ఆక్సిజన్ కొరతతో ఏపీలో మరణ మృదంగం!
posted on May 3, 2021 @ 4:54PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి వేగంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలను తీసేస్తోంది. ఇప్పటికే ఎందరో రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా కన్నుమూశారు. తాజాగా అనంతపురం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.
హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడంపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడం బాధాకరమని ఆమె అన్నారు. ఆక్సిజన్ అందించలేని స్థితిలో ఉన్న సీఎం జగన్ కు అధికారంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో హిందూపురం ఆసుపత్రిలో 12 మంది చనిపోయారని... మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లిలో కూర్చుని చోద్యం చూస్తున్నారని... ఇది సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఎంత మంది బలికావాలని ప్రశ్నించారు. అనంతపురం, కర్నూలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక 26 మందికి పైగా చనిపోయారని అన్నారు.
కరోనా సోకిందనే ఆందోళన కంటే ఆక్సిజన్ దొరుకుతుందా? లేదా? అనే ఆందోళనే ప్రజలకు ఎక్కువగా ఉందని సునీత అన్నారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం... మోసపూరిత మాటలతో రాజకీయ పబ్బం గడుపుకోవడంపైనే జగన్ దృష్టి సారిస్తున్నారని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటిలేటర్లను అందజేశారని... వాటిని ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. జగన్ ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని... తాడేపల్లి ప్యాలస్ ను దాటి ఆసుపత్రులను సందర్శించాలని చెప్పారు. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరతపై దృష్టిని సారించాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ ఆసుపత్రిలో ఒకే రోజు సుమారు 15 మంది చనిపోవడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తొలిసారిగా దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారన్నారు. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. రంగుల కోసం రూ.3000 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిందన్నారు. గోరంతల్ని కొండంతలుగా చేసి ప్రచారం నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి సాక్షిలో ఫుల్ పేజీ యాడ్స్ కోసం వందలకోట్లు దుబారా చేసిందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలన్నారు. బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.