సోనియా వ‌ద్ద‌కు కోమ‌టిరెడ్డి రాజీనామా లేఖ‌

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను గురు వారం (ఆగస్టు 4) పార్టీ అధినేత సోనియాగాంధీకి పంపించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్న ట్లు.. ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే 8వ తేదీన అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ స్పీకర్‌ను కోరారు. తన నియోజకవర్గమైన మునుగోడు  ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.  తెలంగాణాలో టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీ చేయ‌లేద‌ని, టీఆర్ ఎస్ అరాచ‌క పాల‌న పోవాలంటే అది బీజేపీతోనే సాధ్య‌మ‌న్న న‌మ్మ‌కంతోనే కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. స్పీకర్  అపా యింట్ మెంట్ తీసుకుని రాజీనామా లేఖను ఆయనకు స్వయంగా అందజేస్తానని వెల్లడించారు.  ఇదిలా ఉండ‌గా, బీజేపీ ప‌క్షాన చేరితే మునుగోడులో ఆ పార్టీ అభ్య‌ర్ధిగా  విజయం సాధిస్తానని  ధీమా వ్యక్తం చేశారు. అయితే అందుకు బీజేపీ   ఆ న‌మ్మ‌కం క‌లిగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించిన‌ట్లు  తెలు స్తోంది. త‌ప్ప‌కుండా గెల‌వ‌గ‌ల‌న‌ని కేంద్రంలో బీజేపీ నేత‌లు న‌మ్మితే త‌ప్ప‌కుండా  రాజ‌గోపాల్ రెడ్డికి కావ ల‌సిన మ‌ద్ద‌తు ల‌భిస్తుందని బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్రమైన దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై తాను స్పందించనని,  ఏమైనా ఉంటే రాజగోపాల్‌రెడ్డినే అడగాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు.  రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఉప ఎన్నికలా.. ముందస్తు ఎన్నికలా?!

వలసలు కాదు ఉప ఎన్నికలే అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటన్నది కుండ బద్దలు కొట్టేశారు. మునుగోడుతో సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం ఆగిపోదనీ, కనీసం మరో మూడు నాలుగు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కమలం గూటికి చేరడం ఖాయమని ఆయన చెప్పేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీలైనన్ని నియోజవకర్గాలలో ఉప ఎన్నికలు జరిగేలా కమలంపార్టీలోనికి వలసలు ఉంటాయనీ బండి సంజయ్ చెప్పారు. కోమటి రెడ్డ రాజగోపాల రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి వలసల ప్రవాహం ఆరంభమైనట్లేననీ, ఆలా ఆయా పార్టీల నుంచి వచ్చి కమలం గూటికి చేరే వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా తప్పని సరిగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఇదంతా టీఆర్ఎస్ ను కుదేలు చేయడానికి లేదా గాభరా పెట్టడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది పైన రెండు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  పరిస్థితుల్లో ఇలా వరుస ఉప ఎన్నికలను ఎదుర్కొన వలసి రావడం ఏ విధంగా చూసినా అధికార పార్టీకి లాయకీ కాదు. అందుకు టీఆర్ఎస్ ఏమీ మినహాయింపు కాదు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాలుగైదు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖాయం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండంటూ టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతున్నారు. ఒక వేళ బండి సంజయ్ అన్నట్లు కొన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే వస్తే కేసీఆర్ ముందస్తుపై తీవ్రంగా ఆలోచించక తప్పని సరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. బండి వ్యూహం కూడా అదేనని అంటున్నారు. కేసీఆర్ సాధారణంగా షెడ్యూల్ వరకూ ఆగకుండా ముందస్తుకే మొగ్గు చూపుతారు. 2014 ఎన్నికలలో విజయం తరువాత ఆయన ఏడాది ముందుగానే ముందస్తుకు వెళ్లి ఘన విజయాన్ని అందుకున్నారు. అదే ఫార్ములాను అనుసరించి ఈ సారి కూడా ముందస్తు యోచన చేసినా కేంద్రంలో బీజేపీతో సంబంధాలు చెడిన నేపథ్యంలో ముందస్తు కోసం అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం చక్రం తిప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ఎదురెత్తు వేస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. అయితే సిట్టింగ్ ల వరుస రాజీనామాలతో ఎక్కువ సంఖ్యలో ఉప ఎన్నికలను ఎదుర్కొన వలసి వస్తే మాత్రం కేసీఆర్ అనివార్యంగా ముందస్తు యోచనను ముందుకు తీసుకువస్తారన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే బండి సంజయ్ పదే పదే పలు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు అంటూ ఫీలర్లు వదులుతున్నారు. అయితే ఇప్పటి వరకూ కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వినా మరెవరూ కమలం గూటికి చేరబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించింది లేదు. వ్యూహాత్మకంగా పలువురు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఫీలర్లు వదులుతోంది. ఏది ఏమైనా రాజగోపాల రెడ్డి రాజీనామా చేసేశారు. అదే బాటలో మరి కొంత మంది నడిస్తే మాత్రం కేసీఆర్ ముందస్తు యోచనతో ముందుకు సాగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

గోరంట్లా.. ఉచ్ఛ నీచాలు మరిచావు.. తెలుగుదేశం ఫైర్

రాజ‌కీయ నాయ‌కునిగా, వైసీపీ ఎంపీగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకోవాల్సిన గోరంట్ల మాధ‌వ్ ఊహించ‌ని విధంగా చాలా అస‌భ్య‌క‌రంగా దొరికిపోయారు. ఒక మ‌హిళ‌తో మాధ‌వ్ న్యూడ్ వీడియోకాల్ మాట్లాడుతూ న్న క్లిప్పింగ్ ఒకటి  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు. వీడియో లీక్ కావడంతో వెంటనే మాధవ్‌పై సీఎం జగన్ చర్య లు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించా లని డిమాండ్ చేశారు. ఓ నిజాయతీ గల పోలీస్ అధికారి నని చెప్పుకుని.. ఆ ప్రచారంతోనే మాధవ్ ఎంపీగా గెలిచారని, కానీ సీఐగా కూడా గోరంట్ల మాధవ్ పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఎంపీగా కూడా ఆయన తీరు, వైఖరీ మారలేదనడానికి తాజీ వీడియోనే సాక్ష్యమని దుయ్యబడుతున్నారు. కాగ   నెటిజ‌న్లు,యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు ఆయ‌న తీరుపై మండిప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లాలో మాధ‌వ్ సీఐగా ప‌నిచేస్తున్న‌రోజుల్లో కూడా ఒక మ‌హిళ‌తో ఇదే విధంగా మాట్లాడార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తిం చ డంపై మహిళా సంఘాలు మండిపడుతు న్నా యి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన  ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు.  కాగా, ఆయన మాట్లాడిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు.   వైసీపీ నేతల  తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ  నేత బోండా ఉమా  అన్నారు. మీడి యాతో మాట్లాడుతూ, సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. అడ్డంగా దొరి కినా ఇంకా గోరంట్ల మాధవ్ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని విజయసాయి ట్వీట్‌ చేయాలని అన్నారు. ఎంపీ గోరంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేశ్‌ మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధిస్తున్నారని బొండా ఉమ బోండా ఉమా ఆరోపించారు. అలాగే అంబటి రాంబాబు విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ అసలు వైసీపీ నేతలెవరికీ మహిళల పట్ల గౌరవం లేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనితో మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుం టోందని టీడీపీ నేత, మాజీమంత్రి పీతల సుజాత  అన్నారు. ఎంపీ గోరంట్ల ఓ మహిళతో మాట్లాడిన న్యూడ్ వీడియో  కాల్‌పై స్పందించిన ఆమె  మీడియాతో మాట్లాడుతూ వీడియో కాల్‌కు.. జిమ్‌లో వీడియోకు తేడా తెలియదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.  మహిళల పట్ల అసభ్యంగా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌పై సీఎం జగన్ నాడు చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ విధంగా చేసేవారా? అని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీ మహిళా సత్తా ఏంటో చూపిస్తామని పీతల సుజాత అన్నారు.

