‌జాక్షేత్రంలోకి వస్తేనే క‌దా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలిసేవి? క‌రోనా క‌ల్లోలం సీఎం జ‌గ‌న్‌ కంటికి క‌నిపించేది. ముఖ్య‌మంత్రికి రాజ‌కీయ‌ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌పై ఉన్నంత‌ ఇంట్రెస్ట్‌.. కొవిడ్ క‌ట్ట‌డి, నివార‌ణ చ‌ర్య‌ల‌పై చూప‌డం లేదు. ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేదు. ఇదేం ముఖ్య‌మంత్రో ఏమో.. అని ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు.

బెంగాల్లో రాష్ట్రపతి పాలన?

తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడవసారి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా అద్భుత విజయాన్ని సాధించి, హట్రిక్ కొట్టిన ఆమె బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ ఆమెతో  ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను అభినందిచారు. మమత బెనర్జీ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు, ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం, గవర్నర్’తో కలిసి విలేకరుల సమావేసంలో మాట్లాడిన మమతా దీదీ, క్లుప్తంగా, తమ ప్రాధాన్యాలను వివరించారు. కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొని, పరిస్థితిని అదుపులోకి తేవడమే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె సంకేతమాత్రంగానే అయినా,కేంద్రంతో సయోధ్యతను కోరుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ పై కలిసి పోరాటం సాగిద్దామని అన్నారు. అలాగే.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చెలరేగుతున్న రాజకీయ హింసపై ఉక్కుపాదం మోపుతానని, హింసకు పాల్పడుతున్నవారిని వదిలిపెట్టబోనని పేర్కొన్నారు. “ఈ రోజు నుంచి శాంతిభద్రతల బాధ్యత నేనే తీసుకుంటా. దీనిపై కఠినంగా వ్యవహరిస్తా” ఇది నా రెండో ప్రాధాన్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు.  మరోవంక గవర్నర్ ధన్‌కర్‌, ముఖ్యమంత్రి తమకు సోదరి సమానురాలు అంటూ, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసను అరికట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలూ దీదీ  తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఇలా తెరమీద కనిపించిన ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది చిత్రం ఎలాఉన్నా, ఎన్నికల సందర్భంగా ఎగిసిపడిన రాజకీయ విద్వేష, వైషమ్యాలు ఇంకా పుర్తిగా పోలేదు. ఇప్పట్లో సమసి  పోయాయని, పోతాయని ఆశించే పరిస్థితులు కూడా  రాష్ట్రంలో కనిపించడం లేదు. అటు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైన కమలనాధులు కుతకుతా ఉడికి పోతున్నారు. మరో వంక, బ్రహ్మాండ విజయం ఇచ్చిన ఉత్సాహంలో, ఒక రకమైన విజయగర్వంలో  మునిగి తేలుతున్నతృణమూల్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్ధులను మట్టు పెట్టేందుకు ఇదే మంచి అనువుగా బావించి దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో ఇంతవరకు 14 మంది పైగా తమ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది.  మరో వంక ఇరుపక్షాలు కూడా రాజకీయ వైరాన్ని మరో రూపంలో కొనసాగించే వ్యూహాలను రచిస్తున్నారు. మమత ప్రమాణస్వీకారానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్’కు ఫోన్ చేసి రాష్ట్రంలో జరుగతున్న హింస పట్ల ఆవేదన వ్యక్త పరిచారు. మరోవంక, మమత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా ఆ పార్టీ నాయకులు, ‘రాజకీయ హింస అనే విషచక్రం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని’ కోలకతాలో ప్రమాణం చేశారు. అదే క్రమమలో నడ్డా ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న హింసను దేశ విభజన సందర్భంగా హిందువులపై జరిగిన హింసాకాండతో పోల్చడం ద్వారా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తృణమూల్ ఆరోపిస్తోంది.  అదే విధంగా కేంద్ర హోమ్ శాఖ  రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కోరింది. అంతేకాదు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో, నివేదిక పంపకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హోమ్ శాఖ పేర్కొంది. మరోవంక రాష్ట్రంలో సాగుతున్న హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్‌ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిని టీఎంసీ గూండాలు హత్య చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దుకాణాలను లూటీ చేస్తున్నారు’ అని గౌరవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ఎన్నికల అనంతర హింస ఆసరాగా కమల దళం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మరో యుద్దానికి సిద్దమవుతోందనిపిస్తోంది. ఇటు రాజకీయం, న్యాయ పరంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుని, మమతా బెనర్జీ ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధాలు వేయాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ ఫిరాయించి గెలిచిన ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ వైపు చూడకుండా చూడడంతో పాటుగా రాష్ట్రంలో వచ్చిన ఊపును మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో, అదే విధంగా తమ కార్యకర్తలను కాపాడుకునే వ్యూహంతో బీజేపీ ఎన్నికల అనంతర హింసను అస్త్రంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, తృణమూల్ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దుస్సాహసం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయక పోవచ్చును. కానీ, ఆర్టికల్ 356 రాష్ట్ర ప్రభుత్వ మెడ మీద కత్తిలా ఉంచి మమత దూకుడుకు కళ్ళే వేసే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అయితే, ‘పోరాటమే’  ప్రధాన ఆయుధంగా  రాజకీయాలలో ఎదిగొచ్చిన మమత బెనర్జీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదురుతారని, అనుకుంటే, బీజేపీకి మరో మారు శృంగభంగం తప్పదని తృణమూల్ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే ఏది ఎలా ఉన్నా, బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సంకేతాలు ప్రస్తుతానికి అయితే లేవనే చెప్పవచ్చును.

