వైసీపీ టార్గెట్ చంద్రబాబు.. అందుకే ఉమామహేశ్వరి మరణంపై పైశాచిక ఆరోపణలు!
posted on Aug 4, 2022 @ 11:42AM
జగన్ పగ ప్రతీకారాలకు అడ్డూ అదుపూ లేనట్లు తొస్తుంది. చిన్నపుడు చూసిన సినిమా సీన్స్ మనసులో బాగా నాటుకున్నట్టుంది. వీలుచిక్కినపుడల్లా కాదు వీలు చేసుకుని మరీ ప్రతీ కార ధోరణినే ప్రదర్శించడం బాగా అలవరచుకుంది. జగన్ సీఎం పీఠంఎక్కినప్పటి నుంచి టీడీపీని రాచి రంపాన పెట్టాలన్న ఆలోచననే అమలు చేయడం తప్ప రాష్ట్ర ప్రగతిని పట్టించుకున్న పాపాన లేదు. నాడు ప్రజావేదిక కూల్చి వేత నాటి నుంచి తాజాగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహే శ్వరి ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వరకు జగన్ సర్కార్ చేస్తున్నది అదే. కనీస మర్యాదా, మన్ననలూ కూడా లేకుండా కక్ష పూరిత రాజకీయాలను నెరపడం ఒక్క జగన్ కే చెల్లింది.
రాజకీయాలను పక్కన పెడితే అసలు ఒక కుటుంబంలో ఎవరయినా మృతి చెందితే వెళ్లి పలకరించి రావ డం మర్యాద. అది తనకు రాజకీయంగానూ, సామాజికపరంగానూ పడని కుటుంబమైనా సరే. ఈ ఆచారం అనాదిగా అందరూ పాటిస్తున్నదే. కానీ ఇప్పటి రాజకీయాలు దారుణంగా మారిపోయాయని, మానవ త్వానికి బొత్తిగా అవకాశం లేకుండా పోయిందన్నది ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం గురించి చేస్తున్న జగన్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బయటపెట్టాయి. జగన్ పార్టీలో మీడియా సెల్ బాధ్యతలో ఉన్న గుర్రంపాటి దేవేంద్రరెడ్డి సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ భూమి విషయంలో చిన్నమ్మ ఉమా మహేశ్వరిని లోకేష్ దూషించారనీ, ఆ కారణంగానే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారనీ గుర్రంపాటి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఇది పూర్తిగా అవాస్తవమని ఆ తర్వాత తేలింది. ఈ విధంగా దేశంలో ప్రముఖ వ్యక్తి కుటుంబంపై అసత్యాలు ప్రచారం చేసి ఆనందించడం జగన్ సర్కార్‌కే చెల్లింది. కానీ ఆ తర్వాత అదంతా కల్పనేననీ, అలాంటిదేమీ జరగలేదని తేలినప్పటికీ వైసీపీ నేతలు అందుకు తగిన సమాధానం చెప్పక, క్షమాపణలు కూడా కోరక పోవడం వారి విజ్ఞతను తెలియజేస్తుందని పరిశీలకుల మాట.
ఇదిలా ఉండగా, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మరింతగా ఉత్సాహపడి అభాసుపాలయ్యారు. ఉమామహేశ్వరి సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు కారణాలన్నీ వివరించారనీ అయితే ఆమె మరణం తరువాత అందరి కంటే ముందు వారింటికి వెళ్లిన చంద్రబాబు ఆ లేఖను మాయం చేశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. మరీ దారుణమేమంటే అసలా లేఖలో ఏముందో కూడా లక్ష్మీపార్వ తే వివరించడం.
ఇదంతా ఆ కుటుంబాన్ని రోడ్డమీదకు తీసుకురావలన్న కక్ష తప్ప ఏ మాత్రం వాస్తవం లేదన్నది పరిశీ లకుల అభిప్రాయం. వీరి దాడి ఇక్కడితో ఆగలేదు.. జగన్ పార్టీలో మరో కీలక నేత విజయసాయిరెడ్డి ట్వి టర్‌లో రెచ్చపోయారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై వ్యంగ్యస్త్రాలు సైతం సంధించారు.
వైయస్ జగన్ తొలి కేబినెట్‌లో మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ను టార్గెట్ చేస్తే.., ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం చంద్రబాబు ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకు న్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారం ఎంత రచ్చ అయిందో అందరికి తెలిసేందే. అంతేకాదు.. ఎన్టీఆర్ కుటుంబం మీడియా ముందుకు రావాల్సివచ్చింది. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ముందు ఆయనది గుండె పోటు అంటూ జగన్ పార్టీలోని కీలక నేతలు ఆయన మీడియా ప్రచారం చేసినా.. ఆ తర్వాత ఆయన్ని గొడ్డలితో హత్య చేశారు.
ఆ తర్వాత ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడం.. ఆ క్రమంలో ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం.. అనంతరం వివేకా హత్యకేసులో సూత్రధారులు, పాత్రధారులు వీరేనంటూ మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా ఓ ప్రచారం అయితే జోరుగా నడిచింది.. నేటికి నడుస్తోంది. అయితే ఈ వివేకా హత్య కేసులో తెరవెనుక సూత్రధారులంటూ పలువురు అధికార పార్టీలోని కీలన నేతల పేర్లు తెరపైకి రావడంతో.. ప్రతిపక్ష టీడీపీ నేతలు.. హు కిల్డ్ బాబాయి అంటూ సెటైరికల్‌గా జగన్ పార్టీపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా జగన్ పార్టీలోని కీలక నేతలు.. రంగంలోకి దిగి.. చంద్ర బాబు, లోకేశ్, ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, ఉమామహేశ్వరినీ టార్గెట్ చేస్తున్నారనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే ఉమామహేశ్వరి ఆత్యహత్య చేసుకుని.. ఆ కుటుంబం బాధలో ఉంటే.. దీనిని సైతం రాజకీయం చేసి లబ్ది పొందాలనుకోవడం ఎంత వరకు సబబు అనే జగన్ పార్టీలోని నేతలను నెటిజనల్ సైతం ప్రశ్నిస్తున్నారు.