రాజగోపాలా.. ఆసలు రాజీనామా ఎందుకు చేశావయా?

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రోజుల తరబడి కొనసాగించిన సస్పెన్స్ కు తన రాజీనామాతో తెర దించేశారు. మునుగోడు శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసేశారు. మునుగోడు ఉప ఎన్నిక జరగడం ఖాయమని తేల్చేశారు. అయితే రాజగోపాలరెడ్డి రాజీనామా రాజకీయంలో ఆయనకు ఎలాంటి క్లారిటీ లేదని తేటతెల్లమైపోయింది. రాజీనామా ఫీలర్ల సమయంలోనూ, రాజీనామాకు ముందూ, ఆ తరువాత ఆయన మీడియా సమావేశాలలో చెప్పిన అంశాలు, మాట్లాడిన మాటలూ వింటే అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం రాక మానదు. ఎందు కంటే ఆయా సందర్బాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఉన్న అయోమయాన్ని, కన్ఫ్యూజన్ ని ఎత్తి చూపాయి. ఒక సారి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని పీసీసీ చీఫ్ చేస్తే ఆయన కింద మేం పని చేయాలా? అని ప్రశ్నించిన రాజగోపాల్ కేవలం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించినందునే తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మరో సారేమో రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్నాననీ, అయితే కేసీఆర్ ను ఢీ కొనే సత్తా కాంగ్రెస్ లో లేదు కనుకనే పార్టీని వీడి కమల దళంలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. తీరా రాజీనామా చేసేసిన తరువాత ఇంత కాలంగా తన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనీ, ఉప ఎన్నిక వస్తేనైనా నియోజకవర్గ అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ చేపడుతుందన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. ఇలా ఆయన తన రాజీనామాకు ఒకటి కాదు ఏకంగా మూడు రకాల కారణాలు చెబుతున్నారు. పోనీ ఆ మూడు కారణాలతోనే తాను రాజీనామా చేశానని స్పష్టత ఇచ్చారా అంటే అదీ లేదు. ఒక్కో కారణాన్నీ ఒక్కోసందర్భంలో చెప్పారు. దీంతో అసలు ఆయన రాజీనామాకు కారణమేమిటా అని నియోజకవర్గం ప్రజలే తలలు గోక్కుని అయోమయంలో పడ్డారు. ఇక నెటిజనులైతే రాజగోపాల రెడ్డి అయోమయం, కన్ష్యూజనే మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిందన్నారు. ఇక షబ్బీర్ అలీ అయితే ఆయన ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని ఆరోపిస్తూ.. దాని నుంచి బయటపడడానికే కమలాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. సరే ఇప్పుడు ఇక ఎలాంటి సందేహం లేదు. మునుగోడు ఉప ఎన్నిక ఖాయం. రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేశారు. కమలం తీర్థం పుచ్చుకుంటారు. అందులోనూ సందేహం లేదు. కనీసం బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికలో నిలబడి నియోజకవర్గ ప్రచారానికి వచ్చినప్పుడైనా తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులేమిటన్నది క్లారిటీ ఇవ్వగలరా అంటే అదీ అనుమానమేనంటున్నారు పరిశీలకులు.  ఎందుకంటే ఒకటి రెండు నెలలు అటూ ఇటూగా ఏడాదిలోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపుగానే ఇప్పుడు హడావుడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెరతీయడమెందుకని ఆయన అనుచరులే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.రాజగోపాల రెడ్డి కన్ఫ్యూజన్ కారణంగా ఈ ఉప ఎన్నికలో బీజేపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే కలుగుతున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు, ఆయన బీజేపీలో చేరికకు పార్టీ అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో అయితే గాంధీ భవన్ లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని మరీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ రాజీనామా ప్రకటనతో చల్లబడిపోయిందనే చెప్పాలి. అందుకు ఆయన కన్ఫ్యూజనే కారణమని అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా ఆ రాజీనామా బీజేపీకి ఏం ప్రయోజనం అన్నది పక్కన పెడితే ఆయనకైనా ఉపయోగపడుతుందా అన్నదే.

