కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక డిఫాల్టర్.. షబ్బీర్ అలీ విమర్శ
posted on Aug 4, 2022 @ 10:27AM
కలిసున్నంత కాలం మచ్చలేని పున్నమి చంద్రుడిలా కనిపించిన మిత్రుడు విబేదించి వెళ్లగానే మచ్చల మహరాజుగా మారిపోతాడు. సరిగ్గా అలాగే ఉంది కాంగ్రెస్ వ్యవహారం. కోమటి రెడ్డి రాజగోపల రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత కాలం ఆయన పులుకడిగిన ముత్యంలాగే కనిపించారు పార్టీ వారికి. ఒక్క సారి ఎప్పుడైతే రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారో.. ఆయనలోని లోపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు భూతద్దంలోలా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ దన్ను లేకుండా రాజగోపాలరెడ్డి బ్రాందీ షాపుల్లో మూతలు తీయడానికి కూడా పనికిరాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తే, మరో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ మరింత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఆశించారనీ, పీసీసీ చీఫ్ పదవికి తనను ప్రపోజ్ చేయాల్సిందిగా తన ఇంటికి వచ్చి మరీ అడిగారనీ తాపీగా ఇప్పుడు వెళ్లడించారు. తాను చెప్పింది పచ్చి నిజమన్న ఆయన అది అబద్ధమని దమ్ముంటే రాజగోపాల్ రెడ్డి ఒట్టేసి చెప్పాలని సవాల్ చేశారు.
తన అన్న వెంకటరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ చీఫ్ కావడానికి వీల్లేదని కూడా అన్నారని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ పాలు తాగి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని విమర్శించారు. రాజగోపాల రెడ్డికి కోట్ల రూపాయల అప్పులున్నాయనీ, ఆయన ఒక డిఫాల్టర్ అనీ షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆ సమస్యల నుంచి గట్టెక్కంచమని కోరేందుకే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారనీ, అలా కమలం గూటికి వెళ్లారని ఆరోపించారు.
అసలు రాజగోపాల్ రెడ్డి గెలుపొందిన తరువాత ఒక్కసారైనా మునుగోడు వెళ్లారా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం పార్టీని వీడి.. ఎదురు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కానీ, టీపీసీసీ చీఫ్ ను కానీ విమర్శించే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని షబ్బీర్ అలీ అన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా ఉంటే.. మరో కాంగ్రెస్ నేత, రాజగోపాల్ రెడ్డి సోదరుడు అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన విమర్శల బాణాలను టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే ఎక్కు పెట్టారు. తన తమ్ముడిని అడ్డు పెట్టుకుని రేంవత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తనను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా తానూ పార్టీ వీడుతానని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు కదుపుతున్న కాంగ్రెస్ కు కోమటిరెడ్డి సోదరుల ఉదంతం కచ్చితంగా ఎదురుదెబ్బేనని పరిశీలకులు అంటున్నారు.