బీజేపీది బలుపా? వాపా? బండి వల్లే ఓటమా?
posted on May 3, 2021 @ 11:05AM
దుబ్బాకలో దుమ్మురేపింది. జీహెచ్ఎమ్‌సీలో ఝలక్ ఇచ్చింది. ఇక తెలంగాణ గడ్డ.. బీజేపీ అడ్డా.. అనుకున్నారు అంతా. కానీ, అంతలోనే బీజేపీ అధ్యక్షుని పొలిటికల్ హనీమూన్ పీరియడ్ ముగిసింది. హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కోల్పోయింది. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడిక నాగార్జున సాగర్‌లో ఏకంగా డిపాజిటే గల్లంతైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న జాతీయ పార్టీకి ఇది ఘోర పరాభవమే. ఇక ఆ పార్టీ ఆశలు అడియాశలేనా? తెలంగాణలో బీజేపీ అందలమెక్కడం అంత ఈజీ కానే కాదా? కేసీఆర్ చాణక్యం ముందు కమల వ్యూహాలు వర్కవుట్ అవడం లేదా? అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి బలమా? బారమా? ఇలా, కాషాయపార్టీ భవిష్యత్‌పై అనేక అనుమానాలు మొదలయ్యాయి.
నాగార్జున సాగర్ ఓటమిని పూర్తిగా బండి సంజయ్ ఖాతాలోనే వేస్తున్నారు విశ్లేషకులు. బీజేపీ అభ్యర్థిగా రవి నాయక్ ఎంపిక చేసిన నాడే ఆ పార్టీ ఓడిపోయిందని అంటున్నారు. రెడ్లు, యాదవుల హవా ఉన్న జనరల్ స్థానంలో ఎస్టీని బరిలో దింపి.. సాగర్‌ను రాజకీయ ప్రయోగశాలగా మార్చేసింది. ఇప్పుడిప్పుడే బీజేపీ హవా పెరుగుతున్న సమయంలో.. నాగార్జున సాగర్ ఎన్నికల్లో సత్తా చాటాల్సింది పోయి.. ఇలా డిపాజిట్ కూడా రానంత ఘోరంగా ఓడిపోవడం ఆ పార్టీకి తీరని లోటు.. రాజకీయంగా చేటు..
బీజేపీ అభ్యర్థి రవి నాయక్ అనగానే.. కేడర్‌లో తీవ్ర నిరుత్సాహం. ఓవైపు జానారెడ్డి, భగత్‌లాంటి బలమైన నాయకులు, సామాజిక వర్గం బరిలో ఉన్న చోట.. రాజకీయంగా కీలక ప్రభావం చూపే సమయంలో.. పేలవమైన అభ్యర్థిని ఎంపిక చేసి బండి సంజయ్ పెద్ద తప్పిదమే చేశాడని అంటున్నారు. అందుకే, ప్రచార సమయంలోనూ బీజేపీ జోష్ ఎక్కడా కనిపించలేదు. కమలనాథులు ముందే ఓటమిపై అంచనాకు వచ్చేశారంటున్నారు. ఫలితాలూ వాళ్లు ఊహించిన దానికంటే దారుణంగా రావడం బీజేపీలో చర్చనీయాంశమైంది.
అలుపెరగని పోరాటమే బీజేపీ బలం. ఎంత చిన్న ఎలక్షనైనా.. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతుంది కమలదళం. కేరళ, తమిళనాడు, బెంగాల్‌లో అదే జరుగుతోంది. తెలంగాణలో ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే బీజేపీదే ఈ రాష్ట్రమనేది ఢిల్లీ నేతల ధీమా. దుబ్బాక గెలుపు ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. బలమైన అభ్యర్థి రఘునందన్‌రావు పోటీలో ఉండటంతో గెలుపు సునాయాసమైంది. దుబ్బాక దూకుడు ఇచ్చిన స్పూర్తితో జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లో మరింత కష్టపడ్డారు కమలనాథులు. స్వతహాగా గ్రేటర్ పరిధిలో బీజేపీ బలంగా ఉండటం.. ఎలక్షన్ సమయంలో వరదలు ముంచెత్తడం.. సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యంతో.. వ్యతిరేక ఓటు అంతా బీజేపీ వైపు మళ్లింది. మేయర్ పీఠం దక్కకున్నా.. మెజార్టీ స్థానాలతో దాదాపు గెలిచినంత పని చేసింది బీజేపీ. బండి సంజయ్ సారధ్యంలోనే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడంతో.. ఆ క్రెడిట్ అంతా బండి ఖాతాలో చేరింది. బండి.. మొనగాడంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీదే గెలుపంటూ ప్రచారం మొదలైంది.
కట్ చేస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలోనైతే ఏకంగా నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. కనీసం కోదండరాంకు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు వచ్చినన్ని నోట్లు కూడా రాలేదు బీజేపీకి. దుబ్బాక, గ్రేటర్ విజయ పరంపరతో విర్రవీగుతున్న కమలనాథులకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. బండి సంజయ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పోయిన పరువు తిరిగి దక్కించుకోవడానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రూపంలో మంచి ఛాన్స్ వచ్చింది. అంది వచ్చిన అవకాశాన్ని.. మొదట్లోనే నేలపాలు చేసుకున్నారు కమలనాథులు. కేండిడేట్ ఎంపిక నుంచి.. ప్రచారం వరకూ అన్నిట్లోనూ విఫలం చెందారు. అందుకే.. ఈ ఓటమిని సైతం బండి సంజయ్ ఖాతాలోనే వేస్తున్నారు.
దుబ్బాకలో రఘునందన్ హవా, గ్రేటర్‌లో బీజేపీ ఓట్ బ్యాంక్‌తోనే కమలం పార్టీ సత్తా చాటిందే కానీ.. అందులో బండి గొప్పతనం ఏమీ లేదంటూ విమర్శలు మొదలైపోయాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి, సాగర్‌లో డిపాజిటే రాకుండా ఘోర పరాభవంతో పాటు.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలోనూ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు. ఇదంతా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ వైఫల్యమేనని భావిస్తున్నారు. బండి సంజయ్ నోటి దురుసుతనం, సిల్లీ పాలి..ట్రిక్స్, నాయకత్వ లోపం, మిగతా బీజేపీ అగ్ర నాయకత్వంతో కలుపుగోలుతనం లేకపోవడం లాంటి కారణాలు బీజేపీకి మైనస్‌గా మారాయని అంటున్నారు. ఇటీవల గ్రేటర్‌లో బండిని కాదని స్థానిక బీజేపీ నాయకత్వం నేరుగా కేటీఆర్‌ను కలిసి కార్పొరేషన్ ఉప ఎన్నికలో ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్త చేయడం.. బండిపై తిరుగుబాటు జెండా ఎగరవేయడమే అంటున్నారు. స్థానిక కేడర్‌పై ఆయనకు పట్టు లేకపోవడంతో పాటు నాయకత్వ లోపమే ఇందుకు కారణం అని చెబుతున్నారు. బీజేపీని విపరీతంగా అభిమానించే.. పవన్ కల్యాణ్ సైతం.. తెలంగాణ బీజేపీని తీవ్రంగా విమర్శించారంటే అందుకు బండి సంజయ్ అడ్డగోలు విధానాలే కారణమని అంటున్నారు. గిట్లైతే.. తెలంగాణలో బీజేపీ గెల్చుడు కష్టమే. అందుకే, నాగార్జున సాగర్ ఎన్నిక ఫలితం.. బీజేపీలో అంతర్‌మథనానికి.. బండి నాయకత్వంపై చింతన్ బైఠక్‌కు దారి తీస్తోంది.