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే బీజేపీకే కీలకం

మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే అయినా.. ఈ ఉప ఎన్నికను ఎన్నికల సంవత్సరంలో ఆహ్వానించడానికి బీజేపీ వినా మిగిలిన రెండు పార్టీలూ అంత సిద్ధంగా లేవు. ముఖ్యంగా టీఆర్ఎస్. మరో 14 నెలలలో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కొద్ది రోజుల కిందట ఫీలర్లు వదిలినా తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనించి ఆ ఊసెత్తడం లేదు. అయినా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ కు ఇదేమీ రుచించే విషయం కాదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఎంత మాత్రం లేదు.  ఇక  కాంగ్రెస్  విషయానికి వస్తే  మూమూలుగా అయితే ఉప ఎన్నికను పట్టించుకోవలసిన అవసరం ఆ పార్టీకి పెద్దగా లేదు. ఆ పార్టీ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. కానీ మునుగోడులో రాజీనామా చేసినది సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతికూల ఫలితం వస్తుందన్న జంకు ఆ పార్టీకి ఉంటుంది. అందు కోసం బలమైన అభ్యర్థిని ఉప ఎన్నికలో నిలబెట్టి సానుకూల ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తేంది అందులో సందేహం లేదు. కానీ మునుగోడు ఉప ఎన్నికలో నిజమైన సవాల్ మాత్రం బీజేపీకే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలో విజయం సాధించినా, పరాజయం పాలైనా టీఆర్ఎస్ కు ఒరిగేదీ లేదు, పోయేదీ లేదు. అంతోటి దాని కోసం మునుగోడుపై శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి సొమ్ములు గుమ్మరించే పని ఆ పార్టీ చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆ పార్టీ సమాయత్తమౌతోంది. శక్తియుక్తులన్నీ ఆ ఎన్నికల కోసమే వినియోగిస్తుంది కానీ ఓ ఆరు నెలల భాగ్యానికి మునుగోడులో చమటోడ్చే పని చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. అయినా ఉప ఎన్నికల సవాళ్లు, దాని వెనుక ఉండే వ్యూహాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే మొదలయ్యాయి. అందుకు ఉప ఎన్నిక సవాల్ ను స్వీకరించి బీజేపీ టీఆర్ఎస్ పడే అవకాశాలు లేవు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిన పరిస్థితులు రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసమేనని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా గుర్తించేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ బలోపేతం అయ్యిందంటే అందుకు పీసీసీ చీఫ్ గా రేవంత్ కష్టమే కారణం. అందుకే కేవలం రేవంత్ టార్గెట్ గా బీజేపీ రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి  ఉప ఎన్నికలలో ఆయననే గెలిపిస్తామన్న హామీ ఇచ్చిందని చెబుతున్నారు. సో.. మునుగోడులో కాంగ్రెస్ కు ఫలితం అటూ ఇటూ అయినా అది కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. ఆ వెంటనే జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే కాన్సన్ ట్రేట్ చేయమని రేవంత్ కు చెబుతుంది తప్ప అంతకు మించి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. ఇక మిగిలింది బీజేపీ. బీజేపీకి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక చావో రేవుతో సమానం. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఫలితం అటూ ఇటూ అయితే ఆ పార్టీ ఇంత కాలం రాష్ట్రంలో ఇచ్చిన బిల్డప్ అంతా గాలి బుడగలా తేలిపోతుంది. ఒక వేళ ఫలితం అనుకూలంగా వచ్చినా బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఏ మాత్రం కార్యకర్తల బలం లేని మునుగోడులో విజయం సాధించామని సంబరపడే అవకాశం కూడా ఆ పార్టీకి ఉండదు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవ్వాల్సి ఉంటుంది. అయినా సరే ఏ మాత్రం ఉపయోగం లేని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వచ్చేందుకు బీజేపీ శక్తియుక్తులన్నీ ఒడ్డక తప్పని పరిస్థితి. పరాజయం పాలైతే తెలంగాణలో అధికారం అన్న ఆశను ఆ పార్టీ ఇక వదిలేసుకోవలసిందే. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆ పరిస్థితి లేదు. మునుగోడు ఫలితం ఎలా వచ్చినా ఆ పార్టీల ప్రధాన లక్ష్యం మాత్రం అసెంబ్లీ ఎన్నికలే అన్న స్పష్టత ఆ పార్టీలలో ఉంది. బీజేపీ మాత్రం తెలంగాణలో తిరుగులేని బలం ఉందన్నది చాటుకోవడానికే ఒక విధంగా చెప్పాలంటే బలవంతంగా తీసుకువచ్చినది మునుగోడు ఉప ఎన్నిక కనుక ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆ పార్టీది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఆ పార్టీకి సానుకూలంగా వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు బీజేపీకి నల్లేరు మీద బండి నడక అవుతుందని భావించడానికి వీల్లేని పరిస్థితి.  

స్టాప్‌.. వ‌న్ మినిట్‌!

ట్రాఫిక్ నిబంధ‌న‌ల గురించి ఎంత చెప్పినా, ఎంత ప్ర‌చారం చేసినా జ‌నం మాత్రం వారి ప‌నుల హ‌డా వుడిలో అస‌లా నిబంధ‌న‌ల సంగ‌తి మ‌ర్చిపోతారు. వీలైతే దూసుకుపోవ‌డ‌మే త‌ప్ప ముందు ప్ర‌మా దానికి అవకాశం ఉంటుంద‌న్న ఆలోచ‌నకు తావీయ‌రు. సిగ్న‌ల్ అంటేనే వాహ‌న‌దారుల‌కు చిరాకు. ఇంటి నుంచి నేరు గా ఆఫీసుకి వెళిపోవాల‌నే అనుకుంటారు. సిగ్న‌ల్స్ పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు కేవ‌లం స్కూలు పాఠా నికే ప‌రిమితం చేస్తున్నారు. కానీ కుపాటా అనే  కుక్క‌పిల్ల మాత్రం చాలా క‌ఠినంగా  జీబ్రా క్రాసింగ్‌ను  ప‌హారా కాస్తూ వాహ‌నాల‌ను క‌ద‌ల‌నీయ‌లేదు.   ఏ దేశంలోనో, ఏ న‌గ‌రంలోనో తెలీదు గాని కుపాటా మాత్రం చాలా జాగ్ర‌త్త‌లు తెలిసిన బుజ్జి కుక్క‌పిల్ల‌. దీనికి త‌న య‌జమాని, ఆయ‌న పిల్ల‌ల్నే కాదు స్కూలుకి వెళ్లే పిల్ల‌ల్ని కూడా జాగ్ర‌త్త‌గా జీబ్రా క్రాసింగ్ దాటించాల‌న్న ప‌ట్టుద‌ల‌.  అస‌లు అన‌వ‌స‌రంగా గ‌ట్టిగా హార‌న్లు కొడుతూ కార్లూ, టూవీల‌ర్లు వెళ్ల‌డ‌మే దానికి  ఇష్టం లేదు. సిగ్న‌ల్స్ ద‌గ్గ‌రా చెవులు చిల్లులు ప‌డేలా హార‌న్లు కొడుతూండ‌డంతో మ‌నుషుల మీద దానికి విప‌రీత కోపం వ‌చ్చేసింది. అందుకే సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర ప‌హారాకి  సిద్ధ‌ప‌డింది.

బీజేపీ పెద్దిరెడ్డిని పట్టేస్తే వైసీపీ గతేంటి?

