ఐపీఎల్ టోర్నీ రద్దు! ఐదుగురికి కరోనా నిర్దారణ
posted on May 3, 2021 @ 4:45PM
ఐపీఎల్ టోర్నీపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కలకలం రేగింది. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.
పాజిటివ్ వచ్చిన ముగ్గురికి మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ఫలితాలను రెండుసార్లు నిర్ధారించుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తోందని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. తదుపరి పరీక్షలు నిర్వహించేంత వరకు ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్టు అధికారులు చెప్పారు. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు చివరగా గత శనివారం ముంబయి ఇండియన్స్ తో తలపడింది.
ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడినా, ఆ తర్వాత వారు కోలుకున్నారు. తాజాగా టోర్నీ మధ్యలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మరోసారి కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తానికి కరోనా టెస్టులు నిర్వహించారు. కోల్ కతా జట్టులో కరోనా కలకలం రేగడంతో సోమవారం జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేశారు.
ఇదే తీరులో మరో రెండు, మూడు జట్లలో కరోనా కేసులు వస్తే టోర్నీ నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి క్రికెటర్లను అత్యంత కఠినమైన బయో బబుల్ లో కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఆటగాళ్లకు కరోనా సోకుతుండడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఐపీఎల్ ను రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. విదేశీ ఆటగాళ్లు కూడా భయాందోళనలో ఉండటంతో ఐపీఎల్ నిర్వహించడం కష్టమేనని తెలుస్తోంది.