లాభాల్లో ఉన్నా లాభం లేదు.. విశాఖ ఉక్కు ప్రైవేటుకే కేంద్రం మొగ్గు!

ప్రైవేటీకరణ కేంద్రం పాలసీ అని మరో సారి తేలిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రై ‘వేటు’ వేయడమే తమ విధానమని కేంద్రం పార్లమెంటు సాక్షిగా అంగీకరించేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలలో ఉన్నా వాటిని ప్రైవేటుకు అప్పగించేసి డబ్బులు దండుకోవడమే లక్ష్యమని తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలోనే నడుస్తోందని అంగీకరించింది. అయినా సరే విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పించడానికి నిర్ణయించేశామనీ, ఆ నిర్ణయంలో మార్పు ఉండదనీ తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 2021-22 ఆర్థిక సంవత్సరం లో 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. తెలుగుదేశం ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో విశాఖ ఉక్కు కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. అయినా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా కేంద్రం ఖాతరు చేయడం లేదు. రాష్ట్రం మొక్కుబడిగా ప్రైవేటీకరణ వద్దని ఓ లేఖ రాసేసి చేతులు దులిపేసుకుంది. అయితే కేంద్రం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న విధానానికి కట్టుబడి విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగించేయడానికే సిద్ధ పడుతోంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పింది. 

సోనియాకు మ‌ద్ద‌తుగా టీపీసీసీ స‌త్యాగ్ర‌హ దీక్ష‌

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ఈసీ విచారిస్తున్న‌ది. ఆమె విచార‌ణ నుంచి వ‌చ్చే వ‌ర‌కూ ఆమెకు మ‌ద్ద‌తుగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గాంధీభ‌వ‌న్‌లో స‌త్యాగ్ర‌హ దీక్ష చేప ట్టారు.  దీక్షకు టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు, పొన్నాల, మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రెడ్డి, బోసు రాజు తదితరులు హాజరయ్యారు.  విచార‌ణ పేరుతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని అవ‌మానిస్తున్నారని, దేశంలోని కీల‌క ప‌రిశోధ‌నా సంస్థ‌ల‌ను బిజెపీ ప్ర‌భుత్వం స్వార్ధ‌ప్ర‌యోజ‌నానికి వాడుకుంటోంద‌ని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత‌లు భారీ నినాదాలు చేస్తూ నిర స‌న  తెలి పారు.  చాలారోజులుగా కేంద్రం ప్ర‌ధాన ప‌క్షం మీదా, బీజేపీయేత‌ర రాష్ట్రాల్లో అధికార ప‌క్షాల మీద క‌క్ష‌గ‌ట్టినట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డ్డారు.  దేశంలో అస‌లు ప్ర‌తిప‌క్షం లేకుండా చూడాల‌ని, త‌మ విధానాలు, కార్య‌క్ర‌మాలను ప్ర‌శ్నించేవారు, అడ్డు కునేవారూ లేకుండా చేసుకో వాల‌న్న దృష్టితోనే బీజేపీ స‌ర్కారు ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తోం ద‌న్నారు. అందుకు దేశంలో ప్ర‌తిష్టా త్మక సిబిఐ, ఈడీల‌ను ఉప‌యోగించుకుంటోంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిం చారు. కేంద్రం ఏది చెబితే అది చేయ‌డానికి తందాన తానా అంటూ వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సంస్థ‌లు ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

మీ పిల్ల‌ల్ని ఎక్క‌డ చ‌దివిస్తున్నారు?.. టీచ‌ర్ల‌కు బొత్స ప్ర‌శ్న‌

అధికారంలో ఉన్న‌వారి మీద నిత్యం ఉద్య‌మించాల‌న్న ఆలోచ‌న‌, త‌మ డిమాండ్ల‌తో రోడ్ల‌మీద‌కు రావ‌డం కాకుండా ఉపాధ్యాయుల సంఘాలు ప్రభుత్వ విధానాల‌ను అర్ధ‌ర‌హితంగా వ్య‌తిరేకించ‌డం స‌రికాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యానారారాయ‌ణ అన్నారు.  అమ‌రావ‌తి స‌చివాల‌యంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ, అస‌లు ఉద్య‌మాలు చేస్తున్న ఉపాధ్యాయులు వారి పిల్ల‌ల్ని ఎక్క‌డ చ‌దివిస్తున్నారో చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ఉపాధ్యా యులకు ప్ర‌శ్నించే హ‌క్కు లేద‌న్నారు.  పిల్ల‌లు బాగా చ‌దువుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది. మంచి చ‌దువు చ‌దివించాల‌ని త‌ల్లిదండ్రుల‌కూ ఉం టుంది. కానీ పేద‌వాడి పిల్ల‌లు అలానే పేద‌రికంలోనే ఉండిపోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు ఆలోచించాల‌ని మంత్రి అన్నారు.  విద్య‌ను అంద‌రికీ అందజేయాల‌న్న‌గొప్ప‌ల‌క్ష్యంతోనే జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠ‌శాల‌ల విలీనాన్ని ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని అన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌త‌ను  దృష్టిలో పెట్టుకునే సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నామ‌న్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు  ప్ర‌భుత్వంలో  భాగ‌మ‌ని, ఉపాధ్యాయ సంఘాలతో సంప్ర‌దిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగ‌రీత్యా వారికి ఎలాంటి ఇబ్బందు లు వ‌చ్చినా వాటిపై పోరాడ‌టంలో త‌ప్పులేదు, స‌వ‌ర‌ణ‌లూ చేప‌ట్ట‌వ‌చ్చు. కానీ విధానాల మార్పు గురించి సంఘాలు ప్ర‌శ్నించ‌డం స‌బ‌బు కాద‌ని బొత్స అన్నారు.   గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకే క్లాస్‌ రూం, ఒకే టీచరు ఉన్న స్కూళ్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నా యో వారే చెప్పాలి. ఆ విధంగా ఉండకూడదనే మార్పులు తెచ్చాం. 3 నుంచే సబ్జెక్ట్‌ టీచర్లను తెచ్చామ‌న్నారు.  ప‌థ‌కాలు అమ‌లుపెట్టిన వెంట‌నే మంచి ఫ‌లితాలు ఆశించ‌రాద‌ని, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల విధానాన్ని ప‌రిశీలిస్తున్న‌పుడు ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లోనూ ఉపాధ్యాయులు  విద్యార్ధుల‌పై ప్ర‌త్యేకదృష్టి పెట్టి వారి అభి వృద్ధికి పాటుప‌డాల‌న్నారు.  ఉపాధ్యాయ సంఘాలతో మంచి వాతావర ణంలో చర్చలు జరిగాయి. వాళ్లు సంతోషంగా రిసీవ్‌ చేసుకున్నారు. ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం నమ్ముతాం. 5800 స్కూళ్లు మ్యాపింగ్‌ చేస్తే 268 స్కూళ్లపై అభ్యంతరాలు వచ్చాయి. మేం అడిగితేనే ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలియజేశారు. అంటే మిగతా వన్నీ ఓకే కదా. అభ్యంతరాలు పరిశీలించి అవసరమైతే మార్పులు చేస్తామ‌ని బొత్స అన్నారు. పాఠ్య పుస్తకాల జాప్యా నికి ప్రైవేటు పాఠశాలల ఇండెంట్‌ లోపమే కారణమని చెప్పారు. 15 రోజుల్లో అన్ని ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.