ఒక రాజ్యాన్ని వ‌శం చేసుకోవ‌డానికి స‌వాల‌క్ష వ్యూహాలు వేస్తారు. అది పాత‌కాలం రాజుల కాలం. అత్యాధు నిక కాలంలో అంత‌కంటే చురుగ్గా వ్యూహాలు వేస్తు లోక ప్ర‌సిద్ధుల‌వుతోంది భార‌తీయ జ‌న‌తాపార్టీవారే. బీజేపీ హేమాహేమీల కంటే మించిన వ్యూహ‌క‌ర్త‌లు, పావులు క‌ద‌ప‌డంలో ఆ చురుకుద‌నం ఎవ్వ‌రికీ ఉండ దు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ త‌మ ఆధిప‌త్యం చెలాయించాల‌న్న చిన్న కోరిక‌ను పెద్ద ప‌టం మీద అష్టాచ‌మ్మా ఆడి మ‌రీ అధికారం లాక్కొనే య‌త్నాలు చేయ‌డం వారితోనే సాగుతోంది.  అందుకు తాజా చిత్రం మ‌హారాష్ట్ర‌లో చూపారు. శివ‌సేన‌పార్టీలోనే ఒక తిరుగుబాటుదారుడిని ప్రేరేపించి క‌త్తిలా ఉప‌యో గించి థాక్రేకు దిమ్మ‌దిరిగే వ్యూహ‌చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించి ఆయ‌న్ను ప‌క్క‌కు నెట్టేశారు. కానీ వారి వేగాన్ని, చ‌తుర‌త‌ను నిలువ‌రించే వారు లేక‌పోవడ మే వారికి కొండంత ధైర్యాన్నిస్తోంది. కేంద్రంలో ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం అంత‌టి ఆత్మ‌స్థ‌యిర్యంతో లేక‌పోవ‌డ‌మే మోదీ, అమిత్ షా స్నేహం మ‌రింత బ‌లీయ‌ప‌డింది.  వారి ద్ద‌రు ఏది త‌లిస్తే అది అమ‌లు జ‌రిగిపోతోంది.  ఇక ఆంధ్రాలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి తెర‌చాటున స‌హ‌క‌రించి బీజేపీయే అంద‌ల‌మెక్కించింద‌నేవాద‌నా ఉంది. ఇందుకు టీడీపీ కీల‌క నాయ‌కులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌ ను ఇంకా జాబితా లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని బీజేపీ హైక‌మాండ్ కంట్రోల్ చేసింది. ఆర్థిక విష‌యంలోనూ.. సాయం అంద‌కుండా చూసింది. ఇది.. ఎంత‌గా సాగిందంటే  మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ పోటీ చేసిన చోట సైతం ఎక్కువ పంచ నీయకుండా చూశారు. అంతేకాదు.. టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీలు అంద‌రూ.. బీజేపీలో చేరిపోయారు. అప్ప‌టి వ‌ర‌కు వారిపై ఉన్న కేసులు, సీబీఐ, ఈడీ వేధింపులు సైతం లేకుండా పోయాయి.  కాగా  2024 ఎన్నిక‌ల నాటికి.. వైసీపీలో ఉన్నకీల‌క నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డిని త‌మ‌వైపున‌కు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంది.. బీజేపీ క‌నుక ఆయ‌న‌ను కంట్రోల్ చేస్తే.. వైసీపీ ప‌రి స్థితి ఏంటి? అనేది.. పెద్ద ఎత్తున టీడీపీలోను, వైసీపీలోను.. చ‌ర్చ జ‌రుగుతోంది. పెద్దిరెడ్డి కుటుంబానికి, వైసీపీకి మ‌ధ్య అవినాభ సంబంధం ఉంది. అదేస‌మ‌యంలో రాయ‌ల సీమ‌లోని రెండు జిల్లాల‌ను పెద్ది రెడ్డి త‌న క‌నుస‌న్నల్లో న‌డిపిస్తున్నారు.అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయ‌కుల‌ను ఆయ‌న అదుపులో పెట్టుకున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో పెద్దిరెడ్డిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్ర‌య త్నిస్తే,  వైసీపీని నియంత్రించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బిజేపి నాయకులు అధిష్టానం వద్ద వినిపిస్తుండ డం గ‌మ‌నార్హం. పైగా పెద్దిరెడ్డి సౌమ్యుడు.. అంద‌రి మాటా వినేవాడు.. అనే పేరు కూడా ఉండ‌డం గ‌మ నార్హం. ఏదేమైనా.. ఏపీలో అన్నీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చూసుకుంటోంది. ఎక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగినా.. ఆయ‌నే పార్టీకి దిక్కు, మొక్కు అన్న‌ట్టుగా మారారు. ఈ నేప‌థ్యంలో పెద్దిరెడ్డిని అడ్డు పెట్టి.. బీజేపీ వ్యూహత్మ‌కంగా అడుగులు వేస్తే.. వైసీపీకి చిక్కులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు బీజేపీ నేతలు..

ఉచితాల ప‌నిప‌ట్టేందుకు  క‌మిటీ..  సీజేఐ 

ఉచితాలంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు. రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు మ‌రింత అల‌వాటు చేశా రు. పార్టీ ప్ర‌చారానికి, ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డానికి, పాల‌న అద్భుతంగా చేప‌ట్ట‌డానికి అన్నింటికీ పార్టీలు గాలం వేసేది జానాన్నే. సుల‌భంగా వ‌ల‌లో చిక్కేదీ ఓట‌ర్లే. చిత్ర‌మేమంటే ఆన‌క పాలనలో వ‌చ్చే చిక్కుల‌న్నింటికీ ప్ర‌జ‌ల‌కు ఉచితాలిచ్చే తెచ్చుకున్నామ‌ని ప్ర‌భుత్వాలే అనుకుం టు న్నాయి. అస‌లు ఉచిత ప‌థ‌కాల పంపిణీ హామీల‌తో అధికారం సాగించాల‌నుకోవ‌డాన్ని న్యాయ‌ వేత్త‌లు త‌ప్పు ప‌డుతున్నారు. ఉచిత‌ప‌థ‌కాల పంపిణీ హామీలు అన్న‌ది తీవ్ర ఆర్ధిక అంశ‌మ‌ని సుప్రీం కోర్టు పేర్కొన్న‌ది. ఈ  హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్‌, ఆర్థికసంఘం, లా కమిషన్‌, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతి పక్షా లు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని పేర్కొంది. పార్టీల ఉచిత హామీలను  ఏ విధం గా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది. ఈ కమిటీ కూర్పుపై కేం ద్రం, ఎన్నికల కమిషన్‌ (ఈసీ), సీని యర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, పిటిషనర్లు తమ తమ అభిప్రాయాలను వారం రోజుల్లో తెలియజేయా లని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం  ఆదే శించింది.  ఎన్నికల్లో లబ్ధికోసం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు వివక్షాపూరితంగా హామీలిస్తున్నాయ ని.. హేతుబద్ధత లేని ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని.. వీటిని కట్టడి చేయాలని కోరుతూ న్యాయ వాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది తీవ్ర వ్యవహారమని  గతవారం విచా రణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  దీనిపై తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశిం చింది. సిబల్‌ ఎవరి తరఫునా న్యాయవాది కానప్పటికీ ఈ అంశంపై సలహాలివ్వాలని ఆయన్ను కోరింది. ఈ పిటిషన్‌ బుధవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును ధర్మాసనం ప్రస్తావించింది. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంటు చర్చించాలని సిబల్‌ సూచించారు. దీనికి జస్టిస్‌ రమణ స్పందిస్తూ ఈ అంశం పై పార్లమెంటులో చర్చ జరుగుతుందని మీరు భావిస్తున్నా రా? ఏ రాజకీయ పార్టీ చర్చిస్తుంది..? ఏ పార్టీ కూడా ఉచితాలను వ్యతిరేకించదు. ఈ రోజుల్లో అందరికీ ఉచితాలు కావాలి. ఫలానా పార్టీ  అని పేరు చెప్పను. అన్ని పార్టీలూ వీటి నుంచి లబ్ధి పొందుతున్నాయ‌ని పేర్కొన్నారు. 

వైసీపీ టార్గెట్ చంద్రబాబు.. అందుకే ఉమామహేశ్వరి మరణంపై పైశాచిక ఆరోపణలు!

