మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే బీజేపీకే కీలకం
posted on Aug 4, 2022 @ 2:10PM
మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే అయినా.. ఈ ఉప ఎన్నికను ఎన్నికల సంవత్సరంలో ఆహ్వానించడానికి బీజేపీ వినా మిగిలిన రెండు పార్టీలూ అంత సిద్ధంగా లేవు. ముఖ్యంగా టీఆర్ఎస్. మరో 14 నెలలలో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కొద్ది రోజుల కిందట ఫీలర్లు వదిలినా తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనించి ఆ ఊసెత్తడం లేదు.
అయినా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ కు ఇదేమీ రుచించే విషయం కాదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఎంత మాత్రం లేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మూమూలుగా అయితే ఉప ఎన్నికను పట్టించుకోవలసిన అవసరం ఆ పార్టీకి పెద్దగా లేదు. ఆ పార్టీ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. కానీ మునుగోడులో రాజీనామా చేసినది సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతికూల ఫలితం వస్తుందన్న జంకు ఆ పార్టీకి ఉంటుంది.
అందు కోసం బలమైన అభ్యర్థిని ఉప ఎన్నికలో నిలబెట్టి సానుకూల ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తేంది అందులో సందేహం లేదు. కానీ మునుగోడు ఉప ఎన్నికలో నిజమైన సవాల్ మాత్రం బీజేపీకే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలో విజయం సాధించినా, పరాజయం పాలైనా టీఆర్ఎస్ కు ఒరిగేదీ లేదు, పోయేదీ లేదు. అంతోటి దాని కోసం మునుగోడుపై శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి సొమ్ములు గుమ్మరించే పని ఆ పార్టీ చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆ పార్టీ సమాయత్తమౌతోంది. శక్తియుక్తులన్నీ ఆ ఎన్నికల కోసమే వినియోగిస్తుంది కానీ ఓ ఆరు నెలల భాగ్యానికి మునుగోడులో చమటోడ్చే పని చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. అయినా ఉప ఎన్నికల సవాళ్లు, దాని వెనుక ఉండే వ్యూహాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే మొదలయ్యాయి.
అందుకు ఉప ఎన్నిక సవాల్ ను స్వీకరించి బీజేపీ టీఆర్ఎస్ పడే అవకాశాలు లేవు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిన పరిస్థితులు రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసమేనని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా గుర్తించేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ బలోపేతం అయ్యిందంటే అందుకు పీసీసీ చీఫ్ గా రేవంత్ కష్టమే కారణం. అందుకే కేవలం రేవంత్ టార్గెట్ గా బీజేపీ రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో ఆయననే గెలిపిస్తామన్న హామీ ఇచ్చిందని చెబుతున్నారు.
సో.. మునుగోడులో కాంగ్రెస్ కు ఫలితం అటూ ఇటూ అయినా అది కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. ఆ వెంటనే జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే కాన్సన్ ట్రేట్ చేయమని రేవంత్ కు చెబుతుంది తప్ప అంతకు మించి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. ఇక మిగిలింది బీజేపీ. బీజేపీకి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక చావో రేవుతో సమానం. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఫలితం అటూ ఇటూ అయితే ఆ పార్టీ ఇంత కాలం రాష్ట్రంలో ఇచ్చిన బిల్డప్ అంతా గాలి బుడగలా తేలిపోతుంది. ఒక వేళ ఫలితం అనుకూలంగా వచ్చినా బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఏ మాత్రం కార్యకర్తల బలం లేని మునుగోడులో విజయం సాధించామని సంబరపడే అవకాశం కూడా ఆ పార్టీకి ఉండదు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవ్వాల్సి ఉంటుంది. అయినా సరే ఏ మాత్రం ఉపయోగం లేని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వచ్చేందుకు బీజేపీ శక్తియుక్తులన్నీ ఒడ్డక తప్పని పరిస్థితి. పరాజయం పాలైతే తెలంగాణలో అధికారం అన్న ఆశను ఆ పార్టీ ఇక వదిలేసుకోవలసిందే. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆ పరిస్థితి లేదు. మునుగోడు ఫలితం ఎలా వచ్చినా ఆ పార్టీల ప్రధాన లక్ష్యం మాత్రం అసెంబ్లీ ఎన్నికలే అన్న స్పష్టత ఆ పార్టీలలో ఉంది. బీజేపీ మాత్రం తెలంగాణలో తిరుగులేని బలం ఉందన్నది చాటుకోవడానికే ఒక విధంగా చెప్పాలంటే బలవంతంగా తీసుకువచ్చినది మునుగోడు ఉప ఎన్నిక కనుక ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆ పార్టీది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఆ పార్టీకి సానుకూలంగా వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు బీజేపీకి నల్లేరు మీద బండి నడక అవుతుందని భావించడానికి వీల్లేని పరిస్థితి.