ద‌ళితులు ఉద్య‌మించాలి..దేవినేని పిలుపు 

 అధికారంలోకి వ‌చ్చేముందు ఎస్సీ, ఎస్టీల‌ను ఆదుకుంటామ‌ని భారీ హామీలిచ్చిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఆ తర్వాత హామీల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని తెలుగు దేశం నాయ‌కులు ఆరోపిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో ద‌ళిత గ‌ర్జ‌న నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు గృహ‌నిర్భంధం చేశారు. ఈ  సంద‌ర్భంగా తెలుగు దేశం సీనియ‌ర్ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ, ద‌ళితుల కోసం కేటా యించిన వేల కోట్ల స‌బ్ ప్లాన్ నిధుల‌ను వైసీపీ నాయ‌కులు దారి మ‌ళ్లించార‌ని ఆరోపించారు. ద‌ళితుల‌ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వ విధా నాలు దారుణంగా ఉన్నాయ‌ని, ఈ ప్ర‌భుత్వంపై ద‌ళితులు యుద్ధానికి స‌న్న‌ద్ధం కావాల‌ని  టీడీపీ నేత దేవినేని పిలుపునిచ్చారు.  ద‌ళితులు త‌మ‌కు ప్ర‌భుత్వం త‌మ‌ను ఘోరంగా మోసంచేసిందని ఆరోపిస్తూ భారీ నినాదాల‌తో ద‌ళిత గ‌ర్జ‌న చేప‌ట్టింది. విజ‌య‌వాడ‌లో ద‌ళిత గ‌ర్జ‌న నేప‌థ్యంలో పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేసి టీడీపీ నేత ల‌ను బ‌య టికి రాకుండా గృహనిర్భంధం చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమాతో స‌హా ప‌లువురు తెలుగు దేశం నేత‌ల‌ను గృహ‌నిర్భంధం చేశారు. ప‌ట్ట‌ణంలోని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద భారీగా పోలీసు బ్యారి కెడ్లు ఏర్పాటు చేసి ద‌ళిత నాయ‌కుల‌ను అడ్డుకుంటున్నారు. ధ‌ర్నాచౌక్ చేరుకునే ప‌లుమార్గాల‌ను పోలీసులు బ్యారి కేడ్ల‌తో మూసివేశారు.   ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై  ప్ర‌తీ రోజూ దాడులు జ‌రుగుతున్నాయ‌నిమండిపడ్డారు. స‌బ్‌ప్లాన్ నిధుల‌ను తిరిగి రాబ‌ట్టి ద‌ళితుల సంక్షేమా నికి కేటాయించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌తంలో ఎస్సీల‌కు భూమి కొనుగోలు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టినా దాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వీర్యం చేసింద‌ని ఉమా మండిప‌డ్డారు. అంతేగాక  వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తు లకు చెందిన  విద్యార్ధుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డే అంబేద్క‌ర్ విద్యా ప‌థ‌కం వైసీపీ ప్ర‌భుత్వం నిలిపివేసి వారికి ద్రోహం చేసింద‌ని టీడీపీ నేత ఆరోపించారు. ఈ విధంగా ద‌ళితుల‌ను దారుణంగా మోసం చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ పై  యుద్ధం చేయాల‌ని దేవినేని పిలుపునిచ్చారు.

మా నాన్నా కమీషన్లు తీసుకున్నారు.. నోరు జారిన షర్మిల

మాట్లాడే టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తొందరపడి మాట జారకూడదు.  మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.నోరు జారితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయనడానికి మనకు బోలెడు ఉదాహరణలూ సమెతలూ ఉన్నాయి. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ అభిమానులనూ రగిల్చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన షర్మిల తన తండ్రి విషయంలోనే పొరపాటు చేశారు. ఆయన కమీషన్లు తీసుకున్నారన్న అర్దం వచ్చేలా మాట్లాడారు. తరువాత షర్మిల పీఎస్ ఆమె పొరపాటున మాట్లాడారంటూ ఓ ప్రకటన విడుదల చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వైస్ మహా నేత అంటూ కాంగ్రెస్ వర్గాలు కీర్తిస్తుంటే, విపక్ష తెలుగుదేశం ఆయన చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులలోని అవినీతిని ఎత్తి చూపుతూ మహా మేత అని విమర్శించారు. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన తండ్రిపై విపక్షాలు నాడు చేసిన విమర్శలు నిజమేనని అంగీకరించినట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాలలోకి వచ్చానంటూ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి యాత్రలతో, దీక్షలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న షర్మిల  ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శల బాణాలను సంధిస్తోన్న సంగతి విదితమే. ఘాటు విమర్శలు, పదునైన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ గా ఇప్పుడిప్పుడే షర్మిలకు గుర్తింపు వస్తోంది. డీఎస్ వంటి నేతలు ఆమెను ఆశీర్వదిస్తున్నారు కూడా. అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ఆమె కేసీఆర్ అవినీతిపై విమర్శల బాణాలను సంధించారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులలో అవినీతి వరద పారిందని దుమ్మెత్తి పోశారు. పోలవరం విషయంలో తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్ కలిసే రాజకీయ లబ్ధి కోసం డ్రామాలాడుతున్నారంటూ చెరిగేశారు. ఆవేశంతో రగిలిపోయారు. ఆ ఆవేశంలోనే ఆమె మాట జారారు. కేసీఆర్ కంటే తన తండ్రే ఎక్కువ అవినీతికి పాల్పడ్డారని అర్ధం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆ తరువాత ఆమె పీఎస్ ఓ ప్రకటన విడుదల చేసినా.. అప్పటికే ఆమె వ్యాఖ్యలు వైరల్ అయిపోయాయి. సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.  తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులన్నీ మేఘా ఇంజినీరింగ్ సంస్థకు అప్పజెప్పడాన్నితప్పు పడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఒకే కంపెనీకి ఎందుకు ప్రాజెక్టులన్నీ కట్టబెడుతున్నారని నిలదీశారు. కమీషన్ల కోసమే మేఘాకు కాంట్రాక్టులన్నీ అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. తన తండ్రి హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. తన తండ్రి ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదని అన్నారు. ఇది కేసీఆర్ ను విమర్శిస్తూ.. తన తండ్రి గొప్పదనాన్ని చెప్పడానికి ఆమె చేసిన ప్రయత్నంలో మాట జారింది. తన తండ్రి వైఎస్ కేసీఆర్ లా ఒక్కరి వద్ద కాకుండా చాలా మంది వద్ద కమిషన్లు తీసుకున్నారన్న అర్ధం వచ్చేలా ఆమె మాట్లాడారు. ఇదే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. వైఎస్ వ్యతిరేకులంతా ఇప్పటి దాకా మేం చెబుతున్నదంతా వాస్తవమని ఆమె కుమార్తే చెప్పారంటూ సంబరపడుతున్నారు. ఆమె వర్గీయులు మాత్రం అదో టైపో ( స్పెల్లింగ్ మిస్టేక్)లా తీసుకోవాలంటున్నారు.  

గడ్కరీ రాజకీయ వైరాగ్యం.. టార్గెట్ ఎవరు?

గడ్కరీ ఉరుములేని పిడుగులా ఇవేం రాజకీయాలు నా కొద్దు బాబోయ్ అనేశారు. ఆయనేమీ మామూలు నాయకుడు కాదు. బీజేపీలో కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది. ఈ రోజుకూ మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీ రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించారు.  ఎందుకొచ్చిన రాజకీయాలు? ఎవరి కోసం అంటూ వేదాంతం వల్లించారు. అదేదో స్వగతంలోనో.. సన్నిహితుల దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుతూనో కాదు. ఒక సభలో. అదీ మాజీ పొలిటికల్ లీడర్ గిరీష్ గాంధీ సన్మాన సభలో. గడ్కరీ అంతటి వారు రాజకీయాలపై అంతటి వైరాగ్యం ప్రదర్శించడంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అధికార బీజేపీలో బలమైన నాయకుడు ఒక్క సారిగా రాజకీయం అంటేకేవలం అధికార దాహం, పదవీ వ్యామోహం అంటూ వ్యాఖ్యానించే సరికి ఒక్క సారిగా బీజేపీలో కలకలం రేగింది. ఎందుకంటే రాజకీయం అంటే అధికార దాహం, పదవీ వ్యామోహం అన్న మాటలు ఆయన ఎవరిని టార్గెట్ చేసి అని ఉంటారా అన్న అనుమానాలు ఒక్క సారిగా బీజేపీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీలలోనూ కలిగిందంటే ఆశ్వర్యం లేదు. సామాన్య జనం కూడా గడ్కరీ వ్యాఖ్యలు మర్మమేమిటన్న చర్చల్లో మునిగిపోయారు. అంతే అవి ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటెతో అధికారంలో ఉన్న బీజేపీలో అత్యంత కీలక నాయకుడు ఏమిటీ రాజకీయం కేవలం అధికార వ్యామోహం అంటే ఉలిక్కిపడేవారు అందులోనే ఎక్కువగా ఉంటారు. సమాజి హితం, అభివృద్ధి దిశగా మార్పు, పురోగతి ఇవీ రాజకీయాల లక్ష్యంగా ఉండాలని, గతంలో అలాగే ఉండేవని చెప్పిన గడ్కరి ఇప్పుడు రాజకీయాల అర్ధం పూర్తిగా మారిపోయిందన్నారు. రాజకీయాలంటే అధికారాన్ని అనుభవించడమే అన్నట్లు ప్రస్తుత పరిస్థితి తయారైందనీ, అందుకే తాను రాజకీయాలలో కొనసాగుతూ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ గడిపేయాలా సమాజం కోసం పని చేయాలా అన్న ఆలోచనలో ఉన్నానని చెప్పారు. అయితే గడ్కరీ రాజకీయ వైరాగ్యం వెనుక మహరాష్ట్ర పరిణామాలు ఉన్నాయనీ, రాత్రికి రాత్రి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రాలలో అధికారం కోసం మోడీ సర్కార్ వేస్తున్న ఎత్తులు, పన్నుతున్నవ్యూహాలపై గడ్కరీ అసంతృప్తితో ఉన్నారనీ అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

