ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్ బంద్.. ఇది నిర్మాతల సమ్మె!
posted on Jul 26, 2022 @ 12:36AM
తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చే నెల 1వ తేదీ నుంచి స్తంభించిపోనుంది. ఒక విధంగా ఇది నిర్మాతల సమ్మె పిలుపని చెప్పవచ్చు. నిర్మాతల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ షూటింగ్ లు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. దీంతో పలు సినిమాల షూటింగ్ లు నిలిచిపోనున్నాయి.
వీటిలో ప్రధానంగా ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ నిలిచిపోతుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమౌతున్న ఈ సినిమాల షూటింగ్ నిలిచిపోతే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని సినీ రంగ ప్రముఖులు చెబుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. వాటి షూటింగ్ కూడా నిలిచిపోనుంది. ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు షటింగ్ మధ్యలో ఉన్నాయి అవి కూడా నిలిచిపోనున్నాయి.
గత కొంత కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకూ షూటింగ్ లు నిలిపివేయాలని మంగళవారం జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం నిర్ణయించింది. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రేక్షకులు సినిమా ధియోటర్ కు రావడం బాగా తగ్గిపోయిందని వారంటున్నారు. దానికి తోడు టికెట్ల ధరలు, ఓటీటీ, హీరోల రెమ్యూనరేషన్ వంటి సమస్యల కారణంగా తాము చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు చెబుతున్నారు.
దీంతో ఈ సమస్యల పరిష్కారం కోసం కొంత కాలం షూటింగ్ లు నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే తమ సమస్యలు పరిష్కారమౌతాని ఆశిస్తున్నామనీ, సమస్యలు పరిష్కారమయ్యాకా యథావిధిగా షూటింగ్ లు ప్రారంభిస్తామని ఎడిటర్స్ గిల్డ్ సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు చెప్పారు.