కోమటిరెడ్డి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఫిక్సయ్యిందా? అధిష్ఠానం నిర్ణయం ఏమిటో తేలిపోయిందా?
posted on Jul 27, 2022 6:57AM
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని ఓ సమెత ఉంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి విషయంలో ఆ సామెతనే నమ్ముకున్నట్లు ఉంది. ఇష్టారీతిగా పార్టీపైనా, పార్టీ అధిష్ఠానంపైనా వ్యాఖ్యలు చేస్తూ పోతున్న రాజగోపాలరెడ్డిపై క్రమశిక్షణా చర్యల విషయంలో టీపీసీసీ చీఫ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు. బుజ్జగించడానికి అన్నట్లు మల్లు భట్టి విక్రమార్క రాజగోపాలరెడ్డితో భేటీ అయినా భేటీ తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ రాజగోపాలరెడ్డి పార్టీని వీడినట్లేనని చెబుతున్నారు.
రాజగోపాల రెడ్డితో భేటీ అనంతరం భట్టి ఎవరి ఇష్టం వారిది, ఎవరి దారి వారిది అన్నట్లు మాట్లాడారు. ఇక భేటీ తరువాత రాజగోపాల రెడ్డి అయితే తన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడంపై కూడా పార్టీ వైఖరికి, విధానానికి విరుద్ధంగా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే సోనియా గాంధీని ఈడీ విచారించడానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఈ ఆందోళనలు ఎందుకు అన్న అర్ధం వచ్చేనా వ్యాఖ్యలు చేశారు. అసలు గత రెండేళ్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి పార్టని ఎప్పుడు వీడదానా అన్నట్లుగానే ఉంది. గతంలో కూడా ఒక సారి బీజేపీలో చేరేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లు బహిరంగంగానే ప్రకటించారు.
గత రెండేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ చేపట్టిన ఆందోళనల్లో కానీ పాల్గొన్న దాఖలాలు లేవు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం రాజగోపాలరెడ్డి పార్టీలో ఉన్నారంటే ఉన్నారంతే లా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇక తాజాగా ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీ తరువాత కాంగ్రెస కు గుడ్ బై చెప్పేందుకు డిసైడైపోయారు. మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకీ, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామా చేయాలన్న అమిత్ షా సూచన మేరకు అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగానే ఆయన ఈ సారి ఏకంగా సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీని ఈడీ విచారించడంలో తప్పేముందన్నట్లు మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మట్టి కరిపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలను ఖండించడం లేదు. వీహెచ్ వంటి వారు ఏవో ఓ రెండు మాటలు మాట్లాడి ఖండించినా.. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కానీ, రాష్ట్ర వ్యవహారల శాఖ ఇన్ చార్జ్ మాణికం ఠాకూర్ గానీ పన్నెత్తి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయనపై చర్య తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరనూ లేదు. అధిష్ఠానమే చూసుకుంటుంది అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు