చంద్రబాబు లేఖతో వరద ప్రభావిత ప్రాంతాలకు జగన్ పరుగు
posted on Jul 26, 2022 @ 12:19PM
ఏపీలో భారీ వర్షాలు, వరదలతో గోదావరి నది జిల్లాలకు జిల్లాలనే ముంచెత్తినప్పుడు నీరో చక్రవర్తిలా వ్యవహరించిన సీఎం జగన్.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు కోనసీమ జిల్లాకు పరుగులు పెట్టారు. పి.గన్నవరం, రాజోలు మండలాల్లో పర్యటించి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా, వరద బాధితులు కొందరితో ముఖాముఖి మాట్లాడారు. అంతకు ముందు వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొద్ది రోజుల క్రితం ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరిగి గాల్లోనే వెనక్కి వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితమే వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితులకు భరోసా కల్పించి వచ్చారు.
కాగా.. గోదావరి నదికి వరదలు భారీగా వస్తాయని కేంద్ర జలసంఘం ముందే హెచ్చరించినా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోలేదని చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. గోదావరి నది పరీవాహ ప్రాంతంలోని, ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని వరదలకు వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదని, సురక్షిత ప్రాంతాలకు ముందు తరలించలేదని విమర్శించారు. వరద బాధితులకు భరోసా కల్పించలేదని, వారిని ఆదుకోవడంలో దారుణంగా విఫలమైందని చంద్రబాబు తూర్పారపట్టారు. గోదావరి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు సరైన పరిహారం అందించి, ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఓ లేఖ రాశారు.
ఒక పక్కన వరద పీడిత ప్రాంతాల్లోని బాధితులు అన్నమో రామచంద్రా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో పాటు.. వైసీపీ సర్కార్ పైన, అధికారులు, ప్రజాప్రతినిధుల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మరో పక్కన బాధితులను వారి ప్రాంతాల్లోనే ముందే ప్రత్యక్షంగా పరామర్శించి, స్థానిక టీడీపీ నేతలు, శ్రుణులను సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని చంద్రబాబు పురమాయించారు. వరద నీటిలో, బురదలో కూడా చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లి మరీ బాధితులకు భరోసా ఇచ్చి వచ్చారు.
దీంతో పొలిటికల్ మైలేజ్ చంద్రబాబుకే వచ్చేస్తోందని భావించారో, లేదా ప్రజల్లో ఇప్పటికే తమ ప్రభుత్వంపై, పాలనపై గూడుకట్టుకున్న వ్యతిరేకత మరింతగా పెరిగిపోతుందనే భయంతోనో సీఎం కోనసీమ జిల్లాలో పర్యటనకు వెళ్లారు. అయితే.. సీఎం వెళ్లింది వరద పీడిత ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసేందుకు. కానీ వరద బీభత్సాన్ని, బురదతో నిండిన ప్రదేశాలను సీఎం కళ్లకు కనిపించకుండా అధికారులు, స్థానిక వైసీపీ నేతలు పరదాలు కట్టడం ఏంటని జనం ఎద్దేవా చేస్తున్నారు. నాయకుడంటే చంద్రబాబులా ఉండాలని, కష్టం వచ్చిన వెంటనే నేనున్నానంటూ తమ ముందుకు వచ్చినే వాడే అసలైన నేత అంటున్నారు.
కానీ.. సీఎం జగన్ లా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్క మొరిగిన చందంగా ఇప్పుడు పర్యటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హుద్ హుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన బాధిత ప్రాంతాల్లో వాలిపోయి, అక్కడే తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి మరీ సహాయక చర్యలను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక పక్కన తామంతా వరదల్లో అష్ట కష్టాలు పడుతుంటే.. సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో తమ పార్టీ నేతలతో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అనే, పొలిటికల్ మైలేజ్ ఎలా రాబట్టుకోవాలి, మళ్లీ అధికార పీటాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలనే విషయాలపై ఫోకస్ పెట్టిన వైనాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.