కాంబోజ్‌.. మ‌న‌ మహిళా యుఎన్ రాయబారి

రాయబారి రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్యసమితిలో మొదటి భారతీయ మహిళా రాయబారి కావడం మనందరికీ గర్వకారణం. న్యూయార్క్‌లోని ప్రపంచ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కాంబోజ్ మంగళవారం యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు తన ఆధారాలను సమర్పించారు. ఆమె T S తిరుమూర్తి తర్వాత యుఎన్ లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని దక్కించుకున్న తొలి భారతీయ మహిళ కావడం విశేషం. ఆమె అమ్మాయిల కోసం ఒక నోట్‌లో కూడా జారిపోయిం ది: అక్కడ ఉన్న అమ్మాయిలకు, మనమందరం దీన్ని చేయగలం. కాంబోజ్, 1987-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, భూటాన్‌కు భారత రాయబారిగా పనిచేస్తు న్నారు. భూటాన్ కి భారత మొదటి మహిళా రాయబారి కూడా. ఆమె 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్. ఆమె ఫ్రాన్స్‌లోని పారిస్‌లో తన దౌత్య ప్రయాణాన్ని ప్రారంభించింది, అక్కడ ఆమె 1989-1991 వరకు ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం లో మూడవ కార్యదర్శిగా పోస్ట్ చేయబడింది. పారిస్ నుండి, ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చింది, అక్కడ ఆమె 1991-96 మధ్యకాలంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యూరప్ వెస్ట్ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేసింది. 1996-1999 వరకు, ఆమె మారిషస్‌లో పోర్ట్ లూయిస్‌లోని భారత హైకమిషన్‌లో మొదటి కార్యదర్శి (ఆర్థిక మరియు వాణిజ్య)  ఛాన్సరీ హెడ్‌గా పనిచేసింది. కాంబోజ్ గతంలో 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత్  శాశ్వత మిషన్ లో కౌన్సెలర్‌గా కూడా పనిచేశారు. 2011-2014 వరకు, ఆమె భారతదేశపు ప్రోటోకాల్ చీఫ్‌గా ఉన్నారు, ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ పదవిని నిర్వహించిన మొదటి,  ఏకైక మహిళ. మే 2014లో, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవా నికి దర్శకత్వం వహించేందుకు ప్రత్యేక అసైన్‌మెంట్‌పై కూడా ఆమెను పిలిచారు.   జూలై 2017లో, ఆమె అహ్మదాబాద్‌ను భారత దేశపు మొదటి ప్రపంచ వారసత్వ నగరంగా లిఖించే ప్రయత్నానికి నాయకత్వం వహించారు, ఇది యునెస్కో  ప్రపంచ వారసత్వ కమిటీ  పూర్తి మద్దతుతో సాధించబడింది. ఫిబ్రవరి 2019- జూన్ 2022 వరకు, ఆమె భూటాన్‌లో మ‌న‌ రాయబారిగా పనిచేశారు. కౌన్సిల్‌లో భారతదేశ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌లో ముగుస్తుంది, ఆ నెలలో ఆ దేశం శక్తివం తమైన యుఎన్ విభాగానికి అధ్యక్షులుగానూ వ్యవహరిస్తుంది.

యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. హస్తినలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని విచారించిన ఈడీ, ఆ తరువాత వరుసగా రెండు రోజుల పాటు యంగ్ ఇండియా కార్యాలయాలపై దాడులు నర్వహించారు. తాజాగా మంగళవారం (ఆగస్టు 3) ఢిల్లీలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సమాచారం తెలియగానే కర్నాటక పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ హుటాహుటిన హస్తిన చేరుకున్నారు. హుబ్లీ నుంచి ఢిల్లీ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన రాహుల్ కేంద్రంలోని మోడీ సర్కార్ అసమదీయులైన ఒకరిద్దరుకాంగ్రెస్ దిగ్గజ వ్యాపారుల మేలు కోసమే పని చేస్తున్నదని, చిన్న మధ్య తరహా వ్యాపారాలను బతకనీయడం లేదని విమర్శించారు. కాగా పార్టీ అధినేత్రి  సోనియా, రాహుల్ ను కేంద్రం ప్రొద్బలంతోనే ఈడీ విచారణ పేరిట వేధిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలకు కూడా చేపట్టింది. ఈ ఆందోళనలకు విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. అయినా కూడా ఈడీ తన పని తాను చేసుకుపోతోంది. యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం వద్ద, అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇలా ఉండగా తమ అనుమతి లేకుండా యంగ్ ఇండియా కార్యాలయంలోనికి ఎవరూ వెళ్లరాదని ఈడీ ఆంక్షలు విధించింది. కాగా ఈడీ తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోడీ చేతిలో ఈడీ కీలుబొమ్మలా మారిందని ఆరోపిస్తున్నది. మోడీ ఆదేశాల మేరకే కుట్ర పూరితంగా సోనియాను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈడీ తీరుకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళనలకు సన్నద్ధమౌతున్నది. ఈడీ యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసిన అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ, అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని ఇంటిని   ముట్టడిస్తామన్నారు. 

అభినవ కృష్ణుడి లీవ్ లెటర్

అలిగితివా సఖీ ప్రియా.. అలుక మానవా? అంటూ కోపగృహంలోకి వెళ్లిన భార్యను బతిమలాడుకుని తన్నులు తినాల్సిన బాధ శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంత. అయినా అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఫోన్ లో బుజ్జగించి వెనక్కు తీసుకురావడం పాపం ఆ చిరుద్యోగికి సాధ్యం కాలేదు. అత్తారింటికి వెళ్లి బతిమాలో బామాలో వెనక్కు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ సెలవు ఎలా? మామూలుగా సెలవు కావాలంటే ఎవరైనా ఏం చేస్తారు. కడుపు నొప్పో, కాలు నొప్పో అని పై అధికారికి ఓ లీవ్ లెటర్ ఇస్తారు. కానీ కాన్పూర్ కు చెందిన అమ్షద్ అహ్మద్ మాత్రం ఉన్న కారణం ఉన్నట్లుగానే తన లీవ్ లెటర్ లో పేర్కొన్నాడు. అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బతిమలాడి ఇంటికి తెచ్చుకునేందుకు ఓ మూడు రోజులు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసి సెలవుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతగాడికి సెలవు మంజూరైందా లేదా అన్నది పక్కన పెడితే ఆ లీవ్ లెటర్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోయింది.   ఇటీవల తన భార్యతో ఓ చిన్న విషయంలో గొడవ పడ్డాం. దాంతో నా భార్య అలిగి ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను ప్రసన్నం చేసుకుని తిరిగి ఇంటికి తీసుకురావాలి. అందుకోసం మూడు రోజులు సెలవు మంజూరు చేయండి సార్ అంటూ అతడు రాసిన లీవ్ లెటర్ నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. అసలా లీవ్ లెటర్ బయటకు ఎలా వచ్చిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం అమ్షద్ అహ్మద్ సత్యసంధతను తెగ మెచ్చేసుకుంటున్నారు. అతడి పై అధికారి కచ్చితంగా సెలవు మంజూరు చేసే ఉంటాడని అంటున్నారు. ప్రతి భర్తకూ భార్యను ప్రసన్నం చేసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏముంటుందని జోకులేస్తున్నారు. ఇంతకీ అతడికి సెలవు మంజూరైందా? అత్తారింటికి వెళ్లి భార్యను తెచ్చుకున్నాడా? అన్న ప్రశ్నలు నెటిజన్లను తొలిచేస్తున్నాయి. ఆ వివరాలు చెప్పాల్సింది అమ్షద్ అహ్మదే మరి.