నారి నారి నడుమ మురారి.. 

పెళ్లి చూడడానికి, పలకడానికి రెండు పదాలే కానీ, చాలా పవిత్రమైనది. దానికి మన దేశంలో పురాతనం నుండి ఒక ప్రత్యకమైన స్థానం ఉంది. రాను రాను పవిత్రమైన పెళ్లిని అపవిత్రం చేస్తున్నారు. కొంత మంది అయితే సోలోబతుకే సోబెటర్ అనుకుంటారు. మరికొంత మంది అయితే వద్దురా సోదర పెళ్లంటే నూరేళ్ళ మంటారా.. అంటూ పెళ్లి మీద పాటలు వచ్చాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రతి మనిషి లైఫ్ లో బాల్యం, యవ్వనం, ఒక భాగం అయితే పెళ్లి అనేది మరో భాగం, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి జీవితం పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అని చెప్పుకోవాలి. ఏ ఆడపిల్లకు పెళ్లంటే ఎన్నో భయాలు ఉంటాయి. తల్లిదండ్రులను, బంధువులను, సొంత ఇల్లును వదిలి ఎవరో తెలియని వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండడానికి వెళ్తుంది. అలా వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ మోజులో పడి, భార్యను మరిస్తే.. సొంత తల్లిదండ్రులుగా చూడాల్సిన అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తుంటే… ఆ బాధలు తట్టుకోవడం కన్నా చావే పరిష్కారమనుకున్న ఓ యువతి.. తన తనువు చాలించింది. కూతురికి పెళ్లి చేసి పంపించామని సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.  తంజావూరు సమీపంలో ఉన్న తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణసుందరం చిన్న కుమార్తె భువనేశ్వరి (25)ను ఆర్కాడ్‌కు చెందిన కలియమూర్తి కుమారుడు రంగరాజ్‌ (30)తో ఏడాది క్రితం వివాహం అయింది. ఎన్నో ఆశలతో భువనేశ్వరి అత్తవారింట అడుగుపెట్టింది. కానీ ఆమె ఆశలు అడియాశలేనని  ఆమెకు కొద్దీ రోజులోనే అర్ధమయ్యింది. పెళ్లై  సంవత్సరం అవుతున్నా భర్త తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. చుట్టుపక్కల వాళ్లు భర్తకు, వేరే యువతితో సంబంధం ఉందని చెప్తుండడంతో షాకయ్యింది. దీంతోపాటు అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేసేవారు. ఈ బాధలను ఆ యువతి  తట్టుకోలేకపోయింది. ఈ నరకయాతన కన్నా చావే పరిష్కారమనుకొని మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.   

కలియుగం కరోనా.. ఇన్ని కేసులా..! 

దేశం లో రోజు రోజు కరోనా దాటికి హద్దులు లేకుండా పోతుంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. కేంద్రం మాత్రం కరోనా మరణాలను చూస్తూ ఉండడం తప్పిటిస్తే చేసేదేమి లేదని చేతులు ఏతేసింది. మోడీ పాలనలో ప్రజా ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. కరోనా కారణంగా దేశ వ్యాపితంగా మరణాలకు స్మశానాలు సైతం కన్నీరు పెడుతున్నాయి గని మోడీ హృదయం మాత్రం చలించడం లేదు. మొదటి దాప కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు వలస కార్మికుల ప్రాణాలు తీశాడు. ఎప్పుడు ఆక్సిజన్ అందక, వ్యాక్సిన్ ఇవ్వక ప్రాణాలు తీస్తున్నారు. ఈ విషయమై సుప్రీమ్ కోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన మూతి పక్కకు తిప్పడం తప్పితే మోడీ చేసింది ఏం లేదు.   దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. 4లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు.    తాజా కేసులతో దేశంలో ఇప్పటి  వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,10,77,410కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2,30,168 మంది మరణించగా.. 1,72,80,844 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.   తెలంగాణలో ఇలా..  గడిచిన 24 గంటల్లో 6026 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 6,551 మంది కోలుకోగా.. మరో 52 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. వీరిలో 3,96,042 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 2579 మంది మరణించారు. కరోనా సెకండ్ వేవ్‌లో రికవరీ రేటు కాస్త పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 83.24గా ఉంది. మరణాల రేటు 0.54గా ఉంది. ఇక జాతీయ స్థాయిలో రికవరీ రేటు 82శాతం, మరణాల రేటు 1.1గా నమోదయింది. తెలంగాణలో బుధవారం 79,824 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 1,33,47,076 టెస్ట్‌లు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 3,58,599 మంది పరీక్షలు చేశారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో నిన్న 1115, మేడ్చల్‌లో 418, రంగారెడ్డిలో 403, నల్గొండలో 368, సంగారెడ్డిలో 235, సిద్దిపేటలో 231, వరంగల్ అర్బన్‌లో 224, కరీంనగర్‌లో 223, నాగర్‌కర్నూలులో 206, ఖమ్మంలో 205, మహబూబ్‌నగర్‌లో 204 కేసులు నమోదయ్యాయి.    

