పార్లమెంట్ లోపలా , బయట ఒకటే సీన్ ..
posted on Jul 26, 2022 @ 5:54PM
ఓ వంక పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల. ద్రవ్యోల్బణం పై చర్చకు పట్టు పడుతున్నాయి. సభా కార్యక్రమాలను స్తంబింప చేస్తున్నాయి. ఉభయ సభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. సోమ వారం (జులై 25) లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ సభ్యులను ప్రస్తుత వర్షాకాలసమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. మంగళవారం (జులై 26) పెద్దల సభలో ఏకంగా 19 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. డిఎంకే, టీఎంసీ, తెరాసకు చెందిన ఈ 19 మంది సభ్యులపై ఈ వారంతం వరకు సస్పెన్షన్ వేటు వేశారు.
నిజానికి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటిరోజు నుంచి ప్రతి రోజు కొంచెం అటు ఇటుగా ఇదే కథ నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చకు పట్టుబడుతుంటే, ప్రభుత్వం చర్చకు సిద్ధమే, కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత, ధరలు, ద్రవ్యోల్బణం అంశాన్ని చర్చిద్దామని అంటోంది. అయితే, అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నాయి. ఆర్థిక మంత్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వం అత్యవసరంగా చర్చించవలసిన ధరలు, ద్రవ్యోల్బణం చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి.
అదొక అంతులేని కథ. వరసగా ఏడవ రోజు కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. అదలా ఉంటే, పార్లమెంట్ వెలుపల కూడా రసవత్తర రాజకీయమే నడుస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. గత వారంలో ఫస్ట్ రౌండ్ విచారణ పూర్తి చేసిన ఈడీ ఈ రోజు సెకండ్ రౌండ్ విచారణ జరుపుతోంది. మరో వంక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధిని విచారించడం అంటే భారత మాతను బోనులో నిలబెట్టడమే అనే విధంగా ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలియచేస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా, ఢిల్లీ విజయ్ చౌక్‌లో, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి తరలించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. రాహుల్ గాంధీ చాలా సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీ పాటుగా, లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పని చేస్తోన్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన దర్యాప్తు ఏజెన్సీలను ప్రధాని మోడీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోన్నారని ధ్వజమెత్తారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సభా కార్యక్రమాలను స్తంబింప చేయడం ద్వారా ప్రతిపక్షాలు, ప్రభుత్వానికి మేలు చేస్తున్నాయని అంటున్నారు. ప్రజాసమస్యలు పక్కకు పోయి రాజకీయ వివాదాలకు పార్లమెంట్ వేదిక కావడం అత్యంత దురదృష్టకరంగా విశ్లేషకులు భావిస్తున్నారు.