రాజగోపాలరెడ్డి బాటలోనే కోమటి రెడ్డి వెంటకరెడ్డి.. రేవంత్ పై విమర్శలకు కారణమదేనా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన తమ్ముడు రాజగోపాలరెడ్డి దారిలోనే నడుస్తున్నారా? లేదా నడవడానికి నిర్ణయించుకున్నారా? ఢిల్లీలో ఆయన రేవంత్ పై విమర్శల వర్షం కురిపించడం చూస్తుంటే ఔననే అనుకోవలసి వస్తోంది. కోమటి రెడ్డి సోదరులు తొలి నుంచీ రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ వెంకటరెడ్డి ఆ బాధను పంటి బిగువున భరిస్తూ వస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడాన్ని, కమలం గూటికి చేరడాన్ని సమర్ధిస్తూనే మాట్లాడారు. తన తమ్ముడు తనకు ఇష్టం అయిన పార్టీలోకి వెళుతున్నారు, అది ఆయన వ్యక్తిగతం అంటూ సమర్ధించారు. అయితే తన సోదరుడిపై రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. రాజగోపాలరెడ్డిని ఆనకొండ అనడానికి రేవంత్ కు ఏం హక్కు ఉందని అంటున్నారు. హస్తినలో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి తన ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంపైనే పెట్టారు. కాంగ్రెస్ లో లేకుండా ఉండి ఉంటే మీరు బ్రాందీ షాపుల్లో సీతా మూతలు ఏరుకోవడానికి కూడా పని కొచ్చే వారు కాదంటూ రేవంత్   తన సోదరుడితో పాటు తననూ టార్గెట్ చేసే విమర్శించారని కోమటి రెడ్డి అన్నారు. తనకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కానీ తనను రెచ్చగొడితే మాత్రం ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో తనకు సంబంధం లేదన్న ఆయన పనిగట్టుకుని రేవంత్ పై విమర్శలు గుప్పించడంతోనే కోమటిరెడ్డి కూడా పార్టీని వీడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ వీడడానికి ముందు రేవంత్‌నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అదే బాటలో వెడుతున్నారా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి వదిలేస్తున్న గుడివాడ.. ఆయన గురి ఎక్కడంటే..?

మంత్రి గుడివాడ అమర్నాథరెడ్డి నియోజకవర్గం మార్పుపై తీవ్రంగా దృష్టి పెట్టారా? అనకాపల్లి నుంచి మళ్లీ పోటీకి దిగితే విజయం సులువు కాదని భావిస్తున్నారా? గత ఎన్నికలలో తనకు అనుకూలించిన అంశాలేవీ ఇప్పుడు తనకు అనుకూలంగా లేవని భావిస్తున్నారా? మరో వైపు గత ఎన్నికల సమయంలో ఉన్న జగన్ గాలి ఈ సారి ఇసుమంతైనా లేకపోవడం వల్ల అనకాపల్లి నుంచే మళ్లీ పోటీకి దిగితే విజయం దక్కదని భావిస్తున్నారా? పైగా గతంలో తనకు గట్టి మద్దతుగా నిలిచిన దాడి వంటి పలుకు బడి కలిగిన నేతలు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారుతుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. పైగా అధినేత జనంలో ఉన్నవారికే టికెట్లని ఖరాకండీగా చెప్పేసిన తరువాత అనకాపల్లినే పట్టుకు వెళాడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన గుడివాడ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరనీ, తనకు పెందుర్తి నియోజకవర్గమైతే సేఫ్ అని భావిస్తున్నారనీ వైసీపీ శ్రేణుల్లోనే  ఒక చర్చ జరుగుతోంది. అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గం గుడివాడ అమర్నాథ్ రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్నది. దీనికి తోడు గుడివాడకు అనకాపల్లి నాన్ లోకల్ అన్న ముద్ర ఒకటి ఉంది. దానిని బేస్ చేసుకునే సొంత పార్టీలోనే గుడివాడకు సెగ పెడుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెందుర్తి నియోజకవర్గం పై దృష్టి పెట్టారని అంటున్నారు.   అక్కడ పోటీ చేస్తే తనకు లోకల్ కార్డ్ కలిసొస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ఉన్నారు. ఇంత వరకూ గుడివాడకు బలమైన మద్దతు దారుగా ఉన్న అదీప్ రాజు.. ఇప్పుడు మంత్రిపై గుర్రుగా ఉన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   

వైసీపీలో పెరుగుతున్న ధిక్కారం..మళ్లీ అధికారంపై ఎమ్మెల్యేలలో ఆవిరైన నమ్మకం

ఒక వైపు స్వయంగా చేయించుకున్న సర్వేలే జగన్ కు దిమ్మతిరిగేలా చేస్తుంటే.. మరో వైపు పార్టలో ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు గట్టిగా వినిపించడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మెజారిటీ ఎమ్మెల్యేలలో లేదన్న మాట ఆ పార్టీ శ్రేణుల నుంచే వినవస్తున్నది. అందుకే పార్టీయా గాడిద గుడ్డా.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసు అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే పార్టీపై తమకు విశ్వాసం లేదని విస్ఫష్టంగా చెప్పేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లేదు.. గాడిద గుడ్డూ లేదని ఆయన తన ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపించారంటున్నారు. దాదాపు ఇటువంటి వ్యాఖ్యలే పలువురు ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెప్పారని కూడా అంటున్నారు. ఇక జగ్గయ్య పేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విషయానికి వస్తే..ఆయన సొంత పార్టీపైనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసునని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తాను వైసీపీలో శాశ్వతంగా ఉండబోవడం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారనీ, ఏదో ఉన్నంత వరకూ బాధ్యతగా పని చేయడమే తన పని అన్నారు.   పింఛన్ తీసుకునే సామాన్యులు ఆదాయ పన్ను ఎలా కట్టగలరని ఆయన తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు.  కాగా జ్యోతుల చంటిబాబు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి నుంచి వైసీపీలో చేరారు. 2009లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓటమి పాలయ్యారు.  ఆ తరువాత  2019లో తెలుగుదేశం పార్టీని వీడి  వైసీపీలో చేరారు. ఆ పార్టీ  అభ్యర్థిగా   పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు చంటి బాబు తెలుగుదేశం వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

కాంగ్రెస్ కు జగ్గారెడ్డి, తెరాసకు తుమ్మల గుడ్ బై చెప్పనున్నారా?