 మ‌మ్మ‌ల్ని చేరాలంటే  మొస‌ళ్లు దాటాలి.. మ‌మ‌తా బెన‌ర్జీ

త‌మ మంత్రి పార్థాఛ‌ట‌ర్జీని అరెస్టు చేయ‌డ‌మేగాకుండా ఆయ‌న్ను కేంద్ర‌ప్ర‌భుత్వంతో అనుబంధం ఉన్న ఇఎస్ ఐ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంపై ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్రంపై మండి ప‌డ్డారు. ఇదంతా కేవ‌లం కుట్ర ధోర‌ణి అని అమె అన్నారు. మ‌హారాష్ట్ర త‌ర్వాత త‌మపై విరుచుకుప‌డ‌టానికి మ‌మ్మ‌ల్ని అవ‌మానించ‌డానికే ఇలాంటి చ‌ర్య‌లు  బీజేపీ వ‌ర్గాలు పాల్ప‌డుతు న్నాయ‌ని ఆమె విరుచుకు ప‌డ్డారు. బెంగాల్‌కు రావాలంటే బే ఆఫ్ బెంగాల్ దాటాలి, స‌ముద్రంలో మొస‌ళ్లు తినేస్తాయి జాగ్ర‌త్త అని మ‌మ‌త  హెచ్చ‌రించారు.  మంత్రిని త‌మ‌కు అనుకూలమైన ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డ‌మే రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని అవ‌మానించ‌డ‌మ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. అంటే కేంద్రం అమాయ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది, రాష్ట్రాలే దోచుకునే దొంగ‌లు గా భావించ‌డంలో అర్ధంలేద‌న్నారు. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం బెంగాల్ ప్ర‌జ‌ల్ని అవ‌మానించ‌డం కాదా అని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. రాష్ట్రాల మీద ఆధార‌ప‌డి ఉన్న‌ది మీరేన‌ని  అలాంట‌పుడు రాష్ట్రాల‌ను ఈ విధం గా అవ‌మానించ‌డంలో అర్ధ‌మేమిట‌ని ఆమె ప్ర‌శ్నించారు. మ‌హారాష్ట్రా ఈ ప‌ర్యాయం మీతో యుద్ధం చేయ లేక పోయింది. ఆ రాష్ట్రం త‌ర్వాత ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, ఝార్ఖండ్‌, బెంగాల్ మీద బీజేపీ దృష్టి పెట్టింది. కానీ ఇటు రావడానికి ప్ర‌య‌త్నించ‌కండి, స‌ముద్రంలో  మొస‌ళ్లు కాకుంటే సుంద‌ర్‌బ‌న్  జిల్లాలో రాయ‌ల్ బెంగాల్ పులులు మిమ్మ‌ల్ని క‌రిచిప‌డేస్తాయ‌ని, ఉత్త‌ర బెంగాల్ లో ఏనుగులు తొక్కిప‌డేస్తాయ‌నీ మ‌మ‌తా బెన‌ర్జీ బీజేపీని హెచ్చ‌రించారు.  పార్థ ఛటర్జీ అరెస్టు చేసిన తర్వాత తనకు చేసిన కాల్‌లకు సమాధానం లేకుండా పోయిందని  ఉదయం సంచలనం కలిగించిన తర్వాత  ఈ విషయంపై బెనర్జీ  మాట్లాడారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో పోరా డుతున్న తన ముఖ్య సహాయకుల్లో ఒకరైన మంత్రిని దూరం పెట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయ త్నంగా ఇది కనిపించింది. ఈ రోజు, ముఖ్యమంత్రి అవినీతి లేదా ఏదైనా అక్రమాలకు మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. అప్పుడు ఆమె, ఏజెన్సీలను ఉపయోగించి నా పార్టీని విచ్ఛిన్నం చేయగలదని బిజెపి భావిస్తే తప్పు, నిజం బయట కు రావాలి, కానీ గడువులోపు బ‌య‌ట‌పెట్టాల‌ని హెచ్చ‌రించారు.  ఎవరినీ విడిచిపెట్టేది లేదు.  ఎవరైనా దొంగ లేదా దోపిడీదారు అయితే, టిఎంసీ వారిని విడిచిపెట్టదు, నేను నా స్వంత వ్యక్తులను అరెస్టు చేసాను, నేను నా ఎమ్మెల్యేలను మరియు ఎంపీలను, మంత్రులను కూడా విడిచిపెట్టను. కానీ మీరు ప్రయత్నిస్తే నాపై సిరా వేయండి, నేను మీపై చెత్త వేయగ లనని ఆమె అన్నారు.

కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రతిష్టకు సవాల్ మునుగోడు?

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్గుకునేందుకే కమలం గూటికి చేరుతున్నారా? కాంగ్రెస్ లో ఇమడ లేకపోవడం అన్న అంశం కంటే తన అన్న వెంకటరెడ్డితో విభేదాలే ఆయనకు కాంగ్రెస్ వీడేలా చేస్తున్నాయా? ఇరువురి మధ్యా విభేదాల కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలకు అడుగడుగునా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారా? కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి తీరు వల్లే వెంకటరెడ్డికి పీసీసీ పదవి దూరమైందా? గత కొన్నేళ్లుగా ఇరువురి మధ్యా సఖ్యత లేదా అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. ఇరువురి మధ్యా విభేదాలను ఆసరాగా తీసుకునే కమలం రాజగోపాల రెడ్డిని రాజీనామా దిశగా ప్రోత్సహించిందని అంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తే.. జరిగే ఉప ఎన్నికలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టను, ఆటు టీఆర్ఎస్ దర్పాన్నీ కూడా దెబ్బతీసేలా కమలం పావులు కదుపుతోందంటున్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైతే..అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాలరెడ్డి రంగంలోకి దిగుతారు. ఇప్పటికే  అది ఖాయమని భావిస్తున్న తెరాస ఉప పోరుకు సన్నాహాలు చేస్తోంది. వరాల మూటలు విప్పుతోంది. ఇక బీజేపీ రాజగోపాలరెడ్డిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటుందని ఇప్పటికే అమిత్ షా చెప్పేశారు. ఇక మిగిలింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఉప పోరుకు సిద్ధంగా లేదు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఉప పోరును ఎదుర్కోవడం ఇష్టం లేదు. కానీ అనివార్యమైతే మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత రాజగోపాలరెడ్డి అన్న అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అప్పగించాలని భావిస్తోంది. అంటే సోదరుల మధ్య ఇంత కాలం ఉన్న విభేదాలకు తోడు రాజకీయ వైరం కూడా తోడవుతుంది. ఒక వేళ మునుగోడు ఉప పోరు జరిగితే.. టీఆర్ఎస్ కంటే ఎక్కువగా గాభరా పడేది కాంగ్రెస్సే. అందుకే వ్యూహాత్మకంగా ఆ పోరును అన్నదమ్ముల మధ్య పోరులా మారిస్తే ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వచ్చినా.. రాజకీయంగా కాంగ్రెస్ కు కలిగే నష్టం కంటే వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఎక్కువ నష్టం జరుగుతుంది. పార్టీలో ఆయన హవాకు బ్రేక్ పడుతుంది. చీటికీ మాటికీ టీపీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పించే వెంకటరెడ్డి ఇక స్వరం మార్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదీ కాంగ్రెస్ వ్యూహం. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే మునుగోడు ఉప పోరులో విజయానికి సర్వశక్తులూ ఒడ్డేందుకు రెడీ అయిపోయింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులో గులాబీ జెండా ఎగిరితే.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పార్టీలో నూతనోత్తేజం వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసంతో సమాయత్తం అయ్యే అవకాశం వస్తుంది. ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వస్తే.. మునుగోడులో జరిగింది పార్టీల మధ్య పోరు కాదనీ, అది అన్నదమ్ముల సవాల్ కు సంబంధించిన విషయమంటూ లైట్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం సాధిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్ల కాంగ్రెస్, తెరాసాల గాలి తీసేసినట్లౌతుంది. ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వస్తే కూడా ఆ పార్టీకి పోయేదేముండదు. కోమటిరెడ్డి కమలం గూటికి చేరాలంటే ఆయనకు ప్రజలలో ఉన్న ప్రతిష్ట ఏమిటో తెలుసుకోవడానికే రాజీనామా షరతు విధించామనీ, ఆయనకు ప్రజలలో బలం లేకపోవడం వల్లే పరాజయం పాలయ్యారనీ చెప్పుకుంటుంది.  మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో ఫలితం ఎలా వచ్చినా టీఆర్ఎస్, బీజేపీలకు పోయేదేమీ ఉండదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కనుక పరాజయం పాలైతే కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడుతుంది. వారి జోరుకు కళ్లెం పడుతుంది. ఏ విధంగా చూసినా మునుగోడు ఉప ఎన్నిక కోమటి రెడ్డి సోదరుల పర్సనల్ ఫైట్ గానే మిగిలిపోతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణకు కాబోయే సీఎం షర్మిల.. డీఎస్ ఆశీర్వాదానికి కారణమేమిటి?

