తెలంగాణాలో మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు
posted on Jul 26, 2022 @ 4:50PM
ఆమధ్య భారీ వర్షాలు తెలంగాణాను ఒణికించాయి. తర్వాత కాస్తంత తగ్గుముఖం పట్టింది. ప్రజలు కాస్తంత ఆందోళననుంచి బయటపడ్డారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ నెల 30వ తేదీ దాకా భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా అప్పుడే రాష్ట్రంలో, రాజధాని నగరం హైదరాబాద్ లోనూ వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కుంభపోత వర్షం కారణంగా అనేక ప్రాంతా ల్లో నీళ్లు నిలిచి ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచే భారీ వర్షం ఆరంభమయింది. యాకత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలుచోట్ల సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. నీటి ప్రవా హంలో పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచి పోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్ 9.2 సెంటీ మీటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీ మీట ర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0 సెంటీమీటర్లు, బహదూర్‌పూరాలో 7.8 సెంటీ మీట ర్లు, చార్మినార్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.