అస‌లే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణా కాంగ్రెస్  ఆత్మరక్షణలో ఉండ‌గా మ‌రోవంక సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం అంత‌కు మించి అన్న‌ట్టు త‌యార‌యింది. నిత్యం వార్త‌ల్లో ఉండే జ‌గ్గారెడ్డి గ‌త కొన్ని రోజులుగా మౌనం వ‌హించారు. క‌నీసం గాంధీభ‌వ‌న్ మెట్ల‌న్నా ఎక్క‌డం లేదు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో స‌మావేశం త‌ర్వాత జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హార శైలిలో ఊహించ‌ని మార్పే వ‌చ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. పార్టీ అధినేత‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నందువ‌ల్ల పార్టీ విష‌యాలు మీడియాకు చెప్పన‌ని పేర్కొన్న ఆయన అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలకు దూరం దూరంగానే ఉంటున్నారు. కాగా ఆమ‌ధ్య పార్టీ ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటితే త‌ల గోడ‌కేసి కొడ‌తాన‌ని రేవంత్ రెడ్డి అన‌డం జ‌గ్గారెడ్డిని ఆగ్ర‌హానికి ఆజ్యం పోసిన‌ట్ట‌యింది. య‌శ్వంత్ సిన్హాను క‌లిసిన వి.హ‌నుమంత‌రావును ఉద్దేశించే రేవంత్ ఆ విధంగా నోరుపారేసుకున్నాడ‌ని జ‌గ్గారెడ్డి ఘాటుగానే విమ‌ర్శ‌చేశారు. జ‌గ్గారెడ్డి మౌనం మ‌రింత విస్త‌రించి ఏకంగా మాణికం ఠాకూర్ తో పీసీసీ నాయ‌కుల‌ స‌మావేశానికి కూడా హాజ‌రు కాలేదు.  అంతెందుకు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పార్టీ ఎమ్మెల్యేల‌తో కాకుండా ఆయ‌న విడిగా ఆఖ‌రి నిమిషంలో వ‌చ్చి ఓటేసి వెళ్లిపోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అస‌లు ఆయ‌న ఏం చేయ‌బో తున్నారు? ఆయ‌న ఏం చెప్ప‌బోతున్నార‌న్న‌ది ఇప్ప‌టికీ అంద‌రికీ ఓ ప‌జిల్ గానే ఉంది. సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజ రైన రోజు కూడా హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ ముందు చేసిన ధర్నాలో పాల్గొనకుండా  జగ్గన్న సంగారెడ్డిలో నిరసన దీక్ష చేశారు. ఈయ‌న కూడా ఏదైనా పిడుగు లాంటి మాట చెబుతార‌మోన‌ని తెలంగాణా పిసిసి నాయ‌కులు ఖంగారుప‌డుతున్నారు.  మరో వైపు కొద్దితేడాతో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా  తెరాసాకు పిడగు పాటు వంటి కబురు అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఎందుకంటే, ఆయ‌న కొంత‌కాలం నుంచి బీజేపీ లో చేరుతార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగానే విన‌వ‌స్తోంది. త్వ‌ర‌లో బీజేపీలో చేర‌డానికి ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి, టీఆర్ ఎస్ నేత ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు సిద్ధంగా ఉన్నార‌న్న స‌మాచారం. వీరితో పాటు కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ పార్టీలకు చెందిన కీల‌క‌నేత‌లు కూడా క్యూ కట్ట‌వ‌చ్చ‌ని వార్త‌లు ప్రచారంలో ఉన్నాయి.  తెలంగాణా రాజ‌కీయ‌ రంగం వేడెక్కిన త‌రుణంలో కేసీఆర్ ముంద‌స్తుకు సిద్ధ‌ప‌డితే తుమ్మ‌ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తు న్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.  ఏది ఏమైన‌ప్ప‌టికీ తెరాసకు   తుమ్మ‌ల‌, కాంగ్రెస్ కు జ‌గ్గారెడ్డి ఇద్ద‌రూ పిడుగులాంటి వార్త‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మ‌రింత వేడెక్కించి కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ పార్టీల‌కు పెద్ద ప‌రీక్ష పెట్ట‌బోతున్నార‌ని పరిశీలకులు అంటున్నారు.

జగన్ తీరు పరమ రోత.. సైకో సీఎంకు ఎక్సపైరీ డేట్ దగ్గర పడింది: లోకేష్

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె  ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ దుష్ప్రాచారం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. వైసీపీ శ్రేణులే తమ పార్టీ తీరును నిరసిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష ప్రచారం వెనుక ఉన్నది జగనే. సర్వే నంబర్ కు, డోర్ నంబర్ కు తేడా తెలియని కిరాయిగాళ్లు తన చిన్నమ్మ మరణంపై చేస్తున్న విషప్రచారం వెనుక ఉన్నది ఏపీ సీఎం జగనేనని అన్నారు. జగన్ క్రిమినల్ మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డికి ఇక ఎక్సపైరీ డేట్ దగ్గరపడిందన్నారు. జగన్ జీవితమంతా అసత్యాలు, అన్యాయాలు, అక్రమాలేనని విమర్శించిన లోకేష్ కోడి కత్తి డ్రామా, బాబాయ్ గుండె పోటు అంటూ ఆస్కార్ రేంజ్ నటనలతో గత ఎన్నికల ముందు సానుభూతి సంపాదించుకుని అధికారం చేజిక్కించుకున్నారనీ లోకేష్ పేర్కొన్నారు. తప్పుడు సర్వే నంబర్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారానికి తెరలేపి అభాసుపాలయ్యారన్నారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేసిన నీచ చరిత్ర జగన్ ది అని విమర్శించారు.   ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మరణాన్ని వాడుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత జనాన్ని దోచుకుని, నెత్తుటి కూడు తింటున్నారని దుయ్యబట్టారు. చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంతో తాము విషాదంలో ఉంటే.. విషప్రచారం చేస్తూ వినోదం పొందుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికత గురించి మాట్లాడే అర్హత కూడా విజయసాయి రెడ్డికి లేదని అన్నారు. 

సంక్షేమం పేర లక్ష్మణ రేఖ దాటేశారు..!

