సెంటిమెంట్‌తో సారుకు షాక్? ఈటల సినిమా చూపిస్తారా?
posted on May 3, 2021 @ 4:54PM
అయ్యో పాపం ఈటల రాజేందర్. ఆయనకు కేసీఆర్ ఎంత అన్యాయం చేస్తున్నారు. ఆ బక్క మనిషిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్నాళ్లూ తన చుట్టూ తిప్పుకొని.. ఇప్పుడు కరివేపాకులా ఎలా తీసిపాడేశాడో. అబ్బో కేసీఆర్ మహా ఖతర్నాక్. పాపం రాజేందర్‌కు ఎంత అన్యాయం జరిగిందో. కేసీఆర్ ఎంత ఆయనకు ఎంత అన్యాయం చేశాడో. భూములు ఆక్రమించుకున్నాడట. ఇప్పటి వరకూ ఎవరూ భూములు కబ్జా చేయలేదా? ఈటలనే టార్గెట్ చేయాలా?.. ఇలా మూడు రోజులుగా తెలంగాణలో ఒకటే చర్చ. ఈటల టాపిక్‌పైనే రచ్చ.
ఈటల రాజేందర్‌కూ కావలసింది ఇదే. ఇలాంటి చర్చే ఆయన కోరుకుంటున్నారు. ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి సానుభూతి రావాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్టే.. పక్కా కథ, కథనం, స్క్రీన్‌ప్లేతో రాజకీయం రక్తి కట్టిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఈటల ముందే ఊహించిన దాని ప్రకారమే కేసీఆర్ నడుచుకుంటున్నారు. యాక్షన్ కేసీఆర్‌దిలా కనిపిస్తున్నా.. డైరెక్షన్ మాత్రం పక్కా ఈటలదే అంటున్నారు విశ్లేషకులు.
ఈటలపై పింక్ మీడియాలో మొదట బ్రేకింగ్ న్యూస్ నడిచింది. ఆ తర్వాత ఆయనపై విచారణ మొదలైంది. ఆరోగ్య శాఖను లాగేసుకున్నారు. అయినా, మంత్రి పదవిని వీడకపోవడంతో ఈటలను రాత్రికి రాత్రే కేబినెట్ నుంచి గెంటేశారు. అంతా పక్కా ప్లాన్డ్‌గా లేదూ.
మరి, ఈటల అంతటి వాడిని అలా నిర్దాక్షినంగా వెళ్లగొట్టడం కేసీఆర్‌కు ఏమైనా సరదా? అందుకు, పెద్ద కారణమే ఉండి ఉంటుందిగా? అదేంటో కేసీఆర్ అంతరాత్మకే తెలుసంటున్నారు ఈటల. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈటల చక్రం తిప్పారని.. మంత్రివర్గ సమావేశ సారాంశాన్ని ఎప్పటికప్పుడు బయటకు లీక్ చేసేవారని.. సహచరులు, అధికారుల దగ్గర కేసీఆర్‌ను కించపరుస్తూ మాట్లాడేవారని.. ఇలా ఈటల రాజేందర్ వ్యవహార శైలి ఉండేదని అంటున్నారు. అందుకే, చాలా కాలంగా గులాబీ బాస్‌పై రెబెల్ జెండా ఎగరేస్తూ వచ్చారు ఈటల. ఇంత కాలానికి అది క్లైమాక్స్‌కి చేరింది. కేసీఆర్ యాక్షన్ ఇలానే ఉంటుందని ఈటలకు బాగా తెలుసు. అందుకే, తనపై దేవరయాంజిల్ భూముల అక్రమాలంటూ కేసులు పెడతారని ఆయన ముందే చెప్పారు. త్వరలో తాను పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనా కేసులు బనాయిస్తారని చెబుతున్నారు. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసునని.. అయినా తాను భయపడే మనిషిని కాదంటూ సుతిమెత్తగా సవాల్ చేశారు.
కేసీఆర్‌ను పైకి పల్లెత్తు మాట కూడా అనకుండా.. సందర్భం కాకున్నా, అవసరం లేకున్నా.. గులాబీ బాస్‌ను పొగుడుతూ.. పక్కా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ ధర్మాన్ని నమ్మాడు, ప్రజలను నమ్మాడు.. అంటూ పొగిడుతూనే.. అంతలోనే ఖతర్నాక్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఈటల. ప్రేమతో లొంగదీసుకుంటే లొంగేవాడిని. భయపెడితే లొంగేవాడిని కాదంటూ.. కేసీఆర్‌పై ఈటెల్లాంటి పదునైన మాటలు సంధించారు ఈటల రాజేందర్. కోర్టులు, చట్టం అంటూ ఏవేవో చెప్పినా.. ఏం చేసుకుంటావో చేసుకో..పో.. అన్నట్టుగా మాట్లాడారు ఈటల రాజేందర్. తాను జీరో నుంచి వచ్చానని.. అవసరమైతే తాను మళ్లీ జీరో నుంచి మొదలుపెడతానని.. పరోక్షంగా హెచ్చరించారు.
స్వతహాగా విప్లవ భావాలు, ఉద్యమ ఆశయాలు కలిగిన ఈటల రాజేందర్ తెలంగాణపై తనదంటూ ఓ ముద్ర ఉండాలని తహతహలాడుతున్నారు. ఎన్నాళ్లైనా కేసీఆర్ కిందే ఉండాలా.. తనకంటూ ప్రత్యేకత ఉండొద్దా.. అనే ఆలోచనా ధోరణిలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. వేరే పార్టీలో చేరేకన్నా.. త్వరలోనే ఆయన సొంత పార్టీతో తెలంగాణ ప్రజల ముందుకు వస్తారని అంటున్నారు. ముదిరాజ్ ముద్రతో బీసీల రాజ్యాధికార స్వప్నం నెరవేరుస్తానంటున్నారు. తన భార్య సామాజిక వర్గమైన..రెడ్డి.. అండదండలూ తనకు లభిస్తాయని ధీమాగా ఉన్నారు. అందుకే, తన కొడుకుని నితిన్‌రెడ్డి పేరుతో సమాజానికి పరిచయం చేశారు ఈటల రాజేందర్ ముదిరాజ్. మరి, ఈటల రాజకీయ ఎత్తుగడ ఫలిస్తుందా? లేక, మరో దేవేందర్‌గౌడ్‌లా చరిత్రలో మిగిలిపోతారా? ఇలా, ఈటల ఎపిసోడ్‌తో తెలంగాణ రాజకీయ భవిష్యత్తు రంజుగా మారబోతోంది.