కరోనాపై జగన్ చేతులెత్తేశారు! వైసీపీ నేతల వీడియో వైరల్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో చికిత్స అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక చనిపోతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమి లేదని చెబుతోంది. కరోనా కట్టడిలో జగన్ రెడ్డి సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై జనాలు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  విపక్షాలే కాదు వైసీపీలోనే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నేతలు... కరోనా కట్టడిలో సర్కార్ విఫలమైందని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కరోనా గురించి మాట్లాడుకున్న నేతలు.. ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కరోనాతో చనిపోతే డెడ్ బాడీ తరలింపునకు 30 వేల రూపాయలు, దహన సంస్కారాలకు 12 వేలు వసూల్ చేస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమి చేయడం లేదని చెప్పుకున్నారు. కరోనాతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నా... జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలు గుసగుసలాడుకున్నారు.  కరోనా కట్టడి, జగన్ సర్కార్ తీరుపై రాజమండ్రిలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాము మొదటి నుంచి చెబుతున్న మాటలే వైసీపీ నేతలు అంటున్నారని, ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండో దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చని విపక్ష నేతలు అంటున్నారు. రాజమండ్రి వైసీపీ నేతల వీడియో అధికార పార్టీలో కలవరం రేపుతుందని తెలుస్తోంది. 

వామ్మో.. ఈ నెల 8 న భూమి పైకి  చైనా రాకెట్..  

దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి. కరోనా కారణంగా ప్రపంచదేశాలు చైనా దేశం మీద గుర్రుగా ఉన్నాయి. కరోనాకు సంబందించిన వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే. మళ్ళీ ఇప్పుడు ప్రపంచదేశాలు అన్నీ మరోసారి చైనా గురించి ముక్కుమ్మడిగా మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ  చైనా రాకెట్ గురించే చర్చ జరుగుతోంది. ఇంతక ఆ రాకెట్ వల్ల  ఏం జరుగుతుంది. ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది. అనే ఆందోళన ప్రపంచదేశాల్లో నెలకొంది.   చైనా ప్రయోగించిన ఓ రాకెట్ అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకొస్తోంది. ఐతే అది జనావాసాల్లో కూలిపోయే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో మిగతా దేశాలు కలవరపడుతున్నాయి. చైనా సొంతంతా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత వారం లాంగ్ మార్చ్ 5బీ (Long March 5b) అనే పెద్ద రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్‌ను అది విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోవడంతో తిరిగి భూమిపై కూలుతుందని అంతరిక్ష నిపుణులు విశ్లేషించారు. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మే 8న రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు యూఎస్ స్పేస్ కమాండ్ పరిశీలిస్తోందని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి మైకో హోవర్డ్ వెల్లడించారు. ఐతే భూవాతావరణంలోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? ఎక్కడ కూటిపోతుంది? అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే కొన్ని గంటల ముందు మాత్రమే స్పష్టత వస్తుందని.. అప్పటి వరకూ ఏమీ చేయలేమని స్పష్టం చేారు. ఐతే రాకెట్ భూమిపై కూలినప్పటికీ పెద్దగా నష్టముండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భూమిపైకి చేరేలోపే.. భూవాతావరణ ఒత్తిడికి ఆ శకాలన్ని కాలిబూడిదయ్యే అవకాశముందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్ మార్చ్ రాకెట్ బరువు 22 టన్నుల వరకు ఉంటుంది. అంత భారీ రాకెట్ భూమి వైపు వస్తున్నప్పుడు... పెద్ద పెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ శకలాలు భూమిని తాకితే చిన్న విమానం కూలినట్లుగా ఉంటుందని వెల్లడించారు. రాకెట్ శకలాలు సముద్రంలోనే పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్‌పర్ట్ జొనాథన్ మెక్‌డోవెల్ పేర్కొన్నారు. జనావాసాలపై కూలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది కూడా చైనాకు చెందిన రాకెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. చైనా తొలిసారి లాంగ్‌మార్చ్‌ 5బిని ప్రయోగించినప్పుడు దాని శకలాలు నేరుగా భూమిపై కూలిపోయాయి. ఐవరీ కోస్ట్‌లోని జనవాసాల్లో పడడంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్కైలాబ్ తర్వాత భూమిపై కూలిన అతి పెద్ద రాకెట్ అదేనని అప్పట్లో అంతరిక్ష రంగ నిపుణులు తెలిపారు.1979లో ఆస్ట్రేలియాలోని ఎస్పెరాన్స్ సముద్ర జలాల్లో స్కైలాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే. గతంలో చైనా కరోనా ప్రపంచదేశాలనే వాణికించిందని ఇప్పుడు ఈ రాకెట్ ఏంచేస్తుందో అని ప్రపంచదేశాలు వాపోకుండా ఉండలేకుడా పోతున్నాయి. చూద్దాం ఈ నెల 8 న ఏం జరుగుతుందో..       