ధర్మపురి శ్రీనవాస్ కాంగ్రెస్ అగ్ర నేతలలో ఒకరిగా వెలుగొందారు.  సీఎం పదవి ఆయనదే అని ఒక సమయంలో అంతా భావించారు. 1989లో మంత్రిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులలో ఒకరిగా ఎదిగారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ ఆయన కాంగ్రెస్ నేతే. ఆ తరువాతే ఆ పార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా వైఎస్ లో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. పీసీసీ చీఫ్ గా ఆయన, ముఖ్యమంత్రిగా వైఎస్ ఇద్దరూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపారు. అయితే విభజన తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే ఆ తరువాత పార్టీతో విభేదించారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆయనకు తెరాస మరో అవకాశం ఇవ్వలేదు. అసలు ఆయనకు పార్టీకీ సంబంధమే లేదన్నట్లుగా తెరాస వ్యవహరిస్తున్నది. డీఎస్ కూడా అంతే పార్టీతో అంటీముట్టనట్లే ఉన్నారు.  దూరం జరిగారు. అయితే తెరాసకు మాత్రం రాజీనామా చేయలేదు. ఈ రోజుకూ ఆయన టీఆర్ఎస్ సభ్యుడే. అయితే టీఆర్ఎస్ లో ఉన్నారంటే ఉన్నారు అంతే. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీ.. దాంతో కొద్ది కాలం కిందట డీఎస్ కమలం గూటికి చేరతారన్న వార్తలు వినవచ్చినా ఆయన చూపంతా సొంత గూటిపైనే అంటే కాంగ్రెస్ పైనే. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు కారణాలేమైనా ఫలించలేదు. అందుకు వయోభారం కూడా ఒక కారణమని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన చూపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రగతి మార్గంలో ముందుకు సాగాలంటే వైఎస్సార్ కుమార్తె షర్మిల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు ఆమె ముఖ్యమంత్రి అవుతారనీ, రాజకీయాలలో తన అంచనాలు ఇప్పటి వరకూ తప్పలేదని ప్రకటించారు. 2004  లో వైఎస్సార్ సీఎం అవుతారని ముందుగా చెప్పింది తానేననీ డీఎస్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయనకు హఠాత్తుగా షర్మిలపైనా, ఆమె పార్టీపైనా ఇంత అభిమానం ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు కూడా పరిశీలకులు సమాధానం చెబుతున్నారు. వయో భారం కారణంగా ఇంటికే పరిమితమైన డీఎస్ ను పలకరించే వారే కరవైన పరిస్థితి. అన్నేళ్ల పాటు సేవ చేసిన కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు.. తాను ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న టీఆర్ ఎస్ వదిలేసింది. ఆ సమయంలో  షర్మిల తన డీఎస్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రికి మిత్రుడు కనుక తనకూ పితృ సమానేడే అని  స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి  పలకరించి క్షేమ సమాచారాలు అడిగారు. అంతే పొంగిపోయిన డీఎస్ ను తెలంగాణకు కాబోయే సీఎం నువ్వేనమ్మా అని ఆశీర్వదించేశారు. ఇటు షర్మిలకు తన పార్టీలో చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడెవరూ లేరు.. అటు డీఎస్ కు పలకరించి క్షేమ సమాచారాలు ఆరా తీసే వారు కరవైయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో షర్మిల భేటీ కావడంతో డీఎస్ వైఎస్సీటీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆమె తన తండ్రి  సహచరులను వరసగా కలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో డీఎస్ ని కూడా కలసి ఆయనతో మంతనాలు సాగించారు అని అంటున్నారు. ఇక టీయారెస్ లో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్న డీఎస్ షర్మిలమ్మ పార్టీలో చేరుతారా అన్నది ఒక చర్చ. ఆయన కనుక చేరితే కచ్చితంగా వైఎస్సార్టీపీకి ఎంతో కొంత బలం చేకూరినట్లే. డీఎస్ పెద్ద నాయకుడు. పైగా బీసీ నేతగా బలమైన గొంతుక కలిగిన వారు మరి ఆయన షర్మిల పార్టీలో చేరడానికేనా ఆమె ఫ్యూచర్ సీఎం అని జోస్యం చెప్పినది అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా షర్మిల పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక అంచనాకు అందని అతి పెద్ద  సందేహం. అయితే బడా నాయకులు కొందరు చేరితే మాత్రం కచ్చితంగా తాను గెలవకపోయినా కాంగ్రెస్ ని చీల్చే స్థాయిలో మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు.   ఈ పరిణామాలు అన్నీ షర్మిల సీఎం పదవి కోసం కాకుండా కేసీయార్ ని మూడవసారి గెలిపించడానికే పనికివచ్చినా వస్తాయని అనే వారూ ఉన్నారు. మొత్తానికి డీఎస్ తాపీగా ఒక రాజకీయ  జోస్యం వదిలారు. ఫ్యూచర్ లో చూసుకోండి షర్మిల సీఎం అంటున్నారు. మరి ఇది చెప్పిన ఆయన తాను ఏ పార్టీయో మాత్రం చెప్పలేదు. అదే కదా రాజకీయ గడుసుదనం అంటే.

అప్పుల్లో ఏపీ , తెలంగాణ దొందూ దొందే!

అడ్డగోలు అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే దారిలో నడుస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన రాష్ట్రాల రుణాల జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది మార్సి 31 నాటికి ఏపీకి 3లక్షల98 వేల 903 కోట్ల రూపాయల అప్పులు ఉంటే.. తెలంగాణకు 3 లక్షల 12 వేల 191 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి రాష్ట్రాల అప్పుల వివరాల గురించి ఎంపీ కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో ఏయే రాష్ట్రం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత మొత్తం రుణంగా తీసుకుందన్న విషయాన్ని కేంద్రం ప్రకటించింది.  బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. బడ్జెటేతర రుణాలను మాత్రం కేంద్రం ఈ జాబితాలో పొందుపరచలేదు. బడ్జెట్ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. ఏపీలో అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,07,671 కోట్లుగా కాగా.. 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,60,333 కోట్లు. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లకు చేరాయని విత్త మంత్రి వెల్లడించారు.   రాష్ట్రాలు ఆర్ధిక క్రమశిక్ష పాటించకుండా, ఇష్టానుసారం అప్పులు చేసి ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో.. ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసిందో కేంద్రం వెల్లడించింది.  దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంటులో బయటపెట్టింది. ఎంపీ కిశోర్‌ కపూర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ జాబితాను వెల్లడించారు. ఆ జాబితా ప్రకారం దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో, సిక్కిం చివరి స్థానంలో ఉంది.     తెలుగు రాష్ట్రాలలో ఏపీ 8వ స్థానం,  1తెలంగాణ1వ స్థానంలో ఉన్నట్లు తేలింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పల వివరాల్లోకి వెళితే...తమినాడు- 6,59,868 లక్షల కోట్లు, ఉత్తర‌ప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు, మహారాష్ట్ర -6,08,999 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్-5,62,697 లక్షల కోట్లు, రాజస్థాన్- 4,77,177 లక్షల కోట్లు,  కర్నాటక -4,62,832 లక్షల కోట్లు, గుజరాత్-4,02,785 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ -3,98,903 లక్షల కోట్లు,కేరళ్- 3,35,989 లక్షల కోట్లు,  మధ్యప్రదేశ్ 3,17,736 లక్షల కోట్లు, తెలంగాణ -3,12,191 లక్షల కోట్లు, పంజాబ్ -82,864 లక్షల కోట్లు,హర్యానా- 2,79,022 లక్షల కోట్లు, బీహార్ - 2,46,413 లక్షల కోట్లు, ఒడిశా-1,67,205 లక్షల కోట్లు, జార్ఖండ్ 1,17,789 లక్షల కోట్లు,  చత్తీస్‌ఘ‌డ్- 1,14,200 లక్షల కోట్లు, అస్సాం-1,07,719 లక్షల కోట్లు, ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు, హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు, గోవా- 28,509 వేలకోట్లు,  త్రిపుర -23,624 వేల కోట్లు, మేఘాలయ- 15,125 వేల కోట్లు, నాగాలాండ్- 15,125 వేల కోట్లు,  అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు, మణిపూర్ -13,510 వేలకోట్లు, మిజోరాం- 11,830 వేల కోట్లు, సిక్కిం -11,285 వేల కోట్లు

మాతృదేవో భవ.. ఒంటరి మహిళల పిల్లలందరూ దేశం సుపుత్రులే!