జ‌గ‌న్  పగ ప్రతీకారాలకు అడ్డూ అదుపూ లేనట్లు తొస్తుంది. చిన్న‌పుడు చూసిన సినిమా సీన్స్ మ‌న‌సులో బాగా నాటుకున్న‌ట్టుంది. వీలుచిక్కిన‌పుడ‌ల్లా  కాదు వీలు చేసుకుని మ‌రీ ప్ర‌తీ కార ధోర‌ణినే ప్ర‌ద‌ర్శించ‌డం బాగా అల‌వ‌ర‌చుకుంది. జ‌గ‌న్ సీఎం పీఠంఎక్కినప్ప‌టి నుంచి టీడీపీని రాచి రంపాన పెట్టాల‌న్న ఆలోచ‌న‌నే అమ‌లు చేయ‌డం తప్ప రాష్ట్ర ప్రగతిని పట్టించుకున్న పాపాన లేదు.  నాడు ప్రజావేదిక కూల్చి వేత నాటి నుంచి తాజాగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె  ఉమామహే శ్వరి ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వరకు జగన్ సర్కార్ చేస్తున్నది అదే.  కనీస మర్యాదా, మన్ననలూ కూడా  లేకుండా కక్ష పూరిత రాజకీయాలను నెరపడం ఒక్క జగన్ కే చెల్లింది. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెడితే అస‌లు ఒక కుటుంబంలో ఎవ‌ర‌యినా మృతి చెందితే వెళ్లి ప‌ల‌క‌రించి రావ డం మ‌ర్యాద‌. అది త‌న‌కు రాజ‌కీయంగానూ, సామాజిక‌ప‌రంగానూ ప‌డ‌ని కుటుంబమైనా స‌రే. ఈ ఆచారం అనాదిగా అందరూ పాటిస్తున్నదే. కానీ ఇప్ప‌టి రాజ‌కీయాలు దారుణంగా మారిపోయాయ‌ని, మాన‌వ త్వానికి బొత్తిగా అవ‌కాశం లేకుండా పోయింద‌న్న‌ది ఎన్టీఆర్ కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణం గురించి చేస్తున్న జగన్ పార్టీ నాయకులు చేస్తున్న  వ్యాఖ్య‌లు బ‌య‌ట‌పెట్టాయి. జ‌గ‌న్ పార్టీలో మీడియా సెల్ బాధ్యతలో  ఉన్న గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డి  సోష‌ల్ మీడియాని అడ్డుపెట్టుకుని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఓ భూమి విషయంలో  చిన్నమ్మ ఉమా మహేశ్వరిని లోకేష్ దూషించారనీ, ఆ కారణంగానే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారనీ గుర్రంపాటి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని ఆ త‌ర్వాత తేలింది. ఈ విధంగా దేశంలో ప్ర‌ముఖ వ్య‌క్తి  కుటుంబంపై అస‌త్యాలు ప్ర‌చారం చేసి ఆనందించ‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌కే చెల్లింది. కానీ ఆ త‌ర్వాత అదంతా క‌ల్ప‌నేననీ, అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని తేలిన‌ప్ప‌టికీ  వైసీపీ నేత‌లు అందుకు త‌గిన స‌మాధానం చెప్ప‌క‌, క్ష‌మాప‌ణ‌లు కూడా కోర‌క పోవ‌డం వారి విజ్ఞ‌త‌ను తెలియ‌జేస్తుంద‌ని ప‌రిశీల‌కుల మాట‌. ఇదిలా ఉండ‌గా, వైసీపీ నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తి మ‌రింతగా ఉత్సాహ‌ప‌డి  అభాసుపాలయ్యారు. ఉమామ‌హేశ్వ‌రి సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు కారణాలన్నీ వివరించారనీ అయితే  ఆమె మరణం తరువాత అందరి కంటే ముందు వారింటికి వెళ్లిన చంద్రబాబు ఆ లేఖను మాయం చేశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు.  మ‌రీ దారుణ‌మేమంటే అస‌లా లేఖ‌లో ఏముందో కూడా  ల‌క్ష్మీపార్వ తే వివ‌రించ‌డం.  ఇదంతా ఆ కుటుంబాన్ని రోడ్డ‌మీద‌కు తీసుకురావ‌ల‌న్న కక్ష త‌ప్ప ఏ మాత్రం వాస్త‌వం లేద‌న్న‌ది ప‌రిశీ లకుల అభిప్రాయం. వీరి దాడి ఇక్క‌డితో ఆగ‌లేదు.. జ‌గ‌న్ పార్టీలో మ‌రో  కీల‌క నేత  విజ‌య‌సాయిరెడ్డి ట్వి టర్‌లో రెచ్చ‌పోయారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌‌పై వ్యంగ్యస్త్రాలు సైతం సంధించారు.    వైయస్ జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ను టార్గెట్ చేస్తే.., ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం చంద్రబాబు ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకు న్నారు.  ఆ తర్వాత ఈ వ్యవహారం ఎంత రచ్చ అయిందో అందరికి తెలిసేందే. అంతేకాదు.. ఎన్టీఆర్ కుటుంబం  మీడియా ముందుకు రావాల్సివచ్చింది. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ముందు ఆయనది గుండె పోటు అంటూ జగన్ పార్టీలోని కీలక నేతలు ఆయన మీడియా ప్రచారం చేసినా.. ఆ తర్వాత ఆయన్ని గొడ్డలితో హత్య చేశారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడం.. ఆ క్రమంలో ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం..  అనంతరం వివేకా హత్యకేసులో సూత్రధారులు, పాత్రధారులు వీరేనంటూ మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా ఓ ప్రచారం అయితే జోరుగా నడిచింది.. నేటికి నడుస్తోంది. అయితే ఈ వివేకా హత్య కేసులో తెరవెనుక సూత్రధారులంటూ పలువురు అధికార పార్టీలోని కీలన నేతల పేర్లు తెరపైకి రావడంతో.. ప్రతిపక్ష టీడీపీ నేతలు.. హు కిల్డ్ బాబాయి అంటూ సెటైరికల్‌గా జగన్ పార్టీపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా జగన్ పార్టీలోని కీలక నేతలు.. రంగంలోకి దిగి.. చంద్ర బాబు, లోకేశ్, ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, ఉమామహేశ్వరినీ టార్గెట్ చేస్తున్నారనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే ఉమామహేశ్వరి ఆత్యహత్య  చేసుకుని.. ఆ కుటుంబం బాధలో ఉంటే.. దీనిని సైతం రాజకీయం చేసి లబ్ది పొందాలనుకోవడం ఎంత వరకు  సబబు అనే జగన్ పార్టీలోని నేతలను నెటిజనల్ సైతం ప్రశ్నిస్తున్నారు.

ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు ఉగ్రముప్పు.. ఐబీ హెచ్చరిక

పంద్రాగస్టు వేడుకలు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. ఆజాదీ కా అమృతోత్సవ్ పేరిట దేశ వ్యాప్తగా ఘనంగా స్వాంతంత్ర్యదినోత్సవ వేడుకలునిర్వహించుకుంటున్న వేళ ఐబీ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ ప్రేరేపిత  లష్కరే ఇ తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు పంద్రాగస్టు సందర్బంగా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించిన ఐబీ ఎర్రకోట వద్ద అత్యంత పటిష్ఠ భద్రతా ఏర్పాట్లే చేయాలని సూచించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో పాటు ఉదయ్‌పూర్, అమరావతి ఘటనలను కూడా అందులో ప్రస్తావించింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్‌లోని పెద్ద నేతలు టార్గెట్ గా దాడులు జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. పంద్రాగస్టు లక్ష్యంగా ఉగ్రదాడుల ముప్పు హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట ఎంట్రీ పాయింట్ వద్ద నిఘా పెంచారు. 