కరోనాతో అజిత్ సింగ్ మృతి 

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరిగింది. మరణాలు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి.  కరోనా కాటుకు మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్రాణాలొదిరారు.  రాష్ట్రీయ‌ లోక్‌దళ్ అధ్యక్షుడు , కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. 82 సంవత్సరాల వయసులో చౌదరి అజిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. కరోనా బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.  చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంత‌రం చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత‌ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా అతని పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు.అజిత్ సింగ్ మృతి పట్ల వివిధ పార్టీల రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.  మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్  సింగ్.. రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. రైతు నేతగా ఆయన పేరు గడించారు. దేశంలో ఎక్కడా రైతు సమస్యలు ఉన్నా అజిత్ సింగ్ స్పిందించేవారు. అజిత్ సింగ్ 1939లో జ‌న్మించారు. ఆయ‌న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (చికాగో)లో ఉన్న‌త విద్య అభ్య‌సించారు. అమెరికాలో 15 ఏండ్ల‌పాటు కంప్యూట‌ర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన ఆయ‌న.. త‌న తండ్రి చ‌ర‌ణ్ సింగ్‌ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత దేశానికి తిరిగి వ‌చ్చారు. 1986లో తొలిసారిగా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాఘ్‌ప‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏడు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మాజీ ప్ర‌ధాని వీపీ సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా, పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో ఆహార శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 1996లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ పార్టీ (ఆర్ఎల్డీ)ని స్థాపించారు. అనంత‌రం 2001లో వాజ‌పేయి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2003 వ‌రకు ఎన్‌డీఏ భాగ‌స్వామిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికారు. 

నాలుగు నెలల పెళ్లి.. ఆ తర్వాత పెళ్ళాం బలి.. 

పెళ్లి ఒక ఆడ, మగ. మూడు ముళ్ళు. ఏడు అడుగులు. పంచభూతాలు. వేదమంత్రాలు పెద్దల ఆశీర్వాదాలు. పచ్చని పందిరి. ఒక పెళ్లి జరగాలంటే ఇంత తతంగం ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తన భర్త బాగుండాలి, తనని బాగాచూసుకోవాలి అని కలలు కంటుంది. అలాంటి భర్త దొరికితే ఏ అమ్మాయి కైనా అంతకంటే ఎక్కువ ఏం కావాలనుకోదు. కానీ ఒక  వేల సీన్ రివర్స్ అయిందనుకో ఇక ఆ అమ్మాయి జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుంది.. జీవితం అంత కష్టాల కొలిమిలో కాలిపోవాల్సిందే..  తన ఆశలు పెళ్లి ఆహుతులో కలిసిపోవాల్సిందే. పెళ్ళికి ముందు బాగుండి.  మూడు ముళ్ళు, ఏడు అడుగులు నడిచిన కొద్దిరోజులకే కొత్త మంది  భర్తల  నిజస్వరూపం బయట పడుతుంది. తన భర్త రాముడు కాదు, రావణాసురుడు అని తెలుస్తుంది. ఇక పెళ్లి కూతురు పని స్వాహా..ఆ అమ్మాయి కలలు గాల్లో కలిసిపోతాయి. కలిసి జీవితాంతం బతుకుదాం అనుకున్న ఆమె మనసులో ఆవేదన అంత అంత కాదు. ఇంతకి ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా.. మీరు చదవపోయేదానికి సంబంధం ఉంది మేరే చూడండి..   అది విజయవాడ. పాయకాపురం. అతని పేరు దుర్గారావు. ఆమె పేరు నీరాజ. వారిద్దరికీ నాలుగు నెలల కింద పెళ్లి అయింది. పసుపుతాడు ఎండలేదు. పెళ్లి పందిరి తియ్యలేదు. రెండు మూడు నెలలు సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా జపాన్ నాగసాకి  మీద బాంబు పడ్డట్లు.. ఆ ఇంట్లో గొడవలు. ఆ గొడవలు ఆమె నిండు నూరేళ్ళకు శుభం కార్డు పడింది. ఇంతకి ఆ గొడవలు ఏంటనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం..  దుర్గా రావు తన భార్యని మూడు వేలు అడిగాడు. ఆమె కరోనా టైం కదా..? చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే , మళ్ళీ తమ ఇంటి అవసరానికి డబ్బులు దొరకవు అనుకుందో ఏమో.. భర్త అడిగిన డబ్బులు ఇవ్వలేదు. తను ఆర్ధిక భవిష్యత్తు గురించి ఆలోచింది కానీ .. ఆ డబ్బులు ఇవ్వకపోతే భర్త చేతిలో మరణాన్ని గుర్తించలేదు.  మూడు వేయిల గొడవ ముదిరి ముదిరి చివరికి ఆ భర్త తన భర్య ప్రాణాలు తీశాడు. ఆ నీచుడు. ఒక్కసరిగా కత్తి తీసుకుని దాడి చేసి హత్య చేశాడు. అంతే ఒక నిండు ప్రాణం వెళ్లిపోయింది. ఆమె కలలు, ఆశలు, కష్టాలు, సుఖాలు కత్తి కి బలైపోయాయి. చివరికి ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పెండ్లి చేసినా నాలుగు నెలలకే కూతురు శవంగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.      