చాలా కాలం క్రితం ఒక మ‌హిళ త‌న కుమార్తెను స్కూల్లో చేర్చాల‌ని తీసికెళ్లింది. ఇద్ద‌రే బిక్కు బిక్కుమంటూ రావ‌డంతో అక్క‌డున్న వారు వీల‌యినంత అనుమానించారు. ఆ చూపుల‌తోనే వేల ప్ర‌శ్న‌లు వేశారు. ఇదే ప‌రిస్థితి లోప‌ల కూడా ఉంటుంద‌ని ఆమె అనుకుంది. ప్రిన్సిప‌ల్ పిలవ‌గానే లోపలికి వెళ్లారు. పిల్ల టెన్త్‌లో చేరాలి, మేము వేరే గ్రామం నుంచి వ‌చ్చామ‌న్న‌దామె. అన్ని ప్ర‌శ్న‌లు అయ్యాక  ఏదో ఒక ఫామ్ తీసి పూర్తిచేయ‌మ‌న్నారు. అందులో తండ్రిపేరు ద‌గ్గ‌ర ఆమె ఆగిపోయింది. క్ల‌ర్కు ఆమెనే అనుమానించాడు. ఆమె అత‌ని పేరు రాయ‌డానికి నిరాక‌రించింది. తండ్రిపేరు త‌ప్ప‌కుండా రాయాల‌ని క్ల‌ర్కు ప‌ట్టుప‌ట్టాడు.  ఆ స్కూలు యాజ‌మాన్యం ఒత్తిడి చేసింది. ఆమె  నిరాక‌రించింది. అవ‌మాన‌క‌రంగా భావించి పిల్ల‌ని తీసుకుని వెళిపోయింది. వేరే స్కూల్లో చేర్చి బాగా చ‌దివించుకుంది.  ఇక్క‌డ ప్ర‌శ్న‌ల్లా తండ్రి పేరు త‌ప్ప‌నిస‌రిగా పేర్కొనాల‌న్న నిబంధ‌న‌.  కాలం మారినా తండ్రి పేరు విషయంలో నిబంధనలు మారలేదు.   ఇపుడు ఇదే అంశం మీద కేర‌ళ హైకోర్టు అత్యంత కీల‌క తీర్పు ఇచ్చింది. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు  తప్పని సరి కాదు తల్లి పేరును మాత్రమే  ఉన్నా చాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. అత్యాచారాల‌కు గుర‌యిన మ‌హిళ‌లు,విడాకులు తీసుకుని భర్తకు దూరంగా బ‌తుకుతూ పిల్ల‌ల్ని పోషిం చుకుంటున్న  సింగిల్ మదర్ పట్ల  సమాజం వ్యవహరించే తీరు మారాలన్నదే కోర్టు తీర్పు సారాంశం.   ఈ తీర్పులో   కేరళ హైకోర్టు జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ మహాభారతంలో కర్ణుడి ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. అత్యంత కీలక వ్యాఖ్య లు చేశారు. ఇకపై ఎవ్వరు కర్ణుడిలా బాధపడాల్సిన అవసరం లేదనీ,  అవమానాలు భరించాల్సిన పనిలేదన్నారు.  గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును పేర్కొనకుండా కేవలం తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ప్రతి అమ్మకూ ఉంటుందని స్పష్టం చేసారు. సమాజంలో అవివాహిత మహిళలు, అత్యాచార బాధితుల పిల్లలకు ఎదురవుతున్న బాధలను గుర్తిస్తూ ఈ తీర్పును వెలువరించింది.  ఇంకా కోర్టు పలు వ్యాఖ్యలు సింది. తండ్రి ఎవరో తెలియనందుకు జీవితాంతం దూషణలకు గురైన మహాభారతంలోని కర్ణుడి లాంటివారు మన సమాజంలో ఎవరూ ఉండకూడదని ఆకాంక్షిస్తున్నామని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కర్ణుడు వంటి పాత్రలు లేని సమాజం మనకు కావాలి  అని   పేర్కొంది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి తండ్రి పేరును తొలగించాలని కోరుతూ దాఖలైన ఓ రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తల్లిపేరును మాత్రమే పేర్కొంటూ గుర్తింపు పత్రాన్ని జారీచేయాలని అధికారులను ఆదేశించారు. అవివాహిత మహిళల పిల్లు కేవలం ఆమె పిల్లలే కాదనీ, ఈ మహోన్నత భారత దేశం బిడ్డలని..వారు కూడా ఈ దేశ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని సుస్పష్టం చేశారు. వారి గోప్యత, గౌరవం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను హరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.  

మంచు కరగలేదు.. కోల్డ్ వార్ ముగియలేదు

కొద్ది రోజుల క్రితం  హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  ఇంచుమించుగా సంవత్సర కాలం తర్వాత, రాజ్ భవన్ లో కాలు పెట్టారు. అంతకు ముందు ఏమి జరిగింది, ముఖ్యమత్రి, గవర్నర్ మధ్య దూరం అంతలా దూరం ఎందుకు పెరిగింది అంటే అదంతా ఇప్పుడు చరిత్ర. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో, రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం ఎంతలా పెరిగిందో ఇప్పుడు వేరే చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదని, గవర్నర్ పలుమార్లు ఆరోపించారు. అంతే కాదు, తెలంగాణలో గవర్నర్ వ్యవస్థకు జరుగతున్న అవమానాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రులు, తెరాస నాయకులు కూడా గీతదాటి గవర్నర్ వ్యవస్థను ఏవిధంగా చిన్న చూపు చూస్తోంది వివరించారు. అందుకు తగ్గట్టుగానే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, గవర్నర్ ప్రోటోకాల్ పాటించలేదనే విషయం కళ్ళముందే కనిపిస్తోంది.  అయితే, రాజ్ భవన్  ప్రాంగణంలో జరిగిన రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. అంతే కాదు, గవర్నర్, ముఖ్యంత్రి మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవన్నట్లుగా కనిపించారు.ముఖ్యమంత్రి గవర్నర్’తో మాట కలిపారు. దీంతో ఈ ఇద్దరి  మధ్య‘ మంచు కరిగింది’, విభేదాలు తొలిగి పోయాయి, అనే  ప్రచారం జరిగింది.  అయితే, అదేమీ లేదని స్వయంగా గవర్నర్ తమిళిసై మరోమారు  సోమవారం (జులై 25) దేశ రాజధాని ఢిల్లీలో స్పష్తం చేశారు. స్పష్టం చేయడం కాదు, ముఖ్యమంత్రి పై ఆమె భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర వ్యాఖ్యలపై తాను బరస్ట్ కానంటూనే, ముఖ్యమంత్రిపై ముందెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలను సంధించారు.  నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆమె ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు  సమాధానంగానే అయినా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ముఖ్యమంత్రిలో, రాష్ట్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు రాలేదని,  గవర్నర్ వ్యవస్థను ఇంకా చులకనగానే చూస్తున్నారని అన్నారు.  అంతే కాదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు  జాతీయ రాజకీయాల్లో చోటు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు  వెళ్లకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ముఖ్యమంత్రికి పరోక్షంగా సవాలు కూడా విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవరోధాలు కలిపించినా, ప్రోటోకాల్ పాటించక పోయినా, తాను ప్రజల్లోనే ఉంటానన్నారు. అదలా, ఉంటే, ముఖ్యమంత్రి ఢిల్లీలో అడుగుపెడుతున్న సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలో,రాష్ట్రంలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. అంతే కాదు, గవర్నర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి టార్గెట్  గా తీవ్ర విమర్శలు చేయడం ఇద్దరి మధ్య దూరం తగ్గలేదనే కాదు, తగ్గదని కూడా స్పష్టం చేస్తున్నాయని, అంటున్నారు.

ఖ‌ర్గే ని  పిలిచి మూల కూర్చోబెట్టారు.. ఆగ్ర‌హించిన కాంగ్రెస్‌

పెళ్లికి పిలిచిన‌పుడు మ‌ర్యాదా పాడూ లేక‌పోతే ఎలా?  ప‌క్క ఊరు నుంచి వ‌చ్చిన చిన్న‌బావ కంటే చాలా దూరం నుంచి వ‌చ్చిన పెద్ద‌బావ‌గారిని ప‌ట్టించుకోవాలిగ‌దా?.. ఈ వైరం ఓ పెళ్లి సంద‌ర్భంగా స‌ద‌రు బావ గారి బంధువుకి, పెళ్లికూతురు తండ్రికీ మ‌ధ్య జ‌రిగింది. చీటికీ మాటికీ గొడ‌వ‌చేస్తున్నామంటారేగాని ఆ మాత్రం ప్రాధాన్య‌త‌నివ్వ‌క‌పోతే ఎలా చెప్పండి. త‌ర్వాత స‌ర్దుకుపోయారులేండి. ఇదుగో ఇదే కోపం మ‌ల్లి కార్జున ఖ‌ర్గే గారికీ వ‌చ్చింది.  పార్ల‌మెంటు హాలులో రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణస్వీకారానికి అంద‌ర్నీ ఆహ్వానించిన‌ట్టే ఖ‌ర్గేనీ ఆహ్వానించారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌క పోవ‌డం ప‌ట్ల ఆయ‌న‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది. వ‌చ్చిందంటే రాదు మ‌రీ.. ఆయ‌న కు ద‌క్కాల్సిన స్థానం ద‌క్క‌కపోవ‌డం అవ‌మానించిన‌ట్టే క‌దా? అందుకే రాజ్య‌స‌భకు ఫిర్యాదుచేస్తూ పెద్ద ఉత్త‌ర‌మే రాశార‌ట‌. ఖ‌ర్గేకు జ‌రిగిన అవ‌మానం అంద‌రినీ అవ‌మానించిన‌ట్టేన‌ని భావించి ప్ర‌తిప‌క్షాల నాయ‌కులంతా సంత కాలు చేసిన ఉత్త‌రాన్ని కాంగ్రెస్ రాజ్య‌స‌భ ఎంపీ జైరామ్ ర‌మేష్ ట్వీట్ చేశారు. ఖ‌ర్గే కు మ‌ర్యాద పూర్వ కంగా ఇవ్వాల్సిన సీటును ఆయ‌న‌కు కేటాయించాల‌న్న క‌నీస‌పు ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డం  అంద‌రి ఆగ్ర‌హానికీ కార‌ణం.  ఈ చిన్న‌పాటి విష‌యంలోకూడా ప్ర‌భుత్వం ఏమాత్రం జాగ్ర‌త్త తీసుకున్న‌ట్టు లేద‌ని, కావాల‌నే అవ‌మానిం చాల‌నే ఈ విధంగా ఏర్పాట్లు చేశార‌న్న అభిప్రాయాలే వెల్లువెత్తుతు న్నాయి.  రాష్ట్రప‌తి అభ్య‌ర్ధి త‌మ వ‌ర్గంనుంచే పీఠం ఎక్కారు గ‌నుక  ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి నిద్ర‌ లేకుండా చేస్తామ‌ని చూచాయిగా హెచ్చ‌రించ‌డానికి ఇలా చేశారేమోన‌న్న అనుమానాలు విన‌వ‌స్తున్నా య‌ని రాజ‌కీయ విశ్లేష కులు అంటున్నారు.  ఖ‌ర్గే మొద‌టి వ‌రుస‌లోనే కూచున్నారు. కానీ పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాలులో ఎడ‌వేపు చిట్ట‌చివార్న‌! బిజెపీ ఛీఫ్ జె.పి.న‌డ్డా, మ‌హారాష్ట్ర డిప్యూటీ ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌ల‌కు కాస్తంత ప్రాధాన్య‌తా స్థానాలే క‌ల్పించారు. ఇదంతా రాజ‌కీయ కుట్రేన‌ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కేంద్ర హోంశాఖ ఘోరంగా అవ‌మా నిం చ‌డమేన‌ని  కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

