విజయమ్మకు కొత్త కొలువు.. కుదురుకునేనా?
posted on Jul 26, 2022 @ 3:44PM
కొడుకు కొలువిచ్చి ఉద్దరిస్తాడనుకుంటే అవసరం తీరాక చెన్నపట్నం పంపాడట. అదుగో అలా ఉంది వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పరిస్థితి. తండ్రిబొమ్మని, అమ్మ గౌరవాధ్యక్ష పదవినీ అడ్డు పెట్టుకుని జనాన్ని ఆకట్టుకోవచ్చని రంగంలోకి దిగిన తర్వాత జగన్‌రెడ్డికి రాష్ట్రప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకున్నారు. మూడేళ్ల ప్రయాణం తర్వాత రైలు ఖర్చులు వృధా అయ్యాయని జనం తెలు సుకున్నారు. ఇంటా బయటా మెటికలు విరిచేవారి సంత ఎక్కువయి జగన్ ఉక్కిరి బిక్కిర వుతున్నారు. ఇక లాభం లేదని ఇంటా బయటా గెలవాలని అమ్మ విజయలక్ష్మిని గౌరవంగా చెల్లి షర్మిల వద్దకు ప్రయాణం కట్టించారు. కొడుకు రాజకీయా చాతుర్యం నుంచి ఎలాగో తప్పించుకుని కుమార్తె నొసట విరుపుల నీడలోకి చేరింది వై.ఎస్.విజయలక్ష్మి. కానీ ఇక్కడా ఏదో టిఫిన్ చేస్తూ కబుర్లు చెప్పడం తప్పమరేమీ ఆశించకని కుమార్తె చిన్నపాటి హెచ్చరికా చేస్తోంది.
వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి విజయమ్మ వైదొలిగిన అనంతరం ఆమె పూర్తిగా తన కుమార్తె తెలంగాణ లో ఏర్పాటు చేసిన వైఎస్సీర్టీపీకి ఆమె పరిమితమయ్యారు. అదీ ఆ పార్టీ ప్లీనరీ వేదికగాపై నుంచి రాజీ నామా చేస్తున్నట్లు గౌరవంగా ప్రకటించారు. మరోవైపు పక్క రాష్ట్రంలో తన కుమార్తె, వైయస్ఆర్ తెలం గాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఒంటరిపోరాటం చేస్తుంది.. ఆమెకు అండగా ఉండాలనుకొంటు న్నట్లు ఆమె ఇదే వేదికపై నుంచి చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా జులై 25న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ...రాజశేఖరరెడ్డిగారి భార్య విజయమ్మ...అలాంటి విజయమ్మగారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే అవుతోంది. పదవి ఆశించకుండా... రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పాలన మళ్లీ రావాలని నేను పని చేస్తానని చెప్పిన గొప్ప మనిషి విజయమ్మ... పదవులతో సంబంధమే లేదంటూ పేర్కొన్నారు. తాజాగా వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వైయస్ షర్మిల వ్యాఖ్యలతో.. తెలంగాణలో తన కుమార్తె స్థాపించిన వైయస్ఆర్‌టీపీకి గౌరవాధ్య క్షురాలిగా ఇకపై వైయస్ విజయమ్మ కొనసాగవచ్చుననే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమారుడు వైయస్ జగన్‌ను.. అధికారంలోకి తీసుకు వచ్చేందుకు.. ఓ తల్లిగా వైయస్ విజయమ్మ, సోదరిగా వైయస్ షర్మిల పడిన కష్టం ప్రతి ఒక్కరికి తెలిసేందే. అలాగే తెలంగాణలో కూడా తన కుమార్తె వైయస్ షర్మిలకు అధికారం అందేలా తాను సహకరిస్తే.. సరిపోతోందనే ఓ ఆలోచన వైయస్ విజయమ్మ ఉన్నట్లు ఆమె కుమార్తె వైయస్ షర్మిల వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందనే ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో నడుస్తోంది.
మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి వేదికగా జగన్ పార్టీకి రాజీనామా చేసే క్రమంలో వైయస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న తన కొడుకు వైయస్ జగన్‌కు అండగా ఉన్నాను.. ఇప్పుడు నా కూతురు కష్టాల్లో ఉంది... కాబట్టి ఆమెతో పాటు ఉండేందుకు వెళ్తున్నానంటూ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి. అలాగే లక్షల కోట్ల ఆస్తులున్న వైయస్ జగన్, వైయస్ షర్మిలలు ఏ రకంగా.. ఏ రకమైన కష్టాల్లో ఉన్నా రంటూ వైయస్ విజయమ్మను సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ వద్ద లక్ష కోట్లు ఉన్నాయంటూ ఓ వైపు ప్రచారం అయితే మోత మోగిపోతోంది. ఆ లెక్కన చూస్తే.. మహానేత వైయస్ఆర్ తనయ ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల వద్ద ఓ 10 వేల కోట్ల రూపాయిలు అయినా ఉంటాయని.... పోనీ కనీసంలో కనీసంగా వెయ్యి కోట్లు అయినా ఉంటాయని.. వాటితో ఈ భూమండలం మీద ఏ దేశంలో అయినా సుఖంగా సౌఖ్యంగా బతికేయొచ్చంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరి అలాంటి వైయస్ షర్మిల.. ఎలాంటి కష్టంలో ఉందని వారు వైయస్ విజయమ్మను సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. అయితే విజయమ్మ మాటలను బట్టి చూస్తే.. ఓ ముఖ్యమంత్రి పదవో లేక.. మంత్రి పదవో.. లేక పెద్దల సభ రాజ్యసభో.. లేక ఇంకేదైనా పదవో లేకపోవడమే వైయస్ షర్మిలకు కలిగి న కష్టమా అంటూ వైయస్ విజయమ్మని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో రాజన్నరాజ్యం తీసుకు వస్తాడంటూ గతంలో ఓ తల్లిగా.. ఓ చెల్లిగా అతడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారని.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆ విషయం మీరు బయటకు చెప్పక పోయి నా.. మీ మనసాక్షిగా తెలుస్తునే ఉంటుందని వారు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నా రు.
ఆ క్రమంలోనే మీరు.. ఆ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఉంటారని నెటిజన్లు సోషల్ మీడియాలో అబిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెచ్చి తెలంగాణ ప్రజల కష్టాలు తీరుస్తానని వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చెబుతున్నారని.. మరోవైపు మీరు ప్లీనరీ వేదికగా వైయస్ షర్మిల కష్టాల్లో ఉందంటూ మీరు లక్షలాది మంది హాజరైన ప్రజల ముందు చెప్పారని.. మరి వైయస్ షర్మిలే ప్రస్తుతం కష్టాల్లో ఉంటే.. ఇక తెలంగాణ ప్రజల కష్టాలను ఆమె ఎలా తీరుస్తోందంటూ నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా.. ఏపీలో వైయస్ జగన్‌ని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు వీరిద్దరు శ్రమించి.. ఈ మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని కనీసం వీరిద్దరు ఆరా కూడా తీయడం లేదనే విమర్శ సైతం తెలుగు రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉందనే చర్చ అయితే చాలా బలంగా సాగుతోంది. ఇక వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏపీలో జగన్ పాలనపై విలేకర్లు ఏమైనా ప్రశ్నలు సంధిస్తే.. ఆమె కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తారని ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో రంజు రంజుగా నడుస్తోంది.