తానేటి వనిత ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం
posted on Jul 26, 2022 @ 3:35PM
వైసీపీకి కష్టాలన్నీ ఒకే సారి కట్టకట్టుకుని వస్తున్నట్లున్నాయి. నిన్న మొన్నటి వరకూ విపక్షం ఎంతగా విమర్శించినా గుట్టుగా ఉన్న అడ్డగోలు అప్పుల వ్యవహారం కేంద్రంపార్లమెంటు సాక్షిగా బట్టబయలు చేసేసింది. అసలు అడ్డగోలుగా, ఇష్టారీతిగా అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా ఊపిన కేంద్రమే ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ చూపేసింది. కేవలం జగన్ సర్కార్ ను సహాయపడటానికే, అడ్డగోలుగా అప్పులు తీసుకోవడానికే జగన్ సర్కార్ కేవలం అప్పుల కోసమే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎ్‌సడీసీ)ను ఏర్పాటు చేసింది. అడ్డగోలుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు దండుకుంది.
యూపీ సహా పలు రాష్ట్రాలూ దీనినే అనుసరించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా కేంద్రం కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా వ్యవహరించింది. ఇప్పుడు మాత్రం అడ్డగొలు అప్పులపై శ్రీలంకను బూచిగా చూపి రాష్ట్రాలను హెచ్చరిస్తున్నది. కేంద్రం రాష్ట్రం అప్పులకు చెక్ పెట్టడంతో ముందు ముందు జగన్ సర్కార్ పీకలోతు ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి ఇక ఈ స్థాయి సహకారం ఉండదని స్పష్టంగా తేలిపోవడంతో ప్రభుత్వంలో గాభరా మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా జగన్ సర్కార్ కు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది.
జగన్ సర్కార్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని సర్వేలో తేలింది. అలాగే గడప గడపకూ కార్యక్రమంలో ఎదురౌతున్న నిరసనలు.. ఇవి చాలవన్నట్లు ప్రతిష్టాత్మక అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పరాజయం ఎదురైంది. అక్కడా ఇక్కడా కాదు సాక్షాత్తూ హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గమైన కొవ్వూరులో. అది కూడా ఏకగ్రీవంగా విపక్ష తెలుగుదేశం కైవశం చేసుకుంది.
కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన అర్బన్ బ్యాంకు ఎన్నికలలో సొంత అభ్యర్థులను గెలిపించుకోలేక మొత్తం 11డైరెక్టర్ స్థానాలనూ విపక్ష తెలుగుదేశం పార్టీకి ధారాదత్తం చేసేశారు. 2019లో విజయం తరువాత వైసీపీకి తగిలిన భారీ షాక్ ఇదేనని చెప్పాలి. బ్యాంకుచైర్మన్ గా తెలుగుదేశంకు చెందిన మద్దిపట్ల శివరామృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే11మంది డైరెక్టర్లూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరాజయం తానేటి వనిత సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం సత్తాను, వైసీపీ బలహీనతను చాటాయని పరిశీలకులు అంటున్నారు.