చంద్రబాబుతో నటుడు మోహన్ బాబు భేటీ
posted on Jul 26, 2022 @ 10:48PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో నటుడు మోహన్ బాబు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్ బాబు ఆయనతో దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వీరిరువురి మధ్యా చర్చకు వచ్చిన అంశం ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఈ భేటీ అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ కూడా చర్చనీయాంశంగా మారింది.
తొలి నుంచీ తెలుగుదేశంలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. అయితే ఆ తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. తిరుపతిలోని తన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేశారు. తిరుపతిలో రాస్తారోకో, ధర్నా కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అనంతరం వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వలేదు. క్రమంగా మోహన్ బాబు కూడా రాజకీయాలకూ దూరంగా ఉంటూ వచ్చారు.
మధ్యలో ఒక సారి మోడీతో భేటీ అయినప్పటికీ.. ఆయన రాజకీయంగా క్రియాశీలంగా అయితే లేరు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బేటీ కావడం సంచలనం సృష్టించింది. మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.