ఏపీ కరోనా బలహీనమైందే! భయం వదన్న కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో వేగంగా విస్తరిస్తోంది. రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీగా ఉంటున్నారు. అధికారికంగా సర్కార్ చెబుతున్న లెక్కలకంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కరోనా రోగుల మరణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏపీలో గుర్తించిన  వైరస్ అత్యంత బలమైనదనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ప్రచారంతో ఏపీ జనాలు హడలిపోతున్నారు.  అయితే ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పింది కేంద్ర బయోటెక్నాలజీ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా రకంపై  స్పష్టతనిచ్చింది. ఏపీలో వెలుగు చూసిన రకం అంత బలమైనదేమీ కాదని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు. వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్.440కె రకం బయటపడిందని, అయితే అంతే వేగంగా అది మాయమైందని అన్నారు. దాని విస్తరణ కనిపించలేదని స్పష్టం చేశారు. దాని క్లినికల్ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదన్నారు.  ప్రస్తుతం దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా కొత్త వైరస్ రకాలేమీ లేవని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ పేర్కొన్నారు. ఇది వ్యాప్తి పరంగా, తీవ్రత పరంగా ప్రభావం చూపుతోందన్నారు. బి.618 రకాన్ని కనుగొన్నప్పటికీ అది త్వరగానే అంతర్థానమైందని రేణు స్వరూప్ తెలిపారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు.. దేశంలో కల్లోలమేనా! 

దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారిపై మరో షాకింగ్ న్యూస్. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ పంజా విసురుతుండగా... కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తప్పదనిదంటూ బాంబు పేల్చారు. థర్డ్ వేవ్‌ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు విజయరాఘవన్. అంతేకాదు థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు  కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని తెలిపారు. దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రోజు  రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వీక్లీ నివేదికలో వెల్లడించింది.  మరోవైపు దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై  హెచ్చరికలపై బీజేపీ ఎంపీ  సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సూచించారు స్వామి. తాజాగా ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తూ  ‘‘కోవిడ్ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నేను రెండు రోజుల క్రితమే హెచ్చరించాను. ఈరోజు నీతి అయోగ్ సభ్యుడు కూడా కోవిడ్ థర్డ్ వేవ్‌ను నిర్ధారించారు. కోవిడ్‌ను అరికట్టడానికి సరైన వ్యూహరచన వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన టీం కావాలి’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.   

ప్రాణాలు పోతున్నా పట్టదా! ఏపీ ప్రభుత్వంపై బాబు ఫైర్ 

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. అతి తీవ్రమైన కరోనా సమస్యకు మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని చంద్రబాబు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ లో 33వ అజెండాగా కరోనాను చేర్చారని మండిపడ్డారు. రూ.వేలకోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు.  కొవిడ్‌ రెండో దశ చాలా ఉద్ధృతంగా ఉందని.. ఏపీ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయన్నారు చంద్రబాబు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కొత్త స్ట్రెయిన్‌ ఎన్‌440కె కర్నూలులో ప్రారంభమై దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతుంటే.. దీనిపై అప్రమత్తంగా లేకుండా ఎన్‌440కె అసలు లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకల కొరత లేదంటూ అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.  పార్టీ పరంగా కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నామని.. ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.తమ ఆఫీసులో కొందరికి కరోనా వచ్చిందని, అయితే అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించామని చెప్పారు.ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు అన్నారు.  

మోదీకి మూడిన‌ట్టేనా? కాషాయం క‌నుమ‌రుగేనా?