మంకీ పాక్స్ .. ప్ర‌జారోగ్యానికి మ‌రో ముప్పు

చాలామంది అనుకుంటున్న‌ట్లుగా మంకీపాక్స్ అనేది కొత్త జ‌బ్బు కాదు. దీన్ని మొద‌టిసారిగా 1970ల్లోనే గుర్తించారు. ఈ వైర‌స్ కోతులు, రాడెంట్స్ ద్వారా వ‌స్తుంది. అయితే ఇది మ‌నుషుల‌తో మ‌రీ ద‌గ్గ‌ర‌గా మ‌సలితేనే మ‌నుషుల్లో విస్త‌రిస్తున్న‌ద‌ని ప్ర‌స్తుతం భార‌త్‌లో ఉన్న కేసుల ద్వారా డాక్ట‌ర్లు తెలుసుకున్నా రు. మ‌న దేశంలో మంకీపాక్స్ మొద‌టి కేసు ఈ నెల‌లోనే కేర‌ళ‌లో గుర్తించారు. మంకీపాక్స్ మశూచితో పోలిస్తే సారూప్యత క‌లిగి ఉంది. కానీ తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది  కూడా ఒక అంటువ్యాధి.  కోవిడ్‌-19 యిత‌ర అంటువ్యాధుల వ‌లె మంకీపాక్స్ గాలిసోకితే విస్త‌రించే వ్యాధి కాదు. కానీ ప్ర‌మాద‌క‌ర‌మే. దీని పూర్తి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికి ఒక‌టి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంది. సుమారు 75 దేశాల్లో ఈ అంటువ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఆఫ్రికాలో న‌లుగురు మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూ హెచ్ ఓ  ప్ర‌క‌టించింది.  ఇది ఎంతో త్వ‌ర‌గానే ఇత‌రుల‌కు విస్త‌రిస్తుంది. కానీ దీన్ని గుర్తించే ప‌రీక్ష‌లు క‌ష్ట‌సాధ్యం. భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అయిదు కేసులు న‌మోద‌యిన‌ప్ప‌టికీ, ప‌రీక్ష‌ల‌కు ఇంకా వీలు క‌ల‌గ‌డం లేదుగ‌నుక ఈ కేసు ల సంఖ్య పెర‌గ‌వ‌చ్చ‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు ఆందోళ‌న‌ప‌డుతున్నారు.  పేరు విచిత్రంగా ఉండ‌డంతో, కేవ‌లం కోతుల ద్వారానే ఈ అంటువ్యాధి విస్త‌రిస్తుంద‌ని, మ‌నుషుల‌తో ఇది విస్త‌రించ‌ద‌న్న అభిప్రాయం ప్ర‌చారంలో ఉంది. అయితే  ఇది ఇప్పుడే తెలిసింది గ‌నుక  దీన్ని గురించిన ప్ర‌చారాల‌తో ఖంగారుప‌డ‌వ‌ద్ద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చిస్తోంది. ఎలాంటి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని అధికారులు అంటున్నారు. కోతులు, యితర జంతువుల‌కు దూరంగా ఉండ‌డం వ‌ల్ల ఇది రాకుండా జాగ్త త్త ప‌డ‌వ‌చ్చ‌న్న విష‌యంలో వాస్త‌వం లేద‌ని అంటున్నారు. మంకీపాక్స్ వ‌చ్చిన‌వారు, ఆ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారితో స‌న్నిహితంగా ఉండేవారికి అది విస్త‌రించే అవ‌కాశం ఉంది త‌ప్ప కోవిడ్‌వ‌లె  విస్త‌రిం చద‌ని  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  మంకీపాక్స్‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి స‌న్నిహితంగా,  దూరంగా ఉన్న వారు కూడా స‌ర‌యిన ఆరోగ్య జాగ్ర త్త‌లు పాటించాల్సి ఉంటుది.  అయితే దీన్ని గురించి త‌ప్పుడు స‌మా చారం, అర్ధంలేని పుకార్ల‌తోనే ప్ర‌పంచ దేశాల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయని అంటున్నారు.  శ‌రీరం మీద ఎర్ర‌టి మ‌చ్చ‌లు ఏర్ప డ‌డం, నోటినుంచి ఉమ్మిరావ‌డం, నోటి నుంచి తుప్ప‌ర్లు ప‌డ‌డం వాటి వ‌ల్ల ఈ  మంకీపాక్స్ త్వ‌ర‌గా విస్త రించే అవ‌కాశం ఉంది.  శ‌రీరం మీద ఎర్ర‌టి మ‌చ్చ‌లు, పుండ్లు వంటివి ఏర్ప‌డితే మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా డాక్ట‌రును సంప్ర దించ‌డ‌మే మేలు. మంకీపాక్స్ అనుమానాలు ఉంటే త్వ‌ర‌ప‌డి చికిత్స‌కు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాలి. లేకుం టే మంకీపాక్స్ కూడా తీవ్ర‌రూపం దాల్చే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇప్ప‌టికే కోవిడ్‌-19తో  ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌లు ఆరోగ్య‌, సామాజిక ప‌రిస్థితులు దెబ్బ‌తిని ఎంతో న‌ష్ట‌పోయారు. ఈ అనుభ‌వంతో మంకీపాక్స్‌ను  ముందే గ్ర‌హించి త‌గు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ఎంత‌యినా అవ‌స‌రం. మంకీపాక్స్ వ‌చ్చింద‌నే అనుమానాలు వ‌స్తే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ఆరోగ్య‌సంస్థ ప్ర‌క‌టించింది. అవే మంటే.. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి దూరంగా ఉండాలి. అంటే ఎవ‌ర‌న్నా ఎర్ర‌టి మ‌చ్చ‌లు, దుర ద‌లు వంటివి ఉంటే వారికి దూరంగా ఉండాలి. ఆ అనుమానాలు ఉన్న వ్య‌క్తి కి సంబంధించిన  ఏ వస్తు వుల‌నూ పంచుకోరాదు. కోవిడ్‌-19 స‌మ‌యంలో ఉప‌యోగించిన‌ట్టు శానిటైజ‌ర్‌ను నిత్యం ఉప‌యోగించాలి. ప్ర‌స్తుతం ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. 