శ్రీలంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో చెలరేగిన ప్రజాందోళనలు, హింసాత్మక సంఘటనలపై మన దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రం కూడా రాజకీయ అవసరాలు అనివార్యతలను పక్కన పెట్టి రాష్ట్రాల అప్పులపై హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆంక్షలు విధిస్తోంది. లోక్ సభ సాక్షిగానే రాష్ట్రాల ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యాన్ని మందలించడానికి వెనుకాడటం లేదు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై కేంద్రం బహిరంగంగానే విమర్శలు గుప్పించడం, ఆంక్షలు విధించడం విమర్శలకు తావిస్తున్నా.. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంగా విభిన్న కోణాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పీఠాన్ని అందుకునేందుకు రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు  ఉచిత వరాలను నిచ్చెనలుగా చేసుకుని, అధికారానికి అడ్డ దారిగా, దగ్గరి దారి (షార్ట్కట్) గా భావిస్తున్న నేపధ్యంలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందనే  వాదన బలాన్ని పుంజుకుంటోంది. నిజమే. సంక్షేమం గీత దాటితే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో  ప్రభుత్వాలు ‘ఓటు బ్యాంక్’ పథకాలకు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పులు చేసి మరీ  పథకాలు అమలు చేస్తున్నాయి. మీటలు నొక్కి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇటీవల ఏపీ ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి, నొక్కిన మీటల లెక్కలు చెప్పి, మొత్తం 175 సీట్లు తమవే అన్న ధీమాను వ్యక్తపరిచారు. ఇలా ప్రజలను ఓటర్లుగా ఓటర్లను అమ్ముడుపోయే సరుకుగా భావించి అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఫలితంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోవడంతో పాటుగా,ప్రభుత్వ ఉద్యోగులకు  సకాలంలో  జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అలాగే, అప్పుల భారం పెరిగే కొద్దీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయలేక పోతున్నాయి. కోతలు విధిస్తున్నాయి. చేతులేత్తెస్తున్నాయి. మరో వంక అభివృద్ధి, దీర్ఘకాల సుస్థిర ప్రయోజనాలపై ప్రభుత్వాలు దృష్టి నిలపలేక పోతున్నాయి. శ్రీ లంకలో జరిగింది అదే, అందుకే మన దేశంలోనూ శ్రీ లంక తరహా పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఘటికలు వినిపిస్తున్నాయని, హెచ్చరికలు వినవస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, షార్ట్కట్ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని, చేసిన వ్యాఖ్యాలు ఇప్పడు దేశంలో ప్రధాన చర్చనీయంశాలు అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ, ప్రత్యేకించి ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయక పోయినా, షార్ట్కట్ రాజకీయాలపై ఆధారపడితే,  షార్ట్ సర్క్యూట్ ఖాయమని చేసిన హెచ్చరిక మాత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా అందరికీ వర్తిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు  ఏపీ, తెలంగాన స్టేట్ గవర్నమెంట్స్ సీరియస్ గా తీసుకోవాలని  అంటున్నారు. ప్రధాని మోడీ ఎక్కడా ఎవరి పేరూ ప్రస్తావించక పోయినా, ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్కట్ రాజకీయాలుగా అభివర్ణించారు. వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు.. షార్ట్కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి" అని హెచ్చరించారు. నిజానికి ప్రధాని  మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితి గతులు, అప్పులు ఆదాయాలపై దృష్టిని కేంద్రేర కరించింది. ముఖ్యంగా, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లంఘించి, కార్పొరేషన్ల పేరిట అడ్డదారిలో చేస్తున్న అప్పులకు సంకెళ్ళు  బిగించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా అప్పులు చేయకుండా రాష్ట్రాల రుణ పరిమితిని ఎప్పటికప్పుడ్డు సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రం తీసుకున్న కఠిన చర్యలు సహజంగానే రాష్ట్ర  ప్రభుత్వాలకు రుచించడం లేదు. అయితే, ఆర్థిక నిపుణులు, చివరకు రాష్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు కూడా, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే,ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరని, బెల్ట్స్ బిగించిక తప్పదని అంటున్నారు. అలాగే, శ్రీలంక పరిణామాల నేపధ్యంలో, ప్రజలు కూడా, సంక్షేమం గీతదాటితే సంక్షోభమే, అనే వాస్తవాన్ని గుర్తిస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా శ్రీలంక పరిణామాలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు విత్త మంతి ఏపీ సర్కార్ లక్ష్మణ రేఖ దాటేసిందనీ, ఈ విషయంపై ఆ రాష్ట్రాన్ని గతంలోనే  హెచ్చరించామనీ కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో రాజకీయాలు చేయడం అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్రాలకు కానీ ఎంత మాత్రం తగదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విస్త‌రిస్తున్న గొయ్యి... ప్ర‌జ‌ల ప్రాణ‌భీతి!

తెలియ‌ని ప్రాంతంలో తిరుగుతూంటే హ‌ఠాత్తుగా చిన్న గొయ్యో, పెద్ద కంప‌తో క‌ప్ప‌బ‌డిన మ‌రేద‌యి నానో క‌న‌ప‌డితే ఒక్క‌సారిగా భ‌యంతో వెన‌క‌డుగుప‌డుతుంది.  ఉన్న‌ప్రాంతంలోనే కాస్తంత దూరంలోని పెద్ద‌గొయ్యి  క్ర‌మేపీ విస్త‌రించ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌కు గురిచేయ‌క‌ పోదు. చిన్న గొయ్యి, పెద్ద పాము ఒక్క‌సారి చూస్తేనే ఒణుకుపుడుతుంది. అలాంటిది త‌మ భూప్రాం తాన్ని మెల్ల‌గా  త‌న‌లోకి లాగేసుకుంటున్న అసాధార‌ణ గొయ్యి చిలీ టియెర్రా అమ‌రిల్లా ప్ర‌జ‌లు ప్రాణ‌భీతి ఏ స్థాయిలో ఉంటుం దో ఆలోచించండి.  ఉత్తర చిలీలోని టియెర్రా అమరిల్లా ప్రాంతంలో ప్రస్తుతం 25 మీటర్ల వెడల్పు ,  200 మీటర్ల  లోతులో ఉన్న భారీ , అసాధారణమైన గొయ్యి ఎక్కడా కనిపించలేదు.  దీని గురించి  భయానక సంగ‌తేమిటంటే గొయ్యి ఇంకా  విస్తరించ‌డం.  డ్రోన్‌ల ద్వారా తీసిన  వైమానిక ఫుటేజ్ భారీ గొయ్యి  చూపించింది, ఇది 82 అడుగుల (బహుశా చాలా ఎక్కువ) వ్యాసం కలిగి ఉంది. దీన్ని గురించి  నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ (సెర్నాజియోమిన్) పరిశోధిస్తోంది. ఈ విషయం శాస్త్రవేత్తలకు ఇటీవ‌ల‌ తెలిసింది. కెనడా కు చెందిన లుడిన్ మైనింగ్ రాగి గని ద్వారా నిర్వహిస్తున్న అటకామా ప్రాంతంలోని విస్తారమైన భూభా గంలో క్యాటర్ ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దాదాపు 200 మీటర్లు (656 అడుగులు) దిగువకు గణనీయమైన దూరం ఉంది.   అక్కడ ఎటువంటి  పదా ర్థాన్ని గుర్తించలేదు, కానీ చాలా నీటి ఉనికిని మేము చూశామ‌ని  నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ  అండ్ మైనింగ్ (సెర్నాజియోమిన్) డైరెక్టర్ డేవిడ్ మోంటెనెగ్రో చెప్పారు.  స్పష్టంగా, లుండిన్ మైనింగ్ రాగి గని అల్కాపర్రోసా గనిలోని బిలంకి దగ్గరగా ఉన్న భాగాలను మూసివేసింది. అయితే,  దానివ‌ల్ల  అక్క‌డ ప‌ని చేస్తున్న సిబ్బంది, పరికరాలు లేదా మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం లేదని  పేర్కొన్నా రు.  ఈమ‌ధ్య ఒక ప్రకటనలో, లుండిన్ మైనింగ్ సింక్‌హోల్ ఏ కార్మికులను, సంఘ సభ్యులను ప్రభావితం చేయలేదని తెలిపింది. అక్క‌డికి  600 మీటర్లు కంటే ఎక్కువ దూరంలోనే నివాసాలు ఉన్నాయి. అయితే ఏదైనా జనావాస ప్రాంతం లేదా పబ్లిక్ సర్వీస్ ప్రభావిత జోన్ నుండి దాదాపు కిలోమీటరు దూరంలో ఉం ద‌ని ప్రకటన పేర్కొంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ బిలం తక్షణ ముప్పును కలిగించనప్పటికీ, మైనింగ్ నిక్షేపాలు చుట్టుముట్టడం గురించి ప్రజలు ఎల్లప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని స్థానిక కమ్యూన్ మేయర్ క్రిస్టోబల్ జునిగా అన్నారు. మా కమ్యూనిటీ కింద మైనింగ్ నిక్షేపాలు  భూగర్భ పనులే చుట్టూరా జ‌రుగుతుంటాయి. క‌నుక‌ మాకు ఎప్పుడూ ఉంద‌ని మేయర్ జునిగా అన్నారు. 