బెంగాల్‌లో బేజార్‌. కేర‌ళ‌లో ఖ‌తం. త‌మిళ‌నాడులో తుస్. ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీని బండ‌కేసి కొట్టారు ఓట‌ర్లు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన ఏపీ, తెలంగాణ‌లోనూ క‌మ‌లం పార్టీ ఖ‌ల్లాస్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే కాదు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని స్థానిక సంగ్రామంలోనూ బీజేపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది.  యూపీలో బీజేపీ అధికార పార్టీ. ఆ యూపీ ద‌య వ‌ల్లే మోదీ రెండుసార్లు ప్ర‌ధాని కాగ‌లిగారు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఓడిపోవ‌డం క‌మ‌ల‌నాథుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ప్ర‌ధాన మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో.. 40 జిల్లా పంచాయ‌తీ స్థానాలుంటే అందుకే కేవ‌లం 8 సీట్ల‌కే బీజేపీ మ‌ద్ద‌తుదారులు ప‌రిమిత‌మ‌వ‌డం ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలోనూ సేమ్ సీన్‌. 40 సీట్ల‌లో బీజేపీ కేవ‌లం 6 చోట్ల మాత్ర‌మే గెలువ గ‌లిగింది. అంటే, హిందుత్వ నినాదం నుంచి ప్ర‌జ‌లు దూరం జ‌రుగుతున్న‌ట్టేనా? రాజకీయంగా కీల‌క‌మైన వారణాసి, అయోధ్యలో బీజేపీ ఓడిపోవ‌డం దేనికి సంకేతం?  ప్ర‌ధాని మోదీ ప్రాభ‌వం అధఃపాతాళానికి ప‌డిపోతోందా?  దేశ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం మ‌స‌క‌బారుతోందా?  అటు.. కర్ణాటకలోనూ అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మై ప‌రువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్ సైతం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు గ‌ట్టి షాక్ తగిలింది.  ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌లోనే ఎంతోకొంత బ‌ల‌మున్న బీజేపీ ఇప్పుడు అక్క‌డ కూడా చ‌తికిల ప‌డుతోంది. మోదీ ఇమేజ్ డ్యామేజ్ అవ‌డ‌మే ఇందుకు కార‌ణం అంటున్నారు. ద‌క్షిణాదిన ఇప్ప‌ట్లో పువ్వు గుర్తు అధికారంలోకి రాలేద‌ని.. తాజా ఎన్నిక‌ల‌తో తేలిపోయింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫ‌లితాల‌తో.. ఇక సౌత్‌పై కాషాయం ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే.  అటు, ఉత్త‌రాదిలోనూ బీజేపీ ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. గెలుస్తామ‌నుకున్న బెంగాల్‌లో.. బెంబేలెత్తిపోయింది బీజేపీ. మోదీ, అమిత్‌షా, జేపీ న‌డ్డాలు.. ముగ్గురూ క‌లిసి దాదాపు 100 వ‌ర‌కూ ఎన్నిక‌ల ర్యాలీలు నిర్వ‌హించగా.. జ‌స్ట్‌, వీల్ ఛైయిర్‌లో కూర్చొని, త‌న‌పై దండెత్తి వ‌చ్చిన క‌మ‌ల‌దండును దంచికొట్టింది దీదీ. బెంగాల్ టైగ‌ర్ పంజా దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మ‌మ‌త బ‌ల‌మెంతో క‌మ‌ల‌నాథుల‌కు తెలిసొచ్చేలా చేసింది.   యూపీలోనూ కాషాయం వెల‌వెల‌పోతోంది. హిందుత్వ నినాదం పాత చింత‌కాయ ప‌చ్చ‌డిగా మారింది. మోదీ మాట‌ల‌ను, యోగి చేష్ట‌ల‌ను.. ఎల్ల‌ప్పుడూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. యూపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో ప‌రాభ‌వ బారంతో కుమిలిపోతున్నారు కాషాయ శ్రేణులు. ఇక‌, ఢిల్లీలో కేజ్రీవాల్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పంజాబ్‌లో కెప్టెన్ సాబ్ క‌ర్చీఫ్ వేసుకున్నారు. రాజ‌స్థాన్, గుజ‌రాత్‌లో 50-50. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన పాగా. ఇలా లెక్కేస్తూ పోతే.. చిన్నా చిత‌కా రాష్ట్రాలే క‌మ‌లం ఖాతాలో క‌నిపిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల‌న్నీ ప్రాంతీయ పార్టీలో జాబితాలో చేరిపోయాయి. మరో ఏడెనిమిది నెలల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నిక‌లు.. వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ, అమిత్ షా నాయకత్వానికి మరింత అగ్నిపరీక్షగా మారతాయనడంలో సందేహం లేదు.  మాట‌లు త‌ప్ప మోదీ చేసేదేమీ లేద‌నే అభిప్రాయానికి ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన‌ విభ‌జ‌న హామీలేవీ నెర‌వేర్చ‌న‌ప్పుడే మోదీ మాట మీద నిల‌బ‌డే మనిషి కాద‌ని తేలిపోయింది. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేస్తున్నా మౌనంగా ఉంటుండ‌టం ఆయ‌న హోదాకే మ‌చ్చ తెస్తోంది. ఇక‌, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో మోదీ అవ‌లంభిస్తున్న‌ ఉదాసీన వైఖ‌రి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. దేశ ప్ర‌జల ప్రాణాలు బ‌లిపెట్టి.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం.. విదేశాల‌కు వ్యాక్సిన్ ఎగుమ‌తి చేశార‌నే అప‌వాదు ఆయ‌న్ను వెంటాడుతూనే ఉంది. వీడియో ప్ర‌సంగాలు మిన‌హా.. కొవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌ధాని చేసిందేమీ లేద‌నే అభిప్రాయం దేశ ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింది. అందుకే, ఎక్క‌డ‌, ఎలాంటి ఎన్నిక‌లు జ‌రిగినా.. వాటిలో బీజేపీకి ప‌రాభ‌వ‌మే ఎదుర‌వుతోంది. యావ‌త్ దేశాన్ని కాషాయమ‌యం చేయాల‌నే క‌మ‌ల‌నాథుల క‌ల‌.. క‌ల్లే కానుంది. యావ‌త్ దేశం నుంచి కాషాయ పార్టీ తుడుచుకుపెట్టుకు పోయే ప‌రిస్థితి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు మోదీ.. ఒట్టి మాట‌లు క‌ట్టిపెట్టి.. గ‌ట్టి మేలు త‌ల‌పెట్ట‌వోయ్‌...