ఆలస్యం అయితే అడ్రస్ గల్లంతే.. ఇద్దరు సిఎంలకు పీకే హెచ్చరిక

ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. ఇది అందరికీ తెలిసిన సామెత. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ సామెత వర్తిస్తుందా, అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుందని అంటున్నారు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్. నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయనే ప్ర‌చారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ ప్రచారానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా, ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో పనిచేస్తున్న ప్యాక్ సంస్థ, ఆ సంస్థ తరపునే  తెలంగాణలో  తెరాసకు ప్రశాంత్ కిశోర్, ఏపీలో వైసీపీకి ఆయ‌న స‌హ‌చ‌రుడు రుషిరాజ్‌సింగ్ వ్యుహకర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రలో ఐ ప్యాక్ నిర్వహించిన సర్వే ఆధారంగానే, ముందస్తు ఎన్నికల ప్రచారం తెరమీదకు వచ్చింది.  అయితే,గత కొంత కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముందస్తు ఎన్నికల విషయంలో పునరాలోచనలో ఉన్నారని, ఒకడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా, అటూ ఇటూ ఊగుతున్నారని  వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందుగా అసెంబ్లీని రద్దు చేసి కూర్చుంటే, ఆతర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించక పోయినా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనా విధించినా, వ్యూహం బెడిసి కొడుతుందని తతపటాయిస్తున్నారు. అందుకే ఆయన  కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా  ఎన్నికల తేదీలు ప్రకటిస్తే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అది జరిగే పని కాదు అనుకోండి అది వేరే విషయం.  అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు అయితే కనిపించడం లేదు. కానీ, ఆ ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఏపెలో ప్రభుత్వ వ్యతిరేకత దినదినాభివృద్ధి కాదు, క్షనక్షణాభివృద్ది చెందుతోందని ఐ ప్యాక్’ సర్వేలు సూచిస్తున్నాయి. అలాగని ముందస్తుకు వెళ్ళినా గెలుపు అవకాశాలు 30  శాతం దిగువకు పడిపోయాయని, అదే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఎటూ ఓడిపోవడం ఖాయమని తెలిసినప్పుడు మునస్తుకు వెళ్ళడం ఎందుకని, వైసీపీలో చర్చ జరుగుతోంది.   ఈ నేపధ్యంలో, ప్రశాంత్ కిశోర్’ ఎన్నికలు దూరం అయ్యేకొద్దీ సర్కార్ వారి బొక్కలు మరింతగా బయటపడి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభంజనంగా మారుతుందని,, ఆ ప్రభంజనాన్ని తట్టుకోవం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అయ్యే పని కాదని  ప్రశాంత్ కిశోర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఎన్నికలు వెనక్కి వెళ్ళీ కొద్దీ, అక్కడ ఇక్కడ కూడా, అధికార తెరాస, వైసీపీలు రెండూ ఓటమికి దగ్గరవుతాయని కూడా ప్రశాంత్ కిశోర్  స్పష్టం చేశారని అంటున్నారు. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని, అయినా పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మ‌ల‌చుకునే స్థితిలో ప్ర‌తిప‌క్షాలు లేవ‌ని, దీన్ని అవ‌కాశంగా తీసుకొని రాజ‌కీయ శూన్య‌త‌ను మ‌రోసారి భ‌ర్తీచేసుకోవాలని పీకే ప్పిన‌ట్లు తెలిసింది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీజేపీ అధికార టీఆర్ఎస్‌ను ఢీకొడుతున్నాయి. ఏపీలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ జోరుమీద ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంవ‌ల్ల ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టిక‌ప్పుడు అధికార ప‌క్షాన్ని ఢీకొట్ట‌లేవ‌ని, అలాకాకుండా సాచివేత ధోర‌ణితో ఆల‌స్యం చేసుకుంటూ వెళితే మీకే ప్ర‌మాదంటూ పీకే ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను హెచ్చ‌రించార‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రికి రెండు రాష్ట్రాల ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ఒక అంచ‌నాకు వ‌చ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.

ఒకే రోజు త‌ల్లుల‌యిన  ఒకే పేరున్న స్నేహితులు

బాల్య‌స్నేహాలు చాలా కాలం కొన‌సాగ‌వ‌చ్చు. ఒక్క‌రిద్ద‌రే మ‌రీ ఆత్మీయంగా చివ‌రంటా ఉండ‌వ‌చ్చు. కానీ కొంద‌రు చాలా చిత్రంగా క‌లుస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒకే పేరున్నవారు. ఉదాహ‌ర‌ణ‌కు ఈ ఆష్లేలు!  ఈ ఇద్ద‌రు మంచి స్నేహితులు. ఇద్ద‌రికి ఒకే రోజు పిల్ల‌లు పుట్టారు. ఇంత‌కంటే ఆనందం మ‌రోటి ఉంటుందా?  వారి స్నేహం మ‌రంత విక‌సించింది. ఇద్ద‌రూ మ‌న పాత సినిమాల్లోలా అక్కా, చెల్లీ అంటూ కాస్తంత భారీ అతి క‌రుణాత్మ‌క ఆత్మీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం లేదుగానీ ఇద్ద‌రి అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు దాదాపు ఒక‌టేన‌ట‌! ఏ దేశం, ఏ న‌గ‌రం అనేది తెలియ‌లేదు కానీ, ఆష్లే రే, ఆష్లే హెన్స‌న్.. ఇద్ద‌రు మంచి స్నేహితులు. అనేక ర‌కాలుగా  ఇద్ద‌రికీ సారూప్య‌త ఉంది. ఇద్ద‌రూ త‌మ కాలేజీ స్నేహితుల‌నే పెళ్లాడారు. ఇద్ద‌రి  తీరు తెన్ను లూ ఒకేర‌కం. ఇద్ద‌రి కుటుంబాలు ప‌క్క‌ప‌క్క‌నే.  పెళ్ల‌యిన త‌ర్వాత వీరి స్నేహం ఒకింత బాగా చిక్క‌న‌ యింది. చిన్న చిన్న విష‌యాలు పంచుకునేవారు. అనేకానేక సంగ‌తులు, అల్ల‌ర్లు చెప్పుకుంటూ  కాలం గ‌డుపు తున్నారు.  ఇద్ద‌రూ  గ‌ర్భందాల్చారు. కానీ ఎవ‌రూ త‌మ ప్రాంతాన్ని వ‌దిలి వెళ్ల‌లేదు. అక్క‌డే  ఉన్నారు. డాక్ట‌ర్ల‌ను సంప్రదించారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆస్ప‌త్రికీ క‌లిసే వెళ్లారు. చిత్ర‌మేమంటే ఇద్ద‌రు సంప్ర‌దించిందీ  ఒకే డాక్ట‌ర్‌ని. అందువ‌ల్ల వారి మ‌ధ్య ఆస్ప‌త్రి, మందులు విష‌యాల్లో ఎలాంటి ఇబ్బందీ త‌లెత్త‌లేదు. అందు వ‌ల్ల భ‌యాందోళ‌న‌కూ గురికాలేదు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 22న ఇద్ద‌రికీ ఆడ‌బిడ్డ‌లు క‌లిగారు.  ఆ ఇద్ద‌రికీ ఒకే లాంటి డ్ర‌స్‌లు వేసి ఇద్ద‌రూ ఎత్తుకుని ఫోటోలు తీయించుకున్నారు.  ఈ చిన్నారి ఆష్లేలూ మ‌రి వారి త‌ల్లుల్లా క‌లిసి ఉంటార‌నే అనుకుంటున్నారంతా. ఒకే ప‌ట్ట‌ణం, ఒకే ప్రాంతం, ప‌క్క‌ప‌క్క‌నే నివాసాలు, ఒకే స్కూలు. స‌రే బాల్య మిత్రుల‌యితే మ‌రి గిచ్చుకోడాలు, గిల్ల‌డాలు, ఏడ‌వ‌డం త‌ల్లుల‌కు ముద్దుగా ఫిర్యాదులు చేయ‌డం మామూలే. అప్పుడు పెద్ద ఆష్లేలు మ‌రింత ఆనంది స్తారు. అదే జీవ‌న మాధుర్యం. 

జగన్ నియోజకవర్గాల వారీ సమావేశాలు జరిగేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్రతి మాటా, ప్రతి కదలికా, ప్రతి చర్యా, ప్రతి ప్రసంగం ఆ విషయాన్నే చెబుతుంది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా అంటే మాత్రం కనీసం పార్టీ శ్రేణుల నుంచి కూడా ఔననే సమాధానం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అందులో వైసీపీ వాళ్లు మినహాయింపు ఎంత మాత్రం కాదు. నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేద్దామని ప్రయత్నించే ఎమ్మెల్యేలకు ఆయన దర్శనమే దొరకదు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్క సారి కూడా సీఎంను కలుసుకోవడానికి కనీస అవకాశం దొరకని ఎమ్మెల్యేల సంఖ్య వందకు పైగానే ఉంటుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. జగన్ చెబుతున్నట్లు వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరిగే పని కాదని ఆ పార్టీ వారే పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తే ముందుగా చర్చకు వచ్చేది ఆ నియోజకవర్గంలోని సమస్యలేనని అంటున్నారు. అయితే ఆ సమస్యలను అడ్రెస్ చేసే తీరిక కానీ, ఓపిక కానీ జగన్ కు లేవనడానికి గడప గడపకూలో ఎదురౌతున్న సమస్యలను జగన్ కు తెలియజెప్పడానికి యత్నించిన ఎమ్మెల్యేలకు ఆయన విసుగు, చిరాకు ఎదురైన సంగతిని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నరు. రోజుకు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గానికి చెందిన ఓ 50మంది ముఖ్యులతో సమావేశమైనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. ఒక వైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, మరో వైపు నియోజకవర్గాల వారీగా సమావేశాలు అంటే ఎమ్మెల్యేలు రెంటినీ అవాయిడ్ చేసే అవకావం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. నియోజకవర్గాల వారీ సమావేశాలలో అనివార్యంగా ప్రజా సమస్యలే ముందుగా చర్చకు వస్తాయి. అవి చర్చకు రాగానే వాటి పరిష్కారాన్ని సీఎం సూచించాలి. అలా సూచించడానికైనా ముందుగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేయాలి. ఏ విధంగా చూసినా ఇప్పుడు నియోజకవర్గాలలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే పరిస్థితే లేదు. వీటన్నిటికీ మించి తమ ప్రభుత్వంపై నమ్మకంతో పార్టీ నేతలకు చేసిన పనులకు ఇన్నేళ్లుగా బిల్లులు రాలేదు. ఆ బిల్లులు చెల్లించకుండా జగన్ మాత్రం ఏ ముఖం పెట్టుకుని వారితో సమావేశం కాగలరు అని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. చివరాఖరికి ఇటీవలి వరదల సమయంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చిన పడవలకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు వడుదల చేస్తుందని ఆశించడం దురాశే అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో జగన్ చెప్పినట్లుగా వచ్చే నెలనుంచి నియోజకవర్గాల వారీ సమావేశాలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి పార్టీ శ్రేణులు.  

