అభినవ కృష్ణుడి లీవ్ లెటర్
posted on Aug 4, 2022 6:38AM
అలిగితివా సఖీ ప్రియా.. అలుక మానవా? అంటూ కోపగృహంలోకి వెళ్లిన భార్యను బతిమలాడుకుని తన్నులు తినాల్సిన బాధ శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంత. అయినా అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఫోన్ లో బుజ్జగించి వెనక్కు తీసుకురావడం పాపం ఆ చిరుద్యోగికి సాధ్యం కాలేదు. అత్తారింటికి వెళ్లి బతిమాలో బామాలో వెనక్కు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ సెలవు ఎలా?
మామూలుగా సెలవు కావాలంటే ఎవరైనా ఏం చేస్తారు. కడుపు నొప్పో, కాలు నొప్పో అని పై అధికారికి ఓ లీవ్ లెటర్ ఇస్తారు. కానీ కాన్పూర్ కు చెందిన అమ్షద్ అహ్మద్ మాత్రం ఉన్న కారణం ఉన్నట్లుగానే తన లీవ్ లెటర్ లో పేర్కొన్నాడు. అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బతిమలాడి ఇంటికి తెచ్చుకునేందుకు ఓ మూడు రోజులు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసి సెలవుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతగాడికి సెలవు మంజూరైందా లేదా అన్నది పక్కన పెడితే ఆ లీవ్ లెటర్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోయింది.
ఇటీవల తన భార్యతో ఓ చిన్న విషయంలో గొడవ పడ్డాం. దాంతో నా భార్య అలిగి ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను ప్రసన్నం చేసుకుని తిరిగి ఇంటికి తీసుకురావాలి. అందుకోసం మూడు రోజులు సెలవు మంజూరు చేయండి సార్ అంటూ అతడు రాసిన లీవ్ లెటర్ నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. అసలా లీవ్ లెటర్ బయటకు ఎలా వచ్చిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం అమ్షద్ అహ్మద్ సత్యసంధతను తెగ మెచ్చేసుకుంటున్నారు.
అతడి పై అధికారి కచ్చితంగా సెలవు మంజూరు చేసే ఉంటాడని అంటున్నారు. ప్రతి భర్తకూ భార్యను ప్రసన్నం చేసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏముంటుందని జోకులేస్తున్నారు. ఇంతకీ అతడికి సెలవు మంజూరైందా? అత్తారింటికి వెళ్లి భార్యను తెచ్చుకున్నాడా? అన్న ప్రశ్నలు నెటిజన్లను తొలిచేస్తున్నాయి. ఆ వివరాలు చెప్పాల్సింది అమ్షద్ అహ్మదే మరి.