పీఎంవో వేస్ట్.. గడ్కరీ బెస్ట్! బీజేపీ నేత సంచలనం

దేశంలో కరోనా మహ్మమారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ లో దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందుక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్స్ లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని అంతర్జాతీయ మీడియా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది. మన దేశంలోని విపక్షాలు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తాజాగా మోడీపై సొంత పక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర సర్కార్ తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం అనవసరమని.. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని చెప్పారు. పీఎంఓపై ఆధారపడటం దండగని అన్నారు సుబ్రహ్మణ్యస్వామి.  అయితే తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని... ప్రధాని మోదీని కాదని వివరణ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. హర్షవర్ధన్ తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు. మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని స్వామి హెచ్చరించారు. ఈ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని... ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు సుబ్రహ్మణ్యస్వామి. 

నర్సు పై.. డాక్టర్..  

అది తెలంగాణ. జగిత్యాల జిల్లా. అది ఓ ప్రైవేటు అసుపత్రి. ఆ డాక్టర్ పేరు రాజేష్. మూడు నెలల క్రితం జగిత్యాల పట్టణంలో ఓ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ మధ్యనే కోవిడ్ ఆసుపత్రిగా అనుమతులు లభించాయి. సదువుకున్నోడి కంటే ఆడు ఎవడో మేలు అన్నట్లు..  గీ.. డాక్టర్ చదువైతే సదివిండు గానీ..  వాడి ముద్ది మాత్రం గడ్డి తినింది. మెదడు మోకాళ్ళలో ఉంది. అందుకే వాడికి ఆడోళ్ళ వాసనా కావాల్సి వచ్చింది ఆ దరిద్రపు గొట్టు డాక్టర్ కు. అందుకోసం అక్కడ ఇక్కడ ఎందుకని ఆసుపత్రిలో పని చేస్తున్న సాటి నర్సు పైనే  ఆ డాక్టర్ పాపపు కండ్లు పడ్డాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి.​ నర్సు కొవిడ్ పేషంట్లకు సంబంధించిన పరీక్షల రిపోర్టులను వైద్యుడు రాజేష్‌కు చూపించేందుకు గదిలోకి వెళ్ళింది. అంతటితో ఇదే అదును అని పసిగట్టిన ఆ కామాందుడు. నర్సుతో నీకు జీతం ఎంత ఇస్తున్నారని, ఇంతకంటే ఎక్కువ జీతం ఇప్పిస్తానని చెప్పి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.  కట్ చేస్తే.. ఆ  వైద్యుడి పై, నర్సు కోరుట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు డాక్టర్ ఆణిముత్యం పై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రోజున సినాఫ్ ఎఫెన్స్ క్రింద డిఎస్పీ ఆసుపత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేసే నర్సు పైనే వైద్యుడు ఇలా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది, రోగులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఏమున్నది గర్వకారణం.. నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, అక్రమాలు తప్పా.. సవుడుకున్నోడికి సదువుకోనోడికి తేడాలేకుండా పోయింది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే అన్ని మర్చిపోతారు పోరికిగాళ్ళు.. పోరంబోకులు. తమ అక్క తమ చెల్లి ఒక ఆడదే కదా అని మరిచిపోతారు. మృగంలా పై బడుతారు.   

మరాఠీలకు నో రిజర్వేషన్..  

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠి సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ వార్త తో మహారాష్ట్రలోని మరాఠి ప్రజలు ఒక్కసరిగా కలత చెందారు. గతంలో రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని హై కోర్టు తెలిపింది. 2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే, కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది. ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మారాఠాలకు రిజర్వేషన్‌ కల్పించారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. గతంలో పార్లమెంటు చేసిన ఓ సవరణ ప్రకారం.. ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితా(ఎస్‌ఈబీసీ)లో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని.. అనంతరం రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది. ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాలపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని.. వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. మండల్‌ తీర్పుగా పేరొందిన ఇందిరా సాహ్నీ తీర్పు (1992)ను  పునఃసమీక్షించాల్సిన అసవరం కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. కోర్టు నిర్ణయం పై మరాఠీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అభివృద్ధికి మరింత దూరం అవుతామని ఆవేదన చెందుతున్నారు.   

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్‌! పోలీసుల‌కు ఫుల్ ప‌వ‌ర్స్‌.. హైకోర్టు సీరియ‌స్‌..

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్ పెట్టండి. నైట్ క‌ర్ఫ్యూ వేళ‌లు పొడిగించండి. ఈ నెల 8వ లోగా నిర్ణ‌యం తీసుకోండి. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌న్నింటినీ ప‌రిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఇక‌పై రోజుకు లక్ష కొవిడ్ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, మందుల‌ ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలని.. వాటిపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు కోర్టుకు సమర్పించాలి. శ్మశాన వాటికలు, సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి. ఆస్పత్రుల ద‌గ్గ‌ర‌ పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరించనివారి వాహనాల జప్తు అంశాన్ని పరిశీలించాలి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలి. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   మరోవైపు కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్‌, 1,523 ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతికదూరం పాటించని సంస్థలపై కేసులు పెడుతున్నామని.. భౌతికదూరం పాటించని వ్యక్తులపై కాదన్నారు. ఇప్పటి వరకు ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు డీజీపీ.  పేరంబుదురు నుంచి ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని విచారణ సందర్భంగా డీహెచ్‌ శ్రీనివాస్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది. చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది. క‌రోనా క‌ట్ట‌డికి హైకోర్టే రంగంలోకి దిగ‌డం.. ప‌లు ఆదేశాలు ఇవ్వ‌డంతో.. స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

ఈటల రాజేందర్ బ్యాక్ స్టెప్! 