మాధవా.. ఇదేం పని నాయనా సిగ్గూఎగ్గూ ఉండక్కర్లా!?

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు  అన్నట్లుగా తయారైంది వైసీపీ నేతల తీరు. అవినీతి, అక్రమం, దౌర్జన్యాలతో పాటు మహిళలతో అసభ్య ప్రవర్తన విషయంలో కూడా వైసీపీ నేతల చిట్టా చాలా పెద్దగానే ఉంటోంది. నిన్న మంత్రి అంబటి రాంబాబు, నేడు వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతల జాబితాలో చేరారు. తాజాగా గోరంట్ల మాధవ్ అయితే ఓ మహిళతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడుతున్న క్లిప్పింగ్ లు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించే గోరంట్ల మాధవ్ చుట్టూ వివాదాలు తిరుగుతాయో, లేక వివాదాలనే ఆయన తన చుట్టూ తిప్పుకుంటారో తెలియదు కానీ.. తొలి నుంచీ ఆయన వైఖరి వివాదాస్పదమే. గతంలో అంటే ఎంపీ కాకముందు కర్నూలు జిల్లాలో సీఐగా పని చేస్తున్న సమయంలో కూడా గోరంట్ల మాధవ్ మహిళతో ఇలాగే అసభ్యంగా మాట్లాడారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలను పట్టించుకోకుండా తానో నిజాయితీపరుడైన అధికారినని కలరిచ్చి, ప్రచారం చేసుకుని ఎంపీగా గెలిచారని వైసీపీ శ్రేణులే అంటుంటాయి. తాజాగా గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా మాట్లాడుతూ దొరికిపోయిన వీడియోలో ఉన్న మహిళ ఎవరన్నది తెలియ రాలేదు. కానీ గోరంట్ల మాధవ్ అసభ్య వర్తనపై మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. ఎంపీగా ఉండేందుకు మాధవ్ అనర్హుడని, సీఎం జగన్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు తెలుగుదేశం కూడా గోరంట్ల మాధవ్ తీరుపై మండి పడుతోంది. మాధవ్ వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నది. బాధ్యత గల ఎంపీ  ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది.  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక డిఫాల్టర్.. షబ్బీర్ అలీ విమర్శ

కలిసున్నంత కాలం మచ్చలేని పున్నమి చంద్రుడిలా కనిపించిన మిత్రుడు విబేదించి వెళ్లగానే మచ్చల మహరాజుగా మారిపోతాడు. సరిగ్గా అలాగే ఉంది కాంగ్రెస్ వ్యవహారం. కోమటి రెడ్డి రాజగోపల రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత కాలం ఆయన పులుకడిగిన ముత్యంలాగే కనిపించారు పార్టీ వారికి. ఒక్క సారి ఎప్పుడైతే రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారో.. ఆయనలోని లోపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు భూతద్దంలోలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దన్ను లేకుండా రాజగోపాలరెడ్డి బ్రాందీ షాపుల్లో మూతలు తీయడానికి కూడా పనికిరాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తే, మరో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ మరింత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఆశించారనీ, పీసీసీ చీఫ్ పదవికి తనను ప్రపోజ్ చేయాల్సిందిగా తన ఇంటికి వచ్చి మరీ అడిగారనీ తాపీగా ఇప్పుడు వెళ్లడించారు. తాను చెప్పింది పచ్చి నిజమన్న ఆయన అది అబద్ధమని దమ్ముంటే రాజగోపాల్ రెడ్డి ఒట్టేసి చెప్పాలని సవాల్ చేశారు. తన అన్న వెంకటరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ చీఫ్ కావడానికి వీల్లేదని కూడా అన్నారని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ పాలు తాగి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని విమర్శించారు. రాజగోపాల రెడ్డికి కోట్ల రూపాయల అప్పులున్నాయనీ, ఆయన ఒక డిఫాల్టర్ అనీ షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆ సమస్యల నుంచి గట్టెక్కంచమని కోరేందుకే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారనీ, అలా కమలం గూటికి వెళ్లారని ఆరోపించారు. అసలు రాజగోపాల్ రెడ్డి గెలుపొందిన తరువాత ఒక్కసారైనా మునుగోడు వెళ్లారా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం పార్టీని వీడి.. ఎదురు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కానీ, టీపీసీసీ చీఫ్ ను కానీ విమర్శించే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని షబ్బీర్ అలీ అన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా ఉంటే.. మరో కాంగ్రెస్ నేత, రాజగోపాల్ రెడ్డి సోదరుడు అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన విమర్శల బాణాలను టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే ఎక్కు పెట్టారు. తన తమ్ముడిని అడ్డు పెట్టుకుని రేంవత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తనను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా తానూ పార్టీ వీడుతానని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు కదుపుతున్న కాంగ్రెస్ కు కోమటిరెడ్డి సోదరుల ఉదంతం కచ్చితంగా ఎదురుదెబ్బేనని పరిశీలకులు అంటున్నారు.

హాకీ సెమీస్ చేరిన అమ్మాయిలు.. కాంస్యం అందుకున్న ల‌వ్‌ప్రీత్‌

ఇంగ్లండ్ బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ గేమ్స్ 2022లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు సెమీస్ చేరింది. పూల్ ఏ లో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో కెన‌డాను 3-2 తేడాతో ఓడించింది. దీంతో ఈ పూల్‌లో టాప్ లో నిల‌వ‌డంతో పూల్ బి టాప‌ర్ ఆస్ట్రేలియాతో సెమీస్‌లో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.   కాగా ఆరో రోజు వెయిట్ లిఫ్ట‌ర్ ల‌వ్‌ప్రీత్‌సింగ్ కాంస్యం సాధించాడు. పురుషుల 109 కేజీ ఫైల్ కేట‌గిరీలో అత‌ను గొప్ప ప్ర‌ద‌ర్శ‌నే ఇచ్చాడు. మొత్తం 355 కేజ‌ల బ‌రువు ఎత్తి మూడ‌వ‌స్థానంలో నిలిచాడు. 192 కేజీల‌క్ల‌న్ అండ్ జ‌ర్క్ రౌండ్‌లో జాతీయ‌స్థాయి రికార్డు నెల‌కొల్పి ఆక‌ట్టుకున్నాడు. దీంతో ఈ గేమ్స్‌లో ఇప్ప‌టికి  14 ప‌త‌కాలు భార‌త్ ప‌త‌కాల  14 సాధించి  టేబుల్లో 6వ స్థానంలో నిలి చింది.   జూడోలో తూలికామాన్  78 కేజీల కేట‌గిర‌లో ఫైల్ చేరాడు. అలాగే క్వాష్ డ‌బుల్స్‌లో భార‌త్ జంట జోష్న చిన్న‌ప్ప‌, హ‌రీంద‌ర్ పాల్ సంధూ శ్రీ‌లంక జ‌ట్టును ఓడించింది. 

