పని మొదలెట్టేసిన ఈటల.. తెరాస నుంచి వలసలు షురూ అవుతాయా?
posted on Jul 26, 2022 @ 12:11AM
బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పని మొదలెట్టేశారు. బీజేపీ అధిష్ఠానం అప్పగించిన పని ప్రారంభించేశారు. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసేశారు. టిఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు రానున్న రోజులలో కమలం గూటికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈటల స్వయంగా చెప్పారు.
అంతేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులకు కేసీఆర్ పై కంటే తనపైనే ఎక్కువ విశ్వాసమని ఈటల పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పార్టీలోకి చేరికలపై దృష్టి సారించాలని సూచించారనీ, అందుకే చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమించారనీ బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ గతంలో టీఆర్ఎస్ లో కీలక నేత. కేసీఆర్ కేబినెట్ లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా ఈటల పని చేశారు. ఆ తరువాత కేసీఆర్ తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. ఆ కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో కమలం పార్టీ అభ్యర్థిగా తెరాసపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాను విజయం సాధించినది టీఆర్ఎస్ అభ్యర్థిపై కాదనీ కేసీఆర్ పైనేననీ ఈటల పలు సందర్బాలలో చెప్పారు. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డారు. కేవలం ఆ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్ని చేసినా ఈటల విజయాన్ని నిలువరించడంలో మాత్రం కేసీఆర్ విఫలమయ్యారు.
అందుకే తన విజయం టీఆర్ఎస్ అభ్యర్థిపై కాదనీ కేసీఆర్ పైనేనని ఈటల చెబుతున్నారు. తాను వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ ను ఆయన ఇలాకాలోనే ఓడిస్తానని సవాల్ కూడా చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఈటలతో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్న సంగతి విదితమే. ముఖ్యంగా పీకే సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయించనున్నట్లు కేసీఆర్ భావిస్తుండటం, పీకే సర్వేలో పలువురు సిట్టింగ్ ల పనితీరుపై ప్రజలలో అసంతృప్తి ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సిట్టింగులలో గుబులు మొదలైంది. అటువంటి వారంతా ఈటలకు టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఈటల ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లో తొలి నుంచీ పార్టీలో ఉన్న వారికీ, ఆ తరువాత అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చి చేరిన వారికీ మధ్య అగాధం పెరిగిపోయింది. ఈ పరిణామాలు బాగా తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ కావడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో, కెసిఆర్ నాయకత్వం పై తీవ్ర అసహనం తో ఉన్న నాయకులను గుర్తించి వారిని బిజెపి బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ అత్యధికులకు సీఎం కేసీఆర్ తో కంటే తనతోనే సాన్నిహిత్యం ఎక్కువ అని ఈటల చెబుతున్నారు. వారితో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందనీ, వారంతా ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నారనీ ఆయన అన్నారు.
అమిత్ షా ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ గా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు. తనతో ప్రస్తుతం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల చెప్పారు.