పొత్తుపై వ్యూహాత్మ మౌనం- బాబు, పవన్ లలో ఫుల్ క్లారిటీ?
జోరు వానలు కురుస్తున్న సమయంలో కూడా ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఏపీలో మాత్రం రాజకీయ వేడి రోహిణీకార్తెను మించిపోయింది. అధికార విపక్షాలు రెండూ స్పీడ్ పెంచేశాయి.
ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ, వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావాలని తెలుగుదేశం పట్టుదలతో ఉన్నాయి. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని తెలుగుదేశం విశ్వసిస్తోంది. జగన్ ఆర్థిక అరాచకత్వం, ఏ వర్గానికీ మేలు చేయని విధానాలు, అమరావతి నిర్వీర్యం. అప్పుల కుప్పలా రాష్ట్రాన్ని మార్చేసిన తీరుతో జనం వైసీపీ సర్కార్ అంటే విముఖతతో ఉన్నారని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు.
ఇక మరో పార్టీ జనసేన పార్టీ అధినేత వ్యూహాలేమిటో ఆయనకైనా తెలుసా అన్న అనుమానాలను సామాన్యులే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ సందర్బమూ లేకుండానే రాష్ట్రంలో విపక్ష ఓట్లను చీలనీయను అంటూ పొత్తల చర్చకు తెరతీసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికల యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉండగా, ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నవంబర్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. పవన్ కల్యాణ్ అయితే అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.
అయితే పరిశీలకులు మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలు పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాయనీ, వేటికి అవిగా ఎన్నికల రణరంగంలోనికి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నా, ఏ పార్టీ కార్యక్రమాలు ఆ పార్టీ వేర్వేరుగా నిర్వహిస్తున్నా.. అంతిమంగా ఎన్నికల నాటికి రెండు పార్టీలూ పొత్తు పొడుపుతోనే ముందుకు సాగుతాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికిప్పుడే పొత్తుల ప్రకటనతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుందని ఇరు పార్టీలూ భావిస్తున్నాయని పేర్కొంటున్నారు. టికేట్ ఆశావహులలో పొత్తుల ప్రకటనతో నిరాశ, అసంతృప్తి ప్రబలే అవకాశం ఉందని, అది వారు వైసీపీ బాట పట్టేలా చేస్తుందని ఇరు పార్టీలూ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అందువల్లనే ఇరు పార్టీలూ కూడా పొత్తు మాటే ఎత్తకుండా గుట్టుగా, గుంభనంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలించి చూస్తే మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే ఇక వైసీపీ పని అయిపోయినట్లునని వివరిస్తున్నారు. జనసేన, తెలుగుదేశం పొత్తు పొడిస్తే ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకూ వైసీసీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం ఉండదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా వైసీసీకి సీట్లు, ఓట్లు కూడా గణనీయంగా తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇరువురూ కూడా ఏపీలో మరోసారి అధికారంలోకి వైసీపీ రాకూడదు అన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ లక్ష్యం నెరవేరాలంటే విడివిడిగా కాక.. కలిసికట్టుగా ఉండాలన్న విషయంలో ఇరువురు నేతలకూ పూర్తి క్లారిటీ ఉందని కూడా చేబుతున్నారు. అందుకే తెలుగుదేశం, జనసేనలు వేటికవిగా ఉంటూనూ పరస్పర విమర్శలకు తావీయకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు.
ఇక చాలా కాలం నుంచే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద పరిశీలకుల అంచనా మేరకు జనసేన పార్టీ పైకి ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీతో పొత్తుకే మొగ్గు చూపుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా జనసేన రాష్ట్రంలో సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నించడాన్ని పొత్తులకు వ్యతిరేకంగా సాగుతోందని భావించలేమని పేర్కొంటున్నారు. పొత్తుకు ఒకరి బలం మరొకరికి శక్తిగా మారుతుందని ఇరు పార్టీల అధినేతలూ భావిస్తున్నాయని పేర్కొంటున్నారు.