కాంబోజ్‌.. మ‌న‌ మహిళా యుఎన్ రాయబారి

రాయబారి రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్యసమితిలో మొదటి భారతీయ మహిళా రాయబారి కావడం మనందరికీ గర్వకారణం. న్యూయార్క్‌లోని ప్రపంచ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కాంబోజ్ మంగళవారం యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు తన ఆధారాలను సమర్పించారు. ఆమె T S తిరుమూర్తి తర్వాత యుఎన్ లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని దక్కించుకున్న తొలి భారతీయ మహిళ కావడం విశేషం. ఆమె అమ్మాయిల కోసం ఒక నోట్‌లో కూడా జారిపోయిం ది: అక్కడ ఉన్న అమ్మాయిలకు, మనమందరం దీన్ని చేయగలం. కాంబోజ్, 1987-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, భూటాన్‌కు భారత రాయబారిగా పనిచేస్తు న్నారు. భూటాన్ కి భారత మొదటి మహిళా రాయబారి కూడా. ఆమె 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్. ఆమె ఫ్రాన్స్‌లోని పారిస్‌లో తన దౌత్య ప్రయాణాన్ని ప్రారంభించింది, అక్కడ ఆమె 1989-1991 వరకు ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం లో మూడవ కార్యదర్శిగా పోస్ట్ చేయబడింది. పారిస్ నుండి, ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చింది, అక్కడ ఆమె 1991-96 మధ్యకాలంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యూరప్ వెస్ట్ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేసింది. 1996-1999 వరకు, ఆమె మారిషస్‌లో పోర్ట్ లూయిస్‌లోని భారత హైకమిషన్‌లో మొదటి కార్యదర్శి (ఆర్థిక మరియు వాణిజ్య)  ఛాన్సరీ హెడ్‌గా పనిచేసింది. కాంబోజ్ గతంలో 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత్  శాశ్వత మిషన్ లో కౌన్సెలర్‌గా కూడా పనిచేశారు. 2011-2014 వరకు, ఆమె భారతదేశపు ప్రోటోకాల్ చీఫ్‌గా ఉన్నారు, ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ పదవిని నిర్వహించిన మొదటి,  ఏకైక మహిళ. మే 2014లో, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవా నికి దర్శకత్వం వహించేందుకు ప్రత్యేక అసైన్‌మెంట్‌పై కూడా ఆమెను పిలిచారు.   జూలై 2017లో, ఆమె అహ్మదాబాద్‌ను భారత దేశపు మొదటి ప్రపంచ వారసత్వ నగరంగా లిఖించే ప్రయత్నానికి నాయకత్వం వహించారు, ఇది యునెస్కో  ప్రపంచ వారసత్వ కమిటీ  పూర్తి మద్దతుతో సాధించబడింది. ఫిబ్రవరి 2019- జూన్ 2022 వరకు, ఆమె భూటాన్‌లో మ‌న‌ రాయబారిగా పనిచేశారు. కౌన్సిల్‌లో భారతదేశ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌లో ముగుస్తుంది, ఆ నెలలో ఆ దేశం శక్తివం తమైన యుఎన్ విభాగానికి అధ్యక్షులుగానూ వ్యవహరిస్తుంది.

యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. హస్తినలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని విచారించిన ఈడీ, ఆ తరువాత వరుసగా రెండు రోజుల పాటు యంగ్ ఇండియా కార్యాలయాలపై దాడులు నర్వహించారు. తాజాగా మంగళవారం (ఆగస్టు 3) ఢిల్లీలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సమాచారం తెలియగానే కర్నాటక పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ హుటాహుటిన హస్తిన చేరుకున్నారు. హుబ్లీ నుంచి ఢిల్లీ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన రాహుల్ కేంద్రంలోని మోడీ సర్కార్ అసమదీయులైన ఒకరిద్దరుకాంగ్రెస్ దిగ్గజ వ్యాపారుల మేలు కోసమే పని చేస్తున్నదని, చిన్న మధ్య తరహా వ్యాపారాలను బతకనీయడం లేదని విమర్శించారు. కాగా పార్టీ అధినేత్రి  సోనియా, రాహుల్ ను కేంద్రం ప్రొద్బలంతోనే ఈడీ విచారణ పేరిట వేధిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలకు కూడా చేపట్టింది. ఈ ఆందోళనలకు విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. అయినా కూడా ఈడీ తన పని తాను చేసుకుపోతోంది. యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం వద్ద, అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇలా ఉండగా తమ అనుమతి లేకుండా యంగ్ ఇండియా కార్యాలయంలోనికి ఎవరూ వెళ్లరాదని ఈడీ ఆంక్షలు విధించింది. కాగా ఈడీ తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోడీ చేతిలో ఈడీ కీలుబొమ్మలా మారిందని ఆరోపిస్తున్నది. మోడీ ఆదేశాల మేరకే కుట్ర పూరితంగా సోనియాను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈడీ తీరుకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళనలకు సన్నద్ధమౌతున్నది. ఈడీ యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసిన అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ, అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని ఇంటిని   ముట్టడిస్తామన్నారు. 

అభినవ కృష్ణుడి లీవ్ లెటర్

అలిగితివా సఖీ ప్రియా.. అలుక మానవా? అంటూ కోపగృహంలోకి వెళ్లిన భార్యను బతిమలాడుకుని తన్నులు తినాల్సిన బాధ శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంత. అయినా అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఫోన్ లో బుజ్జగించి వెనక్కు తీసుకురావడం పాపం ఆ చిరుద్యోగికి సాధ్యం కాలేదు. అత్తారింటికి వెళ్లి బతిమాలో బామాలో వెనక్కు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ సెలవు ఎలా? మామూలుగా సెలవు కావాలంటే ఎవరైనా ఏం చేస్తారు. కడుపు నొప్పో, కాలు నొప్పో అని పై అధికారికి ఓ లీవ్ లెటర్ ఇస్తారు. కానీ కాన్పూర్ కు చెందిన అమ్షద్ అహ్మద్ మాత్రం ఉన్న కారణం ఉన్నట్లుగానే తన లీవ్ లెటర్ లో పేర్కొన్నాడు. అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బతిమలాడి ఇంటికి తెచ్చుకునేందుకు ఓ మూడు రోజులు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసి సెలవుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతగాడికి సెలవు మంజూరైందా లేదా అన్నది పక్కన పెడితే ఆ లీవ్ లెటర్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోయింది.   ఇటీవల తన భార్యతో ఓ చిన్న విషయంలో గొడవ పడ్డాం. దాంతో నా భార్య అలిగి ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను ప్రసన్నం చేసుకుని తిరిగి ఇంటికి తీసుకురావాలి. అందుకోసం మూడు రోజులు సెలవు మంజూరు చేయండి సార్ అంటూ అతడు రాసిన లీవ్ లెటర్ నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. అసలా లీవ్ లెటర్ బయటకు ఎలా వచ్చిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం అమ్షద్ అహ్మద్ సత్యసంధతను తెగ మెచ్చేసుకుంటున్నారు. అతడి పై అధికారి కచ్చితంగా సెలవు మంజూరు చేసే ఉంటాడని అంటున్నారు. ప్రతి భర్తకూ భార్యను ప్రసన్నం చేసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏముంటుందని జోకులేస్తున్నారు. ఇంతకీ అతడికి సెలవు మంజూరైందా? అత్తారింటికి వెళ్లి భార్యను తెచ్చుకున్నాడా? అన్న ప్రశ్నలు నెటిజన్లను తొలిచేస్తున్నాయి. ఆ వివరాలు చెప్పాల్సింది అమ్షద్ అహ్మదే మరి.

