జగనన్న గోరుముద్ద పథకంలో పురుగుల చిక్కీలు!
posted on Jul 26, 2022 @ 4:48PM
జగనన్న పాలనలాగే ఆయన పేరున ప్రారంభించి జగనన్న గోరు ముద్ద పథకం కూడా పక్కదారి పట్టిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ పథకం కింద పురుగులు పట్టిన చిక్కీలు పంపినీ చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు వచ్చాయి. పురుగులను గమనించిన వెంటనే విద్యార్థులు వాటిని తినకుండా విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో విద్యార్థులు ఫుడ్ పాయిజినింగ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది.
ఈ పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులను విద్యార్థులు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ కొన్ని చిక్కీలు పురుగులు పట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. పురుగులను గుర్తించిన వెంటనే ఆ చిక్కీలను తీసివేసి వేరు చిక్కీలు ఇచ్చామని వివరించారు. అయితే ఇలా పురుగులు రావడం ఇదే తొలి సారి కాదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు వచ్చిన సంఘటనలు ఉన్నాయని వారు తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం కింద నాసిరకం చిక్కీలను, కాలం చెల్లిన వస్తువులను ఇవ్వడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. కాగా చిక్కీలలో పురుగుల సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.