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో రగిలిపోతున్న ఈటల... కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈటల మద్దతుదారులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈటల సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు. రాజేందర్ కూడా హుజురాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో .. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కారు సింబల్ తో గెలిచిన పదవి తనకు అక్కర లేదని ఈటల చెప్పడంతో.. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం ఖాయమని అంతా భావించారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన తర్వాత సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈటలను కలిసిన మద్దతుదారులు.. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు చెప్పారని తెలుస్తోంది. రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు కోరితే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని మరికొందరు సూచించారట. ప్రభుత్వం ఏం చేయబోతోంది, కేసీఆర్ వ్యూహం ఏంటన్నదాని కోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తే బెటరని మరికొందరు నేతలు సూచించారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంలో ఈటల రాజేందర్ కూడా పునరాలోచన చేస్తున్నారని  తెలుస్తోంది. హైదరాబాద్ కు వెళ్లి మరికొందరు నేతలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయబోవడం లేదనే ఎక్కువ మంది ఈటల మద్దతుదారులు చెబుతున్నారు.  తన నియోజకవర్గ నేతలతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా ఇదే రకమైన సంకేతం ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని ఈటల రాజేందర్ చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.  రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతానని.. వాళ్ళతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని.. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు. 

కరోనా.. మరణాలకు వారే కారణం..హై కోర్టు  

దేశం లో కరోనా మరణాలు చూసి ఆ యముడి హృదయం అయినా కరిగిపోతాడేమో గానీ, మన పాలకులు హృదయాలు మాత్రం కదలడం లేదు. ఈ విషయంలో లో దేశ నాయకులు కసాయి వారైతే. మన తెలుగు రాష్ట్ర నాయకులు ఆ కసాయి వారి బాబులు అని చెప్పాలి. ఆక్సిజన్ లేక, కళ్ళల్లో జీవకల లేక ఏమిచేయలేక కరోనా బాధితులు పిట్టలా రాలిపోతున్నారు. ఈ నేపథ్యం లో మొన్నటికి మొన్న చైన్నై హై కోర్టు కలగా చేసుకుని. కరోనా కేసులు పెరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం పై సంచల కామెంట్స్ చేసింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సంచలన వ్యాఖ్యానాలు చేసింది.    కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణహోమం వంటిదేనని, ఆ పాపం పాలకులడే అని.. ఆ మరణాలకు బాధ్యతని పాలకులడే అని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్య అని. ప్రజా ఆరోగ్యం మీద పాలకులకు చిత్త శుద్ధి లేకపోవడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. సప్లయ్ చైన్ ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని తేల్చిచెప్పింది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించింది.లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది. ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. కరోనా మరణాల పట్ల మేము కలత చెందుతున్నాం అని. ఇది నిజంగా మారణహోమం కన్నా తక్కువేమీ కాదు. కసాయి తనమే అని చెప్పింది. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలో గుండె మార్పిడి చికిత్సలు, మెదడు ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్న వేళ, సాధారణ జబ్బుతో రోగులు మరణించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కోర్టులు కల్పించుకోబోవని, కానీ వార్తలు చూస్తూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూస్తూ, దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎలా తోసి పుచ్చగలమని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్నో, మీరట్ కలెక్టర్లు వెంటనే స్పందించి, తమ నివేదికలను 48 గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.           

ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా?

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈటలకు మద్దతుగా విపక్ష నేతలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తన అవినీతికి సహకరించడం లేదనే తొలగించారని ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర మంత్రులనుతొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేందర్ కు మద్దతుగా బీసీ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందిస్తున్నారు ఈటల రాజేందర్. మూడు రోజులుగా హుజురాబాద్ లో ఉన్న ఈటన తన అనుచరులు, బీసీ సంఘాలు, కలిసి వచ్చే నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు రాజేందర్. కేసీఆర్ ను టార్గెట్ పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల వివాదంలో మరో కొత్త నినాదం తెరపైకి వచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ కూడా రాజీనామా చేయాలని ఈటల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హుజురాబాద్‌‌లో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే అసలు ఓనర్ ఎవరో తెలుస్తుందని... ఎవరు గెలిస్తే వారే నిజమైన ఓనర్లని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్, ఈటల ఇద్దరిదీ ఒకే స్థాయి అని చెప్పుకొచ్చారు. కాగా తమ నేతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఈటలకు లేదని మద్దతుదారులు స్పష్టం చేశారు. దీంతో ఈటల అనుచరుల డిమాండ్  ప్రకారం గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.  ఉద్యమ సమయంలో చాలా సార్లు కేసీఆర్ రాజీనామా చేశారు. విపక్షాల సవాల్ చేసిన వెంటనే స్పందించి తన పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, ఈటల అనుచరుల డిమాండ్ మేరకు కేసీఆర్ .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.