రాజగోపాలా.. ఆసలు రాజీనామా ఎందుకు చేశావయా?
posted on Aug 4, 2022 @ 3:14PM
కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రోజుల తరబడి కొనసాగించిన సస్పెన్స్ కు తన రాజీనామాతో తెర దించేశారు. మునుగోడు శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసేశారు. మునుగోడు ఉప ఎన్నిక జరగడం ఖాయమని తేల్చేశారు.
అయితే రాజగోపాలరెడ్డి రాజీనామా రాజకీయంలో ఆయనకు ఎలాంటి క్లారిటీ లేదని తేటతెల్లమైపోయింది. రాజీనామా ఫీలర్ల సమయంలోనూ, రాజీనామాకు ముందూ, ఆ తరువాత ఆయన మీడియా సమావేశాలలో చెప్పిన అంశాలు, మాట్లాడిన మాటలూ వింటే అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం రాక మానదు. ఎందు కంటే ఆయా సందర్బాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఉన్న అయోమయాన్ని, కన్ఫ్యూజన్ ని ఎత్తి చూపాయి. ఒక సారి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని పీసీసీ చీఫ్ చేస్తే ఆయన కింద మేం పని చేయాలా? అని ప్రశ్నించిన రాజగోపాల్ కేవలం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించినందునే తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మరో సారేమో రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్నాననీ, అయితే కేసీఆర్ ను ఢీ కొనే సత్తా కాంగ్రెస్ లో లేదు కనుకనే పార్టీని వీడి కమల దళంలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.
తీరా రాజీనామా చేసేసిన తరువాత ఇంత కాలంగా తన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనీ, ఉప ఎన్నిక వస్తేనైనా నియోజకవర్గ అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ చేపడుతుందన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. ఇలా ఆయన తన రాజీనామాకు ఒకటి కాదు ఏకంగా మూడు రకాల కారణాలు చెబుతున్నారు. పోనీ ఆ మూడు కారణాలతోనే తాను రాజీనామా చేశానని స్పష్టత ఇచ్చారా అంటే అదీ లేదు. ఒక్కో కారణాన్నీ ఒక్కోసందర్భంలో చెప్పారు. దీంతో అసలు ఆయన రాజీనామాకు కారణమేమిటా అని నియోజకవర్గం ప్రజలే తలలు గోక్కుని అయోమయంలో పడ్డారు. ఇక నెటిజనులైతే రాజగోపాల రెడ్డి అయోమయం, కన్ష్యూజనే మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిందన్నారు. ఇక షబ్బీర్ అలీ అయితే ఆయన ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని ఆరోపిస్తూ.. దాని నుంచి బయటపడడానికే కమలాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. సరే ఇప్పుడు ఇక ఎలాంటి సందేహం లేదు. మునుగోడు ఉప ఎన్నిక ఖాయం. రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేశారు. కమలం తీర్థం పుచ్చుకుంటారు.
అందులోనూ సందేహం లేదు. కనీసం బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికలో నిలబడి నియోజకవర్గ ప్రచారానికి వచ్చినప్పుడైనా తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులేమిటన్నది క్లారిటీ ఇవ్వగలరా అంటే అదీ అనుమానమేనంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఒకటి రెండు నెలలు అటూ ఇటూగా ఏడాదిలోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపుగానే ఇప్పుడు హడావుడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెరతీయడమెందుకని ఆయన అనుచరులే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.రాజగోపాల రెడ్డి కన్ఫ్యూజన్ కారణంగా ఈ ఉప ఎన్నికలో బీజేపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే కలుగుతున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు, ఆయన బీజేపీలో చేరికకు పార్టీ అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో అయితే గాంధీ భవన్ లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని మరీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ రాజీనామా ప్రకటనతో చల్లబడిపోయిందనే చెప్పాలి. అందుకు ఆయన కన్ఫ్యూజనే కారణమని అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా ఆ రాజీనామా బీజేపీకి ఏం ప్రయోజనం అన్నది పక్కన పెడితే ఆయనకైనా ఉపయోగపడుతుందా అన్నదే.