యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు
posted on Aug 4, 2022 7:52AM
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. హస్తినలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని విచారించిన ఈడీ, ఆ తరువాత వరుసగా రెండు రోజుల పాటు యంగ్ ఇండియా కార్యాలయాలపై దాడులు నర్వహించారు. తాజాగా మంగళవారం (ఆగస్టు 3) ఢిల్లీలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేశారు.
ఈ సమాచారం తెలియగానే కర్నాటక పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ హుటాహుటిన హస్తిన చేరుకున్నారు. హుబ్లీ నుంచి ఢిల్లీ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన రాహుల్ కేంద్రంలోని మోడీ సర్కార్ అసమదీయులైన ఒకరిద్దరుకాంగ్రెస్ దిగ్గజ వ్యాపారుల మేలు కోసమే పని చేస్తున్నదని, చిన్న మధ్య తరహా వ్యాపారాలను బతకనీయడం లేదని విమర్శించారు. కాగా పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ ను కేంద్రం ప్రొద్బలంతోనే ఈడీ విచారణ పేరిట వేధిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలకు కూడా చేపట్టింది.
ఈ ఆందోళనలకు విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. అయినా కూడా ఈడీ తన పని తాను చేసుకుపోతోంది. యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం వద్ద, అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇలా ఉండగా తమ అనుమతి లేకుండా యంగ్ ఇండియా కార్యాలయంలోనికి ఎవరూ వెళ్లరాదని ఈడీ ఆంక్షలు విధించింది. కాగా ఈడీ తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోడీ చేతిలో ఈడీ కీలుబొమ్మలా మారిందని ఆరోపిస్తున్నది.
మోడీ ఆదేశాల మేరకే కుట్ర పూరితంగా సోనియాను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈడీ తీరుకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళనలకు సన్నద్ధమౌతున్నది. ఈడీ యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసిన అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ, అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని ఇంటిని ముట్టడిస్తామన్నారు.