వైసీపీ శాడిజానికి ఇది పరాకాష్ట.. రఘురామ‌కృష్ణంరాజు

ఎవ‌ర‌యినా ఒక వ్య‌క్తి మ‌ర‌ణించ‌గానే శ‌తృవుల‌యినా కాస్తంత సానుభూతితో వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌ల‌క‌రి స్తారు. కానీ వైసీపీవారు మాత్రం చావు పరామర్శకు వెళ్లి చచ్చినోడికి మెల్లకన్ను అన్నట్లు వ్యవహరించారు. అసంబద్ధ, అవాస్తవ విమర్శలతో అభాసుపాలయ్యారు.  తమ విమర్శలన్నీ అవాస్తవాలని తేలిపోయిన తరువాత కూడా   క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోగా  అదే మూర్ఖత్వాన్ని కొనసాగిస్తూ   ఉండిపోవ‌డాన్ని వైసీపీ శ్రేణులో సహించలేకపోతున్నాయి. సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కూడా ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ మా పార్టీ శాడిజానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.  ఆస్తికోస‌మే గొడ‌వ‌ప‌డి  కుటుంబ‌స‌భ్య‌లే  ఆమె మ‌ర‌ణానికి కార‌కుల‌య్యార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌చా రం చేయ‌డం క్ష‌మించ‌రాని నేర‌మ‌ని న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు మండిప‌డ్డారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెర వేలుపుగా తెలుగువారు పూజించే ఎన్టీ రామారావు కుమార్తె మ‌ర‌ణం ప‌ట్ల వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం నైతిక దివాళాకోరుతనానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. ఆస్తికోసం అర్రులు చాచ‌డం, అన్నా చెల్లెళ్లు బంధాన్ని కూడా ప‌ట్టించుకోకుండా దూరంగా వెళ్ల‌డం ఎవరు చేశారన్నది  యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలుసున‌ని ర‌ఘురామ రాజు  అన్నారు. కానీ ఎన్టీఆర్ కుటుంబానికి ఆ అగత్యం లేదని రఘురామ రాజు అన్నారు.  ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో భాగంగా ఢిల్లీలో ర‌ఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికలలో  40 నుంచీ 45 స్థానాలు గెలిచే అవ‌కాశం ఉంటుంద‌ని భావించాననీ, ఇప్పుడు మా పార్టీ  సోష‌ల్ మీడియాలో పార్టీ వారియ‌ర్స్ చేస్తున్న ఈ వికృత చేష్ట‌లతో   ఒక్క సీటు రాక‌పోయినా పెద్ద‌గా ఆశ్చర్య‌పడాల్సిన పని లేదని రఘురామరాజు అన్నారు. అస‌లు ఒక‌రి బంధువు మ‌రణాన్ని రాజ‌కీయ‌ కోణంలో చూడ‌డం కామెంట్లు చేయ‌డం కంటే దారు ణం మ‌రోటి ఉండ‌ద‌ని వైసీపీ ఎంపీ మండిప‌డ్డారు. హూ కిల్డ్ బాబాయ్ అన్న‌దానికి ప్ర‌తిగా హూ కిల్డ్ పిన్ని అనే ప్ర‌చారానికి తెర‌ లేప‌డం పై ఆయ‌న మండిప‌డ్డారు. బాబాయి హత్య కేసులో నిందితుల‌ను బయటకు రాకుండా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదెవరన్నది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు.   ఏకంగా సిబిఐ అధికారి రాంసింగ్ పైనే, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చేత ఫిర్యాదు చేయించి కేసు పెట్టించిందెవరో తెలియదా అని ప్రశ్నించారు. సీబీఐ అధికారి  రామ్ సింగ్ తనపై పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను స్క్వాష్ చేయమని కోరగా, కోర్టులో కేసు లిస్ట్ కాలేదని, జడ్జి సెలవు పెట్టి వెళ్లారని, ఇలా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని అన్నారు.  ఇక రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహరించిన తీరు లేపి తన్నించుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.  ఏపీ డెవలప్మెంట్ కార్పొ రేషన్ పేరిట తాము చేసిన అప్పులను, ఆర్.బి.ఐ   తప్పు పట్టినట్టుగా లేఖ రాసిందా ?అంటూ ప్రశ్నించి రాజ్యసభ సాక్షిగా ఏపీ సర్కార్ అప్పులను ఆర్బీఐ తప్పుపట్టిందని కేంద్రం ప్రకటించడంతో మోహం ఎక్కడ దాచుకోవాలో తెలియని పరిస్థితిలో పడ్డారని రఘురామకృష్ణం రాజు అన్నారు.   పార్లమెంట్లో 377 లో భాగంగా లాటరీ లో తనకు ప్రశ్న లేవనెత్తి అవకాశం లభించిందని, అయితే తమ పార్టీ ఎంపీలు కేంద్రానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే మాట్లాడాలి తప్ప, రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడవద్దు అంటూ ఒత్తిడిని తీసుకువచ్చి, ప్రజా సమస్యను ప్రస్తావించకుండా చేశారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లినే గౌరవించని వాడు .మాతృభాషను గౌరవిస్తాడను కోవడం తప్పేనని అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే  బోధించాలని ఎం ఓ ఎస్  అన్నపూర్ణాదేవి స్పష్టంగా పేర్కొన్నారని, దేశంలోని 28 భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించా రని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు పాఠ శాలల కోసం రోడ్డు ఎక్కారని గుర్తు చేశారు. పాఠశాలలు దూరంగా ఉండటం వల్లే దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు దగ్గర్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని, వీరిలో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని గుర్తు చేశారు.

ధ‌నికుల‌పైనే కమలం గురి.. తెలంగాణలోనూ అదే దారి

ఇప్ప‌టికిప్పుడు వ్యాపారం పెంచుకోవాలంటే ల‌క్షాధికారి అవ‌స‌రం మావా..అంటాడు ఓ సినిమాలో విల‌న్ తాలూకు అల్లుడు. వ్యాపారంతో న‌లుగురిని పోగేసి ఎగ‌స్పార్టీఓడిని తాటిచెట్టుక్క‌ట్టేయొచ్చు.. అని అసి స్టెంటు స‌ల‌హా! ఈ రెండో మాట ఎలా వున్నా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు ప్ర‌తీ చిన్న ఎన్నిక‌కూ ధ‌నికుల అవ సరం బాగా ప‌డుతోంది. ప్ర‌తీ పార్టీ ధ‌నికుల అండ‌దండ‌ల‌తో ప్ర‌శాంతంగా గెలుపు ధీమాతో ఉంటోం ది. ఇపుడు బీజేపీ వారి ఆలోచ‌నా అదే. అస‌లు బీజేపీ అంటేనే సంపన్నుల ప‌ట్ల ప్ర‌త్యేకాద‌ర‌ణ ఉన్న పార్టీ అనే అభి ప్రాయం ఎలాగూ ఉంది.  ఆ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో చేరికల తీరు ఉంది. కేవలం సంపన్నులను, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లను ఎంచుకుని మరీ బీజేపీ గాలం వేస్తోంది. ఆర్థికంగా దన్ను ఉన్న వారికి మాత్రమే తమ పార్టీలో ఎంట్రీ అని చెప్పకనే చెబుతోంది.  పార్టీని నిల‌బెట్ట‌డానికి, న‌డిపించ‌డానికి  బీజేపీకి అభిమానులు ఉన్నారు, జెండా భుజాన వేసుకుని జీవితాన్నిపార్టీకోసం ప‌ణంగా పెట్టే వీరాభిమానులూ ఉన్నారు.   అయితే పార్టీకి ఆర్థిక దన్నుగా నిలబడి అవసరమైనప్పుడు సొమ్ములు వెదజల్లి మరీ పార్టీకి అండగా నిలబడే వారే బీజేపీకి ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి ఇప్పుడు అవసరం అందుకే బీజేపీ ఏరి కోరి మరీ ఆర్థకంగా  బాగా పరిపుష్టత ఉన్నవారికి పార్టీలో చేర్చుకుంటోంది. మొన్నటికి మొన్న కొండా విశ్వేవ్వరరెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. పరిశీలకుల అబ్జర్వేషన్ మేరకు ఎన్నిక‌ల ఖ‌ర్చుకు వెన‌కాడ‌ని వారిని పార్టీలోకి ఆహ్వానించ‌డం వ‌ల్ల చిన్న‌పాటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొనడా నికి వారికి శ‌క్తి ఉంటుంద‌ని, ప్ర‌తీ అంశంలోనూ అధిష్టానం క‌ల్పించుకుని ప‌నులు జ‌రిగేలా చూడాల్సిన స‌మ‌స్య ఉండ‌ద‌ని  పార్టీ సీనియర్ల మాట‌. ముఖ్యంగా ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీని గెలిపించ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్దిక మ‌ద్ద‌తు, జ‌నాక‌ర్ష‌ణ స‌మాజంలో ప్ర‌ముఖులు, ధ‌నికుల‌తోనే అవుతుంద‌న్న‌ది బీజేపీ నమ్మకం. ఈ నేప‌థ్యంలోనే ఇక‌పై పార్టీలోకి ఎవ‌ర్ని ఆహ్వానించాల‌నుకున్న‌ప్ప‌టికీ    ఆర్ధికంగా బలంగా ఉన్న వారినే తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం పార్టీ తెలంగాణ అధ్యక్షుడికి మౌఖిక ఆదేశాలించ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా సుసంపన్నులన్న సంగతి తెలిసిందే.