మినిస్టర్ రోజా కొత్త వ్యాపారం!?

ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా కొత్త బెంజ్ కారు కొన్నారు. ప్రత్యేకించి చెప్పుకోడానికి ఇందులో కొత్తేమి ఉందని అనుకుంటున్నారా? మంత్రులు ఖరీదైన, విలాసవంతమైన కొత్త కార్లు కొనుక్కోవడంలో వింతేమి ఉంటుంది? అంటే ఉందనే సమాధానం చెబుతోంది ప్రతిపక్ష సోషల్ మీడియా. ఎందుకంటే మంత్రి అయిన మూడు నెలలకే కొత్త బెంజ్ కారును రోజా కోటిన్నర రూపాయలు పెట్టి కొనడం. తన కొడుకు కౌశిక్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకే దాన్ని కొన్నట్లు స్వయంగా ఆమె చెప్పుకున్నారు. ఆ కారును రోజా తన కొడుకుతో కలిసి ఓ రేంజ్ లో ఆర్భాటంగా ఆవిష్కరించి, భర్త, కొడుకు, కుమార్తెను ఎక్కించుకుని ఫస్ట్ రైడ్ కు వెళ్లిన వీడియోని తన సోషల్ మీడియా పేజిలో పోస్టు పెట్టారు. సినీ నటిగా గతంలో బాగానే సంపాదించిన రోజా అనంతరం టీవీ షోల్లో కూడా పెద్ద మొత్తంలో పారితోషికాలు తీసుకున్నట్లు చెబుతారు. మంత్రి కాక ముందు ఆమె ఏపీఐఐసీ చైర్మన్ గా పనిచేశారు. అక్కడా ఆమెకు లక్షల రూపాయలు ముట్టేదంటారు. ఇప్పుడు మంత్రి అయ్యాక జీతం, ఇతర అలవెన్సులు కలిపి భారీగానే వస్తున్నాయి. దాంతో పాటు రోజా ఓ కొత్త వ్యాపారం కూడా మొదలెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికైనా అపాయింట్ ఇవ్వాలంటే వారి నుంచి పెద్ద  మొత్తంలో సొమ్ములు లాగేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైతేనేం రోజా బెంజ్ కారు కొని కొడుకుకు గిఫ్ట్ గా ఇవ్వడం వెనుక ఆమె ఆదాయం మీద ప్రముఖంగా చర్చ జరుగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా నిరంతరం విమర్శలతో విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ రోజాపై టీడీపీ సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. ‘ఇదిగో.. ఇది వింటున్నారా?.. మంత్రి రోజా కొత్త వ్యాపారం మొదలెట్టారు’. ‘మంత్రి గారికి అపాయింట్ మెంట్ లో బాగానే వస్తున్నట్లున్నాయి. బాగానే వెనకేశారు’ అంటూ రోజా వీడియోపై  సోషల్ మీడియా వేదికగా  నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. జగన్ కేబినెట్లో ‘కరప్షన్ క్వీన్లు రోజా, విడదల రజని’ అన్న ఆరోపణలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి. అపాయింట్ మెంట్ కోసం వచ్చే వారి నుంచి రోజా, రజని 50 వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోను తెలుగు తమ్ముళ్లు కూడా పెద్ద ఎత్తున షేర్లు చేస్తుండడం గమనార్హం. తమ అభిమాన నటుడు, నేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే రోజాను ఆయన అభిమానులు, జనసైనికులు మాత్రం ఎందుకు వదిలిపెడతారు? ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే పవర్ స్టార్ కోటిన్నర రూపాయలు పెట్టి 8 వాహనాలు కొంటే ప్యాకేజీ అని మొరిగిన కుక్కలు రోజా బెంజ్ కారుపై సమాధానం చెప్పాలంటున్నారు.  పర్యాటక మంత్రిగా నెలకు లక్షా 25 వేలు జీతం తీసుకునే రోజా ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని కోటిన్నరతో బెంజ్ కారు కొన్నారో చెప్పాలని నిలదీస్తున్నారు.   అయితే.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ పై ఫైర్ బ్రాండ్ రోజా ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. కానీ రోజా అనుచరులు మాత్రం టీడీపీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. సినిమాలు, టీవీ షోల్లో రాణించిన రోజా బెంజ్ కారు కొనలేనంత దారుణమైన స్థితిలో లేరంటున్నారు. అడ్డదారిలో సంపాదించాల్సిన అగత్యం రోజాకు లేదంటున్నారు. కానీ ‘తాను ఆర్థికంగా అంత ధనికురాలిని కాద’ని రోజాయే స్వయంగా చెప్పిన మాటల వీడియో క్లిప్పింగ్ ను పట్టుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మొత్తానికి మంత్రి రోజా కొత్త కారు వ్యవహారం సంచలనంగా మారింది. మరి ఫైర్ బ్రాండ్ రోజా దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

సీబీఐ అటు నుంచి నరుక్కొస్తోందా?!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో తిరిగినన్ని, తిరుగుతున్నన్ని మలుపులు గతంలో ఏ కేసులోనూ జరిగి ఉండక పోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది. తన సొంత ఇంట్లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. వివేకా అన్న కొడుకు వైఎస్ జగన్ విపక్ష నేత. వివేకా మరణించారన్న వార్త బయటకు రాగానే ఆయన గుండె పోటుతో మరణించారంటూ జగన్, ఆయన అనుచరులు విజయసాయి తదితరులంతా ఒకరి తరువాత ఒకరు ప్రకటనలు గుప్పించేశారు. గంటల వ్యవధిలోనే వివేకా గుండె పోటుతో మరణించలేదు... ఆయన హత్యకు గురయ్యారన్నది వెల్లడైంది. అంతే జగన్ తదితరులందరి స్వరం మారిపోయింది. చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఈ హత్య వెనుక ఉందంటూ విమర్శలు గుప్పించి.. ఎన్నికలలో సానుభూతి పవనాల కోసం తమ వంతు ప్రయత్నం చేసేశారు. ఆయన హత్యపై సీబీఐ విచారణకు స్వయంగా జగన్ డిమాండ్ చేశారు. సరే ఆ తరువాత జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత తన సొంత బాబాయ్ వివేకా హత్య కేసు విచారణను నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ఆయనే అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మాత్రం తన తండ్రి హత్య కేసులో  సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అంగీకరించి కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఏపీలో సీబీఐ అయినా, అంత కంటే గోప్ప సంస్థైనా సరే చేయగలిగేదీ ఏదీ ఉండదని జగన్ సర్కార్ హయాంలో నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. కేసు దర్యాపు వేగంగా జరుగుతున్న సమయంలో సీబీఐకి బెదరింపులు వచ్చాయి. సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు దాఖలయ్యాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వివేకా హత్య విచారణ సజావుగా సాగకుండా ఆపే యత్నమే. దీంతో గత కొంత కాలంగా సీబీఐ ఈ హత్య కేసు విషయంలో సైలెంటైపోయింది. అంతకు ముందు ఈ హత్య కేసులో అరెస్టయిన ఎవన్ ముద్దాయి ఎర్రగంగిరెడ్డి బెయిలు  రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అప్పటికే వివేకా హత్య కేసులో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సీబీఐ విచారణ విషయంలో హఠాత్తుగా మౌనం వహించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో  కొందరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ పరిస్థితుల్లో గత కొంత కాలంగా మౌనంగా ఉన్న సీబీఐ హఠాత్తుగా ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. ఎర్రగంగిరెడ్డి బెయిలుపై ఉంటే సాక్షులను బెదరించే, ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. దీంతో ఇక వివేకా హత్య కేసు విచారణ వేగవంతం య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు విచారణలో ఎర్రగంగిరెడ్డి బెయిలు పిటిషన్ పై సుప్రీం నిర్ణయం అత్యంత కీలకం కానున్నద.