బీజేపీ కథ మళ్లీ మొదటికి! వర్గ పోరే కారణమా?
దుబ్బాక గెలుపు ఊపు నిచ్చింది. హైదరాబాద్ విజయంతో జోష్ పెరిగింది. ఇక, తెలంగాణలో, తెరాసకు ప్రత్యాన్మాయం బీజేపీనే, అని అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు, సామాన్య ప్రజలు కొంతవరకు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో, ఇక పార్టీ పరుగులు తీస్తుందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని కూడా, అనుకున్నారు. బండి సంజయ్ అయితే, తెరాసను గద్దె దింపుతామని బల్లగుద్దారు.
అయితే ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం (హైదరాబాద్)లో బీజేపీ ఓడిపోయింది. మరో స్థానం (ఖమ్మం) లో ఎక్కడో నాలుగో స్థానానికో అయిదో స్థానానికో పడిపోయింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి డిపాజిట్ గల్లంతయింది. అలాగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇతర నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ కమలం కనీసం గౌరవప్రదమైన ఓటమికి కూడా నోచుకోలేదు. ఎక్కడా పట్టుమని పది సీట్లు గెలవలేదు. అంటే, బీజేపీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
ఇవన్నీ ఒకెత్తు అయితే, పార్టీలో, అంతర్గత విబేధాలు బుసలు కొడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, అనుకూల వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలి పోయిందా అనేవిధంగా, రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. అంతే కాదు, తెరాస అనుకూల వ్యతిరేక వర్గాలగానూ పార్టీలో కొందరు అటూ కొందరు ఇటూ అన్నట్లుగా వ్యవహరించి పార్టీకి తలవంపులు తెస్తున్నారు.ముఖ్యంగా జీహెచ్ఎంసిలో లిగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక, విషయంలో తలెత్తిన వివాదం, చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకగ్రీవం చేయాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సహా కొందరు నాయకులు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్’ను కలవడంతో మొదలైన బండి వర్సెస్ స్టొరీ చివరకు సిట్టింగ్ స్థానంలో బీజేపీ ఓడిపోవడంతో మరో మలుపు తిరిగింది.
అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, ఒక్క నాగర్జున సాగర్ మినహా ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా, గొప్పగా జెండా ఎగరేయలేదు. మరో వంక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్’కు గురైన అధికార తెరాస, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికట్టి, దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, కారు పార్టీ ఎన్నికల స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు, మున్సిపల్ ఎన్నికల వరకు పార్టీని విజయపధంలో ముందుకు నడిపించారు. అంతే కాదు, అదే ఊపులో, యువరాజ పట్టాభిషేకానికి అవరోధం అనుకున్న వారి అడ్డుతొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.అయితే అలాగని పార్టీలో, అంతా బాగుందని అనుకుంటే, అది పొరపాటే అవుతుంది.
గతంలో కేసీఆర్ అనేక మంది పార్టీ సీనియర్లను, చివరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంత కీలక పాత్రను పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ సహా అనేక మందిని ఇదే తరహాలో, ఇంతకంటే అవమానకంరంగా సాగనంపినా, ఎవరూ కూడా కేసీఆర్’ను రాజకీయంగా దేబ్బతీయలేక పోయారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరామ్ ఓడిపోయారు. అలాగే, తెరాస నుంచి వెలికి గురై సొంత కుంపట్లు పెట్టుకున్నవారు కానీ, ఇతర పార్టీలలో చేరినవారు కానీ, కేసీఆర్ నాయకత్వాన్ని సవాలు చేయలేక పోయారు. కానీ, మారిన పరిస్థితుల్లో ఈటల నాయకత్వంలో కీసీఅర్ వ్యతిరక శక్తులు అన్నీ ఏకమయ్యేందుకు, ఏకం చేసేందుకు జరుగతున్నప్రయత్నాలు ఫలిస్తే, రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేక పోలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఈటల కొత్త పార్టీ పెట్టినా, మరో జాతీయ పార్టీతో పొట్టు లేకుండా, తెరాస, కేసీఆర్’ను ఎదుర్కోవడం సాధ్యం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అదలా ఉంటే, ఈటల వ్యవహారం కూడా బీజేపీలో చిచ్చుకు కారణం అయింది. ఈటల వ్యవహారంలో పార్టీ సీనియర్ నాయకుడు, మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈటల పై వేటును పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షడు బండి సంజయ్ సహా పార్టీనాయకులు అందరు కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. ఈటలకు అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించారు. అయినా, మోత్కుపల్లి మాత్రం అందుకు విరుద్ధంగా, బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చినందుకు, ఈటల ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని పూజ చేయాలని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని, అన్నారు. అయన ఈటల తీరును తీవ్రం తప్పు పట్టారు. ఇలా పార్టీ విధానానికి విరుద్ధంగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని, కేటీఅర్’ను కలసిన నాయకులపై చర్యలు తీసుకున్నట్లుగానే మోత్కుపల్లి పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ క్రమశిక్షణ నిబంధనల విషయంలో కొంత కాలం పాటు, కొంత వెసులుబాటు ఇవ్వాలని అంటున్నారు.
ఇదిలాఉంటే, రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తోంది. గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, మొత్తంగా చూస్తే, దుబ్బాక ఊపు, జీహెచ్ఎంసీ జోష్ చల్లారి, పార్టీ ఇమేజ్ మళ్ళీ మొదటికి వచ్చిందని, కొందరు పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే, జాతీయ స్థాయి పరిణామలు, ముఖ్యంగా కొవిడ్కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక పోవడం, పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని పార్టీ సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ నాయకత్వం ఎరువు నేతల కోసం ఎదురు చూడకుండా,పార్టీని సంస్థాగతంగా, సిద్ధాంతపరంగా బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తేనే,ఎప్పటికైనా పార్టీకి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు.