మాధవా.. ఇదేం పని నాయనా సిగ్గూఎగ్గూ ఉండక్కర్లా!?
posted on Aug 4, 2022 @ 10:54AM
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారైంది వైసీపీ నేతల తీరు. అవినీతి, అక్రమం, దౌర్జన్యాలతో పాటు మహిళలతో అసభ్య ప్రవర్తన విషయంలో కూడా వైసీపీ నేతల చిట్టా చాలా పెద్దగానే ఉంటోంది.
నిన్న మంత్రి అంబటి రాంబాబు, నేడు వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతల జాబితాలో చేరారు. తాజాగా గోరంట్ల మాధవ్ అయితే ఓ మహిళతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడుతున్న క్లిప్పింగ్ లు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించే గోరంట్ల మాధవ్ చుట్టూ వివాదాలు తిరుగుతాయో, లేక వివాదాలనే ఆయన తన చుట్టూ తిప్పుకుంటారో తెలియదు కానీ.. తొలి నుంచీ ఆయన వైఖరి వివాదాస్పదమే. గతంలో అంటే ఎంపీ కాకముందు కర్నూలు జిల్లాలో సీఐగా పని చేస్తున్న సమయంలో కూడా గోరంట్ల మాధవ్ మహిళతో ఇలాగే అసభ్యంగా మాట్లాడారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఆ ఆరోపణలను పట్టించుకోకుండా తానో నిజాయితీపరుడైన అధికారినని కలరిచ్చి, ప్రచారం చేసుకుని ఎంపీగా గెలిచారని వైసీపీ శ్రేణులే అంటుంటాయి. తాజాగా గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా మాట్లాడుతూ దొరికిపోయిన వీడియోలో ఉన్న మహిళ ఎవరన్నది తెలియ రాలేదు. కానీ గోరంట్ల మాధవ్ అసభ్య వర్తనపై మహిళా సంఘాలు మండి పడుతున్నాయి.
ఎంపీగా ఉండేందుకు మాధవ్ అనర్హుడని, సీఎం జగన్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు తెలుగుదేశం కూడా గోరంట్ల మాధవ్ తీరుపై మండి పడుతోంది. మాధవ్ వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నది. బాధ్యత గల ఎంపీ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది.