తెలంగాణలో ఉప ఎన్నికలా.. ముందస్తు ఎన్నికలా?!
posted on Aug 4, 2022 @ 4:54PM
వలసలు కాదు ఉప ఎన్నికలే అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటన్నది కుండ బద్దలు కొట్టేశారు. మునుగోడుతో సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం ఆగిపోదనీ, కనీసం మరో మూడు నాలుగు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కమలం గూటికి చేరడం ఖాయమని ఆయన చెప్పేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీలైనన్ని నియోజవకర్గాలలో ఉప ఎన్నికలు జరిగేలా కమలంపార్టీలోనికి వలసలు ఉంటాయనీ బండి సంజయ్ చెప్పారు. కోమటి రెడ్డ రాజగోపాల రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి వలసల ప్రవాహం ఆరంభమైనట్లేననీ, ఆలా ఆయా పార్టీల నుంచి వచ్చి కమలం గూటికి చేరే వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా తప్పని సరిగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఇదంతా టీఆర్ఎస్ ను కుదేలు చేయడానికి లేదా గాభరా పెట్టడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది పైన రెండు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో ఇలా వరుస ఉప ఎన్నికలను ఎదుర్కొన వలసి రావడం ఏ విధంగా చూసినా అధికార పార్టీకి లాయకీ కాదు. అందుకు టీఆర్ఎస్ ఏమీ మినహాయింపు కాదు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాలుగైదు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖాయం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండంటూ టీఆర్ఎస్ కు సవాళ్లు విసురుతున్నారు. ఒక వేళ బండి సంజయ్ అన్నట్లు కొన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే వస్తే కేసీఆర్ ముందస్తుపై తీవ్రంగా ఆలోచించక తప్పని సరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. బండి వ్యూహం కూడా అదేనని అంటున్నారు. కేసీఆర్ సాధారణంగా షెడ్యూల్ వరకూ ఆగకుండా ముందస్తుకే మొగ్గు చూపుతారు.
2014 ఎన్నికలలో విజయం తరువాత ఆయన ఏడాది ముందుగానే ముందస్తుకు వెళ్లి ఘన విజయాన్ని అందుకున్నారు. అదే ఫార్ములాను అనుసరించి ఈ సారి కూడా ముందస్తు యోచన చేసినా కేంద్రంలో బీజేపీతో సంబంధాలు చెడిన నేపథ్యంలో ముందస్తు కోసం అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం చక్రం తిప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ఎదురెత్తు వేస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. అయితే సిట్టింగ్ ల వరుస రాజీనామాలతో ఎక్కువ సంఖ్యలో ఉప ఎన్నికలను ఎదుర్కొన వలసి వస్తే మాత్రం కేసీఆర్ అనివార్యంగా ముందస్తు యోచనను ముందుకు తీసుకువస్తారన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది.
అందుకే బండి సంజయ్ పదే పదే పలు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు అంటూ ఫీలర్లు వదులుతున్నారు. అయితే ఇప్పటి వరకూ కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వినా మరెవరూ కమలం గూటికి చేరబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించింది లేదు. వ్యూహాత్మకంగా పలువురు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఫీలర్లు వదులుతోంది. ఏది ఏమైనా రాజగోపాల రెడ్డి రాజీనామా చేసేశారు. అదే బాటలో మరి కొంత మంది నడిస్తే మాత్రం కేసీఆర్ ముందస్తు యోచనతో ముందుకు సాగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.