రాజగోపాలరెడ్డి బాటలోనే కోమటి రెడ్డి వెంటకరెడ్డి.. రేవంత్ పై విమర్శలకు కారణమదేనా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన తమ్ముడు రాజగోపాలరెడ్డి దారిలోనే నడుస్తున్నారా? లేదా నడవడానికి నిర్ణయించుకున్నారా? ఢిల్లీలో ఆయన రేవంత్ పై విమర్శల వర్షం కురిపించడం చూస్తుంటే ఔననే అనుకోవలసి వస్తోంది. కోమటి రెడ్డి సోదరులు తొలి నుంచీ రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ వెంకటరెడ్డి ఆ బాధను పంటి బిగువున భరిస్తూ వస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడాన్ని, కమలం గూటికి చేరడాన్ని సమర్ధిస్తూనే మాట్లాడారు. తన తమ్ముడు తనకు ఇష్టం అయిన పార్టీలోకి వెళుతున్నారు, అది ఆయన వ్యక్తిగతం అంటూ సమర్ధించారు. అయితే తన సోదరుడిపై రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. రాజగోపాలరెడ్డిని ఆనకొండ అనడానికి రేవంత్ కు ఏం హక్కు ఉందని అంటున్నారు. హస్తినలో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి తన ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంపైనే పెట్టారు. కాంగ్రెస్ లో లేకుండా ఉండి ఉంటే మీరు బ్రాందీ షాపుల్లో సీతా మూతలు ఏరుకోవడానికి కూడా పని కొచ్చే వారు కాదంటూ రేవంత్   తన సోదరుడితో పాటు తననూ టార్గెట్ చేసే విమర్శించారని కోమటి రెడ్డి అన్నారు. తనకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కానీ తనను రెచ్చగొడితే మాత్రం ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో తనకు సంబంధం లేదన్న ఆయన పనిగట్టుకుని రేవంత్ పై విమర్శలు గుప్పించడంతోనే కోమటిరెడ్డి కూడా పార్టీని వీడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ వీడడానికి ముందు రేవంత్‌నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అదే బాటలో వెడుతున్నారా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి వదిలేస్తున్న గుడివాడ.. ఆయన గురి ఎక్కడంటే..?

మంత్రి గుడివాడ అమర్నాథరెడ్డి నియోజకవర్గం మార్పుపై తీవ్రంగా దృష్టి పెట్టారా? అనకాపల్లి నుంచి మళ్లీ పోటీకి దిగితే విజయం సులువు కాదని భావిస్తున్నారా? గత ఎన్నికలలో తనకు అనుకూలించిన అంశాలేవీ ఇప్పుడు తనకు అనుకూలంగా లేవని భావిస్తున్నారా? మరో వైపు గత ఎన్నికల సమయంలో ఉన్న జగన్ గాలి ఈ సారి ఇసుమంతైనా లేకపోవడం వల్ల అనకాపల్లి నుంచే మళ్లీ పోటీకి దిగితే విజయం దక్కదని భావిస్తున్నారా? పైగా గతంలో తనకు గట్టి మద్దతుగా నిలిచిన దాడి వంటి పలుకు బడి కలిగిన నేతలు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారుతుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. పైగా అధినేత జనంలో ఉన్నవారికే టికెట్లని ఖరాకండీగా చెప్పేసిన తరువాత అనకాపల్లినే పట్టుకు వెళాడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన గుడివాడ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరనీ, తనకు పెందుర్తి నియోజకవర్గమైతే సేఫ్ అని భావిస్తున్నారనీ వైసీపీ శ్రేణుల్లోనే  ఒక చర్చ జరుగుతోంది. అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గం గుడివాడ అమర్నాథ్ రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్నది. దీనికి తోడు గుడివాడకు అనకాపల్లి నాన్ లోకల్ అన్న ముద్ర ఒకటి ఉంది. దానిని బేస్ చేసుకునే సొంత పార్టీలోనే గుడివాడకు సెగ పెడుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెందుర్తి నియోజకవర్గం పై దృష్టి పెట్టారని అంటున్నారు.   అక్కడ పోటీ చేస్తే తనకు లోకల్ కార్డ్ కలిసొస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ఉన్నారు. ఇంత వరకూ గుడివాడకు బలమైన మద్దతు దారుగా ఉన్న అదీప్ రాజు.. ఇప్పుడు మంత్రిపై గుర్రుగా ఉన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   

వైసీపీలో పెరుగుతున్న ధిక్కారం..మళ్లీ అధికారంపై ఎమ్మెల్యేలలో ఆవిరైన నమ్మకం

ఒక వైపు స్వయంగా చేయించుకున్న సర్వేలే జగన్ కు దిమ్మతిరిగేలా చేస్తుంటే.. మరో వైపు పార్టలో ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు గట్టిగా వినిపించడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మెజారిటీ ఎమ్మెల్యేలలో లేదన్న మాట ఆ పార్టీ శ్రేణుల నుంచే వినవస్తున్నది. అందుకే పార్టీయా గాడిద గుడ్డా.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసు అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే పార్టీపై తమకు విశ్వాసం లేదని విస్ఫష్టంగా చెప్పేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లేదు.. గాడిద గుడ్డూ లేదని ఆయన తన ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపించారంటున్నారు. దాదాపు ఇటువంటి వ్యాఖ్యలే పలువురు ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెప్పారని కూడా అంటున్నారు. ఇక జగ్గయ్య పేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విషయానికి వస్తే..ఆయన సొంత పార్టీపైనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసునని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తాను వైసీపీలో శాశ్వతంగా ఉండబోవడం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారనీ, ఏదో ఉన్నంత వరకూ బాధ్యతగా పని చేయడమే తన పని అన్నారు.   పింఛన్ తీసుకునే సామాన్యులు ఆదాయ పన్ను ఎలా కట్టగలరని ఆయన తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు.  కాగా జ్యోతుల చంటిబాబు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి నుంచి వైసీపీలో చేరారు. 2009లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓటమి పాలయ్యారు.  ఆ తరువాత  2019లో తెలుగుదేశం పార్టీని వీడి  వైసీపీలో చేరారు. ఆ పార్టీ  అభ్యర్థిగా   పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు చంటి బాబు తెలుగుదేశం వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.