మాలేగావ్ పేలుళ్ల‌లో ప్ర‌గ్యా పాత్ర‌.. తేల్చిన ఫోరెన్సిక్‌

దేశ‌ భ‌క్తిలో అంద‌రినీ మించిన‌వారిలా భారీ ప్ర‌చారాలు చేసుకుంటున్న బీజేపీ వారి చ‌రిత్ర‌కో మ‌చ్చ ప‌డిం ది. మ‌హారాష్ట్ర మాలేగావ్ ప‌ట్ట‌ణంలో 2008లో జ‌రిగిన బాంబుపేలుళ్ల కేసులో బీజేపీ ఎంపీ  ప్ర‌గ్యాసింగ్ ఠాకూర్ పాత్ర ఉంద‌ని తేలింది. అప్ప‌ట్లో మాలేగావ్ మ‌సీదులో జరిగిన బాంబుపేలుళ్ల కేసు విచార‌ణ‌లో ఆమె పాత్ర ఉంద‌న్న‌ది ఫోరెన్సిక్ నిపుణుల బృందం తేల్చింది.  మ‌సీదులో ఉంచిన ఎల్ ఎంఎల్ వెస్పా స్కూట‌రు పోలీ సుల‌కు ల‌భించింది. ఈ స్కూట‌రు భోపాల్ బీజేపీ ఎంపీ పేరునే రిజిస్ట‌ర్ అయి ఉంద‌ని  నిపుణులు ముంబయి ఎన్ ఐ ఏ ప్ర‌త్యేక కోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించి 261మంది సాక్షు ల‌ను కోర్టు విచారిం చింది. నాసిక్ జిల్లా మాలేగావ్ ప‌ట్ట‌ణంలో 2008 సెప్టెంబ‌ర్ 29న స్కూట‌ర్ బాంబు పేలుడు జ‌రిగింది.  ఆ దుర్ఘ‌ట‌న లో ఆరుగురు మ‌ర‌ణించ‌డ‌గా మ‌రో వంద‌మంది గాయ‌ప‌డ్డారు. అక్క‌డ ల‌భించిన ప్ర‌గ్యా స్కూట‌రులో అమ్మోని యం నైట్రేట్ ల‌భించింద‌ని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. ఆ సంగ‌తిని  సాక్షులు కూడా అంగీకరించారని విచార‌ణ‌లో తేలింది. కాగా ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిన ప్ర‌గ్యాపై బీజేపీ సీనియ‌ర్లు ఏ చ‌ర్య తీసుకుంటార‌నేది  చూడాలి. ఇటీవ‌లి కాలంలో ఆర్ధిక‌ నేరాల‌ల్లో అనుమాతిల‌ను సైతం విడిచిపెట్ట‌కుండా ఈడీ, ఎన్ ఐఎల‌తో దాడి చేయిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం త‌మ పార్టీవారు ఇంత దారుణానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసీ మౌనం వ‌హిం చ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌స‌మ‌ని విశ్లేష‌కుల మాట‌. 

కారు దిగిన మంత్రి ఎర్రబెల్లి సోదరుడు.. బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు!

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన చేరికల కమిటీ తన పని ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి చేరికలు షురూ అయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకీ, శాసనసభ్యత్వానికీ రాజనామా చేశారు. రేపో మాపో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరనున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ గూటికి చేర్చుకుంటున్న బీజేపీ  అదే సమయానికి టీఆర్ఎస్ నుంచి కూడా ఓ కీలక నేతకు కమలం కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసింది. ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారు దిగి కాషాయ జెండా ఎత్తడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఏకంగా మంత్రి సోదరుడు టీఆర్ఎస్ రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ నెల 7న ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. సరిగ్గా  అదే రోజు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలోనే అమిత్ షా సమక్షంలోనే కమలం గూటికి చేరనున్నారు. కోమటి రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో ఎంత కలకలం రేగిందో, ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా కూడా టీఆర్ఎస్ లో అంతటి కలవరాన్ని కలిగించింది. ప్రదీప్ రావు స్వయంగా ఎర్రబెల్లి సోదరుడు కావడం, పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన రాజీనామా ఒక్క వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సాహించడమే కాకుండా ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ చేరికల కమిటీకి టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన ఈటల రాజేందర్ ను చైర్మన్ చేసింది. ఈటలకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో ఉన్న పరిచయంతో ఎక్కువ మందిని కమలం పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయగలరని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో ఇరత పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్న వారి జాబితాను ఇప్పటికే ఈటల అమిత్ షా కు సమర్పించారు. రానున్నరోజులలో కమలం పార్టీలోకి మరింత మంది చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

