టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత
posted on May 3, 2021 @ 2:24PM
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. సబ్బం హరిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి పూర్తిగా విషమించి.. సోమవారం మధ్యాహ్నం సబ్బం హరి చనిపోయారు. సబ్బం హరి మరణంతో టీడీపీలో విషాదం అలుముకుంది. హరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఏప్రిల్ 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అప్పటికీ కోలుకోకపోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.69 ఏండ్ల సబ్బం హరికి భార్య ,ముగ్గురు పిల్లలు. తాను రాజకీయాల్లో ఉన్న పిల్లలను మాత్రం పాలిటిక్స్ కు దూరంగా ఉంటారు సబ్బం హరి. రాజకీయాల్లో అవినీతికి దూరంగా ఉన్నారనే పేరు సబ్బం హరికి ఉంది.
జూన్ 1, 1952 న విశాఖపట్నంలో జన్మించారు సబ్బం హరి. తగరపువలస సమీపంలోని చిట్టివలస ఇతడి సొంతూరు. నాన్న బంగారునాయుడు. అమ్మ అచ్చియ్యమ్మ. ఆరుగురి తర్వాత ఆఖరివాడు హరి. సొంతూరులోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఇంటర్ ఏవీఎన్ కళాశాలలో చేరారు. అక్కడే డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 1985లో విశాఖ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు సబ్బం. 1989 ఎన్నికల్లో విశాఖలో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించారు.1995లో కార్పొరేటర్ గా గెలిచి విశాఖ మేయగ్ ఎన్నికయ్యారు. మేయర్ లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు సబ్బం హరి
కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు సబ్బం. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను ధిక్కరించి వేరు కుంపటి పెట్టిన సందర్భంలో, ఓదార్పు యాత్రలో ఆయన వెన్నంటి ఉన్నారు. అయితే.. ఆ తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సబ్బం హరి బద్ధ శత్రువుగా మారారు. చాలా కాలం పాటు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2019లో టీడీపీలో చేరారు సబ్బం హరి.
గత ఎన్నికల్లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు సబ్బం హరి. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ యాక్టివ్ గా ఉంటున్నారు. అమరావతి, మూడు రాజధానుల ప్రతిపాదన, ఇసుక మాఫియా, మద్యం పాలసీ, వాలంటరీ వ్యవస్థ. .ఇలా అన్ని అంశాలపై సబ్బం హరి గట్టిగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఆదర్శ నేతగా ఉన్న సబ్బం హరి... ముక్కుసూటిగా మాట్లాడుతారనే టాక్ ఉంది. తప్పు అని తెలిస్తే.. సొంత మనుషులను కూడా ఆయన వ్యతిరేకిస్తారని చెబుతారు.