డ్రోన్ సాయంతో జ‌వ‌హ‌రీ అంతం

ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా సారథ్య బాధ్యతలు చేపట్టిన అయిమాన్ అల్ జవహరిని  కూడా అంతమొందించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు. అమెరికా గూడఛార సంస్థ  సీఐఏ సహకారంతో  71 ఏళ్ల జవహరిని అమెరికా సేనలు అత్యంత వ్యూహాత్మ‌కంగా అంతంచేశారు. అమెరికా ఈ  దాడిలో కేవలం ఒక డ్రోన్, రెండు హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులతో ప్రపంచంలోనే  మోస్ట్ వాంటెడ్  ఉగ్ర వాద నేత ను కడతేర్చింది. దీంతో అమెరికాలో ట్విన్ ట‌వ‌ర్‌పై అల్‌ఖ‌యిదా దాడికి ప్ర‌తిఫ‌లంగా  ప‌గ తీర్చుకున్నట్టుగా అమెరికా ప్ర‌క‌టించింది. అల్‌-జ‌వ‌హ‌రీ అమెరికా పౌరుల‌పై దాడులు, హ‌త్యారోప‌ణ‌లు ఎదుర్కొంటు న్నా డ‌ని బైడ‌న్ తెలిపారు.  కాగా, ఈ దాడిలో వినియోగించిన హెల్ ఫైర్ క్షిపణులు ఎలాంటి పేలుడు లేకుండానే పనిపూర్తిచేశాయి. కాబూల్ లోని తన నివాసంలో బాల్కనీలో ఉన్న జవహరిని గుర్తించగానే, డ్రోన్ నుంచి వెలువడిన హెల్ ఫైర్ క్షిపణులు ఒక్కదుటున దూసుకెళ్లి ఆయన శరీరాన్ని చీల్చివేశాయి. దాంతో అక్కడేమీ పేలుడు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది. జ‌వ‌హ‌రి ర‌హ‌స్యంగా నివ‌సిస్తూనే ప్ర‌పంచ‌దేశాల్లో అనుచ‌రుల‌కు ఆదే శాలు పంపుతూ దాడుల‌ను నిర్వ‌హిస్తుండేవాడు. కాగా అత‌న్ని హ‌త‌మార్చ‌డంతో  న్యాయం  జ‌రిగిం ద‌ని బైడెన్ అన్నారు. కాగా ఈ డ్రోన్ దాడి స‌మ‌యంలో జ‌వ‌హ‌రి కుటుంబ స‌భ్యులు అదే భ‌వ‌నంలో ఉన్న‌ప్ప టికీ ఆయ‌న్నుమాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుని దాడి జ‌రిగింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు. 

ఇల్లు కొనండి.. రెండుదేశాల్లో నివ‌సించండి!

ఫ్రిజ్ కొనండి.. ప్లాస్టిక్ బాటిల్ ఫ్రీ, ఐదు కిలోల కూర‌లు కొనండి.. పావు ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు ఫ్రీ.. ఇలాంటి గిఫ్టులు మ‌న‌దేశంలో బ‌హుప్ర‌సిద్ధం. గృహిణుల‌కు ఇలా గాలం వేసి పెద్ద పెద్ద మాల్స్‌వారంతా వారిచేత ప‌ర్సులు ఖాళీచేయించ‌డం త‌ర‌చూ గ‌మ‌నిస్తూనే ఉంటాం. మార్కెటింగ్ ఓ పిచ్చి. అవ‌స‌రం ఉన్నా లేకు న్నా ఏదో ఒక వ‌స్తువు కొనాల‌న్న కొనుగోలుదారుని బ‌ల‌హీన‌తే వ్యాపారుల‌కు పెద్ద అసెట్ అనేది వ్యాపార స్తుల ఆదాయ సూత్రం. కానీ ఇల్లు కొనండి గొళ్లెం ఫ్రీ అన‌రుగాక అన‌రు. చిత్ర‌మేమంటే ఓ పెద్ద విల్లా కొంటే రెండు దేశాల్లో ఉండేందుకు వీలు క‌ల్పిస్తామ‌నే ప్ర‌క‌ట‌నా వ‌చ్చింది. ఇదెలా సాధ్యం?  అందులో ఏదో మ‌ర్మం ఉండ‌వ‌చ్చు.. బ‌హుశా ఆ విల్లాలో దెయ్యాలేమ‌న్నా ఉన్నాయేమోన‌ని మ‌నోళ్ల‌కి సాధార‌ణంగా వ‌చ్చే పెద్ద అనుమానం!  చిత్రంగానే ఉంది. ఒక విల్లా కొన‌డం ఆల‌స్యం వెంట‌నే రెండుదేశాల పౌర‌స‌త్వం ల‌భిస్తుందనేది  ఎలా న‌మ్మ‌డం అనే ప్ర‌శ్న కెన‌డా వాసుల‌కు రాదు. ఎందుకంటే, కెన‌డాకి చెందిన క్యూబెక్, అమెరికా వెర్మాంట్ మ‌ధ్య ఏడువేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోని పెద్ద విల్లా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఇది  కొన‌గ‌లిగితే ఆ రెండు దేశాల పౌర‌స‌త్వం ల‌భిస్తుంది. అంటే ఇటు కెన‌డా, అటు అమెరికా పౌర‌స‌త్వం! త‌మాషాగా ఉంది. రెండు ఇళ్ల మ‌ధ్య‌, రెండు అపార్ట్‌మెంట్ల  మ‌ధ్య  కాస్తంత స్థ‌లం క‌న‌ప‌డితే ఇటువారో, అటువారో క‌బ్జా చేయాల‌న్న ఆలోచ‌న‌తో రాత్రికి రాత్రి ఎవ‌రో  ఒక‌రు కొట్టేయాల‌నే ఆలోచిస్తారు.  స‌రే ఇంత‌కీ ఈ విల్లాకి ఆశ‌ప‌డితే మాత్రం వెంట‌నే మ‌న క‌రెన్సీలో అయితే జ‌స్ట్ 71 ల‌క్ష‌లు క‌ట్టాలి. ఈ  విల్లా ఓన‌ర్లు బ్రియాన్‌, జోవాన్ డుమోలిన్ దీన్ని న‌ల‌భ‌య్యేళ్ల క్రితం వార‌సత్వంగా పొందారు. ఇది స‌రిగ్గా స్టాన్స్ట‌డ్ రూ ప్రిన్సిప‌లె లో ఉంది. దీనికి ఒక‌వైపు కెన‌డా స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ ఏజెన్సీ, మ‌రో వేపు యు.ఎస్‌.కస్టమ్స్‌, బార్డ‌ర్ ప్రొటెక్ష‌న్ ద‌ళాలు రాత్రింబ‌వ‌ళ్లూ కాప‌లా కాస్తుంటారు. మ‌రో ఇబ్బందేమంటే ఈ విల్లాకి అన్ని వైపులా ఇష్టంవ‌చ్చిన‌ట్టు తిర‌గ‌డానికి అవ‌కాశం లేదు. కేవ‌లం ప‌రిమిత ప్రాంతంలోనే, ప‌రిమిత దారిలోనే తిర‌గాలి, వెళ్ల‌డం రావ‌డంచేయాలి. కాస్తంత నిర్ల‌క్ష్యం చేసినా రెండు దేశాల స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ విభాగం పోలీ సులూ జైల్లో వేస్తారు.  అయితే యు.ఎస్, కెన‌డా నుంచీ కూడా ఈ విల్లా చేర‌డానికి మార్గం ఉంది. అంతే కాదు విల్లా వెనుక వైపు గ‌తంలో ఒక మార్గం ఉండేది, దాన్ని యు.ఎస్ ఏజెంట్లు మూసేయించారు. ఇంత గంద‌ర‌గోళం విల్లాను ఎవ‌రు తీసుకుని ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లరు? అందుకే కేవ‌లం ఫోటోల్లో పెట్టి  చూస్తూ ఆనందిస్తున్నారు. టెన్ష‌న్ ప‌డేకంటే టెంట్‌లో ఉండ‌డం మేలు క‌దా!

సోనియా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొంతకాలంగా ఇదే విషయంగా సాగుతున్న చర్చ పక్కదారి పడుతున్న నేపధ్యంలో ఇంకా లేట్ చేస్తే ఇంకెన్నో లోగుట్లు బయటపడే ప్రమాదం ఉందని, సో ..ఇంకా జాగుచేయడం మంచిది కాదని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజగోపాల రెడ్డి రాజీనామా ఖరారైన నేపధ్యంలో మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యమవుతుంది. వచ్చే ఆరు నెలలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళితే తప్పించి, ఉప  ఎన్నిక జరిగి తీరుతుంది.   మరోవంక వచ్చే సంవత్సరం (2023) ద్వితీయార్ధంలో జరిగే శాసనసభ ఎన్నికల ముందు, జరిగే మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపు అవుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీ లెక్క తేల్చడంతో పాటుగా అనేక రాజకీయ భేతాళ ప్రశ్నలను సమాధానం ఇస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, తెరాసకు ప్రాధాన ప్రత్యర్ధి ఎవరో మునుగోడు తెల్చేస్తుంది.  అందుకే, మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి.యుద్ధానికి సిద్దమవుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే, రాజగోపాల రెడ్డి రాజీనామా  ప్రకటించిన కొద్ది సేపటికే తెర మీదకు వచ్చారు. అంతేకాదు, అప్పటికప్పుడు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కన్వీనర్ గా ఎన్నికల కమిటీ ప్రకటించారు. అలాగే, ఎవరొచ్చినా, ఎవరు రాకున్నా, ఎన్నికల శంఖారావం  పూరిస్తున్నామని, ఆగష్టు 5 న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాకుండా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, కాంగ్రెస్ లో పుట్టిపెరిగిన వారికంటే, తనకే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందని ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. అలాగే,   సోనియా గాంధీ సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీని విచారిస్తున్న సమయంలో రాజగోపాల రెడ్డి హోం మంత్రి అమిత్ షాతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారని, ఫైర్ అయ్యారు. అంతే కాకుండా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ, సోనియా సెంటిమెంట్ నే ఎన్నికల అస్త్రం చేసుకున్నారనే అభిప్రాయం  కల్పించారు.  అయితే రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలో పనిచేయని సోనియా సెంటిమెంట్ ఇప్పుడు ఈ ఉపఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా వుంది. అంతే కాకుండా  గతంలో ఇదే సోనియా గాంధీని,  బజారు  భాషలో దూషించిన రేవంత్ రెడ్డి ఇప్పడు ఆమెను తెలంగాణ తల్లి అన్నా, ఇంకొకటి అన్నా, ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ప్రధాన ప్రశ్నగా వుంది.  అయితే, మరో వంక మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్‌ స్థానం కావడంతో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికలో విజయం కీలకంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో ఒకటి. పార్టీ కున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఉమ్మడి నలోగొండ జిల్లా నుంచే ఎన్నికయ్యారు. ఇంకా అనేక మంది దిగ్గజ నేతలున్న జిల్లా నల్గొండ జిల్లా. అయినా  జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఇలా కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఎవరికీ, ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకపోవడం పట్ల జిల్లా నాయకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.  నిజానికి జిల్లాకు రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులే కాకుండా, కేంద్ర నాయకులు కూడా రాజగోపాల రెడ్డి పార్టీ రాజీనామా చేయకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ,  రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన నాయకులు మాత్రం, మొదటి నుంచి, రాజగోపాల రెడ్డి పార్టీ వదిలిపోతేనే మంచిందనే విధంగా వ్యవహరించారని అంటున్నారు. అందుకే, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి పునరాలోచనకు అవకాశం లేకుండా రంగప్రవేశం చేశారు. నిజానికి గత వరం రోజులుగా సాగుతున్న రాజగోపాల రెడ్డి ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి ఎక్కడా ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. కానీ, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే మీడియా ముందుకొచ్చి ఆయనపై  తీవ్ర ఆరోపణలు చేశారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి దూకుడు బ్రేకులు వేసే సమయం వచ్చిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధగా రేవంత్ రెడ్డి పార్టీని హైజాక్ చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ  సీనియర్ నాయకులు వ్యక్తపరుస్తున్నారు,ఈ పర్యవసాన ప్రభావం ఉపఎన్నికల పైనే కాకుండా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై కూడా ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను కూడా మునుగోడు డిసైడ్ చేస్తుందని అంటున్నారు.

పిల్లాడిలా ఉన్నాడ‌ని ఉద్యోగ నిరాక‌ర‌ణ‌!

అర్హ‌త‌ను అనుస‌రించి ఉద్యోగం.. స‌హ‌జంగా జ‌రుగుతుంది. కేవ‌లం సాంకేతిక విజ్ఞ‌నం వున్న‌వారికీ చ‌దువుతో సంబంధం లేకుండానే ఉద్యోగం ల‌భిస్తుంటుంది. అన్ని అర్హ‌త‌లూ ఉండి ఇంట‌ర్వ్యూల్లో విఫ‌ల మ‌య్యే వారూ ఉంటారు. కొంద‌రికి సంస్థ‌ల పెద్ద‌ల‌తో ప‌రిచ‌యాల‌తో ఉద్యోగాలు వ‌స్తూంటాయి. చిత్ర మేమంటే మావో షెంగ్ అనే 27 ఏళ్ల వ్య‌క్తికి మాత్రం ఉద్యోగం ఇవ్వ‌నంటున్నారు. కార‌ణం అత‌ను మ‌రీ 12 ఏళ్ల పిల్లాడి లా క‌నిపించ‌డ‌మేన‌ట‌! పైగా  కార్మిక చ‌ట్టాలు అంగీక‌రించ‌వ‌న్నార‌ట‌! కొంద‌రు వ‌య‌సును మించి క‌న‌ప‌డ‌తారు, మ‌రికొంద‌రి వ‌య‌సు అంత‌గా తెలీదు. కానీ మావోది మాత్రం నిజంగా దుర‌దృష్ట‌మే. ఎందుకంటే అత‌నికి ఉద్యోగం చాలా అవ‌స‌రం. అత‌ను చాలా ఉద్యోగ ప్ర‌య‌త్నా లు చేశాడు. ఏకంగా త‌న అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ ఒక టిక్ టాక్ కూడా త‌యారు చేసి తెలిసిన వారి ద్వారా అనేక కంపెనీల‌కు పంపించాడు. కానీ అంద‌రూ ఆ టిక్ టాక్‌ను ఎవ‌రో పిల్లాడు స‌ర‌దాగా చేసి పం పించాడ‌ని రిలాక్స్ కోసం చూస్తూ న‌వ్వుకున్నార‌ట‌! పాపం మావో మాత్రం త‌న అభ్య‌ర్ధ‌న‌ను ఇలా అర్ధం చేసుకున్నార‌ని తెగ బాధ‌ప‌డ్డాడు. అమెరికాలో 15 ఏళ్ల వాడికీ ఏదో ఒక ఉద్యోగం ల‌భిస్తున్నపుడు చైనాలో అలాంటి అవ‌కాశం లేక‌పోవ‌డం దారుణ‌మ‌ని పసివాడు కాని ఈ కుర్రాడు కాస్తంత మండిప‌డ్డాడు. అయితే ఎలాగో ఒక కంపెనీవారు నిజంగానే వీడు పిల్లాడు కాదు కుర్రాడే అని న‌మ్మి ఉద్యోగం ఇచ్చిందిట‌. ఇక మావో పెళ్లి చేసుకుని తండ్రిని మ‌రింత బాగా చూసుకుంటాడ‌ని ప‌క్కింటివారంతా అనుకుంటున్నారు. 

ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్తానంలో ముగిశాయి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె పెద్ద కుమార్తె బుధవారం ( ఆగస్టు 3) తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె రాక కోసమే రెండు రోజులుగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు కుటుంబ  సభ్యులు ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు  పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.   అలాగే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌, బ్రాహ్మణి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కళ్యాణ్‌రామ్‌ తదితరులు జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడు, ఉమామహేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ పాడె మోశారు. ఉమామహేశ్వరి భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ ఆమె చితికి నిప్పంటించారు.